ప్రీ-డయాబెటిస్ అంటే ఏంటి, ఇది టైప్ 2 డయాబెటిస్‌గా మారకుండా ఉండేందుకు 4 కీలక విషయాలు..

ప్రీడయాబెటిస్, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

(ఇది ప్రీ-డయాబెటిస్ కథనం. ప్రీడయాబెటిస్ అనేది టైప్-2 డయాబెటిస్‌కు ముందు దశ. ఈ కథనంలో వేగంగా బరువు తగ్గడం గురించి సమాచారం, సలహాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తావించిన అంశాలను ఆచరించేటప్పుడు తప్పనిసరిగా వైద్యులు లేదా నిపుణుల పర్యవేక్షణ అవసరం)

ప్రీడయాబెటిస్ అంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం, టైప్ 2 డయాబెటిస్‌గా పరిగణించేంత స్థాయిలో లేకపోవడం.

మీరు మీ జీవనశైలిలో, ప్రత్యేకించి మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడమే కాదు, దాన్నుంచి విముక్తి పొందవచ్చని 'డయాబెటిస్ యూకే సంస్థ'లో సీనియర్ క్లినికల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న ఎస్తేర్ వాల్డెన్ చెప్పారు.

"ప్రీడయాబెటిస్ ఉందని గుర్తించిన వారిలో కొంతమంది తమకు టైప్ 2 డయాబెటిస్ కచ్చితంగా వస్తుందని అనుకుంటారు. కానీ, ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు" అని ఎస్తేర్ చెప్పారు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, అధిక బరువును తగ్గించుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని 50 శాతం నివారించవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చని ఆమె తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రీడయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ప్రీడయాబెటిస్ ఉందని ఎలా తెలుస్తుంది?

ప్రీడయాబెటిస్‌ లక్షణాలు ఎక్కువగా కనిపించవు.

"రొటీన్ చెకప్‌లో భాగంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు తేలే వరకు చాలామందికి ప్రీడయాబెటిస్‌ ఉన్నట్లు తెలియదు" అని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అమండా అవెరి చెప్పారు.

అధిక బరువు, ఆహారం, వయసు ఇలా అనేక అంశాల వల్ల ప్రీడయాబెటిస్ రావొచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంలో ఇవన్నీ ముఖ్యపాత్ర పోషిస్తాయి.

"ఇన్సులిన్ అనేది క్లోమంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్, ఇది రక్తంలో గ్లూకోజ్ (చక్కెర)ను సాధారణ స్థాయిలో ఉంచడానికి సహాయపడుతుంది. ఒక వ్యక్తి అధిక బరువుంటే, అది కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే, రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను నియంత్రించడం ఇన్సులిన్‌కు కష్టంగా మారుతుంది. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉంటే ఇన్సులిన్ ప్రభావం మరీ తక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని నియంత్రించేందుకు శరీరం అధికంగా ఇన్సులిన్ విడుదల చేస్తుంది. అయితే ఇది ఎక్కువ కాలం సాధ్యం కాదు" అని అమండా వివరించారు.

అందుకే, శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం, తిండి అలవాట్ల వల్ల ప్రీడయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ప్రీడయాబెటిస్ ఉంటే ఏం చెయ్యాలి?

"వ్యక్తులు ఎవరికి వారే భిన్నంగా ఉంటారు. కాబట్టి ప్రీడయాబెటిస్ ఉన్న వాళ్లందరికీ ఒకే రకమైన ఆహారం ఉండదు" అని ఎస్తేర్ చెప్పారు.

"అధిక కొవ్వు, అధికంగా గ్లైసెమిక్ ఇండెక్స్, ఫైబర్ తక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది" అని ఆమె తెలిపారు.

ఒక పరిశోధన ప్రకారం నాలుగు విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే టైప్2 డయాబెటిస్‌ను నివారించవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చు.

అందుకు ఉపయోగపడే 4 కీలక విషయాలు..

1. మీ బరువు 10 శాతం తగ్గించుకోండి

అధిక బరువు తగ్గాలనుకుంటే డాక్టర్‌ను సంప్రదించండి. బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదేనా, మీరున్న బరువు వల్ల ప్రీడయాబెటిస్ వచ్చే అవకాశం ఉందా, లేదా అనేది తెలుసుకోండి.

'లైఫ్ వితౌట్ డయాబెటిస్' అనే పుస్తక రచయిత ప్రొఫెసర్ రాయ్ టేలర్ 2011లో ఒక పరిశోధన చేశారు. టైప్2 డయాబెటిస్‌ విషయంలో ఇది ఉపయోగపడుతుందని నిరూపితమైంది.

ఆరోగ్యం, బరువు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

"చాలామందికి, వారి ప్రస్తుత బరువులో కేవలం 10 శాతం బరువు తగ్గడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇది కాలేయంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగిస్తుంది" అని రాయ్ టేలర్ పుస్తకంలో తెలిపారు.

"పదేళ్ల కిందట వరకు దీన్ని మేజిక్‌గా భావించేవారు. ఒకసారి బరువు తగ్గిన తర్వాత, మళ్లీ పెరగకపోతే పూర్తి స్థాయి మధుమేహం వచ్చే ప్రమాదం పూర్తిగా తొలగిపోతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎన్ని కిలోలు తగ్గారన్నది కాదు మీ మొత్తం బరువులో ఎంత బరువు తగ్గారన్నది కీలకం. ఎవరైనా వారి వ్యక్తిగత శరీర కొవ్వు పరిమితిని మించితే వారిలో ప్రీడయాబెటిస్ డెవలప్ అవుతుంది" అని టేలర్ అందులో రాశారు.

కొవ్వు పరిమితి ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది, కాబట్టి ఊబకాయం వర్గంలోకి రాని వారు కూడా ప్రీడయాబెటిస్ ప్రమాదంలో ఉండవచ్చు. వేగంగా బరువు తగ్గించే ఆహారాలను నివారించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నప్పటికీ, ప్రీడయాబెటిస్ విషయంలో అవి ప్రయోజనకరంగా ఉండవచ్చని టేలర్ తెలిపారు.

"ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటారు కానీ, వేగంగా బరువు తగ్గడమనేది (రోజు తీసుకునే ఆహారం 800 కేలరీలకు తగ్గించడం వంటివి) టైప్ 2 డయాబెటిస్‌ నిరోధిస్తుందని గుర్తుంచుకోండి."

అయితే, ఈ సమయంలో మీ శరీరం అవసరమైన పోషకాలను పొందాలి.

2. బరువు అదుపులో ఉంచండి

కొంతమంది తక్కువ కేలరీల ఆహారాన్ని అనుసరించడం ద్వారా చాలా త్వరగా బరువు తగ్గుతారు. కానీ, అలాంటి ఆహారాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం సాధ్యం కాదు.

అందుకే, మీ బరువును అదుపులో ఉంచడానికి ఒక మార్గాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

శాకాహారం, వేగన్ ఆహారాలను తీసుకోవడం, కార్బోహైడ్రేట్లను పరిమితం చేయడం వంటివి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని డయాబెటిస్ యూకే సంస్థ తెలిపింది. కఠినమైన ఆహార నియమాలను పాటించడం కంటే వీటిని అనుసరించడం సులభమని చెబుతోంది.

ఎర్రటి మాంసం, ప్రాసెస్ చేసిన మాంసాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

3. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి

కొన్ని ఆహారాలు, పానీయాలు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని రీసర్చ్ పేర్కొంది. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో వీటిని తగ్గించడం ఉత్తమం. వాల్డెన్ చెప్పిన దాని ప్రకారం వీటిలో:

తియ్యటి పానీయాలు

ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి ఎందుకంటే, వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర పెరుగుదలకు కూడా కారణమవుతాయి, కాలక్రమేణా శరీరంలోని ఇన్సులిన్‌ను ప్రభావితం చేస్తుంది.

ఎర్రటి మాంసం (రెడ్ మీట్), ప్రాసెస్ చేసిన మాంసాలు (బీఫ్, గొర్రె, పంది మాంసం వంటివి)

ఎక్కువ మొత్తంలో ఎరుపు లేదా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు (చక్కెర స్నాక్స్, వైట్ బ్రెడ్ వంటివి)

తక్కువ ఫైబర్, అధిక స్టార్చ్ అనేవి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని రీసర్చ్ కనుగొంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు టైప్ 2 డయాబెటిస్ రావడానికి కారణమవుతాయి. ఎందుకంటే, వీటిని తయారు చేసే ప్రక్రియలో ఫైబర్ తొలగిపోతుంది, స్టార్చ్ శాతం పెంచుతుంది.

బంగాళాదుంపలు (ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్)

డయాబెటిస్ యూకే సంస్థ ప్రకారం.. బంగాళాదుంపలను తరచుగా తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాటికి చాలా ఎక్కువ జీఐ (గ్లైసెమిక్ ఇండెక్స్) ఉంటుందని భావిస్తారు.

'తృణధాన్యాలు తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు' అని ఒక అధ్యయనం కనుగొంది.

డయాబెటిస్, ఆరోగ్యం, ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

4. ఈ ఆహారాలను తీసుకోండి

"కొన్ని ఆహారాలు, పానీయాలు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిశోధనలో తేలింది" అని వాల్డెన్ చెప్పారు.

వీటిలో పండ్లు, కూరగాయలు (ముఖ్యంగా ఆకుకూరలు, ద్రాక్ష, ఆపిల్స్), తృణధాన్యాలు, పెరుగు, జున్ను, చక్కెర లేని టీ, కాఫీ ఉన్నాయి.

రోజు తృణధాన్యాలు (సుమారు 45 గ్రాములు) తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం 20 శాతం తగ్గించవచ్చని 2015లో జరిపిన ఒక అధ్యయనంలో తేలింది.

ప్రతిరోజూ పాల ఉత్పత్తులను తీసుకునే వ్యక్తులు డయాబెటిస్ ప్రమాదాన్ని 5 శాతం తగ్గించుకోవచ్చని తేలింది. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకుంటే 10 శాతం తగ్గించుకోవచ్చు. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ ప్రమాదాన్ని 14 శాతం తగ్గించుకోవచ్చని 2016 అధ్యయనంలో తేలింది.

భయపడకండి

మీకు ప్రీడయాబెటిస్ ఉందని తేలితే, భయపడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్‌ను పూర్తిగా నివారించడానికి దీనిని ఒక అవకాశంగా భావించాలని డాక్టర్ అమండా అవేరీ తెలిపారు.

"చిన్న ఆహార మార్పులు కూడా పెద్ద తేడాను కలిగిస్తాయి" అని అమండా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)