సిగాచీ ప్రమాదం: పరిశ్రమలలో ప్రమాదాలకు కారణాలేంటి, ప్రభుత్వం ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ శివార్లలోని పాశమైలారం సిగాచీ ఇండస్ట్రీస్‌లో జరిగిన భారీ ప్రమాదంలో ఇప్పటివరకు 40 మంది చనిపోయారని యాజమాన్యం ప్రకటించింది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ఫార్మా రంగంలో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో సిగాచీ ఇండస్ట్రీస్ ప్రమాదం కూడా ఒకటని చెప్పవచ్చు.
ఈ ప్రమాదం తర్వాత పరిశ్రమల్లో భద్రతా లోపాలపై విస్తృత చర్చ జరుగుతోంది.
పరిశ్రమలపై అజమాయిషీకి ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి తదితర ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. కానీ ఆయా శాఖల తరపున జరిగే తనిఖీలు మొక్కుబడిగా ఉన్నాయనే విమర్శలున్నాయి.
తనిఖీలు చేసి ఏయే లోపాలున్నాయనే విషయమై కంపెనీలను అప్రమత్తం చేసినా తదుపరి వాటిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిశ్రమలు కూడా లోపాలను సరిదిద్దడంపై దృష్టి సారించడం లేదు.
"తనిఖీలు చేసి రిపోర్టులు ఇస్తే, వాటిని వెంటనే పరిశీలించి లోపాలు సవరించుకునే బాధ్యత కంపెనీలపై ఉంటుంది. అలా జరగకపోవడమే ప్రమాదాలకు కారణమవుతోంది" అని జేఎన్‌టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణరావు వివరించారు.
పూర్తి స్థాయిలో టెక్నికల్ సైంటిఫిక్ బోర్డును ఏర్పాటు చేసి దానికి తనిఖీల బాధ్యత అప్పగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘గత పదిహేనేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చాలావరకు బాధ్యతలను యాజమాన్యాలపైనే పెట్టింది’’ అని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి చెప్పారు.
''పరిశ్రమలలో లోపాల విషయంలో ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు వస్తున్నాయి. వాటికి అవసరమైన పరిష్కార మార్గాలపై దృష్టి పెడుతున్నాం. ప్రతి రెండేళ్లకోసారి పరిశ్రమలపై సమీక్షలు చేస్తాం. లోపాలపై ఆరునెలలకోసారి తనిఖీలు చేస్తాం'' అని వివేక్ చెప్పారు.


ఫొటో సోర్స్, UGC
'ప్రమాదకర ప్రదేశాలలో అనుభవం లేని కార్మికులు'
తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం 19,580 పరిశ్రమలు రిజిష్టర్ కాగా, వీటిలో దాదాపు 6.94లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
తెలంగాణ లేబర్ బ్యూరో రిపోర్ట్ 2023 ప్రకారం 603 పరిశ్రమల్లో దాదాపు 5వేల మంది ప్రమాదకర పనుల్లో ఉన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక కథనంలో ప్రస్తావించింది.
ఇటీవల ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన తనిఖీల్లో కంపెనీల్లోని ప్రమాదకర ప్రదేశాల్లోనూ రోజువారీ కూలీలను నియమించుకుని పనులు చేయిస్తున్నట్లుగా తేలింది.
పరిశ్రమలను కాలుష్య స్థాయిలను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ కేటగిరీలుగా విభజిస్తారు. రెడ్ కేటగిరీ కింద గుర్తించిన పరిశ్రమల్లో కాలుష్య స్థాయితోపాటు ప్రమాద అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ ఉన్న ప్రాంతాలలోనూ ఎలాంటి అనుభవం లేని రోజువారీ కూలీలతో యాజమాన్యాలు పనులు చేయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.
దీనిపై ప్రభుత్వం స్పందించింది.
ఇకపై రెడ్ కేటగిరీ పరిశ్రమల్లోని కీలకమైన ప్రదేశాల్లో పర్మినెంట్ లేదా శిక్షణ పొందిన కార్మికులే ఉండేలా ఆదేశాలు ఇస్తున్నట్లుగా మంత్రి జి. వివేక్ వెంకటస్వామి బీబీసీతో చెప్పారు.
సేఫ్టీ ఆఫీసర్ల నియామకాలెక్కడ?
ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం, కంపెనీలు ప్రతి రెండు వేల మంది కార్మికులకు ఒక సేఫ్టీ ఆఫీసర్‌ను నియమించుకోవాలి. తర్వాత కార్మికుల సంఖ్యను బట్టి అదనపు సేఫ్టీ అధికారుల నియామకం జరగాలి.
"సేఫ్టీ అధికారులను నియమించుకోవాలనే నిబంధన కాగితాలకే పరిమితం అవుతోంది. చాలావరకు పరిశ్రమల్లో సేఫ్టీ ఆఫీసర్స్ ఉండటం లేదు. సేఫ్టీ ఆడిట్లు సరిగా జరగడం లేదు" అని పర్యావరణవేత్త బాబూరావు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నామమాత్రపు తనిఖీలు
కార్మిక శాఖ తరఫున 2020 నుంచి ఇప్పటి వరకు 7,389 తనిఖీలు, 3569 సంయుక్త తనిఖీలు నిర్వహించినట్లుగా కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఇందులో కార్మిక శాఖ చేసిన తనిఖీల్లో బిల్డింగ్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల్లో కేవలం 596 తనిఖీలు జరిగాయి. అయితే నిరంతరం తనిఖీలు చేసేందుకు సరిపడా సిబ్బంది లేరనేది కార్మిక శాఖాధికారులు చెబుతున్నమాట.
కార్మిక శాఖలో చాలా తక్కువ మంది సిబ్బంది ఉంటారని మంత్రి జి.వివేక్ వెంకటస్వామి కూడా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
"కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్‌గానీ తనిఖీలు చేసి, ఆ ఇన్‌స్పెక్షన్ రిపోర్టులు కంపెనీలకు ఇచ్చినప్పుడు లోపాలు సవరించుకోవాల్సిన బాధ్యత కంపెనీ లేదా పరిశ్రమల యాజమాన్యాలపై ఉంటుంది. ఆ నివేదికలపై ఆరు నెలలకోసారి పునఃసమీక్షించాలని కూడా అధికారులను ఆదేశించాం" అని వివేక్ చెప్పారు.
తెలంగాణలో ఏటా సగటున 180 వరకు తీవ్ర పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నట్లు ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ లెక్కలను బట్టి తెలుస్తోంది.
ఈ మేరకు 2014 నుంచి 2021 మధ్య 1270 ప్రమాదాలు జరిగాయి.
ఇందులో 456 మంది చనిపోయారు. 537 మంది గాయపడ్డారు.
ముఖ్యంగా నిర్వహణాలోపాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు.
"సిగాచీ పరిశ్రమలో డ్రైయర్‌లో పేలుడు కారణంగా ప్రమాదం జరిగింది. దీని నిర్వహణ విషయంలో సమగ్ర విచారణ జరుగుతోంది" అని తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బెండి రాజగోపాలరావు చెప్పారు.

ఫొటో సోర్స్, Vivek Venkatswamy/FB
‘నిబంధనలు రూపొందిస్తున్నాం’
భారీ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో రియాక్టర్లు, డ్రైయర్ చాంబర్లలో పేలుడు జరిగినట్లుగా స్పష్టమవుతోంది.
"ఆయా చాంబర్లలో ఉష్ణోగ్రతలు, ప్రెజర్ ఒక్కసారిగా పెరిగిపోయి ప్రమాదాలు జరుగుతుంటాయి. సేఫ్టీ వాల్వ్ ద్వారా రసాయనాలు డంప్ ట్యాంకుల్లోకి మళ్లించే ఏర్పాట్లు ఉండాలి. సేఫ్టీ వాల్వ్ నిర్వహణను యాజమాన్యాలు సరిగా చేయడంలేదు. మా తనిఖీల్లో ఇవే ప్రధానంగా తెలుస్తున్నాయి" అని పరిశ్రమల శాఖకు చెందిన జనరల్ మేనేజర్ ఒకరు బీబీసీతో చెప్పారు.
ఆరు నెలలకోసారి సేఫ్టీ ఆడిట్, సిబ్బందికి భద్రత పరికరాలు లేకపోవడం, నైపుణ్యం లేకపోయినా పని ప్రదేశాల్లో నియమించుకోవడం వంటి లోపాలు అధికారులు గుర్తిస్తున్నారు.
అలాగే గ్యాస్, రసాయనాల లీకేజీల విషయంలో కంపెనీల యాజమాన్యాలు లీక్ డిటెక్షన్ అండ్ రిపేర్ పరీక్షలు నిర్వహించాలి.
వీటిని పెద్ద పరిశ్రమలు రెండు సంవత్సరాలకోసారి, చిన్న తరహా పరిశ్రమలు ఏడాదికోసారి నిర్వహిస్తుంటారు.
ఇక నుంచి ఈ పరీక్షలను ఆరు నెలలకోసారి నిర్వహించాలని ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే పరిశ్రమలు, కంపెనీలకు నిరంతరం కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటికి ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు గుర్తించాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ అభిప్రాయపడ్డారు.
"లోపాల పరంగా యాజమాన్యాలను బాధ్యులుగా చేస్తూ శిక్షణ పొందిన కార్మికులనే నియమించేలా నిబంధనలు రూపొందిస్తున్నాం" అని మంత్రి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














