స్క్విడ్ గేమ్ 3 రివ్యూ: ‘నీకింకా మనుషుల మీద నమ్మకముందా’? .. ప్రాణాలు, డబ్బులతో ఆడిన ఈ ఆటలో చివరికి ఏమైంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్నారు కార్ల్ మార్క్స్. అదే ఇప్పుడైతే మానవ విధ్వంసాలన్నీ ఆర్ధిక విచ్ఛిన్నాలే అనేవాడు. మనిషి వికృత స్వభావాన్ని డబ్బు ఎత్తి చూపుతుంది. లోభానికి ప్రాణభయం కూడా తోడైతే అదే స్క్విడ్ గేమ్.
రెండు సీజన్ల తర్వాత మూడో సీజన్ వెబ్‌సిరీస్ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే దీన్ని ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మంది చూశారు.
అంతలా అందరూ ఎదురుచూసిన ఈ సీజన్లో ఏముంది?


ఫొటో సోర్స్, Getty Images
ఆట చూడ్డానికి చాలా సింపుల్, కానీ..
ఆర్ధికంగా దివాళాతీసి, బతుకు మీద ఆశ కోల్పోయి, ఎన్నో కష్టాల్లో ఉన్న మనుషులను స్క్విడ్ గేమ్ రిక్రూటర్స్ ఎంచుకుంటారు.
నాలుగు వందలకి పైగా ఉన్న బృందాన్ని ఒక ద్వీపానికి రహస్యంగా తరలించి అక్కడ ఆట ప్రారంభిస్తారు.
ఆట చూడ్డానికి చాలా సింపుల్. అన్నీ మనం చిన్నప్పుడు ఆడుకున్నవే.
కానీ ఆటలో ఓడిపోతే ప్రాణం పోతుంది. నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తారు.
ఈ రక్తపాతంలో ఉన్న ప్రజాస్వామ్యం ఏమంటే ప్రతి ఆట ముగింపులో ఓటింగ్ నిర్వహించి సగం మందికి పైగా వద్దు అనుకుంటే రద్దు చేస్తారు.
మొదటి సీజన్లో ఇలాగే వెళ్లిపోయి బయట బతకలేక ప్రాణాలకి తెగించి మళ్లీ వస్తారు. అందరి మరణాల్ని దాటుకుని, శవాల మీద ఒకడు విజేతగా మిగులుతాడు.
బిలియన్ల డబ్బు అందుకుంటాడు. ఇది ఫస్ట్ సీజన్.
సెకండ్ సీజన్లో ఈ ముఠాని ఎలాగైనా కనిపెట్టి ఈ హింసని అంతం చేయాలని హీరో అనుకుంటాడు. అనివార్యంగా ఆటలోకి వస్తాడు. అందర్నీ హెచ్చరిస్తాడు. చివర్లో కొందరిని కలుపుకొని విఫలమవుతాడు. దీంతో సెకండ్ సీజన్ ముగుస్తుంది.
దీని కొనసాగింపే థర్డ్ సీజన్.
సెకండ్ సీజన్ చూడకపోతే థర్డ్ సీజన్ అర్థం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
హింసకి మించినది ఇంకేదో..
2009లో ఈ కథని రాసుకున్నాడు దర్శకుడు. పదేళ్లు ఎందరి చుట్టూనో తిరిగాడు. చివరికి, తెరమీదికి వచ్చింది. ప్రపంచం ఆశ్చర్యపోయి చూసింది.
నిజానికి ఈ కథలో పెద్ద సస్పెన్స్ ఎలిమెంట్ లేదు. గెలిస్తే డబ్బు, లేదంటే మరణం. సారాంశం ఇంతే.
అయితే, మనిషిలోని రాక్షసుడు అడుగడుగునా కనిపిస్తూ ఉంటే భయమేస్తుంది.
అదే స్థానంలో మనం ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంటుందని చెక్ చేసుకుంటూ ఉంటాం. విపరీతమైన రక్తం కనిపిస్తూ ఉంటుంది. కానీ, హింసకి మించినది ఇంకేదో భయపెడుతూ ఉంటుంది. డబ్బు కనిపిస్తే మనిషి తన ప్రతి విలువని ఎలా అమ్ముకుంటాడో అర్థమవుతుంది.
థర్డ్ సీజన్లో అత్యంత జుగుప్సాకరమైన మనుషుల మధ్య హీరో ఉదాత్తంగా కనిపిస్తూ ఉంటాడు.
ఆఖరి ఎపిసోడ్, చివరి సన్నివేశంలో విలన్ హీరోని ఒక మాట అడుగుతాడు.
నీకింకా మనుషుల మీద నమ్మకముందా?
ఈ ఆట ఆడిస్తున్న డబ్బు పిశాచాల వైపు చూస్తూ హీరో ఒక మాట అంటాడు. 'మేం మనుషులం, గుర్రాలం కాదు.'
ఈ రెండు వాక్యాలే స్క్విడ్ గేమ్ సిరీస్ ఆత్మ.
రెండో సీజన్ అసందర్భంగా ముగిసేసరికి చాలా విమర్శలు వచ్చాయి. అందుకే మూడో సీజన్ ఒక కొలిక్కి వచ్చి ముగుస్తుంది.
అయితే, నాలుగో సీజన్ కూడా ఉందని లీడ్ ఇచ్చారు. ఈసారి కథ అమెరికాలో.
రిక్రూటర్‌గా ప్రముఖ నటి కేట్ బ్లాంచెట్ కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
6 ఎపిసోడ్స్
సీజన్ 3లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. దాదాపు 6 గంటలకి పైగా స్క్రీన్ టైం. తిరుగుబాటు విఫలమైన తరువాత కథ ప్రారంభం.
ఆటలో ఉన్న ఆటగాళ్ల ఎమోషన్, కొత్త ఆటలు కీలకమైన అంశం.
ఈ దీవి కోసం సాయుధ బృందంతో వెతుకుతున్న డిటెక్టివ్‌ది ఒక ఉప కథ అయితే, ఓడిపోయిన ఆటగాళ్లని కాల్చేసే భద్రతా దళంలోని ఒక అమ్మాయి తిరుగుబాటు రెండో ఉప కథ.
ఆటలోని ముఖ్యపాత్రలు ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి. ఆమెకి దూరమైన ప్రియుడు. ఇద్దరూ డ్రగ్ అడిక్ట్స్. ఒక ట్రాన్స్‌జెండర్, అప్పులు తీర్చుకోడానికి ఆటకి వచ్చిన కొడుకు, అతన్ని ఆర్థిక బాధల నుంచి కాపాడడానికి వచ్చిన తల్లి. నోటికొచ్చిన శకునాలు చెప్పే ఒక మంత్రగత్తె కూడా ఉంటుంది.
పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం తెలియని అప్పుడే పుట్టిన ఒక పసిపాప కూడా ఆటలో భాగం కావడం ఈ సీజన్ ప్రత్యేకత.

ఫొటో సోర్స్, Getty Images
- కీస్ అండ్ నైవ్స్: ఆటగాళ్లని రెండు బృందాలుగా విడదీస్తారు. ఒక బృందానికి తాళాలు, ఇంకో బృందానికి కత్తులు. అనేక ద్వారాలున్న తేనెతుట్టెలాంటి గదుల్లోకి వెళ్లిన వాళ్లు తమ తమ తాళంతో ద్వారాలు తెరుచుకుని తప్పించుకోవాలి. కత్తి చేతిలో ఉన్న వాళ్లు వెంటాడతారు. ప్రతి ఒక్కరూ ఇంకొకరిని చంపాలి. ఇచ్చిన టైంలోగా చంపలేకపోతే వాళ్లు చచ్చిపోతారు. రెండు బృందాల్లోనూ ప్రాణభయం. తల్లీకొడుకులు, ప్రేయసీ ప్రియులు చెరో బృందంలో ఉంటే? అదే కదా ఆట.
- ది స్టారీ నైట్: చావు బతుకుల యుద్ధం మధ్య ఒక కొత్త ప్రాణం వస్తే? బతకాలంటే చంపాలి. చంపితేనే బతుకుతాం. ఈ ఎపిసోడ్ ఆఖరి సన్నివేశం ప్రేక్షకుల్ని వెంటాడి వేటాడుతుంది.
- ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్: మనుషుల్ని మృగాలుగా మార్చి ఆట ఆడిస్తున్నది ఎవరో తెలుస్తుంది. ఎందరో రాలిపోయిన తరువాత రక్తం వాసన వస్తున్న డబ్బు గుట్టలుగా కనిపిస్తూ ఉంటే ఓటింగ్ జరుగుతుంది. దురాశ ఆటని నడిపిస్తుంది. కొత్త ఆట, చిన్నప్పుడు ఆడుకున్నదే స్కిప్పింగ్. గాలిలో ఎగిరే తాడు నీ ఆఖరి క్షణాల్ని నిర్ణయిస్తుంది.
- 222: కొత్తగా ఆటలోకి వచ్చిన పసిపాప నెంబర్.
- కొరియన్ సింబల్: ఈ ఆట ఎప్పటికీ ఆగదు. మనిషిలోని దురాశ, అతనిలోని క్రూరమృగాన్ని బతికిస్తున్నంత కాలం ఆగదు. కొత్త ఆటలో ఎవరు బతకాలో, చావాలో అందరూ కలసి నిర్ణయించుకోవాలి.
- హ్యూమన్స్ ఆర్: ఆటకి ముగింపు మనుషులు, గుర్రాలు కాదు. గుర్రపుపందేల్లో గుర్రం చనిపోదు. ఇక్కడ పరాజయమే మరణం.

ఫొటో సోర్స్, Getty Images
స్క్విడ్ గేమ్ 3 చూసిన తరువాత తేరుకోవడానికి కొంచెం టైమ్ పడుతుంది.
తెలిసోతెలియక బతుకు కోసం యుద్ధం చేస్తున్న వాళ్లే ఎక్కువ మంది.
యుద్ధం చేయిస్తున్న వాళ్లు కంటికి కనిపించరు. ఆటలు మారుతాయి. కొత్త ఆటలు నేర్చుకుంటూ ఉంటాం. లేదా నేర్పిస్తారు.
నిజానికి ఈ సిరీస్ ఒక ఫిలసాఫికల్ జర్నీ.
జననమైనా, మరణమైనా హింస లేకుండా జరగదు. గాయం, రక్తం కనిపించకపోవచ్చు.
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














