'అమ్మాయిల కోసం నిర్మించని ప్రపంచంలోకి ప్రతిరోజూ మా అమ్మాయిలను సిద్ధం చేసి పంపిస్తున్నాను'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ కోసం
"మీకు అబ్బాయిలు లేరా?"
"కాలం మారిపోతోంది, అమ్మాయిలకు విపరీతమైన స్వేచ్ఛ వచ్చింది. నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు, నచ్చిన ఉద్యోగాలు చేస్తున్నారు, నచ్చినట్లు బతుకుతున్నారు అని కొందరు అంటుంటే, అమ్మాయిలకు తగినంత స్వేచ్ఛ లేదు, ఇంకా మూస ధోరణిలోనే పెరుగుతున్నారు, ఆడపిల్లలను పెంచడం ఈ సమాజంలో ప్రతి రోజు ఒక విప్లవమే" అని బెంగళూరుకు చెందిన కార్పొరేట్ ట్రైనర్ అజిత్ శివరాం లింక్డ్‌ఇన్ ప్లాట్‌ఫార్మ్‌పై చర్చను లేవనెత్తారు.
ఈ నేపథ్యంలో అజిత్ శివరాంతో బీబీసీ మాట్లాడింది.
అమ్మాయి పుట్టగానే చాలామంది అడిగే ప్రశ్న - అబ్బాయి పుట్టలేదని బాధపడుతున్నారా? అని.
అబ్బాయిల కోసం ముగ్గురు, నలుగురు ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితులను నేను కూడా ఎదుర్కొన్నాను.
అప్పుడు మా నాన్నగారు ఐసీయూ బెడ్ పై చివరి క్షణాల్లో ఉన్నారు.
'మీ అబ్బాయి ఎక్కడ' అని నర్స్ ఆయనను అడిగారు. ఆయన అపస్మారక స్థితిలో అక్కడే ఉన్న నావైపు వేలు చూపించారు… ‘తనే నా కొడుకు’ అని.
మనిషి చివరి క్షణాల్లో లేదా కష్ట సమయంలో అబ్బాయిలే దగ్గర ఉండాలనే ఆలోచన ఆమెను ఆ ప్రశ్న అడిగేలా చేసిందని అనిపించింది.


ఫొటో సోర్స్, instagram.com/ajit4949
అబ్బాయిలే ఎందుకు ఉండాలి?
ఇలాంటి ప్రశ్నలు హాస్పిటల్ లోనే కాదు, దేవాలయాల్లో కూడా ఎదుర్కొంటూనే ఉంటాం. కొన్ని పూజలు, క్రతువులు కోసం భర్త పేరు అడుగుతారు.
ఇలాంటి సామాజిక నేపథ్యంలో అజిత్ శివరాం పోస్ట్ వైరల్ అయింది.
ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయంతో చాలామంది ఏకీభవించారు.
అజిత్ శివరాం ఆ పోస్ట్ ఎందుకు రాయాల్సి వచ్చిందో తెలుసుకోవడానికి ఆయనతో మాట్లాడాను.
"ఇది తరతరాల కండీషనింగ్. ఎదిగిందని ఎంత చెప్పుకున్నా భారత్ ఇంకా పితృస్వామ్య సమాజమే. నాకు ఇద్దరు అమ్మాయిలు. అయితే అబ్బాయిలు లేరని బాధపడుతున్నారా అని చాలామంది బంధువులు నన్ను అడుగుతారు. వాళ్లకి సమాధానం చెప్పడం ఒక విప్లవమే కదా" అని అన్నారు.
"ఇలాంటి ప్రశ్నలు నేను కూడా చాలాసార్లు ఎదుర్కొంటూ ఉంటాను. ముఖ్యంగా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నీకో అబ్బాయి ఉండి ఉంటే బాగుండేది అని చాలామంది బంధువులు అంటూ ఉంటారు" అని హైదరాబాద్ కు చెందిన బిందు అన్నారు.
ఈమె ఓ ఈవెంట్ మేనేజర్. ఈమెకు ఒక కూతురు ఉంది.
ఆమె హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీలో న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు.
"అమ్మాయిల కోసం నిర్మించని ప్రపంచంలోకి ప్రతిరోజూ ఉదయం మా అమ్మాయిలను తయారు చేసి పంపిస్తున్నాను" అని అజిత్ రాశారు.
ఇలా ఎందుకు రాశారని ప్రశ్నించాను.
"అమ్మాయిల మాట నుంచి నడవడిక వరకు ప్రతి విషయాన్ని ఒక ప్రశ్నగానే చూస్తారు. అమ్మాయి ఎలా మాట్లాడాలి, నలుగురితో ఎలా మెలగాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలి అనే ప్రతి విషయాన్నీ ఇంట్లో తల్లిదండ్రులో, బంధువులో నిర్ణయిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి పెద్దగా ఏమీ మారలేదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ, తన తల్లి ఇంద్రాణి శివరాం కర్ణాటకలో బాడ్మింటన్ చాంపియన్ అని చెప్పారు.
తల్లిదండ్రుల ప్రభావం తనపై ఉండటంతో, తనకు అమ్మాయి పుట్టినప్పుడు హద్దులు లేని ఆనందాన్ని అనుభవించానని ఆయన చెప్పారు.
అయితే, అమ్మాయి పుడితే అందరూ ఇంతే ఆనందాన్ని అనుభవిస్తున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
అమ్మాయిలకే ఆంక్షలు ఎందుకు?
ఒకవైపు మహిళా సాధికారత, బాలికల విద్య అవసరం అంటూనే, మరోవైపు మన ఆలోచనా విధానంలో మాత్రం సంకుచిత భావాలతోనే ఉంటున్నాం అని అజిత్ అన్నారు.
"కార్పొరేట్ ప్రపంచంలో అమ్మాయి ఒక సలహా ఇస్తే, ఇది సాధ్యమయ్యే విషయం కాదు అంటారు. కానీ, అదే విషయాన్ని ఒక అబ్బాయి చెబితే వెంటనే దాన్ని ఆమోదిస్తారు. చాలా మంది ఇళ్లల్లో కూడా నువ్వు అమ్మాయివి, నీకేం తెలియదు అని అనడం చూస్తూ ఉంటాం" అని అన్నారు.
"అబ్బాయి నైట్ అవుట్‌కి వెళ్తానంటే సరే అంటాం. అమ్మాయిలకు ఒక డెడ్‌లైన్ పెడతాం. ఇది వివక్షే. కానీ అమ్మాయిలు స్వేచ్ఛగా తిరగగలిగే పరిస్థితులు మనం సృష్టించలేదు. సమ సమాజం అనేది మాటల్లో, కవితల్లో, సాహిత్యంలో మాట్లాడటం చాలా సులభం. కానీ కొన్ని తరాలుగా నాటుకుపోయిన పితృస్వామ్యాన్ని ఒక్క రాత్రిలో కూలగొట్టలేం. కనీసం బెడ్ టైమ్ కథల్లో, డైనింగ్ టేబుల్ చర్చల్లో పిల్లలతో మాట్లాడాలి" అని ఆయన అంటారు.
కానీ ఇలా ఎంతమంది ఉన్నారనేది పెద్ద ప్రశ్న.
‘‘సంస్థల్లో అమ్మాయిలకు సమాన భాగస్వామ్యం లేనప్పుడు భిన్నత్వాన్ని, నైపుణ్యాన్ని, ఆవిష్కరణలను, దృక్పథాన్ని కోల్పోతున్నట్లే. అమ్మాయిల గొంతు వినిపించేందుకు కూడా ఒక స్పేస్ కావాలి. అది సృష్టించే బాధ్యత పురుషులదే" అని ఆయన అన్నారు.
అమ్మాయిలను స్వతంత్రంగా, భావ ప్రకటనా స్వేచ్ఛతో పెంచుతున్నప్పుడు సమాజం నుంచి చాలా ప్రతిఘటన ఎదుర్కొంటూ ఉంటామంటున్న బిందు… తనకు ఎదురైన ఒక ఘటనను ఉదాహరణగా చెప్పారు.
"ఒకసారి ఇంట్లో పార్టీకి అమ్మాయి స్నేహితులను పిలిచినప్పుడు, ఆ పార్టీలో అబ్బాయిలు కూడా ఉంటే మా పిల్లల్ని పంపం, వాళ్ల నాన్నగారు ఒప్పుకోరు లాంటి సమాధానాలు వినాల్సి వచ్చింది. ఈ ధోరణి నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది" అన్నారు.
కానీ, ఈ అభిప్రాయంతో గుంటూరుకు చెందిన మరో మహిళ ఏకీభవించలేదు.
ఈమె ఉద్దేశంలో అమ్మాయి జీవితం పెళ్లితోనే ఒక కొలిక్కి వస్తుందని, అమ్మాయి ఎప్పుడూ అణకువగా ఉండాలని అన్నారు. ఈమెకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.
"కానీ, అమ్మాయి అంటే అత్తగారు, భర్త మాట వినాలి, వాళ్లు చెప్పినట్లే నడుచుకోవాలి. అమ్మాయిలు పంతానికి వెళితే కుటుంబాలు ఎలా నిలబడతాయి?" అని ప్రశ్నించారు.
ఈమె పెద్దగా చదువుకోలేదు. ఇలా ఆలోచించడానికి కుటుంబ నేపథ్యం, చదువు, పెరిగిన వాతావరణం కారణం అని మానసిక నిపుణులు అంటారు.
"నగరాల్లో అయినా గ్రామాల్లో అయినా అమ్మాయిల పెంపకంలో పెద్దగా తేడా ఏమీ రాలేదు. మెజారిటీ కుటుంబాల్లో పితృస్వామ్య వ్యవస్థ నాటుకుపోయి ఉంది. స్త్రీ, పురుషులకు సమాజం నిర్దేశించిన పాత్రల్లో పెద్దగా తేడా లేదు" అని 'భూమిక' పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి అన్నారు.
ఈమె బీబీసీతో మాట్లాడారు.
'భూమిక' పత్రిక మహిళలకు సంబంధించిన అంశాలను ప్రచురిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కాలం మారిందా?
కాలం మారింది. కొంతవరకు స్వేచ్ఛాయుత వాతావరణం వచ్చింది.
అమ్మాయిలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ లైఫ్ స్కిల్స్ మాత్రం నేర్పడం లేదు అంటూ, ప్రేమ పేరుతో అపరిచితులతో వెళ్లి మోసపోతున్న అమ్మాయిల ఉదాహరణలు చెప్పారు సత్యవతి.
"మా అమ్మాయి బాస్కెట్ బాల్ ప్లేయర్. స్పోర్ట్స్ ఎంపిక చేసుకున్నప్పుడు మేం నియంత్రించలేదు" అని బిందు అన్నారు.
"మా అమ్మాయి 14 ఏళ్ల వయసులో టీచర్ల నుంచి బాడీ షేమింగ్ ఎదుర్కొంది. కానీ, తనను కుంగిపోనివ్వకుండా తనకు కావల్సిన సహకారం అందించాం. ఇది తను రేపు సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది" అని అన్నారు.
"ఎవరైనా అమ్మాయి పట్ల తప్పుగా ప్రవర్తించినప్పుడు, నువ్వేం తప్పు చేశావో అంటూ తనను కుంగిపోయేలా చేయడం మానేసి, తనకు అవసరమైన సహకారం ఇవ్వాలి. ఇది వాళ్లు సమస్యను ఎదుర్కొనేలా చేస్తుంది" అని బిందు అంటారు.
"ఇంట్లో అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు ఏం డ్రెస్ వేసుకోవాలో కూడా చెబుతూ ఉంటాం. కానీ, ఒక అమ్మాయి సౌకర్యవంతంగా ఉండేటట్లు డ్రెస్ చేసుకోవడంలో తప్పు లేదు. తన ఇంట్లోనే తనకు స్వేచ్ఛ లేకపోతే ఎలా?" అని ఆమె ప్రశ్నించారు.
"స్వేచ్ఛ అనేది ఒక బాధ్యత. విచ్చలవిడితనానికి, స్వేచ్ఛకు తేడా చెప్పగలిగినప్పుడు సమాజంలో చోటు జరిగే నేరాలను అరికట్టగలం" అని సత్యవతి అభిప్రాయపడ్డారు.
స్వేచ్ఛ పేరుతో యువత విశృంఖలత్వానికి అలవాటు పడుతున్నారేమో అనే భయాన్ని వ్యక్తం చేశారు.
"అమ్మాయిలను ఒక మూసలో పెంచడం మానేసి, తనను తాను ఎలా రక్షించుకోవాలో నేర్పించగలిగితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమ్మాయిలపై పెరుగుతున్న నేరాలు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఒక్క 2022 లోనే మహిళలపై జరుగుతున్న చేసుకున్న నేరాలకు సంబంధించి 4,45,256 కేసులు నమోదయ్యాయి.
ప్రతి లక్షమంది జనాభాకు 2018లో ఈ నేరాలు 58.8 శాతం ఉంటే ఇవి 2022 నాటికి 66.4 శాతానికి పెరిగాయి.
ఇందులో వరకట్న హత్యలు, గృహ హింస, అత్యాచారం లాంటి నేరాలు ఉన్నాయి.
"అమ్మాయిలు స్వేచ్ఛగా బతికే సమాజాన్ని సృష్టించే బాధ్యత పురుషులదే. ఇలాంటి పోస్టుల వల్ల 1-2 శాతం మందిలోనైనా మార్పు వైపు ఆలోచనకు బీజం వేసిన వాళ్లమవుతాం" అని అజిత్ శివరాం అంటారు.
"పెళ్లి తర్వాత అమ్మాయి అత్తగారింట్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెబుతూ అమ్మాయిని సంసిద్ధం చేసినట్లే, పెళ్లైన తర్వాత భార్యతో ఎలా ఉండాలనే దానిపై అబ్బాయిలను ఎందుకు చేయం" అని బిందు ప్రశ్నించారు.
"చదువు, ఆర్థిక స్వాతంత్య్రం అబ్బాయిలకు ఎంత ముఖ్యమో అమ్మాయిలకూ అంతే ముఖ్యం. అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా మానవత్వం ఉన్న మనుషుల్లా పెంచాలి. అప్పుడే వివక్ష లేని సమాజం వైపు అడుగులు పడటం మొదలవుతుంది" అని బిందు ముగించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














