రహస్య కెమెరాలు, స్మార్ట్ డివైజ్‌లతో భార్యలపై నిఘా... లాక్‌డౌన్‌లో పెరుగుతున్న గృహ హింస

గృహ హింస
    • రచయిత, షిరోమా సిల్వా, టాలియా ఫ్రాంకో
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

కరోనావైరస్ లాక్‌డౌన్‌ల నడుమ ప్రపంచ వ్యాప్తంగా గృహ హింస పెరుగుతోంది. దీనిలో టెక్నాలజీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది.

స్మార్ట్ స్పీకర్లు, ట్రాకింగ్ యాప్స్, కంప్యూటర్ కీబోర్డులను కనిపెట్టే సాఫ్ట్‌వేర్లు ఇలా అధునాతన పరికరాలు, సాఫ్ట్‌వేర్ల సాయంతో బాధితులపై నిఘా పెట్టడం మరింత తేలికైపోతోంది. నానాటికీ ఇలాంటి సాంకేతికతను అడ్డుపెట్టుకొని వేధింపులకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

తాము సాయం అందిస్తున్నవారిలో 70 శాతం మంది ఇలాంటి సాంకేతిక పరిజ్ఞాన బాధితులు ఉన్నారని డొమెస్టిక్ వైలెన్స్ చారిటీ రిఫ్యూజ్ సంస్థ తెలిపింది.

కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న ఇద్దరు బాధితులు బీబీసీతో తమ అనుభవాలను పంచుకున్నారు. వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకొని వారి వివరాలు వెల్లడించలేదు.

''అతడు ఒకసారి బయటకు వెళ్లినప్పుడు.. రింగ్ డోర్‌బెల్ కెమెరా కనిపించింది. దాని సాయంతో అతడు నాపై నిఘా పెడుతున్నాడని అప్పుడే అర్థమైంది'' అని కేట్ (పేరు మార్చాం) చెప్పారు.

అమెజాన్‌కు చెందిన ఇంటర్నెట్ కనెక్టెడ్ సెక్యూరిటీ డివైజ్ గురించి ఆమె చెబుతున్నారు. కెమెరా ముందు ఎవరైనా కదిలితే వెంటనే అది హెచ్చరికలు పంపిస్తుంది. దీని సాయంతో లైవ్ ఫుటేజీని రికార్డ్ చేయొచ్చు. అంతేకాదు చాలా దూరంలో ఉండే ఈ వీడియోను చూడొచ్చు.

గృహ హింస

''కావాలంటే నేను వెంటనే దానిలో బ్యాటరీని తీసేయొచ్చు. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే పిల్లల భద్రత కోసమే దాన్ని పెట్టానని అతడు చెబుతాడు. నేను మంచి తల్లిని కాదని చెబుతూ అతడు పోలీసులను ఆశ్రయిస్తాడేమోనని భయంగా ఉంది'' అని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు దూరం నుంచే నియంత్రించగలిగే అమెజాన్ వర్చువల్ అసిస్టెంట్‌తో తన భాగస్వామి తనపై ఎలా నిఘా పెట్టేవాడో సూ (పేరు మార్చాం) వివరించారు. ఈ ఇంటర్నెట్ ఆధారిత స్పీకర్లతో మనం మాట్లాడొచ్చు. అలానే వాయిస్‌లనూ రికార్డింగ్ చేయొచ్చు.

''అన్ని డివైజెస్‌లోనూ తన అకౌంట్లతో లాగిన్ అవుతాడు. ఇంట్లో చాలా అలెక్సా డివైజెస్ ఉంచాడు. అతడు బయటకు వెళ్లినా.. ఇంట్లో డివైజెస్‌ను తన ఆధీనంలో ఉంచుకుంటాడు. బయట నుంచి ఆ డివైజెస్‌తో కమ్యూనికేట్ అవుతుంటాడు'' అని కేట్ తెలిపారు.

మరోవైపు లాక్‌డౌన్‌లో పురుషులపై వేధింపులు కూడా పెరిగాయి.

గత ఏడాదితో పోల్చినప్పుడు కరోనావైరస్ లాక్‌డౌన్ మొదట్లో తమకు 5,000కుపైగా కాల్స్ సాయం కోరుతూ వచ్చాయని బ్రిటన్‌కు చెందిన ద రెస్పెక్ట్ మెన్స్ అడ్వైస్ లైన్ తెలిపింది.

అయితే, పురుషులతో పోల్చినప్పుడు మహిళలు గృహ హింస, వేధింపులకు బాధితులుగా మారే అవకాశం ఎక్కువ. గతేడాది బాధితుల్లో నాలుగింట మూడొంతుల మంది మహిళలే ఉన్నట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

''తమ ఆధీనంలో''

జెండర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ల మధ్య సంబంధంపై అధ్యయనం చేపట్టేటప్పుడు ''నియంత్రణ''అనే అంశం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుందని యూనివర్సిటీ కాలేజీ లండన్‌ పరిశోధకురాలు డాక్టర్ లియోనీ టేంజెర్ వివరించారు.

''వేధింపులకు పాల్పడే వారిలో ఎక్కువగా మగవారే ఉంటారు. అతడే ఆ డివైజ్‌లను కొనుగోలు చేస్తాడు. వాటిని తన ఆధీనంలో ఉంచుకుంటాడు'' అని ఆమె వివరించారు.

''దీంతో డివైజెస్ సెట్టింగ్స్‌తోపాటు పరిసరాలపైనా అతడికి నియంత్రణ సాధ్యపడుతుంది'' అని చెప్పారు.

సూ, కేట్‌ల అనుభవాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

''మేం అంతా ఇంటిలో ఓ గాలి బుడగలో బతుకుతున్నట్లు అనిపిస్తుంది'' అని సూ వ్యాఖ్యానించారు.

''నేను బయటకు వెళ్లినా.. నా స్మార్ట్‌వాచ్ లేదా ఫోన్ లేదా ఐప్యాడ్ సాయంతో నేనెక్కడ ఉన్నానో అతడు తెలుసుకుంటాడు. నాపై, నా పిల్లలపై నాకు ఎంత తక్కువ నియంత్రణ ఉందో ఇప్పుడే తెలుస్తోంది. దీని నుంచి నేను బయటపడాలి'' అని ఆమె పేర్కొన్నారు.

తమ ఉమ్మడి అమెజాన్ అకౌంట్‌ను తన పార్ట్‌నర్ లాక్ చేశాడని, ఆ అకౌంట్‌లో తన క్రెడిట్ కార్డ్ వివరాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు. దీంతో తనకు నచ్చినట్లు ఖర్చు పెట్టే నియంత్రణ కూడా అతడి చేతుల్లోకి వెళ్లిపోయిందని వివరించారు.

''నా కార్డ్ వివరాలు డిలీట్ చేయమని అమెజాన్ వారిని సంప్రదించాను. అయితే అలా చేయడం కుదరదని వారు వివరించారు. మీరు మీ బ్యాంకు కార్డులను రద్దు చేసుకోవడమే మంచిదని చెప్పారు. తమ పరికరాలను ఎందుకోసం ఉపయోగిస్తున్నారో కంపెనీలు తెలుసుకోవాలి'' అని ఆమె సూచించారు.

గృహ హింస

ఫొటో సోర్స్, Getty Images

గృహ హింస చట్టం ఉల్లంఘనలు

భాగస్వాములపై సాంకేతిక పరికరాలను ఉపయోగించి నిఘా పెట్టడాన్ని నేరంగా పరిగణించేలా ఓ బిల్లును బ్రిటన్ తీసుకొస్తోంది.

సాంకేతిక పరికరాల నియంత్రణ, బలవంతంగా టెక్నాలజీ ఉపయోగించాలని చెప్పడం తదితర అంశాలపై ఈ బిల్లును సిద్ధంచేశారు.

టెక్నాలజీ సంబంధిత వ్యవహారాలతో ముడిపడివున్న కేసుల్లో పోలీసులకు మరికొన్ని అదనపు అధికారాలను ఈ బిల్లు కల్పిస్తోంది.

మరికొన్ని నెలల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశముంది.

అయితే, కొన్ని స్మార్ట్‌ఫోన్ యాప్‌లు నానాటికీ మరింత ప్రమాదకరంగా మారుతున్నాని రిఫ్యూజ్ హెచ్చరించింది.

''గృహ హింస బాధితులకు సాయం చేస్తామంటూ కొన్ని సంస్థలు ప్రత్యేక యాప్‌లను తీసుకొస్తున్నాయి. అయితే వీటితో జరిగే మేలు కంటే కీడే ఎక్కువ. బాధితుల భద్రతతోపాటు వారు ఉండే లొకేషన్ కూడా దీని సాయంతో తెలుసుకోవచ్చు''అని సంస్థ తెలిపింది.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఎక్కువ మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అంటే ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ డివైజెస్‌తో గడుపుతున్నారు.

అందుకే, ఒకవేళ బ్రేకప్ అయితే తమ పరిస్థితి ఏమిటని ఎలక్ట్రానిక్ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ల డెవలపర్లు ఒకసారి ఆలోచించాలని కేట్ అన్నారు.

''మీరు జంటగా ఉన్నప్పుడు.. ఒకే మెయిల్‌తో అన్నింటిలోనూ లాగిన్ అవ్వొచ్చు. కానీ ఒకవేళ విడిపోవాల్సి వస్తే.. పరికరాలపై నియంత్రణలేని వారు ఏమీ చేయలేరు. మీరు అప్పుడు ఏమీ మార్చలేరు'' అని పేర్కొన్నారు.

గృహ హింస

భద్రతతో సవాళ్లు

టెక్నాలజీ ఆధారిత వేధింపులను ఎలా తగ్గించాలనే అంశంపై ఐబీఎంలోని భద్రతా నిపుణులు పరిశోధన చేపడుతున్నారు.

సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారులు తప్పనిసరిగా అనుసరించాలంటూ వారు కొన్ని నిబంధనలను తీసుకొచ్చారు.

వేధింపుల విషయంలో బాధితులు, నిందితులను బాధ్యత వహించమనడం కంటే.. తమ ఆవిష్కరణల పరిణామాలు గురించి ముందే కంపెనీలు తెలుసుకుంటే మేలని వారు చెబుతున్నారు.

''భద్రత విషయంలో భారమంతా వినియోగదారులపై మోపకూడదు. కొంత భారాన్ని ఆవిష్కర్తలు కూడా మోయాలి''అని ఐబీఎంకు చెందిన లెస్లీ న్యూటాల్ వ్యాఖ్యానించారు.

దూరం నుంచి నియంత్రించే టప్పుడు ఇంట్లోని పరికరాలు ఒక హెచ్చరిక జారీ చేయడం లాంటి సదుపాయాలను అందుబాటులోకి తెస్తే మేలని ఆమె చెప్పారు.

''ఇంట్లో అందరూ సమాచారాన్ని పంచుకోవడమే లక్ష్యంగా చాలా స్మార్ట్ డివైజెస్‌ను అభివృద్ధి చేస్తారు. అయితే ఇందులో రెండో కోణం కూడా ఉంటుందని చాలా మంది ఊహించరు''.

చాలా మంది ఫ్యామిలీ యాప్స్ సాయంతో పిల్లల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు.

దీనిలో భాగంగా షేర్ చేసే చాలా సమాచారం దుర్వినియోగం అయ్యే ముప్పు కూడా ఉంటుంది.

''బ్యాటరీలో ఎంత పవర్ ఉంది. లాంటి సమాచారాన్ని కూడా ఆ పరికరాలు, సాఫ్ట్‌వేర్లు చేరవేస్తాయి. ఇవి చూడటానికి చాలా చిన్న అంశాలుగా కనిపించొచ్చు. కానీ వేధింపుల కోణంలో ఇవి చాలా పెద్దవి. నా బ్యాటరీలో పవర్ లేదని మీరు చెప్పి ఇప్పుడు తప్పించుకోలేరు''అని లెస్లీ వివరించారు.

చిత్రాలు కేటీ హోర్విక్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)