ప్రపంచంలో ఒకే ఒక్కరికి ఈ బ్లడ్ గ్రూప్ ఉంది, ఎవరామె? ఎక్కడుంటారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద వి
- హోదా, బీబీసీ ప్రతినిధి
''గ్వాడా నెగటివ్''గా పిలుస్తున్న 48వ బ్లడ్ గ్రూప్‌ను కనుగొన్నారు. ఇంతవరకు గుర్తించిన ప్రకారం.. ప్రపంచంలో ఒకే ఒక్క మహిళకు ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నట్లు చెబుతున్నారు.
ఫ్రాన్స్ ఆధీనంలోని గ్వాడెలోప్ ఐలాండ్‌కు చెందిన మహిళలో ఈ రక్తాన్ని గుర్తించారు. ఆ ప్రదేశాన్ని సూచించేలా ఈ బ్లడ్ గ్రూప్‌కు గ్వాడా నెగటివ్ అని పేరుపెట్టారు.
ఫ్రాన్స్ జాతీయ రక్త సంస్థ అయిన ఎస్టాబ్లిష్‌మెంట్ ఫ్రాంకైస్ డు సాంగ్ (ఈఎఫ్ఎస్)ఈ బ్లడ్ గ్రూప్‌ను కనుగొంది. ఈ ఆవిష్కరణకు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ గుర్తింపు లభించింది. దీనిని 48వ బ్లడ్ గ్రూప్‌గా గుర్తించింది. ఈ బ్లడ్ గ్రూప్‌ను పీఐజీ7గా వ్యవహరిస్తున్నారు.
2025 జూన్ నాటికి ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచంలో ఒకే ఒకరికి ఈ బ్లడ్ గ్రూప్ ఉంది.

అరుదైన రక్తం అంటే..
ఒక బ్లడ్ గ్రూప్ అరుదైనదో కాదో తెలుసుకోవడానికి, సాధారణంగా ప్రతి ఒక్కరి రక్తంలో ఉండే ఈఎంఎం యాంటీజెన్ ఆ బ్లడ్ గ్రూప్‌లో ఉందో లేదో నిర్ధరించాల్సి ఉంటుంది.
ఆ బ్లడ్ గ్రూప్ వెయ్యి మందిలో ఒకరి కంటే తక్కువ మందిలో కనిపిస్తే దానిని అరుదైన బ్లడ్ గ్రూప్‌గా చెబుతారు.
కొత్తగా కనుగొన్న బ్లడ్ గ్రూప్‌లో ఉన్న అరుదైన లక్షణం ఏంటంటే, అందులో ఈఎంఎం యాంటీజెన్ ఉండదు. ఈ ఈఎంఎం యాంటీజెన్ దాదాపు మానవులందరిలో ఉంటుంది. ఇది రక్తంలోని ఎర్ర రక్తకణాలపై కనిపిస్తుంది.
రక్తకణాలకు కొన్ని ప్రోటీన్లను కలిపి ఉంచడంలో సాయపడుతుంది.
ఈ యాంటీజెన్ రక్తంలోని ఎర్ర రక్తకణాలను శరీరం తన సొంత కణాలుగా గుర్తించడంలో 'కోడ్'లా పనిచేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా నిర్ధరణ అయింది?
2011లో, గ్వాడెలోప్‌కు చెందిన 54 ఏళ్ల మహిళ శస్త్రచికిత్సకు ముందు కొన్ని రక్త పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో, ఆమె రక్తంలో కొన్ని అసాధారణ అంశాలను ఫ్రెంచ్ వైద్యులు గమనించారు.
ఆమె రక్తం ఇతర ఏ బ్లడ్ గ్రూప్‌తోనూ సరిపోలలేదు, కానీ ఆమె రక్తం ఎందుకు అలా ఉందో తెలుసుకునేందుకు అప్పటికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు.
దీనిపై ఫ్రెంచ్ జాతీయ రక్త సంస్థకి చెందిన థియెరీ బెర్నార్డ్, స్లిమ్ అసౌసీ సహా పరిశోధకుల బృందం వరుస అధ్యయనాలు నిర్వహించింది.
2019లో జీనోమ్ సీక్వెన్సింగ్‌లో అధునాతన పద్ధతుల ఆవిష్కరణ జరిగింది.
పెద్ద సంఖ్యలో జన్యువులను వేగంగా, క్రమంలో చేర్చే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది, ఆ తర్వాతే కొత్త బ్లడ్ గ్రూప్‌కి కారణమైన జన్యువైవిధ్యాన్ని(జెనెటిక్ వేరియంట్) గుర్తించినట్లు పరిశోధకులు థియెర్రీ బెర్నార్డ్ చెప్పారు.
ఈ జన్యువైవిధ్యమే ఈఎంఎం యాంటీజెన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ ఎలా వచ్చింది?
ఈ క్వాడ్రా బ్లడ్ గ్రూప్ కలిగివున్న మహిళ తల్లిదండ్రులిద్దరిలోనూ పైన చెప్పిన జన్యువైవిధ్యం ఉంది.
అందువల్ల, ఆమె వారసత్వంగా జన్యువైవిధ్యాన్ని పొందింది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఆమె ఒక్కరేనని, ఆమె ఎవరి నుంచీ రక్తం తీసుకోలేరని థియెరీ బెర్నార్డ్ అన్నారు.
దాదాపు ప్రతి ఒక్కరిలో ఈఎంఎం యాంటీజెన్ ఉండడం వల్ల, ఆమె మరొకరి నుంచి రక్తదానం పొందలేరు.
అలాగే, ఇదే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ఇంకెవరైనా ఆమె పుట్టిన గ్వాడెలోప్ ఐలాండ్‌లో కానీ, దాని సమీప ప్రాంతాల్లో కానీ ఉన్నారా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అరుదైన బ్లడ్ గ్రూప్ వారికి ఎదురయ్యే సవాళ్లు
ఇలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్నవారు, అదే బ్లడ్ గ్రూప్ వారి నుంచి మాత్రమే రక్తం తీసుకోగలరు.
ఒకవేళ వేరే రక్తం ఎక్కిస్తే, ఆ వ్యక్తి రక్తంలో లేని యాంటీజెన్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ యాంటీజెన్‌ను ఆ శరీరం అంగీకరించదు.
''వేరే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కించడం కొన్నిసార్లు ప్రాణాంతకం కావొచ్చు. బాంబే బ్లడ్ గ్రూప్ అని పిలిచే అరుదైన బ్లడ్ గ్రూప్‌లో H యాంటీజెన్ ఉండదు. మనందరిలో దాదాపుగా యాంటీజెన్ ఉంటుంది. కాబట్టి, బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి రక్తం ఎక్కించేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, అలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారు తమ రక్తాన్ని తామే ఎక్కించుకునే ఒక పద్ధతి ఉంది'' అని మైక్రోబయాలజిస్ట్ షణ్ముకప్రియ అంటున్నారు.
''అలాంటి వారు తమ రక్తాన్ని తామే దానం చేసుకుని, భద్రపరుచుకోవచ్చు. రక్తంలోని వివిధ భాగాలను వేర్వేరుగా నిల్వ చేయవచ్చు. కొన్ని భాగాలను ఏడాది వరకు చేసుకోవచ్చు. యాంటీజెన్లు లేని ప్లాస్మా వంటి భాగాలను ఏ దాత నుంచి అయినా పొందవచ్చు'' అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














