ఆ దేశ జనాభాలో 40 శాతం భారత సంతతి ప్రజలే, ప్రధాన మంత్రిదీ ఇక్కడి మూలాలే

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో, భారత సంతతి ప్రజలు, బ్రిటీషర్లు, వలస కార్మికులు

ఫొటో సోర్స్, x.com/narendramodi

ఫొటో క్యాప్షన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ప్రధాని మోదీకి భారత సంతతి ప్రజలు స్వాగతం పలికారు.

భారత్ నుంచి 14 వేల కిలోమీటర్ల దూరాన ఉన్న దేశమది. అక్కడి జనాభాలో సుమారు 42 శాతం భారత సంతతికి చెందిన ప్రజలే.

భారత సంతతికే చెందిన కమలా ప్రసాద్ బిస్సేస్సర్ ఇప్పుడక్కడ ప్రధానమంత్రి.

దీంతో పాటు ఆ దేశానికి మరో గుర్తింపు కూడా ఉంది. అది క్రికెట్.

సునీల్ నరైన్, దినేష్ రామ్దిన్, రవి రాంపాల్ వంటి ప్రత్యేక పరిచయం అవసరం లేని క్రికెటర్లు అక్కడి నుంచే వచ్చారు. వీరంతా వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

ఆ దేశమే ట్రినిడాడ్ అండ్ టొబాగో.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించారు.

గురువారం రాత్రి నరేంద్ర మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ చేరుకున్నప్పుడు ఆయనకు సంప్రదాయ భోజ్‌పురి చౌతల్ (జానపద పాట)తో స్వాగతం లభించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తనకు లభించిన స్వాగతం గురించి ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందులో ఆయన రెండు దేశాల మధ్య "విలువైన సాంస్కృతిక సంబంధం" అని రాశారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో భాగంగా ప్రసంగించిన మోదీ ‘ప్రధాని కమలా జీ పూర్వీకులు బిహార్‌లోని బక్సర్‌లో నివసించేవారు. అక్కడి ప్రజలు ఆమెను బిహార్ బిడ్డగా భావిస్తారు. 25 ఏళ్ల క్రితం నేను ఇక్కడకు వచ్చినప్పుడు మేమంతా బ్రయాన్ లారా కవర్ డ్రైవ్, పుల్‌షాట్లను ఆనందించేవాళ్లం. ఇప్పుడు సునీల్ నరైన్, నికొలస్ పూరన్ మా యువత హృదయాల్లో అదే ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన స్నేహం మరింత బలపడింది" అని అన్నారు.

మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని భారత సంతతి ప్రజలతో భేటీ అయ్యారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో అభివృద్ధిలో వారు పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు.

నరేంద్రమోదీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో, భారత సంతతి ప్రజలు, బ్రిటీషర్లు, వలస కార్మికులు

ఫొటో సోర్స్, x.com/narendramodi

భారతీయులు అక్కడ ఎలా స్థిరపడ్డారు?

19వ శతాబ్ధంలో 'ఒప్పంద కార్మిక వ్యవస్థ' కింద భారత సంతతి ప్రజలు ట్రినిడాడ్ అండ్ టొబాగో చేరుకున్నారు.

1845- 1917 మధ్య భారత ఉపఖండం నుంచి సుమారు 1.43 లక్షల మందిని కూలీలుగా ట్రినిడాడ్‌ తీసుకువెళ్లారు.

వీరిలో ఎక్కువ మంది ఉత్తర భారత దేశం నుంచే వెళ్లారు. అందులోనూ ఎక్కువ మంది ప్రస్తుత ఉత్తర ప్రదేశ్, బిహార్ జిల్లాలకు చెందినవారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భోజ్‌పురి మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.

బ్రిటిష్ వలసరాజ్యాలలో బానిసత్వాన్ని రద్దు చేసిన తర్వాత, కార్మికుల కొరత పెరిగింది. దీంతో వారు 'గిర్మిట్' పథకం కింద భారత్‌ నుంచి తమ వలస రాజ్యాలకు కార్మికులను తీసుకెళ్లారు.

గిర్మిట్ అనేది 'అగ్రిమెంట్' అనే ఇంగ్లిష్ పదం నుంచి పుట్టింది.

ఈ ఒప్పందం కింద భారతీయులు మూడు నుంచి ఐదేళ్లు కూలీలుగా పని చేసేందుకు వర్క్ కాంట్రాక్ట్ ఇచ్చారు.

ఆ తర్వాత స్వదేశానికి తిరిగిరావొచ్చు.

కానీ, అలా వెళ్లినవారిలో అనేక మంది అక్కడే స్థిరపడ్డారు.

వారి వారసులు ఇప్పటికీ తమ పూర్వీకులు ఎక్కడ నుంచి వచ్చారనే విషయం చెబుతుంటారు.

"మీరు ఒప్పంద కార్మికుల వారసులు. అయితే మీ గుర్తింపు అది కాదు. మీరు సాధించిన విజయాలు, అందించిన సేవలు, ఆచరించిన విలువల ఆధారంగానే మీ గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ దేశపు విజయాన్ని రెట్టింపు చేశారు" అని అక్కడి భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి మోదీ అన్నారు.

భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య సంబంధాలు సాంస్కృతిక, మత పరమైన, చారిత్రక సంబంధాలను దాటి విస్తరించాయి.

ఆ దేశంలో జీవిస్తున్న 14 లక్షల మంది జనాభాలో 42శాతానికి పైగా భారత సంతతి వారు ఉన్నారు.

కార్మికులుగా ప్రారంభమైన భారత సంతతి ప్రజల ప్రయాణం ప్రస్తుతం వ్యాపారం, రాజకీయాలు, విద్య, వైద్యం వంటి అనేక రంగాలకు విస్తరించింది.

భారత సంతతి ప్రజలు లేని రంగం ఏదీ అక్కడ లేదని చెప్పవచ్చు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో, భారత సంతతి ప్రజలు, బ్రిటీషర్లు, వలస కార్మికులు

ఫొటో సోర్స్, x.com/narendramodi/ Screen grab

ఫొటో క్యాప్షన్, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత సంతతి ప్రజలు

ట్రినిడాడ్ అండ్ టొబాగో చరిత్ర

ట్రినిడాడ్ అండ్ టొబాగో ద్వీప దేశం. ఇందులో ట్రినిడాడ్, టొబాగోతో పాటు మరికొన్ని దీవులు ఉన్నాయి. ఇది కరీబియన్ ఐలాండ్స్‌లో దక్షిణాన.. దక్షిణ అమెరికా ఉత్తర తీరానికి సమీపంలో ఉంది.

1962లో ఇది బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. అదే ఏడాది కామన్‌వెల్త్ దేశాల కూటమి, ఐక్య రాజ్యసమితిలో సభ్య దేశమైంది.

1976లో గణతంత్రంగా అవతరించింది.

ట్రినిడాడ్ వాయువ్య తీరంలో ఉన్న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఈ దేశానికి రాజధాని.

కరీబియన్ దీవుల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో సంపన్న దేశం. ఈ దేశంలో భారీగా ఉన్న చమురు, సహజవాయువు నిల్వలు దేశ ఆర్థిక రంగానికి వెన్నెముక.

ఈ జంట ద్వీప దేశంలో ఆఫ్రికా, భారత సంతతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఈ దేశ తలసరి ఆదాయం లాటిన్ అమెరికన్ దేశాలు, ఇతర కరీబియన్ దేశాల కంటే ఎక్కువ.

దేశ ఆర్థిక వ్యవస్థ చమురుపై ఆధారపడి ఉండటంతో, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగినా, తగ్గినా దాని ప్రభావం ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తుంది.

1980, 90లలో చమురు ధరలు పతనం కావడంతో దేశ అప్పులు భారీగా పెరిగాయి. నిరుద్యోగం పెరిగి కార్మికుల్లో అశాంతి చెలరేగింది.

కరీబియన్ ఐలాండ్స్‌లో మిగతా దేశాల మాదిరిగానే ట్రినిడాడ్ అండ్ టొబాగో కూడా మాదక ద్రవ్యాల అక్రమ సరఫరా గ్యాంగులకు సంబంధించిన హింసతో సతమతం అవుతోంది. ఇది ఈ దేశ పర్యటక రంగానికి ముప్పుగా మారింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)