ఓ భామ అయ్యో రామ-మూవీ రివ్యూ: సుహాస్ సినిమా ఎలా వుందంటే?

ఫొటో సోర్స్, V Arts
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
కలర్ ఫోటో, అంబాజీపేట బ్యాండ్ మేళం సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ హీరోగా నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ థియేటర్లలోకి వచ్చింది. సినిమా ఎలా వుందంటే...
బాల్యంలోని కొన్ని కారణాల వల్ల హీరో(సుహాస్)కి సినిమాలు చూడడం ఇష్టం వుండదు. థియేటర్‌కి వెళ్లినా బయట కూర్చుని కథ మాత్రం విని, సినిమాని జడ్జ్ చేయగలడు.
అర్ధరాత్రి జరిగిన ఒక ప్రమాదం వల్ల హీరోయిన్ (మాళవిక మనోజ్) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. సినిమాలంటే ఇష్టంలేని అతన్ని, ఒక మంచి సినిమా డైరెక్టర్‌గా ఎలా మార్చింది? ఇదే సినిమా సారాంశం.
టైటిల్ చూస్తే ఇదేదో కామెడీ సినిమా అనుకుంటాం కానీ, చాలామటుకు సినిమా సీరియస్‌గానే సాగుతుంది.
కామెడీ ప్రయత్నం చేసినా అది పండలేదు.
పెద్దగా ఆశలు లేకుండా నిర్లిప్తంగా జీవించే కుర్రాడిని ఒక అమ్మాయి ఎలా మార్చిందనేది లైన్‌గా వినడానికి బాగానే వుంటుంది. కానీ సన్నివేశాలు బలంగా రాసుకుని కథని బిగువుగా నడపడంలో దర్శకుడు రామ్ గోదల పూర్తిగా విఫలమయ్యాడు.
ఫలితంగా రెండున్నర గంటల సహన పరీక్ష.
దీనికి కారణం ఏమంటే సుహాస్ క్యారెక్టర్ గందరగోళంగా వుంటుంది. కాసేపు సీరియస్‌గా , ఇంకాసేపు కామెడీగా వుంటాడు. డాన్స్‌లు, ఫైట్స్ కూడా చేసేస్తూ వుంటాడు.


ఫొటో సోర్స్, V Arts
ఆద్యంతం అయోమయం
హీరోయిన్ మాళవికలో ఎక్స్‌ఫ్రెషన్స్ పలకకపోవడంతో ఎమోషనల్ సీన్స్ తేలిపోయాయి. ఆమె రకరకాల ప్రాక్టికల్ జోక్స్ వేయడం కథలో ఇరికించినట్టు వుండడంతో తెరమీద ఏం జరుగుతూ వుందో అర్థంకాని పరిస్థితి. క్లైమాక్స్‌లో కూడా ఇదే తికమక.
సినిమాలో వచ్చే ప్రతిసీన్ , గతంలో మనం చూసినవే. అనేక సినిమాల్లోని సీన్స్ తెచ్చి కుప్ప పోయడంతో ఫ్రెష్‌నెస్ పోయింది. సెకండాఫ్‌లో వచ్చే హీరో ఫ్లాష్‌బ్యాక్, పెళ్లి కామెడీ ప్రేక్షకుల్ని ఎగ్జిట్ వైపు దారి చూపిస్తూ వుంటాయి.
మధ్యమధ్యలో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగులు చిరాకుపెడుతుంటాయి.
ఈ కథలో ఏం నచ్చి సుహాస్ ఒప్పుకున్నాడో తెలియదు. వరుసగా ఇలాంటి రెండు సినిమాలు చేస్తే ప్రేక్షకుడు అతన్ని మరిచిపోతాడు.
కథలో వరుసగా ట్విస్ట్‌లుంటాయి. కానీ రిజిస్టర్ కావు. వీటికి తోడు హీరోయిన్‌కి సినిమా కథలు చెప్పే అలవాటు వుంటుంది. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో బాణాలు గుచ్చి, తుపాకీతో కాలుస్తుంటారు. అది ప్రేక్షకుడి మీద హింసేనని దర్శకుడు గుర్తించలేకపోయాడు.
ప్లస్ పాయింట్స్ - ఏవీ లేవు
మైనస్ పాయింట్స్ -అన్నీ అవే
బాటమ్ లైన్: ఓ భామా, ప్రేక్షకుల ఖర్మ
( కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














