అప్పుడే ఏం తేల్చలేం, ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే: రామ్మోహన్ నాయుడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెస్సికా రాన్స్‌లే
- హోదా, బీబీసీ న్యూస్
ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది.
ప్రమాద స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్స్‌లో పైలట్ల సంభాషణను గుర్తించారు. పైలట్లలో ఒకరు ''మీరెందుకు ఆపేశారు'' అని అడగడం, అందుకు మరో పైలట్ ''నేనేమీ చేయలేదు'' అని సమాధానం ఇవ్వడం వినిపించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
లండన్ వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన నిమిషంలోపే కూలిపోయింది.
ఈ ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.
సమగ్ర, తుది నివేదిక 12 నెలల్లో వచ్చే అవకాశం ఉంది.

అప్పుడే ఎలాంటి అంచనాలకు రావొద్దు.. తుది నివేదిక రావాల్సి ఉంది: రామ్మోహన్ నాయుడు
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) విడుదల చేసిన ప్రాథమిక నివేదికపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.
ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, ఈ దశలో ఎలాంటి తుది నిర్ణయాలకు రాలేమని.. తుది నివేదిక వచ్చేవరకు వేచి చూద్దామని అన్నారు.
వార్తాసంస్థ ఏఎన్ఐ, ఇతర మీడియాతో మాట్లాడిన ఆయన.. 'ఈ కేసులో సాంకేతిక అంశాలున్నాయి. ఇప్పుడే నివేదికపై మాట్లాడడం తొందరపాటు అవుతుంది. ప్రంపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన పైలట్లు, విమానయాన సిబ్బంది దేశంలో ఉన్నారు. వారు పౌర విమానయానానికి వెన్నెముక లాంటివారు. అప్పుడే తుది నిర్ణయాలకు రావొద్దు' అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రన్ టు కటాఫ్.. ఏం జరిగింది?
భారత విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.
టేకాఫ్ అయిన కొద్దిక్షణాల్లోనే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో, ఆ కొద్ది సెకన్లలో ఏం జరిగిందో ఈ నివేదిక వివరిస్తోంది.
''విమానం సుమారుగా 08:08:42 యూటీసీ (కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్) వద్ద గరిష్ఠంగా 180 నాట్స్ ఐఏఎస్(ఇండికేటెడ్ ఎయిర్‌స్పీడ్) వేగాన్ని అందుకుంది.
ఆ వెంటనే, ఒక సెకను తేడాతో ఇంజిన్ 1, ఇంజిన్ 2లకు ఇంధనం సరఫరా చేసే స్విచ్‌లు 'రన్' నుంచి 'కటాఫ్'కి మారాయి'' అని నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
అప్పుడు, ''పైలట్లలో ఒకరు ఎందుకు కటాఫ్ చేశావని మరొకరిని అడుగుతున్నట్లు కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లలో వినిపించింది. అందుకు మరో పైలట్, నేను చేయలేదని బదులిచ్చారు.''
08:08:52 యూటీసీ వద్ద, ''ఇంజిన్ 1 ఇంధన కటాఫ్ స్విచ్ కటాఫ్ నుంచి మళ్లీ రన్‌కి మారింది. ఆ తర్వాత నాలుగు సెకన్లకు ఇంజిన్ 2 కటాఫ్ స్విచ్ కూడా కటాఫ్ నుంచి రన్ మోడ్‌కి మారింది'' అప్పటికి సమయం 08:08:56 అయింది.
అనంతరం, 9 సెకన్ల తర్వాత 08:09:05కి పైలట్లలో ఒకరు "మే డే.. మే డే .. మే డే" అంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సంకేతాలు పంపారు.
ఆ తర్వాత అధికారులకు ఎలాంటి స్పందనా రాలేదు. ఆ కొద్దిసేపటికే, విమానం కూలిపోవడం కనిపించింది.
ప్రాథమిక నివేదిక లింక్ ఇక్కడ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కాక్‌పిట్‌లో ఎవరి మాటలు ఏవి?
విమానం నుంచి సేకరించిన రికార్డర్ డేటా ప్రకారం, విమానంలోని రెండు ఇంధన స్విచ్‌లు(సాధారణంగా విమానం నేలపై ఉన్నప్పుడు ఇంజిన్లు ఆన్ చేయడానికి లేదా ఆఫ్ చేయడానికి ఉపయోగించేవి), టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సెకన్ల వ్యవధిలో ఒకదాని తర్వాత మరోటి రన్(ఆన్) నుంచి కటాఫ్(ఆఫ్) మోడ్‌లోకి వెళ్లాయి.
దీంతో రెండు ఇంజిన్లు థ్రస్ట్‌ను కోల్పోయాయని ఏఏఐబీ నివేదిక తెలిపింది.
అప్పుడు, కాక్‌పిట్‌లో గందరగోళం వినిపించింది. ఎందుకు ఆపేశారని ఒక పైలట్ మరో పైలట్‌ను అడుగుతున్నారు. లండన్‌లోని గాత్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఈ విమానాన్ని కెప్టెన్ సుమీత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్ నడుపుతున్నారు. అయితే, కాక్‌పిట్ సంభాషణలో ఏ మాటలు ఎవరివో నివేదికలో పేర్కొనలేదు.
ఆ తర్వాత, ఇంజిన్ స్విచ్‌లను ఇన్‌ఫ్లైట్ (ఆన్) మోడ్‌కి తీసుకొచ్చారు. ఇంజిన్లను తిరిగి పనిచేయించే ప్రక్రియను ప్రారంభించారు. ఒక ఇంజిన్, థ్రస్ట్‌ను అందుకున్నప్పటికీ, విమానానికి తగిన వేగాన్ని అందించలేకపోయింది.
విమానం కూలిపోయి వైద్యుల హాస్టల్‌పైకి దూసుకెళ్లడానికి ముందు పైలట్లలో ఒకరు మేడే కాల్ ఇచ్చారు, అనంతరం పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదానికి ముందు, ఇద్దరు పైలట్లకు ''తగినంత విశ్రాంతి'' ఉందని నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘పక్షులు పెద్దగా లేవు’
పక్షులు ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న ఊహాగానాలు వచ్చినప్పటికీ, విమానం ప్రయాణిస్తున్న మార్గంలో ''పక్షుల సంచారం భారీస్థాయిలో ఉన్నట్లు'' ఏమీ కనపించలేదని నివేదిక తెలిపింది.
నివేదికలో ఇలా పేర్కొన్నారు, ''ప్రస్తుత దర్యాప్తులో, B787-8 లేదా GE GEnx-1B ఇంజిన్ ఆపరేటర్లు, తయారీదారులపై చర్యలకు సిఫార్సు చేయదగిన లోపాలేవీ గుర్తించలేదు. విమానంలో కానీ, ఇంజిన్లలో కానీ ఎలాంటి కీలకమైన లోపాలేవీ దృష్టికి రాలేదు.''
నివేదికలో ఎలాంటి కచ్చితమైన నిర్ధరణకు రాలేదు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నప్పటికీ పైలట్ల చర్యలపై దృష్టి కేంద్రీకరించారు.
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) నిబంధనల ప్రకారం, ప్రమాదం జరిగిన 30 రోజుల్లోపు ప్రాథమిక నివేదికను దాఖలు చేయాలి, అయితే అందులోని వివరాలను బహిరంగపరచడం తప్పనిసరేమీ కాదు.
2011లో వాడుకలోకి వచ్చిన దగ్గరి నుంచి 787-8 డ్రీమ్‌లైనర్ ఘోర ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి.

ఫొటో సోర్స్, Reuters
బ్లాక్‌బాక్సుల్లో ఏముంది?
ప్రమాదం తర్వాత, విమానంలోని ఎన్‌హాన్స్‌డ్ ఎయిర్‌బోర్న్ ఫ్లైట్ రికార్డర్లు (ఈఏఎఫ్‌ఆర్) లేదా ''బ్లాక్ బాక్స్''లను శిథిలాల నుంచి సేకరించారు. విమానం కూలిపోయే ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో పరిశోధకులు తెలుసుకోవడంలో ఇవి కీలకం.
ఈ పరికరాలు విస్తృత స్థాయిలో విమాన డేటా, కాక్‌పిట్ ఆడియోలను రికార్డ్ చేస్తాయి. పైలట్ రేడియో కాల్స్ నుంచి యాంబియంట్ కాక్‌పిట్ శబ్దాల వరకూ అన్నింటినీ రికార్డ్ చేస్తాయి.
ప్రైవేటీకరణ అనంతరం, బిజినెస్ దిశ మార్చుకునే దశలో ఉన్న ఎయిర్ ఇండియాకు ఈ ప్రమాదం ఒక పెద్ద ఎదురుదెబ్బ. ఈ ఎయిర్‌లైన్స్‌ను 2022లో భారత ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ కొనుగోలు చేసింది.
ఈ విషాద ఘటన భారత్‌లో విమానయాన భద్రత అంశాన్ని కూడా లేవనెత్తింది.

ఫొటో సోర్స్, Getty Images
డ్రీమ్‌లైనర్లలో తనిఖీలు
ఈ నెల మొదట్లో, ఎయిర్ ఇండియా వద్దనున్న 33 డ్రీమ్‌లైనర్లలో 26 విమానాల్లో సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ సంస్థ భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించింది,ఇందులో ఎలాంటి ఆందోళనకర అంశాలూ దృష్టికి రాలేదు.
ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటరీ సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధిపతి ఈ వారంలో బీబీసీతో మాట్లాడుతూ, ''ప్రపంచ భద్రతా ప్రమాణాల దృష్ట్యా చూస్తే, భారత్ రికార్డ్ ప్రపంచ సగటు కంటే మెరుగ్గా, స్థిరంగా ఉంది(పెద్ద ప్రమాదాలు జరిగిన రెండు సంవత్సరాలు కాకుండా - అవి అరుదైన సందర్భాలు)'' అంటూ సమర్థించుకున్నారు.
అయితే, విమానాల నిర్వహణపై పర్యవేక్షణ, శిక్షణలో లోపాలను ఎత్తిచూపే ఆందోళనకరమైన రిపోర్టులు ఇటీవలి వారాల వ్యవధిలో అనేకం వచ్చాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














