ప్రసవం తరువాత బిడ్డలకు హాని చేయాలనే ఆలోచనలు తల్లులకు ఎందుకు వస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాథ్యూ హిల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తల్లి కావడం ఓ ఆనందకరమైన క్షణం, కానీ కొంతమంది మహిళలకు, ఈ సమయం మానసికంగా చాలా కష్టంగా ఉంటుంది.
కొంతమంది మొదటిసారి గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత నిరాశ, భయం లేదా ఆందోళనకు లోనవుతారు.
ఇంగ్లాండ్‌కు చెందిన బెక్కీ అనే మహిళ తల్లిగా తనకు ఎదురైన ఇటువంటి అనుభవాల గురించి మాట్లాడారు.
మొదటిసారి ప్రసవించిన తల్లులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె అనుభవాలతో స్పష్టమైంది.
కానీ తమ సమస్య గురించి చెబితే సమాజం ఏమంటుందో అని భయపడి వారు సకాలంలో సహాయం కోరడంలేదు.
బెక్కీ తనకుతాను హాని చేసుకోవడంతోపాటు తన కన్నబిడ్డకు కూడా హాని తలపెట్టాలనే ఆలోచనలతో నిరంతరం బాధపడేవారు.


ఇంగ్లండ్ పశ్చిమ ప్రాంతంలో ప్రసవానికి ముందు, ప్రసవానంతర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఈ పరిస్థితితో బాధపడుతున్న మహిళలకు సహాయం చేసేవారికి గత 3 సంవత్సరాలలో 80 శాతం సిఫార్సులు పెరిగాయి.
స్నానంచేసి రాగానే, తన కొడుకును హింసించాలనే భయంకరమైన ఆలోచనలు తనకు వచ్చాయని బెక్కీ చెప్పారు.
ఆమె సహాయం కోరడానికంటే ముందు తన జీవితాన్ని తానే ముగించుకోవాలని లేదంటే తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని అనుకున్నారు.
"నాకు సహాయం చేసిన వ్యక్తులకు నాపై కోపం లేదు, వారు అర్థం చేసుకుంటారు. దయ కలిగినవారు" అని 36 ఏళ్ల బెక్కీ అన్నారు.
"నా బుర్రలోకి వస్తున్న వింతైన, భయానకమైన ఆలోచనలు మొదటిసారి ప్రసవించిన తల్లుల్లో చాలా సాధారణమని అప్పుడే నాకు అర్థమైంది."

మహిళలకు తక్షణ చికిత్స అందించడమే లక్ష్యం
బ్రిస్టల్, బాత్, నార్త్ ఈస్ట్ సోమర్‌సెట్, సౌత్ గ్లౌసెస్టర్‌షైర్, విల్ట్‌షైర్‌లలో పనిచేసే రెండు ప్రసవానంతర మానసిక ఆరోగ్య సహాయ కేంద్రాలను 2024-25లో 4,816మంది మహిళలు సందర్శించారు.
2022-23లో ఈ సంఖ్య 2,668. అంటే దాదాపు రెట్టింపు.
ఈ హెల్ప్‌లైన్‌ను అవాన్, విల్ట్‌షైర్ మెంటల్ హెల్త్ పార్టనర్‌షిప్ (ఏడబ్ల్యూపీ) నిర్వహిస్తుంది. బెక్కీ ఈవా ఈ హెల్ప్‌లైన్ క్లినికల్ డెవలప్‌మెంట్ లీడ్.
తాము అందించే సేవలపై అవగాహన పెరగడం, ప్రసవానికిముందు, ప్రసవానంతర మానసిక ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెరగడం వల్ల సహాయం కోరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈవా అన్నారు.
మొదటిసారి ప్రసవించిన తర్వాత ఏడాది లోపలే కొంతమంది మహిళల మరణానికి ప్రధాన కారణం.. ఈ ఆందోళనలతో తల్లి ఆత్మహత్య చేసుకోవడమే అని ఈవా అన్నారు.
"మా సాయం అవసరం ఉన్న మహిళలను చేరుకోవాలని, వారికి తగిన మానసిక చికిత్స, శాస్త్రీయ ఆధారిత చికిత్సను అందించాలని మేం కోరుకుంటున్నాం. ఇదే మా సేవ ప్రధాన లక్ష్యం" అని ఈవా అన్నారు.
ప్రసవానంతర నిరాశ, తీవ్రమైన ఆందోళనకు గురయిన తర్వాత 2023 లో బెక్కీ వీరి నుంచి సహాయం పొందారు.
ప్రసవించిన తర్వాత కోలుకుంటున్న బెక్కీ, స్నానం చేయడం, తినడం, నిద్రపోవడం కూడా కష్టంగా ఉందని చెప్పారు. అదే సమయంలో, ఆమె తల్లిపాలు ఇవ్వడంతోపాటు, బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది.
"కానీ ఆ బిడ్డను హింసించాలనే భయంకరమైన, వింతైన ఆలోచనలు వచ్చాయి నాకు" అని బెక్కీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'నామీద నాకే అసహ్యంగా అనిపించేది'
దాదాపు ఆరు నెలల పాటు ఈ లక్షణాలను అనుభవించిన తర్వాత, ఒక సాయంత్రం తన భర్త ఇంటికి వచ్చాక, డ్రెస్సింగ్ గౌనులోనే ఇంటి నుంచి పారిపోయానని బెక్కీ చెప్పారు.
"నేను అలా చీకట్లోనే సమీపంలో ఉన్న గార్డెకి వెళ్లి అక్కడ నడుస్తూనే ఉన్నాను. ' నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోలేను అన్న ఆలోచనలు నా మనసులోకి వస్తూనే ఉన్నాయి." అని ఆమె చెప్పారు.
ఇంకా ఆమె ఏమన్నారంటే.."ఇది సంతోషంగా ఉండాల్సిన సమయం అని అందరూ నాకు చెప్పారు. మీరూ ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఈ సమయం తొందరగా గడిచిపోతుంది. నిజానికి మీరు చాలా అదృష్టవంతులు... నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను."
"నన్ను నేను నియంత్రించుకోలేకపోయేదాన్ని. అందుకే ఇంటికి తిరిగి వెళ్లి వైద్యుడిని సంప్రదించాను. వెంటనే నన్ను పరీక్షించారు." అని బెక్కీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కలవరపెట్టే ఆలోచనలు తనను తాను చాలా అసహ్యించుకునేలా చేశాయని, తానెప్పుడూ అలా ఆలోచించాలనుకోలేదని బెక్కీ చెప్పారు.
అందువల్ల, తనకు లేదా బిడ్డకు ప్రమాదం లేదని వైద్యులు నిర్ధరించడంతో, ఆమె ఆసుపత్రిలో చేరడానికి బదులుగా ఇంట్లోనే చికిత్స కొనసాగించారు.
ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు ఇలాంటి సహాయం, చికిత్సను కోరుకుంటున్నారు కాబట్టి 'ఇలా జరగడం ఆశ్చర్యం కలిగించదు, ఇది చాలా సహజం' అని బెక్కీ బీబీసీతో అన్నారు,
"దీనికి అతిపెద్ద కారణం మన సమాజంలో సరైన సహాయం, మద్దతు లేకపోవడమే అని నేను భావిస్తున్నా" అని ఆమె అన్నారు.
"మేం ఎక్కువగా ఒంటరైపోతున్నాం, మా పిల్లలను ఒంటరిగా పెంచాలని భావిస్తున్నాం. మునుపటి తరాలు తమ పిల్లలను కుటుంబం, సమాజం సహాయంతో పెంచాయి" అని ఆమె అన్నారు.

‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’
"నా చుట్టూ ఉన్న వ్యక్తులు, మానసిక ఆరోగ్య బృందం సహాయం లేకపోయుంటే, నేను బహుశా ఆత్మహత్యకు ప్రయత్నించేదాన్నే, లేదంటే నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేదాన్ని" అని బెక్కీ చెప్పారు.
మానసిక ఆరోగ్య సమస్యలు తరుచుగా గుర్తించరని, దాంతో చికిత్స కూడా అందదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్స్‌లెన్స్ చెబుతోంది.
కొంతమంది మహిళలు సమాజం ఏమంటుదోనని భయపడి లేదా సామాజిక సేవా సంస్థలు తమపై చర్య తీసుకుంటాయని భయపడి సహాయం కోరరు అని పేర్కొంది.
గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత మానసిక ఆరోగ్య సమస్యలు మహిళలు, వారి కుటుంబాలపై తీవ్రమైన, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్స్‌లెన్స్ తెలిపింది.
ఇది పిల్లల భావోద్వేగ, సామాజిక, మేథో వికాసాన్ని కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొంది.

కొత్త తల్లులు మానసిక ఆరోగ్య సంకేతాలను గుర్తించడంలో సహాయపడే వైద్యులు, వ్యక్తులకు ఏడబ్ల్యూపీ సంస్థ ప్రత్యేక శిక్షణ అందించిందని ఈవా చెప్పారు.
"మానసిక ఆరోగ్య క్షీణతకు అనేక కారణాలు ఉన్నా, ఆర్థిక ఒత్తిడి, కుటుంబ సభ్యుల మధ్య బంధం సరిగా ఉండకపోవడం ప్రధాన కారణాలు" అని ఆమె చెప్పారు.
"మా ప్రసూతి, ఆరోగ్య సందర్శన సిబ్బంది క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు. అన్ని కేసులు నేరుగా నిపుణుల బృందానికి చేరేలా మేం ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాం" అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














