షెఫాలీ జరీవాలా: ఈ నటి మరణం తర్వాత యాంటీ ఏజింగ్ ట్రీట్‌మెంట్‌పై చర్చ ఎందుకు మొదలైంది? ఈ చికిత్సతో యవ్వనంగా కనిపిస్తారా?

ఫొటో సోర్స్, shefalijariwala/Insta
షెఫాలీ జరీవాలా 42 ఏళ్లకే ఆకస్మికంగా చనిపోవడానికి కారణాలు ఏంటనేది ఇంకా తెలియలేదు.
షెఫాలీ వృద్ధాప్య నిరోధక మాత్రలు (యాంటీ ఏజింగ్ ట్యాబ్లెట్స్ ) సహా అనేక మందులు తీసుకున్నారని ఆమె మరణంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు చెప్పారు.
బహుశా ఖాళీ కడుపుతో ఆమె ఈ మాత్రలు తీసుకోవడం వల్ల రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
"జూన్ 27న షెఫాలీ ఒక ఇంజెక్షన్ తీసుకున్నారు. అది యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ అయి ఉండొచ్చు" అని పోలీస్ అధికారి ఒకరు చెప్పినట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
"రక్తపోటు వేగంగా పడిపోయింది. ఆమె వణకడం మొదలైంది. తర్వాత కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు" అని పోలీస్ అధికారి వివరించారు.
జూన్ 27 రాత్రి షెఫాలీ జరీవాలాను అంధేరీలోని బెలెవ్యూ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులకు సమాచారం అందింది. పోస్ట్ మార్టం కోసం ఆమె మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించారు.

"షెఫాలీ మరణానికి సంబంధించి అంబోలీ పోలీసులు ఇప్పటివరకు ఆమె భర్త, తల్లిదండ్రులు, ఇంటి పనిమనిషితో సహా 10 మంది స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. షెఫాలీ స్పృహ కోల్పోయినప్పుడు వాళ్లందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఏదీ అనుమానాస్పదంగా అనిపించలేదు. దర్యాప్తులో భాగంగా, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన పోలీసు బృందం వారి ఇంటికి వెళ్లి అనేక వస్తువుల నుంచి నమూనాలను సేకరించింది. ఇందులో షెఫాలీ వాడుతున్న మందులు, ఇంజెక్షన్లు కూడా ఉన్నాయి" అని పోలీసులు చెప్పారు.
షెఫాలీ మరణం తర్వాత వృద్ధాప్య నిరోధక చికిత్సలు, వయస్సు పెరగడం వల్ల వచ్చే శారీరక మార్పులను నిరోధించే చికిత్సలతో ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయనే దానిపై చర్చ తీవ్రమైంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖ నటీమణులు ఏమన్నారు?
షెఫాలీ మరణం తర్వాత నటి మల్లికా శెరావత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. 'ఆరోగ్యకరమైన జీవనశైలి' అలవరచుకోవాలని అందులో సూచించారు.
"నేను ఎలాంటి ఫిల్టర్లు వాడలేదు. మేకప్ వేసుకోలేదు. నా జుట్టుకు కూడా ఏమీ చేయించలేదు. నేను ఈ వీడియో మీ అందరికీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే మనం బొటాక్స్ వద్దని చెబుదాం. ఆర్టిఫీషియల్ కాస్మెటిక్ ఫిల్లర్స్ వద్దని చెబుదాం. ఆరోగ్యకరమైన జీవనశైలిని స్వాగతిద్దాం" అని మల్లికా శెరావత్ ఆ వీడియోలో చెప్పారు.
అదే సమయంలో నటి కరీనా కపూర్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "నేను బొటాక్స్‌కు వ్యతిరేకం" అని చెప్పారు.
వయసు పెరగడం వల్ల నటీమణులకు పెరుగుతున్న సవాళ్ల గురించి ఆమె ప్రస్తావిస్తుండగా... మీకు కూడా చర్మం ముడతలు పడటం, వయసు పెరగడం గురించి ఆందోళన ఉందా అనే ప్రశ్న కరీనాకు ఎదురైంది.
"నేను బొటాక్స్‌కు వ్యతిరేకం. అయితే నేను నా గురించి శ్రద్ధ తీసుకుంటాను. ఆరోగ్యంగా ఉండటం, మంచి, సహజమైన థెరపీలు తీసుకోవడం లాంటివి. దీనర్థం ఏంటంటే విశ్రాంతి తీసుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కొంత సమయం గడపడం. మీరు సెట్‌లో ఏం చేస్తారో వాటికి పూర్తిగా భిన్నమైనవి అన్నమాట. సూదులు, సర్జరీల లాంటి వాటి జోలికి వెళ్లకపోవడం" అని కరీనా చెప్పారు.
మల్లికా శెరావత్, కరీనా కపూర్ తమ ప్రకటనల్లో షెఫాలీ పేరును ప్రస్తావించలేదు. అయినప్పటికీ వారి ప్రకటనలు ఆమె మరణం చుట్టూ జరుగుతున్న చర్చకు ముడిపడి ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
యాంటీ ఏజింగ్ ట్రీట్‌మెంట్ అంటే ఏంటి?
వయసు పెరిగే కొద్దీ ముఖం మీద ముడతలు, నుదిటిపైన గీతలు, కళ్ల కింద చర్మం నల్లగా మారడం లాంటి మార్పులు వస్తాయి.
దీనిని నివారించడానికి కాస్మెటిక్ సర్జరీలు, ఇంజెక్టబుల్ ఫిల్లర్లు, బొటాక్స్ లాంటివి పెరిగాయి.
వయస్సు పెరగడం వల్ల కనిపించే ప్రభావాలు, మార్పులను నెమ్మదింపచేసే ఔషధాలు, సమ్మేళనాల కలయికే ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్‌మెంట్.
వీటిలో అత్యంత ప్రజాదరణ పొందినది బొటాక్స్. ఇది చాలా శక్తిమంతమైన ఇంజెక్షన్.
నుదుటిపై గీతలు, కళ్ల కింద ముడతలు, ముక్కు చుట్టూ చర్మంపై గీతలు వంటి వాటిని తగ్గించేందుకు బొటాక్స్ ఇంజెక్షన్ ఉపయోగిస్తారు.
చర్మ సౌందర్యం కోసం ఈ ఇంజెక్షన్ వినియోగించేందుకు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ 20 ఏళ్ల క్రితమే అనుమతి జారీ చేసింది.
"డెర్మల్ ఫిల్లర్లు అనేవి చర్మం లోపల ఇచ్చే ఇంజెక్షన్లు. అవి మన చర్మ కణాలు తయారయ్యే పదార్థం నుంచి తయారవుతాయి" అని ది ఈస్తటిక్ క్లినిక్‌లో సీనియర్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ దేవ్‌రాజ్ షోమ్ హిందీ న్యూస్ వెబ్‌సైట్ ది లల్లన్‌టాప్‌తో చెప్పారు.
వయసు పెరిగే కొద్దీ చర్మంలోని కొల్లాజెన్ తగ్గడం మొదలవుతుంది.
అయితే ఫిల్లర్ల సాయంతో కొల్లాజెన్‌ను తిరిగి చేర్చడం ద్వారా ముఖం యవ్వనంగా కనిపిస్తుందని ఆయన అన్నారు.
చాలామంది వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి గ్లూటాతియోన్ ఇంజెక్షన్లను కూడా ఉపయోగిస్తున్నారు.
ఇది శరీరంలోని కణాలకు నష్టం జరగకుండా నిరోధించే యాంటీ ఆక్సిడెంట్. గ్లూటాతియోన్‌ను తరచుగా ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు, మాత్రల రూపంలో తీసుకుంటారు.
"గ్లుటాతియోన్ మన శరీరంలో ముందు నుంచే ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ దాని ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే దీన్ని బయట నుంచి తీసుకుంటారు. దీని వల్ల చర్మం రంగు మెరుగుపడుతుందని నమ్ముతారు. ఇంట్రావీనస్ గ్లూటాతియోన్ వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. అయితే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దీనికి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం లేదు" అని కైలాష్ హాస్పిటల్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెర్మటాలజీలో సీనియర్ కన్సల్టెంట్ అంజూ ఝా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ చికిత్స ఎంత వరకు సురక్షితం?
"కొన్ని మినహాయింపులు పక్కన పెడితే, అలాంటి ఇంజెక్షన్లన్నీ సురక్షితమైనవేనని తేలింది. అయితే ఇందులో అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే, వాటన్నింటినీ డెర్మటాలజిస్టు పర్యవేక్షణలోనే తీసుకోవాలి" అని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రికతో దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెర్మటాలజీ చైర్మన్ రిషి పరాశర్ చెప్పారు.
బొటాక్స్ వల్ల ప్రమాదం పెరిగిందని, 2024 ఏప్రిల్‌లో అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది.
29 నుంచి 50 ఏళ్ల వయసున్న 22 మంది మహిళల్లో బొటాక్స్ వల్ల ప్రమాదకరమైన రియాక్షన్లు వచ్చాయని సీడీసీ తెలిపింది. వారిలో 11 మందిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని.. అందులో ఆరుగురిలో బొటాక్స్ ఇంజెక్షన్లలోని టాక్సీన్లు నాడీ వ్యవస్థలోకి వ్యాప్తి చెందినట్లు కనిపించిందని, కళ్లు మసకబారడం, కంటి రెప్పలు వాలిపోవడం, ఆహారం మింగడంలో ఇబ్బందిపడటం, నోరు పొడిబారడం, సరిగా మాట్లాడలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, అలసట వంటి లక్షణాలు వారిలో కనించాయని సీడీసీ తెలిపింది.
వారందరూ గుర్తింపు పొందిన ఆరోగ్య కేంద్రాలలో కాకుండా.. ఇళ్ల దగ్గర, స్పా సెంటర్లలో శిక్షణ లేని వ్యక్తుల నుంచి ఇంజెక్షన్లు తీసుకున్నట్లు తెలిసిందని సీడీసీ చెప్పింది.
"గ్లుటాతియోన్ వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయి. అందుకే దీనికి ఎఫ్‌డీఏ అనుమతి ఇవ్వలేదు. ఇది తీసుకోవడం వల్ల కొందరికి అనాఫిలాక్సిస్ వస్తుంది. ఇంజెక్షన్ ద్వారా తీసుకునే మందులు స్టీవెన్స్ జాన్సన్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. వీటితో మరణం సంభవించే అవకాశం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది" అని డాక్టర్ అంజూ ఝా చెప్పారు.
చర్మాన్ని ప్రకాశవంతం లేదా తెల్లగా చేయడానికి ఈ మందులను ఉపయోగించే వారికి, వారు దీనిని తీసుకుంటున్నంత కాలం మాత్రమే ఇది ప్రభావవంతంగా ఉంటుందని ఆమె చెప్పారు. దీని ప్రభావం శాశ్వతంగా ఉండదు.
"మీరు ఎంత మోతాదు తీసుకుంటున్నారు, దానిని తీసుకోవాలా వద్దా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మంచి చర్మవ్యాధి నిపుణుడి సలహా తీసుకోవడం అవసరం" అని డాక్టర్ అంజు చెప్పారు
"ఈ మందుల వల్ల గుండెపోటు రాదు. అయితే కొన్నిసార్లు మోతాదు పెరగడం వల్ల ఇది కాలేయం, మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని పరోక్ష ప్రభావాలు ఉంటాయి. అందుకే నిపుణుల పర్యవేక్షణ అవసరం. సొంత వైద్యం, పార్లర్‌లో చికిత్సలు, అవగాహన లేని వైద్యుల సూచనలతో ఇలాంటివి వాడవద్దు" అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














