సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ దాడులు: నీరు నింపుకోవడానికి వేచి ఉన్న ఆరుగురు పిల్లలు సహా 10మంది మృతి

పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాలస్తీనా బాలుడు సరాజ్ ఇబ్రహీం మృతితో విలపిస్తున్న బంధువులు.
    • రచయిత, రష్దీ అబులౌఫ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇజ్రాయెల్ గగనతల దాడులలో సెంట్రల్ గాజాలో పదిమంది మరణించారు. వీరిలో ఆరుగురు పిల్లలు ఉన్నారు. మంచినీరు నింపుకోవడానికి వేచి ఉన్న వీరు ఇజ్రాయెల్ గగనతల దాడులలో మరణించారని అత్యవసరసేవల అధికారులు చెప్పారు.

వారి మృతదేహాలను నుసైరాత్‌లోని అల్-అవ్డా ఆసుపత్రికి తీసుకొచ్చారని అక్కడ పని చేసే వైద్యుడొకరు తెలిపారు. ఏడుగురు పిల్లలు సహా మొత్తం గాయపడిన పదహారు మందికి కూడా చికిత్స అందించామని ఆయన చెప్పారు.

అల్-నుసెయిరాత్ శరణార్థి శిబిరం వద్ద నీటి ట్యాంకర్ పక్కన నీటికోసం ఖాళీ డబ్బాలతో నిలబడిన జనంపై డ్రోన్ క్షిపణిని పేల్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం.., ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదిని లక్ష్యంగా చేసిన దాడిలో సాంకేతిక లోపం ఏర్పడిందని, దాంతో ఆ క్షిపణి లక్ష్యానికి కొన్ని మీటర్ల దూరంలో పడిపోయిందని పేర్కొంది. దీనిపై సమీక్ష కొనసాగుతోందని తెలిపింది.

‘‘దీని ఫలితంగా ప్రాణనష్టం సంభవించిందనే అంశం’’ తమకు తెలుసని, సాధారణ పౌరులకు హాని జరగకుండా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, "దాడులకు సంబంధం లేని పౌరులకు జరిగిన హానిపై విచారం వ్యక్తం చేస్తున్నాం" అని వెల్లడించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాలస్తీనియన్లు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మేలో సహాయ పంపిణీ కేంద్రం వద్ద ఆహారం కోసం వేచి ఉన్న పాలస్తీనియన్లు

దాడి తరువాత ఆన్‌లైన్‌లో కనిపించిన నిర్ధరించని వీడియోల్లో రక్తంతో తడిసిన పిల్లలు, ప్రాణం లేని శరీరాలు ఉన్నాయి. ఆ దృశ్యాల్లో భయాందోళనతో నిండిన అరుపులు, నిస్సహాయత స్పష్టంగా వినిపించాయి.

నివాసితులు ఘటనా స్థలానికి పరిగెత్తి, గాయపడిన వారిని ప్రైవేట్ వాహనాలు, గాడిద బండ్ల ద్వారా ఆస్పత్రికి తరలించారు.

గాజా అంతటా ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఉధృతమవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆదివారంనాడు సెంట్రల్ గాజా, గాజా నగరంలో నివాస భవనాలపై జరిగిన మూడు వేర్వేరు దాడుల్లో మరో 19 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయరని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రతినిధి చెప్పారు.

గాజా దక్షిణభాగంలోని రఫా ఫీల్డ్ ఆసుపత్రిలో గత ఆరు వారాల్లో, గత 12 నెలల కంటే ఎక్కువగా సామూహిక దాడుల్లో గాయపడినవారికి చికిత్స జరిపినట్లు అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ (ఐసీఆర్‌సీ) పేర్కొంది.

శనివారం రోజు ఆయుధ సంబంధిత దాడుల్లో గాయపడిన 132 మంది బాధితులను రఫాలోని తమ ఫీల్డ్ హాస్పిటల్‌కి తీసుకొచ్చారని వారిలో 31మంది మరణించారని ఐసీఆర్‌సీ పేర్కొంది.

చాలామంది తుపాకీ గాయలతో ఆస్పత్రికి వస్తున్నారని, ఆహార పంపిణీ ప్రదేశాలవద్దకు వెళ్లే క్రమంలోనే వారిపై దాడులు జరుగుతున్నాయని కొందరు బాధితులు చెప్పారని తెలిపింది.

మే 27న కొత్త ఆహార పంపిణీ కేంద్రాలు ప్రారంభించినప్పటి నుంచి 3,400 మందికి పైగా ఆయుధాలు వల్ల గాయాలయిన రోగులకు ఆసుపత్రిలో చికిత్స అందించామని, 250 కంటే ఎక్కువ మరణాలను నమోదు అయ్యాయని, ఈ సంఖ్య గత సంవత్సరం ఆసుపత్రిలో చికిత్స పొందిన అన్ని సామూహిక మరణాల సంఖ్యను మించిపోయిందని ఐసీఆర్‌సీ తెలిపింది.

"ఈ భారీ ప్రాణనష్టం ఘటనలు జరిగే తీవ్రత గాజాలోని సాధారణ ప్రజలు భరిస్తున్న భయానక పరిస్థితులకు అద్దంపడుతోంది" అని ఐసీఆర్‌సీ పేర్కొంది.

గాజా నిరాశ్రయులు

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, నాసర్ ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేసి శరణార్థి శిబిరం వద్ద తమ వస్తువులను వెదుక్కుంటున్న నిరాశ్రయులు

ఓ ఆహార పంపిణీ కేంద్రం వద్ద 24మంది మరణించారని దక్షిణా గాజాలోని నాసర్ ఆస్పత్రి శనివారం నాడు తెలిపింది. ఆహారం తీసుకోవడానికి వచ్చిన ప్రజలపై ఇజ్రాయెలీ దళాలు తరచూ కాల్పులు జరుపుతున్నారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ఈ ఘటనపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) స్పందిస్తూ, ఆ ప్రాంతంలో తమ కాల్పుల వల్ల "గాయపడిన వారు ఎవరూ ఉన్నట్లు సమాచారం లేదు" అని తెలిపింది.

ప్రమాదంగా భావించిన వ్యక్తులను చెదరగొట్టేందుకే హెచ్చరిక కాల్పులు జరిపామని ఒక ఇజ్రాయెల్ సైనిక అధికారి పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు సహాయ కార్యక్రమాల సంబంధిత మరణాల సంఖ్య 789గా నమోదైంది.

ఈ మరణాల్లో 615 ఘటనలు అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుతో నడుస్తున్న గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్‌ఎఫ్) కేంద్రాల సమీపంలోనే చోటుచేసుకున్నాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం తెలిపింది.

ఈ కేంద్రాలను మే 27న ప్రారంభించారు. దక్షిణ, మధ్య గాజాలోని సైనిక ప్రాంతాల్లో అమెరికా ప్రైవేట్ భద్రతా సంస్థలు వీటిని నిర్వహిస్తున్నాయని తెలిపింది.

మిగతా 183 మరణాలు ఐక్యరాజ్యసమితి, ఇతర సహాయ సంస్థల కాన్వాయ్‌ల సమీపంలోనే నమోదయ్యాయని పేర్కొంది.

పౌరులు గాయపడిన కొన్ని ఘటనలు విషయం తమకు తెలుసని, ప్రజలు, ఇజ్రాయెల్ దళాల మధ్య సంభవించగల ఘర్షణలను వీలైనంతవరకు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన "తప్పుదారి పట్టించే, అసత్యమైన" గణాంకాలను ఐక్యరాజ్యసమితి ఉపయోగించిందని గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ ఆరోపించింది.

నాజర్ ఆస్పత్రి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇంధన కొరతతో నాసర్ ఆస్పత్రి అత్యవసరసేవలు నిలిచిపోయే పరిస్థితి ముప్పును ఎదుర్కొంటోంది.

సహాయ కేంద్రాల సమీపంలో మరణాలు జరిగాయన్న విషయాన్ని తాను ఖండించడం లేదని జీహెచ్‌ఎఫ్ అధిపతి జానీ మూర్ ఇంతకుముందు బీబీసీతో అన్నారు. అయితే, "ఆ మరణాల్లో 100శాతం జీహెచ్‌ఎఫ్ సమీపంలో జరిగాయంటూ చేసిన ఆరోపణలు నిజం కావు" అని ఆయన పేర్కొన్నారు.

బీబీసీ సహా ఇతర అంతర్జాతీయ వార్తా సంస్థలు గాజాలోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ అనుమతించదు.

2023 అక్టోబర్ 7న హమాస్ నిర్వహించిన సరిహద్దు దాడికి ప్రతిగా, గాజాలో దాడులు ప్రారంభించింది ఇజ్రాయెల్. ఆ దాడుల్లో సుమారు 1,200 మంది చనిపోగా, 251 మందిని బంధీలుగా పట్టుకుంది ఇజ్రాయెల్.

అప్పటి నుంచి ఇప్పటివరకు గాజాలో కనీసం 57,882 మంది మరణించినట్టు హమాస్ నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ పేర్కొంది.

గాజా జనాభాలో చాలామంది అనేకసార్లు నిరాశ్రయులయ్యారు. 90శాతానికి పైగా ఇళ్లను ధ్వంసమయ్యాయని, లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయని అంచనా. ఆరోగ్య సంరక్షణ, నీటి సరఫరా, పారిశుధ్య, శుభ్రత వ్యవస్థలు పూర్తిగా నాశనమైపోయాయి. భోజనం, ఇంధనం, ఔషధాలు, ఆశ్రయానికి తీవ్రమైన కొరత ఏర్పడింది.

ఈ వారంలో, దాదాపు 130 రోజుల తరువాత తొలిసారిగా గాజాలోకి 75,000 లీటర్ల ఇంధనాన్ని అనుమతించారు. ఇది "ప్రజల దైనందిన అవసరాలు, అత్యవసర పౌర సహాయ కార్యకలాపాలకు ఏమాత్రం సరిపోదు" అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

గాజాలో ఇంధన కొరత "అత్యంత విషమ స్థాయికి" చేరిందని తొమ్మిది ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు శనివారంనాడు హెచ్చరించాయి. ఇంధనం పూర్తిగా అయిపోతే, ఆసుపత్రులు, నీటి సరఫరా వ్యవస్థలు, పారిశుధ్య నెట్‌వర్కులు, బేకరీల కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని సూచించాయి.

"ఆసుపత్రులు ఇప్పటికే చీకటిలో మగ్గిపోతున్నాయి. ప్రసూతి, నవజాత శిశువులు, ఐసీయూ విభాగాలు పనిచేయడం ఆగిపోతున్నాయి. అంబులెన్సులు ఇక ప్రయాణించలేని స్థితికి చేరుకున్నాయి" అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)