పాశమైలారం : సిగాచీ కంపెనీలో పేలుడుకి అదే కారణమా?

పాశమైలారం, సంగారెడ్డి, హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేలుడు కారణంగా భవనం కుప్పకూలిందని, దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువైందని భావిస్తున్నట్లు తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌బాబు చెప్పారు.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్ శివారులోని పాశమైలారంలో ఉన్న సిగాచీ ఇండస్ట్రీలో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి, ప్రమాదంలో 36 మంది చనిపోయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, కొంతమంది తీవ్ర గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడానికి కారణమేమిటన్న దానిపై పోలీసులు, ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, డ్రైయర్ చాంబర్/యూనిట్‌లో పేలుడు కారణంగా ప్రమాదం జరిగిందని తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు బీబీసీతో చెప్పారు.

''ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత డ్రైయర్ చాంబర్‌లో పేలుడు జరిగి, మంటలు ఎగిసిపడినట్లుగా అర్థమవుతోంది'' అని తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బెండి రాజగోపాలరావు బీబీసీతో చెప్పారు.

తెలంగాణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

''డ్రైయర్ యూనిట్‌లో ఏదో తప్పు జరగడం వల్ల ఘటన జరిగిందని చెబుతున్నారు'' అని అన్నారు.

మరోవైపు, ''ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలి'' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సిగాచీ ఇండస్ట్రీ
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ యూనిట్‌లో కంపెనీ మైక్రో క్రిస్టలిన్ సెల్యూలోజ్ పౌడర్ (ఎంసీసీపీ) తయారు చేస్తున్నట్లుగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో సిగాచీ యాజమాన్యం పేర్కొంది.

అసలు ఏమిటీ డ్రైయర్ ఛాంబర్?

పేరుకు తగ్గట్టుగానే ఇది డ్రై (పొడి వాతావరణం) చేసే చాంబర్ లేదా యూనిట్. సిగాచీ కంపెనీలో మైక్రో క్రిస్టలిన్ సెల్యూలోజ్ పౌడర్ (ఎంసీసీపీ) తయారు చేస్తుంటారు. ఇది డ్రగ్స్ తయారీలో బాండింగ్ (కలిపి ఉంచే) మెటీరియల్‌గా ఉపయోగపడుతుంది.

ఫార్మా పరిశ్రమల్లో డ్రైయర్ చాంబర్ కీలకమని రాజగోపాలరావు చెప్పారు.

''మైక్రో క్రిస్టలిన్ సెల్యూలోజ్ పౌడర్ తయారయ్యాక కొంత తేమ ఉంటుంది. ఆ తేమను పూర్తిగా తొలగించేందుకు వీలుగా డ్రైయర్ చాంబర్ ఉపయోగపడుతుంది.''

''సాధారణంగా డ్రైయర్ చాంబర్ వద్ద 110 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఉంటుంది. అంతకుమించి ఉష్ణోగ్రత లేదా ప్రెజర్ (ఒత్తిడి) పెరిగినా ప్రమాదాలు జరగొచ్చు. ఇక్కడ అదే జరిగిందా.. మరేదైనా లోపమా అనేది విచారణలో తెలుస్తుంది'' అని రాజగోపాలరావు అన్నారు.

ఈ తరహా సంఘటన తెలంగాణలో జరగడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. అలాగే డ్రైయర్ లోకి వచ్చే పైపు లైనులో ప్రెజర్ పెరిగినా ప్రమాదం చోటుచేసుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

ప్రమాదానికి గల అసలు కారణాన్ని ఇప్పటికిప్పుడే నిర్ధరించలేమని వివరించారు.

సీఎం ఆదేశాల మేరకు త్వరలోనే తనిఖీలు చేపడతామని పరిశ్రమల శాఖ, ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు.

ఫార్మా కంపెనీ, డ్రైయర్

ఫొటో సోర్స్, Getty Images

డ్రైయర్ చాంబర్‌లో ప్రెజర్ పెరుగుతుందా?

ఈ విషయంపై తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ వై. మోహన్‌బాబు బీబీసీతో మాట్లాడారు.

''సాధారణంగా ఫార్మా కంపెనీల్లో డ్రైయర్ యూనిట్లు ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. అంటే, ఒత్తిడి ఎక్కువైతే దానంతట అదే ప్రెజర్ కటాఫ్ అయిపోతుంది. ఉష్ణోగ్రత విషయంలోనూ అంతే. ఉష్ణోగ్రతలు ఎక్కువైతే వాటంతట అవే కటాఫ్ అవుతాయి'' అని మోహన్ బాబు వివరించారు.

''ఫార్మా కంపెనీల్లో టెంపరేచర్, ప్రెజర్ ఎక్కువైనా, తక్కువైనా ప్రొడక్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే నిర్వాహకులు అవి సరైన స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రమాదాలు జరుగుతాయనే కాకుండా ప్రొడక్టు పాడై పోకుండా ఉండడం వారికీ ముఖ్యమే'' అని బీబీసీతో చెప్పారు మోహన్ బాబు.

వారానికోసారి, నెలకోసారి అంతర్గతంగా డ్రైయర్ల నిర్వహణ పనులు (మెయింటెనెన్స్) చేస్తుంటారని తెలిపారు. అయినప్పటికీ ఈ తరహా ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు ఆయన చెప్పారు.

''ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న వారందరూ చనిపోయారు. ఏం జరిగిందనే విషయం చెప్పేందుకు ప్రత్యక్షంగా చూసిన వారెవరూ లేరు'' అని మోహన్ బాబు తెలిపారు.

డ్రైయర్ యూనిట్‌లో పేలుడుకు గల కారణాలపై అధికారులు విశ్లేషిస్తున్నారు. సిగాచీ కంపెనీ దాదాపు 36 ఏళ్ల నుంచి ఫార్మా రంగంలో ఉంది. ఎక్కడ లోపం తలెత్తిందనే విషయంపై పరిశీలన చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే, భవనం పూర్తిగా కూలడంతో కారణాలను తెలుసుకోవడం కొంత ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.

''గాయపడిన వ్యక్తితో మేం మాట్లాడాం. ఘటన జరగడానికి ఐదు, పది నిమిషాల ముందు టెంపరేచర్ చూసినట్లుగా చెబుతున్నారు. అంతా సాధారణంగానే ఉందని ఆయన మాతో చెప్పారు. అప్పటికప్పుడు ఏం లోపం తలెత్తిందనే విషయంపై విచారణ చేపడుతున్నాం'' అని మోహన్ బాబు బీబీసీతో చెప్పారు.

పాశమైలారం పారిశ్రామికవాడ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ కంపెనీలో ప్రమాదం జరిగింది.

ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం?

ప్రమాద తీవ్రత పెరగడానికి కేవలం డ్రైయర్ పేలుడు మాత్రమే కాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

పేలుడు మాత్రమే జరిగి ఉంటే ఆ ప్రదేశం వరకే నష్టం పరిమితం అయ్యేది. దానికి తోడు భవనం కూలిపోవడంతో ఎక్కువమంది దాని కింది చిక్కుకుపోయారు.

''పేలుడు కారణంగా భవనం కుప్పకూలింది. దీంతో కింద ఉన్న కార్మికులు, ఉద్యోగులపై పై అంతస్తు కూలి పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువైందని భావిస్తున్నాం'' అని మోహన్ బాబు చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఫొటో క్యాప్షన్, సిగాచీ ఇండస్ట్రీస్‌ పేలుడులో బాధితుల విజ్ఞప్తులను వింటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

కంపెనీలలో తనిఖీలకు ఆదేశాలు

సిగాచీ పరిశ్రమ తరహా ఘటనలు పునరావృతం కాకుండా రసాయన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఇప్పటికే హైదరాబాద్ శివారుల్లోని పారిశ్రామికవాడలో గల పరిశ్రమల్లో తనిఖీలు, సేఫ్టీ ఆడిట్ సరిగ్గా జరగడం లేదనే విమర్శలున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉంది.

''కంపెనీలలో లోపాలను గుర్తించి నివేదిక ఇవ్వాలి. నిపుణుల సాయంతో సమగ్ర నివేదిక రూపొందించండి'' అని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)