విమానంలో ప్రసవం: గర్భిణులు ఎన్నో నెల వరకు విమాన ప్రయాణం చేయొచ్చు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి

విమానంలో ప్రసవం

ఫొటో సోర్స్, DR SAILAJA VALLABHANENI

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించిన ఓ మహిళకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. నెలలు నిండకుండానే ఆమె విమానంలోనే ప్రసవించారు.

ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగినట్లు ఇండిగో సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఇదే విమానంలో గైనకాలజిస్టు శైలజ వల్లభనేని కూడా ప్రయాణం చేస్తూ ఉండటంతో ప్రసవానికి అవసరమైన వైద్య సహాయం అందించారు.

మహిళకు నొప్పులు రాగానే విమాన సిబ్బంది సత్వరమే విమానంలో హాస్పిటల్ తరహా స్థలాన్ని ఏర్పాటుచేసి కాన్పు అయ్యేందుకు సహకరించినట్లు ఇండిగో సిబ్బంది బీబీసీతో చెప్పారు.

అయితే, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి విమానయాన సిబ్బందికి తగిన నైపుణ్యాలు ఉంటాయా? విమానంలో డాక్టర్ లేనప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తితే, కేబిన్ సిబ్బంది ఎలా స్పందిస్తారు? అసలు గర్భం దాల్చిన తర్వాత ఎన్ని నెలల వరకూ విమాన ప్రయాణం చేయొచ్చు?

విమానయాన శిక్షణలో భాగంగా ఇండిగో తమ సిబ్బందికి ప్రయాణికుల ప్రాణాలను రక్షించే విధానాలతో పాటు, ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స, అకస్మాత్తుగా గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు స్పందించాల్సిన తీరు గురించి తర్ఫీదు ఇస్తారని ఇండిగో కోసం పని చేస్తున్న ఒక ప్రైవేట్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ సిబ్బంది తెలిపారు.

అదే విమానంలో ప్రయాణిస్తున్న మోసెస్ మార్టిన్ అనే ప్రయాణికుడు సిబ్బందిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

"క్యాబిన్ సిబ్బంది కేవలం మనకి టీ, కాఫీలు అందించడానికి మాత్రమే కాదు. విమాన ప్రయాణంలో తలెత్తే పరిస్థితులతో పాటు ప్రసవాలు చేయడానికి శిక్షణ పొంది ఉంటారు" అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గర్భిణులు ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గైనకాలజిస్టు డాక్టర్ మంజుల అనగాని బీబీసీకి వివరించారు.

గర్భిణికి బీపీ, డయాబెటిస్ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేని పక్షంలో 28 - 32 వారాల వరకూ విమాన ప్రయాణం చేయవచ్చు అని చెప్పారు.

అలాగే, ఎంత సేపు విమాన ప్రయాణం చేస్తున్నామనేది కూడా పరిగణన లోకి తీసుకోవాలి. 28 వారాలు నిండిన తర్వాత ఎక్కువ గంటల పాటు చేయాల్సిన ప్రయాణాలు మానుకోవడమే మంచిదని అన్నారు.

గంట కంటే ఎక్కువ సేపు ప్రయాణం చేసేటట్లు అయితే, కాళ్ళను చాపుకుని కూర్చోవడం, ఎక్కువగా మంచి నీరు తీసుకోవడం, మధ్య మధ్యలో నిలబడి, అటూ ఇటూ తిరగడం లాంటివి చేస్తూ ఉండాలని సూచించారు.

"ఎత్తుకు వెళ్లేకొద్దీ యుటరస్ ఇరిటబుల్ సిండ్రోమ్ సమస్య ఎదురుకావచ్చు. దాని వలన కూడా గడువుకన్నా ముందే డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది" అని ఆమె చెప్పారు. .

నడుం నొప్పి, డిశ్చార్జి అవ్వడం, గర్భ సంచి గట్టిపడినట్లు అనిపించినా, మాయ కిందకు వచ్చినట్లు అనిపించినా , మరే ఇతర లక్షణాలు కన్పించినా విమాన ప్రయాణం చేయకుండా ఉండటమే మంచిదని అన్నారు.

విమాన ప్రయాణం చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవడంతో పాటు 28 వారాల తర్వాత ఎప్పుడు ప్రయాణం చేసినా డాక్టర్ సర్టిఫికేట్ తప్పని సరిగా తీసుకోవాలని చెప్పారు.

విమానయాన సిబ్బంది ఎంత శిక్షణ తీసుకున్నప్పటికీ ప్రసవం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో పూర్తిగా వైద్యుల తరహాలో సేవలందించడం సాధ్యమయ్యే పని కాదని మంజుల అన్నారు.

ఇలా జరిగే ప్రసవాల్లో ఎంతో కొంత ముప్పు ఉంటుందని అన్నారు.

విమానంలో ప్రసవం

ఫొటో సోర్స్, DR SAILAJA VALLABHANENI

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

విమాన ప్రయాణం చేసేందుకు గర్భం దాల్చిన 32 వారాల లోపు మాత్రమే అనుమతిస్తారు.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే 35వ వారంవరకు ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు.

ఇందుకోసం గర్భిణిని పరిశీలిస్తున్న వైద్య నిపుణుల నుంచి ప్రయాణానికి అనువుగా ఉన్నట్లు సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.

టికెట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి ప్రయాణం తేదీ నెల రోజులకు పైగా దాటిపోతే, డాక్టర్ దగ్గర నుంచి మరొక సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ప్రయాణానికి మూడు రోజుల ముందు జారీ చేసినదై ఉండాలి.

చిన్నారి

ఫొటో సోర్స్, dr sailaja vallbhaneni

ఒక వేళ గర్భిణి కవలలకు గాని, లేదా అంత కన్నా ఎక్కువ మంది పిల్లలకు కానీ జన్మనిచ్చే అవకాశాలు ఉన్నా, లేదా ప్రసవ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నా 32 వారాల తర్వాత ప్రయాణం చేయడానికి ఎయిర్ లైన్స్ అనుమతించదు.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 35 వారాల తర్వాత ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు. దానికి కూడా మెడికల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమతి అవసరం అవుతుంది.

పుట్టిన శిశువులు ప్రయాణం చేయాలంటే శిశువుకు కనీసం 14 రోజులుండాలి.

ఒక వేళ తల్లికి కానీ, బిడ్డకి కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఏదైనా చికిత్స తీసుకోవడం కోసం ప్రయాణం చేయవలసి ఉంటే 14 రోజుల లోపే ప్రయాణం చేయవచ్చు. అయితే, దీనికి ప్రసూతి నిపుణులు, పిల్లల వైద్య నిపుణుల నుంచి సర్టిఫికేట్ అవసరం అవుతుంది. వీరితో పాటు ఒక డాక్టర్ కూడా ప్రయాణం చేయవలసి ఉంటుంది.

ఆధారం: ఎయిర్ ఇండియా

విమానంలో ప్రసవం

విమాన ప్రయాణంలో పిల్లలు పుట్టడం ఇదే మొదటి సారి కాదు.

1991లో డెబోరా ఓవెన్ అనే మహిళ ఘనా నుంచి బ్రిటన్‌కు ప్రయాణం చేస్తుండగా నొప్పులు రావడంతో విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చారు.

సెప్టెంబరు 16వ తేదీన లండన్ నుంచి ఈజిప్ట్ రాజధాని కైరో వెళుతున్న విమానంలో ఒక యెమెనీ మహిళ కూడా మార్గమధ్యంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు న్యూ యార్క్ పోస్ట్ పేర్కొంది. ఆ బిడ్డకు ఈజిప్ట్ ఎయిర్ విమానయాన సంస్థ జీవిత కాలం పాటు వారి విమానాలలో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని బహుమతిగా ప్రకటించింది.

2017లో సౌదీ అరేబియా నుంచి కేరళలోని కోచి వస్తున్న ఒక మహిళ కూడా విమాన ప్రయాణంలో ఉండగానే ప్రసవించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)