‘నా భర్త ఏమయ్యాడో చెప్పండి’

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ శివార్లలో, సంగారెడ్డి జిల్లా పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచీ కంపెనీ గేటు బయట వాతావరణం హృదయవిదారకంగా ఉంది.
ఆ గేటు దగ్గర ఒడిశాకు చెందిన ఒక మహిళ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. తనను లోపలకు పంపించమని పోలీసులను వేడుకుంటున్నారు.
ఆమె భర్త ప్రశాంత్ మహాపాత్రో ఆ కంపెనీలోనే పనిచేస్తారు. అక్కడ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆమె తన భర్త ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరణించిన వారిలో ఆమె భర్త లేరు. ఆస్పత్రిలోనూ కనిపించలేదు.
దీంతో కంపెనీలో చిక్కుకుపోయి ఉంటారని భావించిన ఆమె పరుగున వచ్చి, ఫ్యాక్టరీ ముందు పడిగాపులు పడుతున్నారు. భర్త కోసం రోదిస్తూనే ఉన్నారు.


బిహార్ కి చెందిన లక్ష్మీ ముఖియా బంధువు శ్యామ్ సుందర్ కూడా తన కుటుంబ సభ్యులతో కలసి అక్కడ ఎదురు చూస్తున్నారు. లక్ష్మీ ముఖియా కూడా అదే కంపెనీలో పనిచేస్తారు. ఆయన ఆచూకీ తెలియడంలేదు.
ఆయన బంధువులు పోలీసులపై అరుస్తుంటే, వారు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
కాసేపు అరచి అలసిపోయిన వారు, బాధతో ఒక పక్కకు కూర్చున్నారు.
ఇంకెందరో ఉత్తరాది కూలీల కుటుంబ సభ్యులు తమ ఆప్తుల ఆచూకీ కోసం ఫోన్‌లో ఫోటోలు చూపిస్తూ, అక్కడ అధికారులకు పేర్లు ఇస్తూ కనిపించారు.
కన్నీటి పర్యంతమైన కూలీల కుటుంబాలను తోటి కూలీలు ఓదారుస్తున్నారు.
కంపెనీ నుంచి బయటకు వచ్చే అంబులెన్సుల్లో తమ వారు ఉన్నారేమోనని చూడడం కోసం వాటి వెనుక పరుగుపెడుతున్నారు. అక్కడ అంబులెన్సులను ఆగనివ్వకపోవడంతో, కొందరు కోపంతో వాటిపైకి రాళ్లు కూడా విసిరారు.
ఇదంతా సిగాచీ కంపెనీలో ప్రమాదం తరువాత అక్కడ కనిపించిన దృశ్యాలు.

పెరుగుతున్న మృతుల సంఖ్య
సిగాచీ కంపెనీ ప్లాంటులో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం నాటికి అధికారిక లెక్కల ప్రకారం 34 మంది మరణించారు. ఈ మేరకు సంగారెడ్డి ఎస్పీ వెల్లడించారు.
మరికొందరి ఆచూకీ తెలియలేదు. వారి కోసం బంధువులు ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు అక్కడ మొత్తం 143 మంది ఉన్నారు. అయితే పేలుడు శబ్దంతో చాలా మంది ఒక్కసారిగా పారిపోయారు.
దీంతో ఎంతమంది గల్లంతయ్యారన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు.
సిగాచీ కంపెనీ పాశమైలారం కేంద్రంగా యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియంట్స్, అంటే మందుల తయారీకి వాడే పదార్థాలను తయారు చేస్తుంది.
అందుకోసం మైక్రో క్రిస్టలీన్ సెల్యులోయిజ్ డ్రయ్యర్ యూనిట్ ఇక్కడ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి బీబీసీకి చెప్పారు. సోమవారం ఉదయం 9 నుంచి తొమ్మిదిన్నర గంటల మధ్య ప్రమాదం జరిగినట్టు స్థానిక పోలీసులు బీబీసీకి చెప్పారు.

కుప్పకూలిన భవనాలు
పేలుడుకు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రసాయన పదార్థాల్లో తేమ తొలగించే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది.
ఆ ప్రక్రియలో గాలి పీడనంలో మార్పుల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని కొందరు అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదం ఎంత పెద్దది అంటే, ఆ ధాటికి రసాయనం శుద్ధి చేసే ప్లాంట్ భవనం కుప్ప కూలింది.
దానిపై ఉండే రేకులు గాలిలో ఎగిరి ఫ్యాక్టరీ బయట ఉన్న చెట్లపై పడ్డాయి.
పేలుడు ప్రదేశానికి పక్కన ఉన్న ఇతర భవనాలు దెబ్బతిన్నాయి.
రసాయనాలు వెళ్ల పైపులైన్లు దెబ్బతిన్నాయి.
అక్కడ ఆ వ్యర్థాలు తొలగించే కార్యక్రమం సోమవారం రాత్రి వరకు కొనసాగింది. మంగళ వారం కూడా ఆ పని కొనసాగవచ్చు. అనేక బుల్డోజర్లు, అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులు, వైద్య శాఖ, పోలీసు, రెవెన్యూ, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, సంగారెడ్డి జిల్లా యంత్రాంగం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ప్రతిపక్షం నుంచి హరీశ్ రావు, ఇతర పార్టీల నేతలు కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

అయిన వారి కోసం ఆక్రందనలు
క్షతగాత్రులను ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు.
ప్రభుత్వమే వారికి వైద్యం అందిస్తుందని ప్రకటించారు. మృతదేహాలను సొంత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
పఠాన్‌చెరు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం, డీఎన్ఎ పరీక్షలకు ఏర్పాట్లు చేయించారు మంత్రి రాజనరసింహ.
పేలుడు ధాటికి అక్కడ పనిచేసే వారు ఎగిరి దూరంగా పడ్డారు. అటు కాలిన గాయాల వారు, ఇటు దూరంగా పడడం వల్ల గాయాలయిన వారూ ఉన్నారు. శిథిలాలు తొలగించిన క్రమంలో కొన్ని మృతదేహాలు దొరికాయి.
బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశం నిండిపోయింది.
తాము ఎంతో దూరం నుంచి వచ్చామని తమను పట్టించుకోవడం లేదని తమకు ఎవరూ సమాధానం చెప్పడం లేదని వారు వాపోయారు.

సోమవారం ఉదయం 9 గంటలకు ప్రమాదం జరిగినప్పటికీ, సాయంత్రం 6 గంటల సమయంలో కూడా పొగలు కక్కుతూ కనిపించాయి పరిశ్రమలోని కొన్ని ప్రదేశాలు.
అక్కడ పెద్ద ఎత్తున ఉన్న ముడి పదార్థాల నుంచి ఆ పొగలు వచ్చాయి. రసాయన పదార్థాలు పెద్ద ఎత్తున ఉండడంతో జాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నారు.
పెద్ద పెద్ద పైపులు, రేకులు, సిమెంటు శిథిలాలు అన్నీ కలిసిపోయి అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది.
సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














