BH Series: మీ వాహనానికి భారత్ సిరీస్ నంబర్ ప్లేట్ కావాలంటే ఏం చేయాలి?

బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త ప్రైవేట్ వాహనాలకు మాత్రమే బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ పొందవచ్చు

ఒకవేళ మీరు పని కోసం తరచుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ప్రయాణించాల్సి వస్తుంటే, లేదా ప్రతీ రెండు మూడేళ్లకు జాబ్ ట్రాన్స్‌ఫర్ మీద మరో కొత్త రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తుంటే, మీ వాహనానికి బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ తీసుకోవడం చాలా మంచిది.

అసలు బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ అంటే ఏంటి? దీన్ని ఎవరు పొందవచ్చు? ఈ సిరీస్ నంబర్ ప్లేట్ పొందడం కోసం ఏమి చేయాలి? దీనివల్ల ప్రతికూలతలు ఏమైనా ఉన్నాయా?

ఈ ప్రశ్నలన్నింటికీ ఈ కథనంలో సమాధానాలు తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్

భారత ప్రభుత్వం 2021 ఆగస్టులో బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్‌ను తీసుకొచ్చింది.

ప్రైవేట్ వాహనాలు కొత్త వాటికి మాత్రమే ఈ నంబర్ ప్లేట్ కేటాయిస్తారు. కమర్షియల్ వాహనాలకు ఇవ్వరు.

ఈ సిరీస్ నంబర్ ప్లేట్ మీద BH అనే ఆంగ్ల అక్షరాలు కనిపిస్తాయి.

అయితే, మామూలు నంబర్ ప్లేట్లతో పోలిస్తే ఈ సిరీస్ నంబర్ ప్లేట్‌మీద అంకెలను అమర్చే విధానం కాస్త వేరేగా ఉంటుంది.

BH అనే ఆంగ్ల అక్షరాల తర్వాత, దాని పక్కనే కారు రిజిస్ట్రేషన్ నంబర్ రాసి ఉంటుంది. అలాగే వాహనం కేటగిరీని తెలిపే సమాచారం కూడా అక్కడే కనిపిస్తుంది.

బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ముందుగా రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం (YY), తర్వాత BH (భారత్ సిరీస్), ఆ తర్వాత 4 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్, దాని తర్వాత వాహన కేటగిరీని తెలిపే రెండు ఆంగ్ల అక్షరాలు రాసి ఉంటాయి. వాహన కేటగిరీని బట్టి A నుంచి Z వరకు రెండు అక్షరాలను ఉపయోగిస్తారు.

ఉదాహరణకు, ఏదైనా ఒక కారు నంబర్ 22 BH 9999 AA అనుకుందాం. ఇందులో 22 అంటే, ఈ వాహనం 2022లో భారత్ సిరీస్‌లో రిజిస్టర్ అయిందని అర్థం. తర్వాతి నాలుగు అంకెలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను సూచిస్తాయి. చివరి రెండు అక్షరాలు వాహన కేటగిరీని తెలుపుతాయి.

మామూలు నంబర్ ప్లేట్‌లో రిజిస్ట్రేషన్ అయిన రాష్ట్రం పేరును సూచించే అక్షరాలు ఉంటాయి.

మరి బీహెచ్ సిరీస్‌ ప్రత్యేకత ఏంటి ? అనే సందేహం మీకు రావొచ్చు.

ఈ సిరీస్ నంబర్ ప్లేట్ వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ నంబర్ ప్లేట్ చెల్లుతుంది. అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్తే వాహనాన్ని మళ్లీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదే కాకుండా, మరొక ఇబ్బంది నుంచి కూడా తప్పించుకోవచ్చు.

బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, BH సిరీస్ నంబర్ ప్లేట్‌తో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి

బీహెచ్ నంబర్ ప్లేట్ ప్రయోజనాలు

స్టేట్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనంతో మీరు మరో రాష్ట్రంలో నివసించడానికి వెళ్లినట్లయితే 12 నెలల్లోపు మీరు మీ వాహన రిజిస్ట్రేషన్‌ను కొత్త రాష్ట్రానికి అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. మీరు ఇలా చేయకపోతే, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే అవకాశం ఉంది.

ఫలితంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించలేదనే కారణాన్ని చూపుతూ బీమా కంపెనీ మీ కారు బీమా క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు.

అయితే, బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్‌తో మీకు ఈ సమస్య ఎదురుకాదు. ఎందుకంటే బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ ఉంటే, మీరు ఒక ప్రదేశం విడిచి మరొక ప్రదేశానికి వెళ్లినప్పుడు వాహన రిజిస్ట్రేషన్‌ను మార్చాల్సిన అవసరం లేదు.

అప్పుడు కారు బీమా కవరేజీ, క్లెయిమ్ వ్యాలిడిటీ గురించి ఆందోళన ఉండదు.

రోడ్ ట్యాక్స్ తగ్గుతుందా?

మరో విషయం ఏమిటంటే, సాధారణ నంబర్ ప్లేట్‌తో కొత్త కారు కొన్నప్పుడు మామూలుగా 15 సంవత్సరాల రోడ్డు పన్ను చెల్లించాలి. వాహనం పొడవు, ఇంజిన్ సామర్థ్యం, వాహన రకాన్ని బట్టి ఈ పన్ను ఉంటుంది.

BH సిరీస్ నంబర్ ప్లేట్ తీసుకుంటే, తర్వాతి రెండేళ్లకు మాత్రమే రహదారి పన్ను చెల్లించాలి. ఆ తర్వాత ప్రతీ రెండేళ్లకు ఒకసారి రోడ్డు పన్ను చెల్లించాలి.

ఈ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలకు రోడ్డు పన్నును వాహనం ధర నుంచి జీఎస్టీని తొలగించడం ద్వారా కాలిక్యులేట్ చేస్తారు.

ఇంకో ప్రయోజనం ఏంటంటే, ఒకవేళ మీరు వాహనాన్ని మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అమ్మాలనుకుంటే సులభంగా అమ్మవచ్చు. ఎందుకంటే బీహెచ్ సిరీస్ వాహన రిజిస్ట్రేషన్ దేశమంతటా చెల్లుతుంది.

బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది

ఈ నంబర్ ప్లేట్‌ను ఎవరు తీసుకోవచ్చు?

దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భారత సిరీస్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉందని 2023లో పీఐబీ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది.

కాబట్టి ఈ ప్రాంతాలకు చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు, అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఉద్యోగులు బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల విషయానికొస్తే, వారి కంపెనీ ఆఫీసులు కనీసం నాలుగు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజిస్టర్ అయి ఉంటే వారు కూడా దీనికి అర్హులు.

బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ ఎలా?

బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభం.

ఇందుకోసం మీరు మీ రాష్ట్రంలోని ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ VAHAN పోర్టల్‌లో మీరు లాగిన్ అవ్వొచ్చు. లేదా ఏదైనా అధీకృత ఆటోమొబైల్ డీలర్ సహాయం తీసుకోవచ్చు.

ప్రైవేట్ రంగ ఉద్యోగులైతే ఫారం 60 నింపాలి. వారు వర్క్ సర్టిఫికెట్‌తో పాటు ఎంప్లాయ్‌మెంట్ ఐడీని చూపించి, అవసరమైన పత్రాలను సమర్పించాలి.

దీని తర్వాత వాహనం అర్హతను అధికారులు తనిఖీ చేస్తారు. బీహెచ్ నంబర్ కోసం ఆర్టీవో నుంచి ఆమోదం పొందిన తర్వాత, మోటారు వాహన పన్ను చెల్లించాలి.

అప్పుడు వాహన్ పోర్టల్, మీ కారు కోసం బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్‌ను రూపొందిస్తుంది.

బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్

ఫొటో సోర్స్, parivahan.gov.in

ప్రతికూలతలు, నష్టాలు ఏమైనా ఉంటాయా?

ఒకవేళ మీరు లోన్ మీద వాహనం తీసుకున్నట్లయితే, బ్యాంకు నుంచి ఎన్‌ఓసీ పత్రం అవసరం కావచ్చు. బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఇంకా చాలా బ్యాంకుల విధానం స్పష్టంగా లేదు.

అయితే, భవిష్యత్తులో ఒక వ్యక్తి బీహెచ్ నంబర్‌ తీసేసి, సాధారణ స్టేట్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌ పొందాలనుకుంటే, ఆ ప్రక్రియ కొంచెం క్లిష్టంగా ఉంటుంది.

అలాగే, పన్ను రేట్లు కూడా కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు.

ఉదాహరణకు,10 లక్షల రూపాయల ధర ఉన్న వాహనాలకు 8 శాతం పన్ను, 10-20 లక్షల రూపాయల ధర ఉన్న వాహనాలకు 10 శాతం, 20 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రేట్లు పెట్రోల్ కార్లకు సంబంధించినవి.

అదే డీజిల్ కార్లయితే అదనంగా 2 శాతం, ఎలక్ట్రిక్ కార్లకు 2 శాతం తక్కువ పన్ను ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)