రైట్ బ్రదర్స్: విమానాన్ని కనిపెట్టింది వీళ్లు కాదా, దీనిపై వివాదమేంటి?

విమానాన్ని కనిపెట్టింది రైట్ బ్రదర్స్ కాదా

ఫొటో సోర్స్, BBC/Getty Images

ఫొటో క్యాప్షన్, రైట్‌ బ్రదర్స్, సాంటోస్ డుమోంట్.. చిత్రంలో 14 బిస్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా ఉంది
    • రచయిత, కామిలా వెరాస్ మోటా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విమానాన్ని ఎవరు కనిపెట్టారు? ఈ ప్రశ్న వినడానికి తేలికగా ఉన్నా, నిజానికి సమాధానం అంత తేలికైనది కాదు. వందేళ్లకుపైగా కొనసాగుతున్న ఓ పాత వివాదానికి ఇదే మూలం.

చాలామంది అమెరికన్లు విమాన ప్రయాణానికి నిజమైన 'పితామహులు'గా సైకిల్ మెకానిక్‌లు, సొంతంగా ఇంజనీర్లుగా ఎదిగిన ఓర్విల్లే రైట్, విల్బర్ రైట్‌లను భావిస్తుంటారు. 1903లో వారు మొట్టమొదటిసారి విమానంలో ఎగిరారు.

కానీ, అనేకమంది బ్రెజిలియన్లు మాత్రం ఈ ఘనతను తమ దేశానికి చెందిన అల్బెర్టో సాంటోస్ డుమాంట్‌కు ఇవ్వాలని వాదిస్తారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1903లో పారిస్‌లో మొట్టమొదటి ఫ్లైట్‌ను ఎగరేశారు. దీనిని ఇంటర్‌నేషనల్ ఏరోనాటికల్ ఫెడరేషన్ కూడా గుర్తించింది.

మరి నిజంగా విమానాన్ని కనిపెట్టింది ఎవరు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
14 బిస్ విమానం

ఫొటో సోర్స్, National Library of France

ఫొటో క్యాప్షన్, సాంటోస్ డుమోంట్ తన 14-బిస్‌లో మొదటిసారి పారిస్‌లో ప్రయాణించారు

సాంటోస్ డుమాంట్: జనం సమక్షంలో గాలిలోకి..

గాలిలో ఎగిరిపోవాలనే మనిషి కలను నిజం చేసేందుకు 20వ శతాబ్దం ప్రారంభంలో ఇంజిన్‌పై పనిచేస్తూ గాలిలో ఎగిరే యంత్రాన్ని తయారుచేయడంలో అనేకమంది నిమగ్నమై ఉండేవారు.

ఆ సమయంలో పారిస్ నగరం విమాన తయారీకి కేంద్రంగా ఉండేది. అక్కడ మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటమే కాక, మెటలర్జీ, మెషిన్లు, భౌతికశాస్త్ర పరిశోధనలకు అవసరమైన నిధులు సులభంగా లభించేవి.

''అప్పట్లో అది ఏదో ఒక క్షణంలో సంభవించే విషయంలా అనిపించేది'' అని ఫ్రెంచ్ చరిత్రకారుడు ప్రొఫెసర్ జీన్ పీరే బ్లే చెప్పారు.

ఆ సమయంలో విమాన ఔత్సాహికులు ఏ ప్రయత్నాన్ని మొదటి విమానయానంగా పరిగణించాలో నిర్ణయించారు.

విమానం ఎటువంటి బయటి సహాయం లేకుండా ఎగరాలి, ప్రజలు దానిని ప్రత్యక్షంగా చూసి ధృవీకరిస్తేనే అంగీకరించాలని భావించారు.

సాంటోస్ డుమాంట్ 1906 నవంబర్ 12న వీటన్నింటినీ సాధించగలిగాడు. అతని '14-బిస్' అనే విమానం 220 మీటర్ల దూరంపాటు పారిస్‌లో ప్రజల సమక్షంలో ఎగిరింది.

తర్వాత సంవత్సరం అతడు డెమియోసెల్లె అనే మరో కొత్త విమానాన్ని రూపొందించారు. ఇది ప్రపంచంలో తొలి తేలికపాటి, భారీ సైజు విమానంగా గుర్తింపు పొందింది.

డిమియెసెల్లె

ఫొటో సోర్స్, Getty Images

సాక్ష్యాలేంటి ?

రైట్ బ్రదర్స్ తాము ఐదేళ్ల కిందటే మొదటిసారి విమానంలో ఎగిరామని 1908లో ప్రకటించారు.

ఈ ప్రకటనతో ఫ్రాన్స్ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. ఆ సమయంలో అమెరికా, యూరప్‌ల మధ్య ఫ్లయింగ్ క్లబ్‌ల మధ్య లేఖల ద్వారా నిరంతర సమాచార మార్పిడి జరుగుతుండేది.

నేలపై నుంచి ఎక్కువ దూరం ఎగరగలిగే విమానాన్ని తయారు చేయడంలో ముందు వరుసలో నిలిచేందుకు పోటీ జరుగుతోందని అందరికీ తెలిసిందే. కానీ, చాలా ఏళ్లుగా రైట్ బ్రదర్స్ గురించి యూరప్‌లో ఎటువంటి సమాచారం లేదు.

అయితే తమ ఆవిష్కరణకు పేటెంట్ అనుమతి రాకపోవడంతో తమ ఆలోచనను ఎవరైనా తస్కరించే ప్రమాదం ఉందని భయపడినట్టు ఆ సమయంలో రైట్ బ్రదర్స్ చెప్పారు.

కానీ వాస్తవంగా చూస్తే, 1903 డిసెంబర్ 17న నార్త్ కరోలినాలోని కిటీహాక్‌లో వారు ఫ్లయర్‌లో గాలిలోకి ఎగిరినప్పుడు కేవలం అయిదుగురు మాత్రమే దాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఆ సంఘటనకు ఒక టెలిగ్రామ్, కొన్ని ఫోటోలు, ఒర్విల్ రైట్ డైరీ మాత్రమే దొరికిన ఆధారాలు.

రైట్ బ్రదర్శ్ విమానావిష్కరణ

ఫొటో సోర్స్, Library of Congress

ఫొటో క్యాప్షన్, 1903లో రైట్ బ్రదర్స్ ఫ్లయర్‌లో ప్రయాణించడానికి ప్రయత్నించారు

ఆ సమయంలో గాలివేగం సుమారు గంటకు 40 కిలోమీటర్లుంటుందన్నట్టు ఒర్విల్ తన డైరీలో రాశారని, గాలి ఇంత వేగంగా ఉంటే ఇంజిన్ లేకుండానే విమానం గాల్లోకి లేచే అవకాశముందని బ్రెజిల్ ఆస్ట్రానమీ మ్యూజియం మాజీ డైరెక్టర్ అయిన శాస్త్రవేత్త హెన్రిక్యూ లిన్స్ ది బారోస్ వంటి వారు చెబుతారు.

అయితే, రైట్ బ్రదర్స్ మద్దతుదారులు మాత్రం దీనిని ఖండిస్తారు. పారిస్‌లో 14-బిస్ ఎగరకముందే, 1904–05లోనే రైట్ సోదరులు ఫ్లయర్ కంటే మెరుగైన మోడల్స్ తయారు చేశారని వాదిస్తారు.

''రైట్ బ్రదర్స్ 1903 డిసెంబర్ 17న మొదటిసారి గాలిలో విజయవంతంగా ప్రయాణించగలిగినప్పుడు, అప్పటిదాకా ఎగరడానికి ఉన్న అడ్డకుంలన్నింటినీ దాటామనుకున్నారు'' అని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో పని చేసిన చరిత్రకారుడు, రైట్ బ్రదర్స్‌పై పలు పుస్తకాలు రాసిన టామ్ క్రౌచ్ చెప్పారు.

"ఆ విమానాన్ని ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. కానీ అప్పటికే అది తయారై గాల్లోకి ఎగిరింది'' అంటారు టామ్ క్రౌచ్.

రైట్ బ్రదర్స్ తామే ముందు విమానయానం చేశామని చెప్పేందుకు 1908లో ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అందులో భాగంగా వారు యూరప్ వెళ్లి ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో 200కుపైగా డెమో విమాన ప్రయాణాలు నిర్వహించారు. ఓసారైతే వారు 124 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు కూడా.

"ఆ సమయంలో యూరోప్‌లోని రాయల్ కుటుంబాలు విల్బర్‌తో కలిసి విమానంలో కూర్చోవాలనుకునేవారు. దాన్నో గొప్ప గౌరవంగా పరిగణించేవారు'' అని ప్రొఫెసర్ బ్లే చెప్పారు.

రైట్ బ్రదర్సే తొలిగా విజయవంతమైన ప్రయాణం చేసినవారని విమానాలపై తొలికాలపు నిపుణుల్లో ఒకరిగా పేరుగాంచిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫెర్డినాండ్ ఫర్బర్ వంటివారు కూడా అంగీకరించారు.

''ఇంత మెరుగైన నియంత్రణ ఉన్న విమానాన్ని ఒక్కరోజులో తయారు చేయడం సాధ్యం కాదు'' అని ఆయన అన్నారు.

రైట్ బ్రదర్స్ విమానానికి సంబంధించిన కథనం

ఫొటో సోర్స్, Library of Congress

క్యాటపల్ట్ పై చర్చ

యూరప్‌లో రైట్ బ్రదర్స్ ప్రదర్శించిన ఫ్లయర్ విమానానికి చక్రాలు లేవు. అవి ఎగరాలంటే 'క్యాటపల్ట్' అనే ప్రత్యేక యంత్రం సహాయం అవసరమయ్యేది (క్యాటపల్ట్ అంటే బయటి నుంచి బలాన్ని అందించి విమానాన్ని గాల్లోకి ఎత్తే విధంగా పనిచేస్తుంది.) ఈ విషయమే అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.

విమానానికి ఉన్న ఇంజిన్ శక్తి చాలా తక్కువగా ఉండటం వల్ల అంది సొంతంగా గాల్లోకి ఎగరలేకపోయేది. కేవలం క్యాటపల్ట్ వల్లే అది గాల్లోకి లేవడం సాధ్యమవుతోందని విమర్శకులు చెప్పేవారు.

అయితే, ఎలాంటి నేలపై నుంచైనా విమానం ఎగరాలనే ఉద్దేశంతోనే రైట్ బ్రదర్స్ క్యాటపల్ట్‌ని వాడారని కొంతమంది చెబుతారు.

కానీ, విమానప్రయాణం ఎవరు ముందు చేశారనే కథలో మరో మలుపు కూడా ఉంది. ఇందులో సాంటోస్ డుమాంట్, రైట్ బ్రదర్స్ మాత్రమే పోటీదారులు కాదు, తాము కూడా విమాన ప్రయాణాన్ని సొంతంగా ఆవిష్కరించామంటూ మరికొంతమంది ముందుకు వచ్చారు.

జర్మనీలో పుట్టి అమెరికాలో జీవించిన గుస్తావ్ వైస్‌కాఫ్ 1901లోనే విమానంలో గాల్లోకి ఎగిరారని అంటారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జర్మనీలో పుట్టి అమెరికాలో నివసించిన గుస్తావ్ వైస్‌కాఫ్ 1901లోనే విమానంలో గాల్లోకి ఎగిరారని అంటారు.

జర్మనీలో పుట్టి అమెరికాలో నివసించిన గుస్తావ్ వైస్‌కాఫ్, 1901లోనే విమానంలో గాల్లోకి ఎగిరారని అంటారు. అలాగే న్యూజీలాండ్‌కు చెందిన రిచర్డ్ పియర్స్ కూడా 1903 మార్చిలో విమాన ప్రయాణం చేశారనే వాదన ఉంది.

ఇంతకన్నా ముందే, దక్షిణాఫ్రికాలోని హౌవిక్ పట్టణం సమీపంలో ఉన్న జాన్ గుడ్‌మాన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి 1871లోనే మొట్టమొదటి మానవ నిర్మిత ఇంజిన్ లేని గ్లైడర్‌ను తయారుచేశారని, ఇది మనుషులు చేసిన తొలి విమానమనేందుకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అంతేగాక, ఆ గ్లైడర్‌కు గుర్తుగా ఇప్పటికీ అక్కడ ఓ స్మారక చిహ్నం ఉంది.

అందుకే ‘‘ విమానాన్ని ఎవరు కనిపెట్టారు అనే విషయంపై చర్చించడం నిరుపయోగం'' అంటారు పలువురు వైమానిక నిపుణులు.

''అదేదో ఓ పదిమంది శ్రమకాదు, వందలమందిది..అప్పుడు మాత్రమే అది సాధ్యమైంది'' అంటారు జెన్స్ ఆల్ ది వరల్డ్స్ ఎయిర్ క్రాఫ్ట్‌కు పాతికేళ్లపాటు సంపాదకుడిగా పనిచేసిన పాల్ జాక్సన్.

రైట్ బ్రదర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికన్ విమానయాన చరిత్రలో ప్రాచీనమైన పేర్లలో ఒకరైన గ్లెన్ హామండ్ తమ పేటెంట్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ 1909లో రైట్ బ్రదర్స్‌పై కేసు వేశారు.

గుర్తింపు కథ

సాంటోస్ డుమాంట్, వైస్‌కాఫ్ తదితరులు తగిన గుర్తింపు పొందలేకపోయారు అంటారు జాక్సన్.

''చివరకు పేరు సంపాదించేది ఎవరంటే ఖరీదైన లాయర్లు ఉన్నవారే'' అంటారు ఆయన.

"దురదృష్టవశాత్తు, 19, 20వ శతాబ్దాలలో అనేక ఆవిష్కరణల విషయంలో అసలైనవారు కాకుండా ఇతరులకు ఆ గుర్తింపు దక్కింది'' అని చెబుతారు జాక్సన్.

టెలిఫోన్‌ను కనిపెట్టారనే ఘనతను పొందిన స్కాటిష్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రాహంబెల్ విషయలో కూడా ప్రశ్నలు తలెత్తడాన్ని జాక్సన్ ఉదాహరణగా పేర్కొన్నారు. నిజానికి బెల్‌కు పేటెంట్ దక్కినా, టెలిఫోన్ ఆవిష్కరణ చేసింది పేదవాడైన ఇటాలియన్ ఆంటోనియో ముచి అని 2002లో అమెరికన్ కాంగ్రెస్ కూడా అంగీకరించింది. ఆంటోనియో ముచి కూడా బెల్‌తో కలిసి ఒకే వర్క్‌షాపులో పనిచేశారట.

అమెరికన్ విమానయాన చరిత్రలో ప్రాచీనమైన పేర్లలో ఒకరైన గ్లెన్ హామండ్ తమ పేటెంట్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ 1909లో రైట్ సోదరులు ఆయననను కోర్టుకు లాగారు.

హామండ్ బంధువైన మార్షియా కమింగ్స్ ప్రస్తుతం ఓ బ్లాగ్ నడుపుతున్నారు. ఇందులో రైట్ బ్రదర్స్ కథ ఎంతవరకు నిజం, ఎంత వరకు ప్రచారం అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

''రైట్ బ్రదర్స్ ఉద్దేశపూర్వకంగానే కర్టిస్ లాంటి పేర్లు చరిత్రలో లేకుండా తుడిచేశారనిపిస్తుంది'' అంటారు కమింగ్స్.

మరోపక్క ఒర్విల్, విల్బర్‌ల వారసురాలు, అమాండా రైట్ లేన్ మాత్రం దీనిని ఖండిస్తున్నారు. "నాకు తెలిసిన ఒర్విల్ అలాంటి వ్యక్తి కాదు. కావాలని ఎవరినైనా లక్ష్యంగా చేసుకునేవాడిలా అనిపించదు" అంటారు ఆమె.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)