బీబీసీ ఇంపాక్ట్: సోలబొంగు విద్యార్థుల కోసం కదిలిన అధికారులు, ఊళ్లోనే స్కూలు, ఊరికి రోడ్డు

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
సోలబొంగు గ్రామానికి పాఠశాల వచ్చింది. అంతేకాదు రోడ్డు కూడా రాబోతోంది.
చదువు కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా సోలబొంగు గిరిజన గ్రామంలోని 12 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై బీబీసీ 'చదువుల పడవ' పేరుతో ఇటీవల కథనం రాసింది.
విద్యార్థులు చిన్న పడవలో 300 అడుగుల లోతైన జలాశయాన్ని దాటి, తుప్పలు, పొలాల మీదుగా స్కూల్‌కు చేరుకుంటున్న వైనాన్ని వెలుగులోకి తెచ్చింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు స్పందించి, గ్రామానికి చేరుకున్నారు. సోలబొంగుకు స్కూల్, రోడ్డు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.


ఫొటో సోర్స్, K.Govind
బీబీసీ కథనంతో...సోలబొంగు గ్రామానికి శనివారం (28.06.25) జిల్లా విద్యాశాఖ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు వచ్చారు. వారు రైవాడ రిజర్వాయర్ లో పడవపైనే ప్రయాణం చేస్తూ గ్రామానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ జేఈ గణేష్ మాట్లాడుతూ...
"సోలబొంగు గ్రామంలో స్కూల్, రోడ్డు లేకపోవడంతో చదువు కోసం 12 మంది పిల్లలు ప్రమాదకరమైన పడవ ప్రయాణం చేస్తూ స్కూల్ కి వెళ్లడంపై బీబీసీ తెలుగు ప్రసారం చేసింది. ఈ కథనంపై స్పందించిన జిల్లా కలెక్టర్ సోలబొంగులో రోడ్డు, స్కూల్ వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. అందుకే ఈ గ్రామానికి వచ్చాం. సోలబొంగు గ్రామంలో రోడ్డు పనులను ప్రారంభించాం. సోలబొంగు గ్రామ గిరిజనులు వైద్యం, ఇతర అవసరాల కోసం కూడా బోటుపైనే వెళ్తున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు పనులు మొదలైయ్యాయి కాబట్టి...మరి కొన్ని రోజుల్లో ఇక రోడ్డు సౌకర్యం వాడుకుని సమీప పెద్ద గ్రామాలైన తామరబ్బ, మండలకేంద్రమైన దేవరపల్లికి సులభంగా వెళ్లవచ్చు." అని చెప్పారు.

ఏమిటీ 'సోలబొంగు' కథ?
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలో సోలబొంగు అనే గిరిజన గ్రామం ఉంది. ఊరిలో నూక దొర తెగకు చెందిన 16 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ 76 మంది నివసిస్తున్నారు.
రైవాడ రిజర్వాయరు అనకాపల్లి జిల్లాకు ఒక వైపు ఉంటే, మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సోలబొంగు గ్రామం ఉంది.
ఈ గిరిజన గ్రామంలో 22 మంది బడి ఈడు పిల్లలుంటే అందులో 12 మంది మాత్రమే పాఠశాలకు వెళ్తున్నారు.
ఈ విద్యార్థులంతా చదువు కోసం సుమారుగా రెండు కిలోమీటర్లు రైవాడ జలాశయంలో బోటులో ప్రయాణం చేసి, ఆ తర్వాత మరో రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ తామరబ్బలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు.
దీంతో, చదువు కోసం పిల్లలు చేస్తున్న ప్రమాదకర ప్రయాణంపై బీబీసీ కథనం ప్రసారం చేసింది.
ఈ నేపథ్యంలో అరకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్, జిల్లా సర్వ శిక్ష అభియాన్ అదనపు జిల్లా ప్రాజక్ట్ కో ఆర్డినేటర్ ఆర్.స్వామినాయుడు, అనంతగిరి ఎంఈఓ శనివారం గ్రామాన్ని సందర్శించారు.

ఫొటో సోర్స్, K.Govind
వీరభద్ర పేట నుంచి సోలబొంగు గ్రామం వరకు గ్రావెల్ రోడ్డు కోసం రూ. 3 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు అరకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్ చెప్పారు.
శనివారం సోలబొంగు గ్రామ పెద్దలు కొబ్బరికాయ కొట్టి రోడ్డు పనులు ప్రారంభించారు.
సోలబొంగు గ్రామంలో పాఠశాలను ఈనెల 28నే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారని సర్వ శిక్ష అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ స్వామి నాయుడు చెప్పారు.
''కలెక్టర్ ఆదేశాల ప్రకారం సోలబొంగు గ్రామస్థులతో మాట్లాడాం. మూడు నుంచి ఐదో తరగతి చదువుతున్న ఐదుగురు పిల్లల్ని పినకోట ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చేర్పించడం, మిగతా 1, 2 తరగతి చదువుతున్న పిల్లల కోసం గ్రామంలో వలంటీర్ ద్వారా విద్యను అందించే ఏర్పాట్లు చేశాం'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, K.Govind
ఆనందంతో థింసా నృత్యం
సోమవారం నుంచే విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని స్వామి నాయుడు చెప్పారు.
పిల్లలకి బట్టలు, పుస్తకాలు, బోర్డు, బ్యాగులు వంటివి కూడా అందజేస్తామన్నారు.
దీంతో గిరిజనులు ఆనందంగా థింసా నృత్యం చేసి సంబరాలు చేసుకున్నారు.
బీబీసీ కథనాలతో గ్రామానికి రోడ్డు వచ్చిందని, గ్రామంలోనే పిల్లలు చదువుకునేందుకు అవకాశం కలిగిందని సోలబొంగు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














