ముస్లింలలో మహిళలు కూడా విడాకులు ఇవ్వొచ్చా? తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముస్లిం మహిళల విడాకులు అనగానే అందరికీ తలాక్ గుర్తొస్తుంది.
భారత ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ విషయంలో చట్టం చేసినప్పుడు దేశమంతా దీనిపై చర్చ జరిగింది.
అయితే, భార్య కూడా తనకు తానుగా భర్తకు విడాకులు ఇవ్వచ్చని ఇస్లామిక్ చట్టాలు చెబుతున్నాయి.
భర్త ఇచ్చే విడాకులు తలాక్ అయితే, భార్య ఇచ్చే విడాకులను ఖులా అంటారు.
తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ ఖులా మరోసారి చర్చనీయమైంది.
భర్తకు ఇష్టం లేకపోయినా భార్య ఇవ్వగలిగిన ఖులా విడాకులు ఏంటి?
ఈ విషయంలో ముస్లిం మహిళలకు ఎలాంటి హక్కులున్నాయి?


ఫొటో సోర్స్, Getty Images
తాజా కేసు ఏంటి?
మహమ్మద్ ఆరిఫ్ అలీ, అఫ్సరున్నీసాలకు 2012 జూన్ 1న పెళ్లైంది.
అమ్మాయికి అబ్బాయి రూ. 11 వేల మెహర్ ఇచ్చారు.
ఇస్లామిక్ సంప్రదాయంలో పెళ్లి సమయంలో అమ్మాయికి అబ్బాయి మెహర్ అనే బహుమానం ఇస్తారు.
తరువాత ఐదేళ్లు వారు కలిసున్నారు.
ఆ తరువాత భర్త తనను హింసిస్తున్నాడంటూ అఫ్సరున్నీసా ఆరోపించారు.
2017 జులై 7న భర్త కొట్టాడంటూ ఆసుపత్రిలో చేరారు.
తర్వాత ఆసుపత్రి నుంచి పుట్టింటికి వెళ్లిపోయారు.
భర్త నుంచి ఖులా కావాలని కోరారు అఫ్సరున్నీసా. అందుకు భర్త అంగీకరించలేదు.
తరువాత ఆమె, సదా ఎ హక్ షరియా అనే సంస్థ దగ్గరకు విడాకుల కోసం వెళ్లారు.
ఈమె విడాకులిప్పించమంటూ అభ్యర్థించిన ఆ షరియత్ సంస్థలో ఒక ముఫ్తీ, ఒక ఇస్లామిక్ స్టడీస్ ప్రొఫెసర్, ఒక అరబిక్ ప్రొఫెసర్, ఒక మసీదు ఇమామ్ ఉన్నారు.
ఈ సంస్థ చట్టబద్ధమైన విడాకులిచ్చే సంస్థ కానప్పటికీ, సాధారణంగా ముస్లింలు కొందరు విడాకుల పత్రం కోసం ఇటువంటి సంస్థలను ఆశ్రయిస్తుంటారు.
మధ్యవర్తిత్వం కోసం భార్యాభర్తల సమావేశానికి రావాలని భర్తను పిలిచారు ఆ మత పెద్దలు.
అతనికి మూడుసార్లు నోటీసు పంపారు.
చివరగా 2020 సెప్టెంబరు 14న ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లిన భర్త అసలు ఇలా భార్యాభర్తల పంచాయితీ చేసే అధికారం, బాధ్యత వాళ్లకు లేదని, తాను ఈ సమావేశాలకు రాలేనని లేఖ ఇచ్చి వచ్చారు.
2020 సెప్టెంబరు 26న భార్యాభర్తల పంచాయితీ జరగాల్సి ఉండగా, అంతకంటే ముందే వెళ్లి తాను రాలేనని చెప్పేశారు భర్త.
దీంతో 2020 అక్టోబరు 5న భార్యకు విడాకులు మంజూరు చేస్తూ ఖులానామా (విడాకుల పత్రం) ఇచ్చింది ఆ సంస్థ.
అయితే ఈ విడాకులను తాను అంగీకరించనంటూ భర్త హైదరాబాద్ లోని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు.
సదా ఎ హక్ షరియా కౌన్సిల్ అనే సంస్థ ఇచ్చిన విడాకులు చెల్లవని, వాటిని రద్దు చేయాలని కోర్టును కోరారు. కానీ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.
భార్య చట్టపరమైన మార్గంలోనే షరియత్ కౌన్సిల్ నుంచి విడాకుల పత్రాన్ని పొందారు కాబట్టి ఆ విడాకుల పత్రాన్ని రద్దు చేయలేం అని కోర్టు తీర్పునిచ్చింది.
దీంతో ఆయన 2024 ఫిబ్రవరిలో తెలంగాణ హైకోర్టుకు వచ్చారు.
పిటిషనర్ అయిన భర్త తరపున జె.ప్రభాకర రావు, మహమ్మద్ సైఫుద్దీన్‌లు వాదించగా.. రెస్పాండెంట్ అయిన భార్య, సదా ఎ హక్ షరియా తరపున ముబాషిర్ హుస్సేన్ అన్సారీ, ఇంతియాజ్ గులామ్ మహబూబ్ ఫయాజ్ మహమ్మద్‌లు వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరి వాదన ఏంటి?
సదా ఎ హక్ షరియత్ సంస్థ ప్రైవేటు ఎన్జీవో, సొసైటీ కాబట్టి వారికి ఇలా పెళ్లిళ్లు రద్దు చేస్తూ తీర్పులిచ్చే, విడాకుల పత్రాలిచ్చే అధికారం లేదని వాదించారు భర్త తరపు న్యాయవాదులు.
షరియా చట్టం ప్రకారం చూసినా ఈ సంస్థ ఒక ముఫ్తీ లేదా ఖాజీ హోదాలో లేదని, అలాంటప్పుడు ఖాజా అంటే తీర్పులు ఇవ్వలేదని వీరి వాదన.
అయితే ఖులా విడాకులను 1937 నాటి ముస్లిం పర్సనల్ లా షరియత్ చట్టం సెక్షన్ 2 ప్రకారం చూడాలని భార్య తరపు న్యాయవాదులు వాదించారు.
జువేరియా అబ్దుల్ మాజిద్ వర్సెస్ ఆతిఫ్ ఇక్బాల్ మసూరి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఖులా విడాకులకు కోర్టు జోక్యం అవసరం లేదని వారు వాదించారు.
గతంలో సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టులు రూపొందించిన ఆరు సూత్రాల ప్రకారం ఆ పెళ్లి రద్దైనట్లు ఆ ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది.
ఆ ఆరు సూత్రాల విషయంలో రాజీపడి విడాకులు ఇచ్చినట్టు భర్త ఫ్యామిలీ కోర్టులో నిరూపించలేకపోయారు అని కూడా భార్య తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు.
అసలు ముస్లింల విడాకులు ఎన్ని రకాలు?
- భర్త ఏకపక్షంగా విడాకులు కోరుకుంటే తలాఖ్
- భార్య ఏకపక్షంగా విడాకులు కోరుకుంటే ఖులా
- ఇద్దరూ కలిపి విడాకులు కోరుకుంటే ముబారాత్

ఫొటో సోర్స్, Getty Images
హైకోర్టు ఏం చెప్పింది?
జూన్ 24న జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదనరావు బెంచ్ ఈ కేసులో తీర్పు ఇచ్చింది.
హైకోర్టు తీర్పులో ఖురాన్, ఇస్లామిక్ ధర్మ శాస్త్రాలు, గతంలో ఇస్లామిక్ చట్టాలపై దేశంలోని వేర్వేరు కోర్టుల తీర్పులు, ఇస్లామిక్ న్యాయ సూత్రాలను విస్తృతంగా చర్చించింది. ఖురాన్‌లోని రెండో అధ్యాయం 229 వాక్యం ప్రకారం ఖులా విడాకులు అంటే ఏంటనే విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది.
''ఖులా అంటే వదిలివేయడం అని అరబిక్‌లో అర్థం. ఇష్టం లేని పెళ్లి నుంచి తమ సంప్రదాయ ముఫ్తీ ద్వారా ముస్లిం మహిళ బయటకు రావచ్చని ముస్లిం చట్టాలు చెబుతున్నాయి. ఈ విడాకులను భర్త కాకుండా భార్య కోరుతుంది. దీనికి ప్రతిగా ఆమె భర్తకు మెహర్ తిరిగి ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఈ అంశం ప్రైవేటుగా ముఫ్తీ దగ్గర సెటిల్ కాకపోతే అప్పుడు ఖాజీ అనే జడ్జి తరహా వ్యక్తి దగ్గరకు పంచాయితీ వెళ్తుంది. అతను ఖాజా అనే తీర్పు ఇస్తారు అని మస్రూర్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ దిల్లీ కేసులో చెప్పారు'' అని హైకోర్టు తన తీర్పులో రాసింది.
''ఖురాన్ రెండో అధ్యాయం 228, 229 అధ్యాయాల ప్రకారం భార్యకు పెళ్లి తెగతెంపులు చేసుకునే సంపూర్ణ హక్కు ఉంది. దీనికి భర్త అనుమతి అవసరం లేదు" అని గతంలో కేరళ హైకోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు ఉటంకించింది. అంతేకాదు షరియా చట్టం ప్రకారం కోర్టుకు వెళ్లకుండా ముస్లిం మహిళ విడాకులు తీసుకోవచ్చనికోర్టు పేర్కొంది.
విడాకులు ఇవ్వాలన్న భార్య డిమాండుకు భర్త అంగీకరించకపోతే ఏం చేయాలనేది మత పరమైన గ్రంథాల్లో కానీ లేదు.
దీంతో ఈ విషయంపై భారతీయ కోర్టులు మొత్తం 4 రకాల ప్రక్రియలను ఏర్పాటు చేశాయి.
- తమ సంప్రదాయ ముఫ్తీ లేదా అతని దగ్గర పంచాయితీ తెగకపోతే ఖాజీ దగ్గరకు వెళ్లడం
- మగవారు తలాఖ్ చెప్పినట్టు ఆడవారు ఖులా చెప్పడం. మళ్లీ కలపడానికి పెద్దలు ప్రయత్నించాలి. కానీ మహిళదే తుది నిర్ణయం. కానీ తీసుకున్న మెహర్ తిరిగివ్వకుండా ఉండే హక్కు భర్తకు ఉంటుంది. తలాఖ్ విషయంలో మగవారికి ఏ హక్కులుంటాయో ఖులా విషయంలో ఆడవారికీ అవే ఉంటాయి.
- భర్త అంగీకరించకపోయినా ఖాజీ ద్వారా విడాకులు పొందవచ్చు.
- షయారోబాను కేసులో సుప్రీం తీర్పు ప్రకారం భార్యకు ఇష్టం లేకుండా భర్తతో బలవంతంగా వివాహబంధంలో ఉండనక్కర్లేదు.
ఇది కాకుండా వివిధ భారతీయ కోర్టులు ముస్లింల మహిళల విడాకుల విషయంలో పెట్టిన ఆరు సూత్రాలను ఈ కేసులోని ఫ్యామిలీ కోర్టు పాటించిందని గుర్తు చేసింది హైకోర్టు.
ఇవన్నీ ప్రస్తావిస్తూ తెలంగాణ హైకోర్టు స్పష్టంగా తన తీర్పులో ఇలా రాసింది.
''భార్యకు విడాకులు తీసుకునే కచ్చితమైన హక్కు ఉంది. భర్తకు విడాకులను తిరస్కరించే హక్కు లేదు. కేవలం మెహర్ మొత్తం లేదా కొంత మొత్తం తిరిగి ఇవ్వడం గురించిన చర్చలు జరపవచ్చు. అలాగని భార్య (అప్పటికే తీసుకున్న) మెహర్ తిరిగి ఇవ్వను అంటే కూడా విడాకులు తిరస్కరించే హక్కు భర్తకు లేదు. అలాగే ఖులా కోసం ముఫ్తీ దగ్గరకు వెళ్లడం తప్పనిసరి కాదు, వారు ఇచ్చే ఫత్వాలు కోర్టుల్లో చెల్లవు. అయితే ఖాజా లేదా కోర్టుకు దీనిపై (విడాకులు ఇష్టం లేనివారు) వెళ్లవచ్చు. వారిచ్చే తీర్పు చెల్లుతుంది. కోర్టులు సైతం భార్యకు ఉండే విడాకుల హక్కును తిరస్కరించలేవు'' అని హైకోర్టు తీర్పిచ్చింది.
''ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు తీర్పు సరైనదే. వీరి విడాకులు చెల్లుతాయి. ముఫ్తీలు, మతపరమైన సంస్థలకు విడాకులు ఇచ్చే హక్కు లేదు. అలాగని ఈ కేసులో విడాకులు చెల్లకుండా పోవు'' అని తీర్పిచ్చారు న్యాయమూర్తులు జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన రావు.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లిలో సమస్యలు వచ్చినప్పుడు, కలిసుండటానికి వీలైనంతలా ప్రయత్నించినా ఇక కలసి ఉండడం కుదరనప్పుడు విడాకులు తీసుకునే హక్కు భార్యాభర్తలిద్దరికీ ఇచ్చింది ఖురాన్.
దీనిపై బీబీసీతో వివరంగా మాట్లాడారు ఇస్లామిక్ స్కాలర్ ఆసిఫుద్దీన్ మహమ్మద్.
''7వ శతాబ్దంలోనే మహిళలకు ఊహించలేని హక్కులు ఇచ్చింది ఇస్లాం. వివాహ బంధాన్ని ఒప్పుకునే లేక తిరస్కరించే హక్కు ప్రతి అమ్మాయికీ ఉంటుంది. ఒక మహిళ వితంతువైనా లేదా విడాకులు తీసుకున్నా పునర్వివాహం చేసుకునే హక్కును ఇస్లాం ఇస్తుంది. ఈ కోవకే చెందిన మరో ముఖ్యమైన హక్కు ఖులా. ఇది సమస్యాత్మక వివాహం నుండి భార్యకు విముక్తి కల్పిస్తుంది. అందుకు ఆమె పెళ్లి సమయంలో భర్త నుండి పొందిన మెహర్ (వధు కట్నం) తిరిగి ఇచ్చేస్తే చాలు. ఈ విధానానికి పునాది ఖురాన్‌లో ఉంది'' అని వివరించారు
''విడాకులకు ఇద్దరూ ఒప్పుకోవడం మంచిదే అయినప్పటికీ, ఒకవేళ భర్త ఖులాకు అంగీకరించకపోతే భార్య షరియత్ కోర్టు లేదా ఖాజీ లేదా ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి వివాహాన్ని రద్దు చేయించుకోవచ్చు. దీనిని ఫస్ఖ్ అంటారు'' అని ఆసిఫుద్దీన్ మహమ్మద్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














