గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ పీఆర్ దేశం
- హోదా, బీబీసీ కోసం
గర్భం దాల్చిన తర్వాత ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? ఏమేం పరీక్షలు చేయించుకోవాలి? కడుపులో బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది? ఏవైనా లోపాలున్నాయా? గర్భణిగా ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొనవచ్చా? ఇలా ఎన్నో ప్రశ్నలు.
గర్భం ధరించిన మహిళలకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతాయి.
వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గర్భ నిర్ధరణ
గర్భం దాల్చినట్లు నిర్ధరించుకునేందుకు మూత్ర పరీక్ష చేసుకోవాలి. మార్కెట్లో అనేక రకాల గర్భ నిర్ధరణ కిట్‌లు అందుబాటులో ఉన్నాయి.
గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఏఎన్ఎం, హెల్త్ వర్కర్ వద్ద ఇవి అందుబాటులో ఉంటాయి.
ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా ఉచితంగా ఈ పరీక్ష చేస్తారు.
ఈ టెస్టులన్నీ కూడా మూత్రంలో హెచ్‌సీజీ హార్మోన్ ఉందా లేదా అని సూచిస్తాయి. ఈ హార్మోన్ మూత్రంలో విడుదల అవ్వడానికి, అండం ఫలదీకరణ చెందాక కనీసం రెండు వారాలు పడుతుంది.
అందువల్ల, నెలసరి తప్పిన కనీసం వారం రోజుల తర్వాత చేసుకోవాలి.
అందులో పాజిటివ్ అని వస్తే వైద్యులకు దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి.

గర్భిణులు డాక్టర్‌ను ఎప్పుడెప్పుడు సంప్రదించాలి?
తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే మొదటి ఏడు నెలల్లో నెలకి ఒకసారి, అంటే ఏడుసార్లు.. 8వ నెలలో రెండుసార్లు, 9వ నెలలో వారానికి ఒకసారి వైద్యుల దగ్గర చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది.
గర్భందాల్చినట్లు నిర్ధరణయ్యాక మొత్తం 13 సార్లు వైద్యులను సంప్రదించాలి.
ఇన్నిసార్లు వీలుపడకపోతే కనీసం నాలుగు సార్లు చెకప్‌కి వెళ్లాల్సి ఉంటుంది.
మొదటి మూడు నెలల్లో ఒకసారి, 4 - 6 నెలల మధ్య ఒకసారి, చివరి మూణ్నెళ్లలో కనీసం రెండుసార్లు సంప్రదించాలి.
చెకప్‌కి వెళ్లినప్పుడు బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉందో లేదో, తల్లికి ఏవైనా ప్రమాద సూచికలు ఉన్నాయా అనే విషయాలను వైద్యులు గమనిస్తారు.
ఎంత బరువు పెరగాలి?
గర్భధారణ సమయంలో మహిళ 9 నుంచి 11 కేజీల బరువు పెరగాలి.
మొదటి మూడు నెలల్లో వాంతుల మూలంగా బరువులో ఎలాంటి మార్పు ఉండదు.
నాలుగో నెల నుంచి బరువు పెరుగుతారు.
4వ నెల నుంచి నెలకు ఒకటిన్నర నుంచి రెండు కేజీలు పెరగాలి.

స్కానింగ్ ఎన్నిసార్లు చేయించాలి?
1) గర్భవతి అని తెలిసిన వెంటనే స్కానింగ్ చేయించుకోవాలి. దానితో బిడ్డ ఎప్పుడు పుట్టే అవకాశం ఉంటుందో ఆ తేదీ నిర్ణయిస్తారు. స్కానింగ్ లేకుండా బిడ్డ ఎప్పుడు పుడుతుందో తెలుసుకోవడానికి చివరిసారిగా ఎప్పుడు నెలసరి వచ్చిందో, ఆ నెలసరి వచ్చిన మొదటి రోజును గుర్తుపెట్టుకోవాలి. అప్పటి నుంచి 9 నెలల 7 రోజులు కలిపితే బిడ్డ పుట్టే తేదీ ఇంచుమించుగా చెప్పొచ్చు. బిడ్డ ఎలా పెరుగుతుందో తెలుసుకోవడానికి ఈ తేదీ ఎంతో ముఖ్యం. అందుకే మహిళలు వారి నెలసరి తేదీని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
2) బిడ్డకు డౌన్ సిండ్రోమ్ ఉందా? లేదా? అని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా చూడొచ్చు. ఈ స్కానింగ్ 3వ నెలలో చేస్తారు.
3) గర్భస్థ శిశువులో ఏవైనా లోపాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు 4 నెలలు నిండాక ఒక స్కానింగ్ చేస్తారు. ఏవైనా తీవ్రమైన లోపాలు ఉంటే (గుండె జబ్బులు,కాళ్లు చేతులు సరిగ్గా లేకపోవడం వంటివి)అబార్షన్ చేసుకునే వీలు ఉంటుంది.
4) ఎనిమిది నెలలకు, 9 నెలలు దాటాక బిడ్డ ఎదుగుదల పరీక్షించేందుకు స్కానింగ్ చేయాల్సి ఉంటుంది.
మొత్తంగా కనీసం నాలుగు నుంచి ఐదుసార్లు స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఏఏ టెస్ట్‌లు చేయించాలి?
రక్త హీనత ఉందేమో తెలుసుకునేందుకు హిమోగ్లోబిన్ పరీక్ష, షుగర్ లేదా బీపీ ఎక్కువ ఉండటం వల్ల తల్లీబిడ్డకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో తెలుసుకునేందుకు మూత్ర పరీక్ష చేయాలి.
కిడ్నీల పనితీరును తెలిపే క్రియాటనీన్ పరీక్ష, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలిపే పరీక్ష చేయించుకోవాలి.
అవికాకుండా థైరాయిడ్, హెచ్ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్ బి టెస్టులు చేయించుకోవాలి. హెచ్ఐవీ, హెపటైటిస్ బి, సిఫిలిస్ బిడ్డకు సోకే ప్రమాదం ఉంటుంది. దీనికి వైద్యుల సలహా మేరకు సరైన మందులు వాడాలి.
షుగర్ ఉందో లేదో కచ్చితంగా తెలుసుకోవడానికి ఓజిటిటి పరీక్ష (ఓరల్ గ్లూకోస్ టోలరెన్స్ టెస్ట్) చేస్తారు. ఈ పరీక్ష ఐదో నెలలో చేస్తారు.
కొంతమంది మహిళలకు కేవలం గర్భం దాల్చినపుడు మాత్రమే షుగర్ లేదా బీపీ ఎక్కువగా ఉంటుంది. బిడ్డ పుట్టాక నార్మల్ అయిపోతుంది. వీటినే గర్భస్థ మధుమేహం, గర్భస్థ రక్తపోటు (గెస్టేషనల్ డయాబెటిస్, గెస్టేషనల్ హైపెర్టెన్షన్) అంటారు. వీటికి కచ్చితంగా మందులు వాడాలి, లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యేక పరీక్షలు
కొన్నిసార్లు బిడ్డకి జన్యు లోపాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు డబుల్ మార్కర్ టెస్ట్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్ లేదా క్వాడ్రబుల్ మార్కర్ టెస్ట్ అనే రక్త పరీక్షలను వైద్యులు సూచిస్తారు.
జన్యు లోపం ఉంటే ఈ రక్త పరీక్షల్లో తెలుస్తుంది. ఇవి 5 నెలలు నిండకముందే చేయించుకోవాలి.
ఒక్కోసారి, తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి మూడు నెలల కంటే ముందే ఈ పరీక్షలు సూచిస్తారు.
టీకాలు..
గర్భం దాల్చిన ప్రతి మహిళ డీటీ (డిఫ్తీరియా అండ్ టెటనస్ టాక్సాయిడ్స్) ఇంజక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంజక్షన్ రెండుసార్లు తీసుకోవాలి.
మొదటి ఇంజక్షన్ మూడు లేదా నాలుగో నెలలో తీసుకుంటే, రెండో ఇంజక్షన్ కనీసం నాలుగు వారాలు ఆగి తీసుకోవాల్సి ఉంటుంది.
గర్భిణులందరూ కచ్చితంగా ఈ ఇంజక్షన్ తీసుకోవాలి, లేదంటే బిడ్డకి, తల్లికి ధనుర్వాతం వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఈ ఇంజక్షన్ కోరింత దగ్గును కూడా నివారిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కచ్చితంగా వేసుకోవాల్సిన మందులు..
రక్త హీనత లేకపోయినా కూడా ఐరన్ మందులు రోజూ వేసుకోవాలి.
నిమ్మకాయ నీరుళు, నారింజ, జామకాయ లేదా ఉసిరికాయ లాంటివి ఐరన్ టాబ్లెట్‌తో పాటు తీసుకుంటే పేగుల నుంచి రక్తంలోకి ఐరన్ బాగా వెళ్తుంది.
అలాగే, నోట్లో ఇనుము రుచి రాకుండా ఉంటుంది.
అయితే, ఇది వేసుకున్నపుడు పాలు, పాల పదార్థాలు (పెరుగు వంటివి) తీసుకోకూడదు.
ఈ ఆహార పదార్థాల్లో ఉండే కాల్షియం ఇనుమును శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.
ఎంత తినాలి?
గర్భం దాల్చడానికి ముందు సాధారణ తీసుకునే ఆహారం కంటే ఒక పూట ఎక్కువే తినాలి. బిడ్డకి సరైన పోషణ అందాలంటే రోజుకి కనీసం మామూలు కంటే 350 కిలో క్యాలరీలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ సమయంలో పదిహేను నుంచి ఇరవై గ్రాముల ప్రోటీన్ కూడా అదనంగా అవసరం పడుతుంది.
దీని కోసం రెండు గుడ్లు లేదా ఒక పెద్ద గ్లాసు పాలు ఆహారంలో అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
సెక్స్ చేయొచ్చా?
గర్భధారణ సమయంలో కూడా శారీరకంగా కలవొచ్చు కానీ భాగస్వామికి ఎలాంటి లైంగిక వ్యాధులు, ఇతరులతో లైంగిక సంబంధాలు లేకపోతేనే కలవాలి.
లేదంటే లైంగిక వ్యాధులు గర్భిణికి, ఆమె నుంచి బిడ్డకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది.
చివరి మూడు నెలల్లో కలిస్తే.. గర్భంపై ఒత్తిడి పడి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి గర్భిణి శారీరక పరిస్థితి, మానసిక స్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి.
కెగెల్స్ వ్యాయామం
ప్రతిరోజూ కనీసం అరగంట వేగంగా నడవడం చేయాలి. శరీరం, మనసు సహకరిస్తే ప్రసవ సమయం కంటే రెండు వారాల ముందు వరకు ఉద్యోగం చేసుకోవచ్చు.
ఎక్కువ మానసిక లేదా శారీరక ఒత్తిడి కలిగించే పనులు మానుకోవాలి.
రోజుకు కనీసం 8 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.
ప్రసవం అయ్యేటప్పుడు యోని చుట్టూ ఉండే కండరాలు చీల్చుకుని పుడుతుంది బిడ్డ. కాబట్టి గర్భంతో ఉన్నపుడు, అంతకు ముందు నుంచే అక్కడ కండరాలు గట్టిపడేలా రోజూ వ్యాయామం చేయాలి. దానిని కెగెల్స్ వ్యాయామం అంటారు.
కొంతమంది మహిళలకి ఈ కండరాలు గట్టిగా లేక గర్భస్థ సమయంలో మూత్రంపై నియంత్రణ కోల్పోతారు. దగ్గినా, తుమ్మినా మూత్రం కారిపోతుంది. ఇలాంటి వారు కూడా ఈ వ్యాయామం రోజూ చేస్తే మూత్రపై నియంత్రణ వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాద సంకేతాలు
పడుకుని లేచిన తర్వాత కూడా కాళ్ల వాపులు కనిపిస్తూ ఉంటే పరీక్షలు చేయించవలసి ఉంటుంది.
ఎప్పుడైనా రక్త స్రావం అయితే, కేవలం రెండు మూడు చుక్కల రక్తం కనబడినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
జ్వరం వచ్చినా, మూత్రంలో మంటగా ఉన్నా, పొత్తి కడుపులో నొప్పవచ్చినా, తలనొప్పి, కళ్లు మసకబారడం, బిడ్డ కదలికలు తగ్గడం లేదా పూర్తిగా తెలియకపోవడం, ఫిట్స్.. వీటన్నింటినీ ప్రమాద సంకేతాలు (డేంజర్ సైన్స్) అంటారు.
అప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
(గమనిక: రచయిత డాక్టర్. వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే ఇది. అవసరమైన సమయాల్లో నేరుగా వైద్యులనే సంప్రదించాలి.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














