మహబూబ్‌నగర్: ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకం, గ్రామస్థుల కోపానికి కారణమేంటి?

ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద గ్రామస్థుల ఆందోళనలు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం కొనసాగుతోంది.

ఏడాదిన్నర క్రితం నారాయణపేట, తాజాగా గద్వాల దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల హింసాత్మక ఆందోళనలు జరిగాయి.

రాజోలి మండలం పెద్ద ధనవాడ దగ్గర బుధవారం జరిగిన ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆస్తుల ధ్వంసం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేశారు.

గాయత్రి బయో ఫ్యూయల్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో రిజిష్టర్ అయింది.

ఆ సంస్థ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధనవాడ దగ్గరలో ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రారంభించే పనిలో ఉంది. 2024లో పనులు ప్రారంభించింది. దాదాపు 30 ఎకరాల భూమిలో ఫ్యాక్టరీ కట్టాలన్నది ప్రతిపాదన.

దానికి చట్టపరమైన అనుమతులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ పనులు ప్రారంభించిన వెంటనే, అంటే 2024 అక్టోబరు నుంచి ఈ ఫ్యాక్టరీ వద్దు అంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద గ్రామస్థుల ఆందోళనలు

ఫొటో సోర్స్, UGC

రాజోలి మండలంలో దాదాపు 12 గ్రామాల ప్రజలు ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారు. వారిలో 3 గ్రామాల ప్రజలు బుధవారం ఆందోళనలో పాల్గొన్నారు.

ఈ ఫ్యాక్టరీ, పెద్ద ధనవాడ దగ్గర ఏర్పాటు అవుతుండగా చిన్న ధనవాడ, చిన్న తాండ్రపాడు, సాసనూరు, తుమ్మిళ్ల, మాన్‌‌దొడ్డి, రాజోలి, కేశవరం, వేంసోంపురం వంటి గ్రామాల ప్రజలు దీన్ని వ్యతిరేకించే వారిలో ఉన్నారు.

2025 జనవరి-ఫిబ్రవరి మధ్య రిలే నిరాహారదీక్షలు చేశారు స్థానికులు. అప్పట్లో స్థానిక నాయకులు, అధికారుల హామీపై ఆ దీక్షలు విరమించారు.

తరువాత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నాయకత్వంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కూడా కలసి వినతి పత్రం ఇచ్చారు. అప్పటి నుంచీ పెద్దగా కదలిక లేదు.

తాజాగా కంపెనీ ప్రతినిధులు మరోసారి అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తుండటంతో ఉద్రిక్తత మొదలైంది.

ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద గ్రామస్థుల ఆందోళనలు

ఫొటో సోర్స్, UGC

గతంలో శాంతియుతంగా ఆందోళన చేసినప్పుడు కంపెనీ రాదని తమకు హామీ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు, తాజాగా ఫ్యాక్టరీ పనులు జరుగుతుంటే మౌనంగా ఉన్నారంటూ గ్రామస్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ భూముల దగ్గర నిరసన కోసం గుమిగూడారు. చుట్టూరా పోలీసులు కూడా ఉన్నారు.

కొంత సేపు నినాదాలు చేసిన గ్రామస్థులు, ఒక్కసారిగా ఫ్యాక్టరీ భూముల్లోకి వెళ్లారు. అక్కడ వేసిన గుడిసెలు వంటివి పీకేసి తగలబెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆపలేకపోయారు. అక్కడ ఉన్న బుల్డోజర్లను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అద్దాలు పగలగొట్టారు. జనరేటర్‌, కంటైనర్ రూమ్ ధ్వంసం చేశారు. కంటైనర్‌ను తగలబెట్టారు. బండ్లను తలకిందులు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 40 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. 12 మందిని రిమాండుకు పంపారు. ఇంకొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.

''సమస్య ఉంటే ప్రజాస్వామికంగా వెళ్ళాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. టెంట్లు తగలబెట్టారు. ట్రెస్ పాసింగ్ చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. మేం గ్రామస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చాం. అయినా వారు వినలేదు'' అని మీడియాకు చెప్పారు డీఎస్పీ మొగిలయ్య.

ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద గ్రామస్థుల ఆందోళనలు

ఫొటో సోర్స్, UGC

గ్రామస్థులు ఆగ్రహంతో ఉన్నందున కొంత కాలం పాటు ఈ సైటు నుంచి దూరంగా ఉండాలని కంపెనీ వారికి పోలీసులు చెప్పినట్టు తెలిసింది. అయితే స్థానికులు మాత్రం కచ్చితంగా ఫ్యాక్టరీ పెట్టకూడదని డిమాండ్ చేస్తున్నారు.

''కంపెనీ రద్దు చేయాలి. మాకు వద్దు. కంపెనీ వద్దని ఆందోళన చేస్తుంటే మమ్మల్ని కొడుతున్నారు. కంపెనీకి వ్యతిరేక పోరాటంలో ఎంతకైనా తెగిస్తాం. నీరు లేకపోతే ఎలా బతకాలి? చచ్చినా, బతికినా కంపెనీ వెళ్ళే వరకూ వదలం. మేం ఏడాది నుంచి అడుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు'' అంటూ స్థానిక మీడియాకు చెప్పారు పెద ధనవాడకు చెందిన ఒక మహిళ.

2023 అక్టోబరులో నారాయణపేట జిల్లా మరికల్ దగ్గరలో చిత్తనూరు దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా వివాదం చెలరేగింది. ఆ ఫ్యాక్టరీ నుంచి వెళుతోన్న ఒక లారీని గ్రామస్థులు అడ్డుకోవడం, ఆ గొడవ పెద్దదై గ్రామస్థులు, పోలీసులపై దాడికి దిగడం, తరువాత అరెస్టులు, వారిని పోలీసులు కస్టడీలో తీవ్రంగా కొట్టారని ఆరోపణలు కూడా వచ్చాయి.

ఇక ఉత్తర తెలంగాణ ధర్మపురి, దిలావర్పూర్‌ల దగ్గర కూడా ఇథనాల్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలు వచ్చాయి. కానీ స్థానికుల ఆందోళనలతో ఆ ఫ్యాక్టరీల నిర్మాణాలను తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపివేసింది.

దిలావర్ పూర్ దగ్గర స్థానికుల వ్యతిరేకతతో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతి రద్దు చేశారనీ, అదే పద్ధతిలో తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని పెద్ద ధనవాడ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది
ఫొటో క్యాప్షన్, నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది

ఏంటీ ఇథనాల్?

పెట్రోలియం దిగుమతులను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ను పెట్రోలులో కలపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దేశవ్యాప్తంగా ఇథనాల్ పరిశ్రమలకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తోంది.

వరి, మొక్క జొన్న, చెరకు వంటి పంటల నుంచి ఈ ఇథనాల్ తయారు చేస్తారు. అయితే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల గాలి, నీరు కలుషితం అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

''ఇథనాల్ కంపెనీలు అత్యంత కాలుష్య కారకాలు. వాటిని తెలంగాణలో ప్రోత్సహించకూడదు. వాటికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి'' అని ప్రొఫెసర్ హరగోపాల్, పర్యావరణవేత్త బాబూ రావు, రైతు స్వరాజ్య కేంద్రం కన్నెగంటి రవి వంటి వారితో కూడిన తెలంగాణ ప్రజా జేఏసీ సంస్థ పలు సందర్భాల్లో డిమాండ్ చేస్తూ వచ్చింది.

దీనిపై గాయత్రి బయో ఫ్యూయల్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ కంపెనీని సంప్రదించే ప్రయత్నం చేస్తోంది బీబీసీ.

వారి స్పందన రాగానే ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)