ఫర్షీ సల్వార్: మొగల్ కాలంనాటి ఈ ఫ్యాషన్ డ్రెస్ ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతోంది..

ఫ్యాషన్, ట్రెండ్, భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Instagram/Zunaira Raza/ Social Media

ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాలో ఫర్షీ సల్వార్ల చర్చ నడుస్తోంది
    • రచయిత, నజీష్ ఫైజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ ఏడాది ఒక ఫ్యాషన్ ట్రెండ్ కేవలం పాకిస్తాన్‌ ఫ్యాషన్ ఇండస్ట్రీనే కాకుండా సాధారణ ప్రజల దృష్టిని కూడా ఆకర్షించింది. అదే ఫ్లోర్-లెంగ్త్ సల్వార్. దీన్నే ఫర్షీ సల్వార్ అని పిలుస్తారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో, టిక్‌టాక్‌లో ఎక్కడ చూసినా ఈ ఫ్లోర్ లెంగ్త్ సల్వార్‌ల గురించే చర్చ నడుస్తోంది.

ఈద్ సందర్భంగా పాకిస్తాన్‌లోని చాలా మంది మహిళలు ఫర్షీ సల్వార్ ధరించారు. కానీ, పాతకాలపు స్టయిల్ అయిన ఈ దుస్తుల ట్రెండ్ ఇప్పుడు పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతోంది?

ఫర్షీ సల్వార్ చరిత్ర ఏంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫర్షీ సల్వార్

ఫొటో సోర్స్, Zunaira Raza/ Social Media

ఫొటో క్యాప్షన్, నేలను తాకేలా పొడవుగా ఉండే సల్వార్లు ఇప్పుడు పాకిస్తాన్‌లో ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి

ఫర్షీ సల్వార్ కొత్త ఫ్యాషనా?

ఫర్షీ సల్వార్ బాగా వెడల్పుగా, పొడుగ్గా ఉండేలా రూపొందించిన ప్యాంట్. ఇది పాదాల కింది వరకు నేలను తాకేలా ఉంటుంది.

ఎక్కువ సౌకర్యంగా, హాయిగా ఉండేలా ఈ డిజైన్‌ను రూపొందించారు.

ఫర్షీ సల్వార్ ఈ కాలపు ఫ్యాషన్ కాదు.

మొగల్ కాలంలో ఈ ఫ్యాషన్ వాడుకలో ఉండేది. తర్వాత 1970, 80 దశకాల్లో కూడా ఈ ఫ్యాషన్‌ను అనుసరించారు.

మునుపటి కాలం నాటి పాటియాలా సల్వార్, బెల్ బాటమ్, వైడ్-లెగ్ పైజామా వంటి డిజైన్లు మళ్లీ ఇప్పుడు తిరిగొచ్చినట్లే, నేలను తాకే పొడవు ఉండే ఫర్షీ సల్వార్ ఫ్యాషన్ కూడా మళ్లీ మొదలైంది.

1970లలో ఈ ప్యాంటులను 'మోరీ' అని పిలిచేవారని ఫ్యాషన్, దీనికి సంబంధించిన ట్రెండ్లను గమనిస్తూ ఉండే కరాచీకి చెందిన 55 ఏళ్ల తలత్ రజా ఖాన్ చెప్పారు.

"మా కాలంలో సల్వార్‌ను 'చోటి మోరీ కే పాంచె' లేదా 'బడి మోరీ కే పాంచె' అని పిలిచేవారు. అయిదు ఇంచుల వెడల్పు ఉన్నప్పుడు, అంచులపై బటన్లు పెట్టేవారు. ఇప్పుడు కర్ధానీ సల్వార్‌ను ఫర్షీ సల్వార్ అని పిలుస్తున్నారు'' అని బీబీసీతో రజా ఖాన్ తెలిపారు.

ఫర్షీ సల్వార్ ఇప్పుడు కొత్త రూపుతో తిరిగొచ్చింది. అంటే దాని ఫ్యాబ్రిక్, శైలిలో చాలా మార్పులు వచ్చాయి.

గతంలో ఇందులో కాక్టస్, టెట్రమ్, కాటన్, లాన్, వెల్లమ్ ఫ్యాబ్రిక్‌లను ఎక్కువగా వాడేవారని రజా చెప్పారు. అంతకుముందు శాటిన్‌తో తయారు చేసిన ఫర్షీ సల్వార్‌లు కూడా ధరించేవారని ఆయన చెప్పారు.

ఫర్షీ సల్వార్

ఫొటో సోర్స్, zunaira raza

ఫొటో క్యాప్షన్, ఫర్షీ సల్వార్ కొత్త ఫ్యాషన్ కాదు. 1970, 80 దశకాల్లోనే ఈ ఫ్యాషన్ ఉంది

ఫ్లోర్ ప్యాంట్ మళ్లీ ట్రెండ్ ఎలా అయింది?

ఫ్లోర్ ఫ్యాంట్ ఫ్యాషన్ 2025లో మహిళల్లో బాగా ప్రాచుర్యం పొందింది. 1970, 80 దశకాల్లో ఇదే ప్యాంట్‌ను పురుషులు కూడా ఎక్కువగా ధరించేవారు. ఇప్పుడు కూడా పురుషులు, మహిళలు ఈ ఫ్లాట్ ట్రౌజర్లను ధరిస్తున్నారు.

'జీతో పాకిస్తాన్' అనే గేమ్ షోలో పాకిస్తానీ నటుడు ఫహాద్ ముస్తఫా చాలాసార్లు ఫర్షీ సల్వార్ ధరించారు.

ఈ రకమైన దుస్తులకు లభిస్తోన్న ప్రజాదరణ చూసి ప్రముఖ డిజైనర్లు, నటీమణులు ఈ దుస్తులను ధరిస్తున్నారు.

కానీ, ఈ ట్రెండ్‌ను మళ్లీ వాడుకలోకి తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కుతుంది?

నటి సదాఫ్ కన్వాల్ బ్రాండ్ కారణంగా ఫ్లోర్-లెంగ్త్ ప్యాంటులపై మళ్లీ అమ్మాయిలు బాగా ఆసక్తి చూపుతున్నారని కొన్ని రోజుల క్రితం మేకప్ ఆర్టిస్ట్ సారా అలీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.

ఈ ట్రెండ్‌ను తిరిగి తీసుకొచ్చిన ఘనత ఫ్యాషన్ డిజైనర్ హుస్సేన్ రెహర్‌కు దక్కుతుందని కూడా కొందరు అంటున్నారు.

ఫర్షీ సల్వార్

ఫొటో సోర్స్, zunaira raza

ఫొటో క్యాప్షన్, పొడవుగా, సన్నగా ఉండే మహిళలకు మాత్రమే ఇవి నప్పుతాయని అనుకునేవారు

ఫర్షీ సల్వార్‌ను ఎవరైనా వేసుకోవచ్చా?

ఫర్షీ సల్వార్‌ను ఈ రోజుల్లో కాస్త పొడవు తక్కువగా ఉండే చొక్కాతో ధరిస్తున్నారు.

అందుకే ఈ రకమైన ప్యాంట్లు అందరికీ నప్పుతాయా లేదా అంశంపై సోషల్ మీడియాలో డిజైనర్లు బిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మారియా బీ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.

ఫ్లోర్ లెంగ్త్ ఫ్యాంటులపై వేసుకునే చొక్కాలు పొడవు తక్కువుగా ఉంటున్నందున ఇవి వయస్సు పైబడిన మహిళలకు నప్పవని మారియా ఆ వీడియోలో అన్నారు.

పొడవుగా, సన్నగా ఉన్న వారికి మాత్రమే ఈ రకమైన ప్యాంటులు నప్పుతాయని ఎక్కువమంది వయస్సు పైబడిన మహిళలు అనుకోవడంతో ఈ ట్రెండ్ 1980లలో కొద్దికాలం మాత్రమే మనుగడలో ఉందని తలత్ రజా అన్నారు.

''ప్రతీ ఫ్యాషన్ అందరికీ నప్పదు'' అని మారియా కూడా అన్నారు.

''ఫర్షీ సల్వార్ అందరి కోసం. చాలా మంది మహిళలు అందంగా కనిపించాలని కోరుకుంటారు. డీసెంట్‌గా ఉండాలని అని అనుకుంటారు. అలాంటి వారికి ఈ ఫ్యాషన్ బాగా నప్పుతుంది'' అని నిదా యాసిర్ మార్నింగ్ షో కార్యక్రమంలో పాల్గొన్న డిజైనర్ హెచ్‌ఎస్‌వై అన్నారు.

ఫర్షీ సల్వార్‌లో పాకిస్తానీ నటి అయేజా ఖాన్

ఫొటో సోర్స్, Instagram

ఫొటో క్యాప్షన్, ఫర్షీ సల్వార్‌లో పాకిస్తానీ నటి అయేజా ఖాన్

ఫర్షీ సల్వార్ చరిత్ర

ఫర్షీ సల్వార్ చరిత్ర మొగల్ కాలం నాటిది. ఆ కాలంలో ఇది రాజుల వస్త్రధారణలో భాగంగా ఉండేది. పర్షియన్ పదం ఫర్ష్ నుంచి ఫర్షీ సల్వార్ అనే పేరు ఉద్భవించింది.

ఈ ప్యాంట్లు నేలను తాకేలా ఉంటాయి. కొన్నిసార్లు నేలను తాకుతూ కూడా కనిపిస్తాయి.

దక్షిణాసియాలోని మహిళలు ధరించే ఒక ఫ్యాషన్ ఈ ఫర్షీ సల్వార్. ఇది ఎక్కువగా ముస్లిం మహిళల్లో బాగా ప్రాచుర్యం పొందింది.

1980లలో పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ పీఐఏ యూనిఫాంలో కూడా ఫర్షీ సల్వార్ భాగంగా ఉండేది. పాకిస్తాన్‌లోనే కాకుండా భారత్‌లో కూడా ఎక్కువగా ఫర్షీ సల్వార్ ధరిస్తారు.

19వ శతాబ్దపు లఖ్‌నవూ ముస్లిం సంస్కృతిని ప్రతిబింబించే ఉమ్రావ్ జాన్ (1981), షత్రంజ్ కే ఖిలాడి (1977) వంటి సినిమాల్లో నవాబులు, రాజకుటుంబాల మహిళలు ఫర్షీ పైజామా ధరించినట్లు కనిపిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)