ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉపాధ్యాయులకు యాప్ గుదిబండగా మారిందా?

గవర్నమెంట్ టీచర్లు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నిరసన తెలుపుతున్న టీచర్లు ( ఫైల్ ఫోటో)
    • రచయిత, అల్లు సూరిబాబు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విద్యార్థులకు చదువు చెప్పడం కన్నా, పాలనాపరమైన బాధ్యతలు, బోధనేతర విధుల భారంతో సతమతమవుతున్నామని ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్ టీచర్ల నుంచి కొన్నాళ్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదే కారణంగా చూపిస్తూ నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని కోటితీర్థం ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. మధుసూదనరావు ఉద్యోగానికి రాజీనామా చేయడంతో 'యాప్'ల భారమనేది మరోసారి చర్చనీయమైంది.

"ప్రభుత్వం యాప్స్, బోధనేతర కార్యక్రమాల పేరుతో టీచర్లను కట్టుబానిసల్లా మార్చేసింది. నాలుగైదేళ్లుగా విద్యార్థుల చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. 29 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు" అని మధుసూదనరావు తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.

అయితే, ప్రభుత్వం వాదన మరోలా ఉంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి మారిందని అధికారులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీచర్లు, యాప్‌లు, లీప్ యాప్, విద్యాశాఖ

ఫొటో సోర్స్, apteachers.in

ఫొటో క్యాప్షన్, 45 యాప్‌లకు బదులుగా ఒకే యాప్ తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది.

బయోమెట్రిక్ నుంచి యాప్‌..

తొలుత వేలిముద్రతో అటెండెన్స్ నమోదు చేయడానికి ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను ప్రభుత్వం ఇచ్చింది.

తర్వాత కాలంలో వాటికి బదులు టీచర్లే తమ సొంత సెల్‌ఫోన్‌లో యాప్‌లను ఉపయోగించే విధానాన్ని తీసుకొచ్చింది.

అలా మొదలై... ప్రతి పనికి ప్రత్యేకంగా ఒక్కో యాప్ వచ్చింది.

రోజూ ఒక్కో యాప్‌లో లాగిన్ అవడానికి, సంబంధిత వివరాలు అప్‌లోడ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతోందని, దీనివల్ల బోధన కన్నా బోధనేతర పనుల భారం ఎక్కువైందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతుండేవి.

దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆయా యాప్‌ల్లో విధులన్నీ కేంద్రీకరిస్తూ 'లీప్' పేరుతో ఒకే యాప్‌ను తీసుకొచ్చింది.

దీని నిర్వహణ బాధ్యత ప్రధానోపాధ్యాయులదే. కొందరు ప్రధానోపాధ్యాయులు మిగిలిన ఉపాధ్యాయులకు కూడా పనిభారం పంచుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీచర్లు, యాప్‌లు, లీప్ యాప్, విద్యాశాఖ

ఫొటో సోర్స్, schooledu.ap.gov.in/screen grab

ఫొటో క్యాప్షన్, బోధనేతర విధులను సచివాలయ ఉద్యోగులకు అప్పగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

యాప్ మారినా విధులు అవే..

''తరచుగా సిగ్నల్ ప్రాబ్లమ్, ఒక్కోసారి సాంకేతిక సమస్యలతో యాప్‌లో టీచర్లు, విద్యార్థుల అటెండెన్స్ అప్‌లోడ్ కూడా సమస్య అవుతోంది. ఐదు నిమిషాల్లో అయిపోవాల్సిన పనికి అరగంటకు పైగా పడుతోంది. ఆ సమయంలో టీచర్లకు టెన్షన్ తప్పట్లేదు. అటెండెన్స్ పడలేదని చూసుకుంటుంటే విద్యార్థులకు పాఠాలు చెప్పలేరు. అలాగని వదిలేసి క్లాస్‌కు వెళ్లిపోతే ఒక్కోసారి అటెండెన్స్ వేయడమే మరిచిపోతున్నవారూ ఉన్నారు. దీనివల్ల పై అధికారుల ఆగ్రహానికి గురవ్వాల్సిన పరిస్థితి ఉంది'' అని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పువ్వల ధనంజయరావు బీబీసీతో చెప్పారు.

దీనిపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు బీబీసీతో మాటాడుతూ, ''గతంలో పాఠశాలల్లో వివిధ అంశాలకు సంబంధించి 45కి పైగా యాప్‌లను ఉపయోగించేవారు. వాటిపై అభ్యంతరాలు ఉండేవి. ఇప్పుడు అనవసరమైన యాప్‌లను తొలగించాం. సింగిల్ యాప్ (ఎల్‌ఈఏపీ- లీప్) తీసుకొచ్చాం. ఇప్పుడు అన్ని సమస్యలు లేవు'' అన్నారు.

అయితే, ఒకటే యాప్ అయినా పనిభారంలో మార్పేమీ లేదన్నారు ధనంజయరావు.

"బాత్ రూమ్‌ల ఫోటోలు తీయడమనే పనిని తొలగించారు. అంతే తప్ప పెద్ద మార్పేమీ లేదు. గతంలోని 45 యాప్‌లతో ఏవైతే పనులు అప్పగించారో అవన్నీ ఇప్పుడూ సింగిల్ యాప్‌లోనూ యథావిధిగా కొనసాగుతున్నాయి" అని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, విద్య

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సింగిల్ టీచర్లు, ప్రధానోపాధ్యాయులు యాప్‌లో నమోదు చేయాల్సిన పనుల జాబితా.

సింగిల్ టీచర్లకు అదనపు భారం

సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల్లో బోధన, బోధనేతర విధులన్నీ ఒకరివే.

ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో ఈ తరహా పాఠశాలల సంఖ్య పెరిగింది. సింగిల్ టీచర్లతో పాటు పూర్తి స్థాయిలో విద్యార్థులున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి యాప్‌ల భారంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

బోధనేతర విధులకు సంబంధించిన యాప్‌ల నిర్వహణ తమకు తప్పించి, సచివాలయాల్లోని ఉద్యోగులకు అప్పగించాలనే వాదనలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వస్తున్నాయి.

ఈ మేరకు ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు వెళ్లాయి.

''బోధనేతర పనులు ప్రధానోపాధ్యాయులకు అదనపు భారమవుతున్నాయి. దీంతో యాప్‌లో ఫోటోలు, వివరాల అప్‌లోడ్ కోసం కొంతమంది ఉపాధ్యాయుల సహాయం తీసుకుంటున్నారు. వారేమో ఈ పనుల్లో పడి తరగతులకు సరిగ్గా వెళ్లలేకపోతున్నారు. బోధనకు ఆటంకం కలుగుతోంది.

ఈ సమస్యల దృష్ట్యా ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, పెద్ద స్కూళ్లలో జూనియర్ అసిస్టెంట్‌లను నియమించాల్సిన అవసరం ఉంది'' అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు బీబీసీతో అన్నారు.

అయితే, యాప్‌లతో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే అయినా ఇప్పుడు ఒకే యాప్ ద్వారా పని సులభమవుతోందని విద్యాశాఖాధికారులు అంటున్నారు.

‘‘ఇప్పుడు ఒకటే యాప్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఒకే యాప్ తో ఉపాధ్యాయులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా సులువు అయింది. అసలు దీంట్లో ఒత్తిడి ఫీల్ కావడానికి ఏముంటుంది? ఏ రోజు పని ఆరోజు చేసుకోవడమే కదా.. టైం కి వర్క్ చేయడం కూడా ప్రెజర్ అనుకుంటే ఎలా ?’’ అని బీబీసీతో అన్నారు విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ (సర్వీసెస్) సుబ్బారెడ్డి.

ఆంధ్రప్రదేశ్, టీచర్లు, యాప్‌లు, లీప్ యాప్, విద్య

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, విద్యార్ధుల హాజరుతో పాటు అనేక అంశాలు ఉపాధ్యాయులు యాప్‌లో నమోదు చేయాలి.

బోధనేతర విధులకే ఎక్కువ సమయం

జనగణన, విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు, ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ విధులకు మాత్రమే ఉపాధ్యాయుల సేవలు ఉపయోగించుకునేందుకు విద్యాహక్కు చట్టం-2009 అనుమతిస్తుంది.

వాస్తవానికి, ఉపాధ్యాయులు మొత్తం తమ వార్షిక పని గంటల్లో కేవలం 19.1 శాతం సమయాన్ని మాత్రమే బోధనకు కేటాయిస్తున్నారని, మిగతా సమయమంతా ఎన్నికల విధులు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం, మధ్యాహ్న భోజనం రిజిస్టర్ల నిర్వహణ వంటి బోధనేతర విధులకే సరిపోతుందని పేర్కొంటూ 'డెక్కన్ క్రానికల్' ప్రచురించిన కథనాన్ని టీచర్లు ప్రస్తావిస్తున్నారు.

కర్ణాటక, ఒడిశా, గుజరాత్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో అధ్యయనం చేసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (డీమ్డ్ యూనివర్సిటీ ) విడుదల చేసిన నివేదికను ఆ పత్రిక ప్రస్తావించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)