ఆకాశం నీ హద్దురా: విమాన ప్రయాణాన్ని నేలకు దించిన కుర్రాడి కథ - సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, facebook/suriyasivakumar
- రచయిత, శతపత్ర మంజరి
- హోదా, బీబీసీ కోసం
మనిషి పట్టుదలతో ప్రయత్నం చేస్తే సాధించలేనిది అంటూ ఏది ఉండదని ఎవరైనా అన్నప్పుడు వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెప్పినట్లుగా ఉంటుంది.
కానీ"ఆకాశం నీ హద్దురా" పేరుతో విడుదలైన సూర్య సినిమా చూస్తున్నంతసేపు నిజజీవిత పాఠాలే వ్యక్తిత్వ వికాస పాఠాలు అనిపించకమానదు. ఇది "ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపినాథ్" జీవిత కథ. బయోపిక్ ని సినిమాగా ఎంచుకోవడంలో ఎంతటి సౌలభ్యం ఉంటుందో. కథ, కథనాలను తడబడకుండా చెప్పడంలో అంతే క్లిష్టత ఉంటుంది. ఏ కొంచెం పొరపాటు చేసినe డ్యాక్యుమెంటరీలాగా మారిపోతుంది సినిమా.
గజిని, సింగం సినిమాల తరువాత తెలుగులో తన మార్క్ సినిమా కోసం ఎదురుచూస్తున్న సూర్య.. గురు(వెంకటేష్) సినిమాతో డైరెక్టర్‌గా తానేంటో నిరూపించుకున్న సుధా కొంగర కాంబినేషన్ ఎమోషనల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో 'సురారై పోట్రు' పేరుతో తమిళంలో, 'ఆకాశం నీ హద్దురా' పేరుతో తెలుగులో ఒకేసారి ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై అమెజాన్ ఫ్రైమ్‌లో విడుదలయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
చంద్రమహేష్(సూర్య) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఒక పల్లెటూరులోని ఓ సాధారణ స్కూల్ మాస్టర్ కొడుకు. తండ్రి పట్టుదలతో ఊరికి కరెంటు తీసుకురావడంతో స్ఫూర్తి పొందే కొడుకు. వైమానిక దళంలో ఉద్యోగి. ఒక అనూహ్యమైన సంఘటన అతని ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది.

ఫొటో సోర్స్, facebook
విమాన ప్రయాణం పేదవారికి కూడా అందుబాటులోకి రావలన్నది అతని ఆశయం.
అందుకోసం అహోరాత్రులు కష్టపడతాడు.అయితే దానికి సంబంధించి అతని దగ్గర అద్భుతమైన ఐడియాలజీ ఉంది కానీ దానికి తగిన ఆర్థిక వనరులు లేవు.
వెంచర్ కాపిటిలిస్ట్ లకు అతని ఐడియాపై నమ్మకం లేదు.
భార్య సుందరి(అపర్ణ బాలమురళి)కుటుంబ బాధ్యతలను చూసుకుంటుంది.చివరకు చంద్రమహేష్ డెక్కన్ ఎయిర్ లైన్ స్టార్ట్ చేస్తాడా?లేదా?అసలు ఒక వైమానిక దళ ఉద్యోగికి ఎయిర్ లైన్ స్టార్ట్ చేయాలన్న పంతం ఎందుకు వచ్చింది?అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
సూర్య పాత్ర ఇంట్రడక్షన్‌లో ఎంత సింపుల్‌గా మొదలవుతుందో. సినిమా చివర వరకు అంచెలంచెలుగా అంతకు పదిరెట్లు బలంతో ఎలివేట్ అవుతుంది.
సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్ని చంద్రమహేష్ పాత్రనే.వన్ మ్యాన్ ఆర్మీలాగా సినిమా భారాన్నంత ఒకడే మోసినట్లుగా అనిపిస్తుంది.
చంద్రమహేష్ తల్లి (ఊర్వశి) పాత్ర అయితేనేమిటీ, భార్య(అపర్ణ బాలమురళి) పాత్ర అయితేనేమిటీ స్త్రీ పాత్రలను మలచిన విధానం బలంగా ఉండి, సినిమాకు అదనపు సొగసులద్దాయి.
సినిమాలోని కీలకమైన మలుపు ప్రేక్షకులను మరింతగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. సినిమా డాక్యుమెంటరీలా రాకుండా ఉండడానికి హీరో తల్లిదండ్రులతో మధ్య ఇంకా హీరోహీరోయిన్ల మధ్య ఎమోషనల్ డ్రామా నడిపిన విధానం చాలా సహాయపడుతుంది.
అయితే అదే కారణం సినిమా లెంగ్త్‌ను అమాంతం పెంచేసి ప్రేక్షకులను విసిగిస్తుంది.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు, ఎయిర్‌లైన్ స్టార్ట్ చేయడం తన లక్ష్యం అన్నప్పుడు కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
పరేష్ గోస్వామి లాంటి కాపిటలిస్ట్ లు తమ రంగంలో ఎదగాలనుకునే కొత్తవారిని ఎన్ని కష్టాలు పెడతారన్నది.. 'రతన్ టాటా లాంటి మహామహుడే ఇక్కడ ఒక ఎయిర్ లైన్ స్టార్ట్ చేయడానికి ఇరవై ఏళ్ళు కష్టపడి.. ఏమీ సాధించలేక ఊరుకున్నాడు'లాంటి డైలాగులతో అర్థమవుతుంది.
కానీ చంద్రమహేష్ లాంటి సాధారణ కుర్రాడిని ఓడించడానికి ఒక వెంచర్ కాపిటలిస్ట్ అంతగా ఆలోచించడం,కష్టపపడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ పాత్రకు పరేష్ రావల్ కాకుండా మరెవరైనా అయినుంటే బాగుండేదేమోనన్న ఫీలింగ్ వస్తుంది.
సినిమా గురించి మాట్లాడడం అంటే సూర్య గురించి మాట్లాడడమే...ఒక పనిలో వందశాతం రిజల్ట్ సాధించాలంటే, వెయ్యిశాతం కష్టపడాలి అంటాడు సూర్య.
అందుకే ఆయన ఏ సినిమా చూసుకున్న ఒక పాత్రను ఎలివేట్ చేయడానికి ఎంత కష్టపడతాడన్నది అర్థమవుతుంది.
ఈ సినిమాలో కూడా చంద్రమహేష్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్లుగా నటించాడు.
రైల్వే రాస్తారోకో సీన్లో గానీ,ఎయిర్ పోర్ట్ సీన్ లో గానీ,భార్యభర్తల మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ లో గానీ తన నటనతో సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్తాడు సూర్య.
లుక్స్ పరంగా కూడా మిలటరీ గెటప్,స్టైలిష్ కుర్రాడు,ఏమి సాధించలేక నిరాశగా ఉండే మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడి గెటప్...ఇలా ప్రతి అరగంటకో విధంగా రూపాంతరం చెందే పాత్రలలోకి అంతే సునాయాసంగా ఒదిగిపోతాడు.

ఫొటో సోర్స్, facebook
ఇక సూర్య తరువాత చెప్పుకోదగిన పాత్ర అపర్ణ బాలమురళిది. సుందరి అలియాస్ బేబి పాత్రలో బబ్లీ గాళ్ రోల్ పోషిస్తూనే..బేకరీ నడపాలనుకునే తన లక్ష్యం సాధించి,తన కుటుంబ ఆర్థిక భారాన్ని మోసేంతటి బలమైన వ్యక్తిత్వంతో కనపడుతుంది.
భర్తకు అడుగడుగునా తోడుంటూనే అవసరమైన ప్రతిసారి అవమానపరిచైనా సరే అతన్ని తన లక్ష్యం వైపు మరింత బలంగా అడుగులు వేసేలా చేస్తుంది.
అలాంటి లోతైన పాత్రలో అపర్ణ బాలమురళి సమర్థవంతంగా పోషించింది.ఇక అందానికి నిర్వచనాలు మారగలిగే స్థితిని మనం అంగీకరిస్తే..అపర్ణ బాలమురళి చాలా అందంగా కనిపిస్తుంది.
సూర్య ప్రతి పనిలో అడ్డుతగిలే విలన్ గా పరేష్ రావే.. ల్కెప్టెన్ 'భక్తవత్సలం నాయుడు'పాత్రలో మోహన్ బాబు తమ మార్క్ నటనతో ఆకట్టుకున్నారు.సూర్యతల్లి పాత్రలో 'ఊర్వశి' నటన మెప్పిస్తుంది...మిగతా వారు కూడా తమతమ పరిధి మేరకు నటించి ఒప్పించారు.లెంత్ ఎక్కువైన ప్రతి ఫ్రేమును అందంగా తీర్చిదిద్దడమే సినిమాకున్న ఏకైక బలం.
'గురు'సినిమా డైరెక్టర్ అనగానే సుధా కొంగర మీద ఒక ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. మణిరత్నం దగ్గర ఏడేళ్ళు పని చేసిన ప్రభావం సినిమాలో చాలా సన్నివేశాలలో ప్రతిఫలిస్తుంది. మహిళ కాబట్టే స్త్రీ పాత్రలను బలమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలుగా తీర్చిదిద్దగలిగారేమో అనిపిస్తుంది.
సూర్యలాంటి స్టార్‌డమ్ ఉన్న నటుడికి సరితూగగల కథను ఎంచుకోవడంలో,దానిని అనుకున్న విధంగా డైరెక్షన్ చేయడంలో విజయం సాధించారు.
ఒక బయోపిక్ ను కమర్షియల్ గా మార్చి కథ,కథనాలను అందుకు అనుగుణంగా నడిపించి,ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమయ్యారు సుధా కొంగర.

ఫొటో సోర్స్, facebook/suriyasivakumar
అయితే సినిమాలో ఉండాల్సిన ఒక క్రిస్పినెస్ తగ్గి కొంచెం సాగదీతగా అనిపిస్తుంది.ఒక నిజజీవిత కథకు కొంత ఫిక్షన్ జోడించి కథను రాయడంలో సుధాకొంగర, షామిలి ఉషాదేవి సఫలీకృతులయ్యారు.
నికేత్ సినిమాటోగ్రఫీ చాలా బాగుండి థియేటర్లో పెద్ద తెరమీద చూడలేకపోతున్నమనే లోటును ప్రస్ఫుటంగా గుర్తుచేస్తుంది.
జీవి ప్రకాష్ కుమార్ సంగీతం రెండు పాటలలో బాగుందనిపిస్తుంది.అయితే నేపథ్య సంగీతం బాగుంది.
రాకేందు మాటలు, సత్యదేవ్ సూర్యకు చెప్పిన డబ్బింగ్ ఆకట్టుకుంటాయి. సతీష్ సూర్య ఎడిటింగ్ విషయంలో కొంత బాధ్యతగా వ్యవహరించాల్సింది అనిపిస్తుంది. కానీ ఏ ఫ్రేముకు ఆ ఫ్రేము కథాపరంగా ముఖ్యభూమికను పోషించిన కారణంగా అతనికీ గందరగోళం నెలకొన్నదేమో అనిపిస్తుంది.
(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- కరోనావైరస్ తమలోనే ఉన్నా గబ్బిలాలు జబ్బు పడవెందుకు? రహస్యం శోధిస్తున్న శాస్త్రవేత్తలు
- బీటిల్ మోసుకెళ్లే బుల్లి కెమెరా.. కీటకాల సాహసాలు లైవ్ స్ట్రీమింగ్
- గిన్నిస్ రికార్డులకు ఎక్కిన భారత పులుల గణన.. ఎందుకంటే...
- 50 ఏళ్ల కిందట అంతరించిన అరుదైన జీవి.. ఆఫ్రికాలో మళ్లీ ప్రత్యక్షం
- 'ఏనుగులను హింసించి చంపేస్తారు, ఆ తర్వాత మొసలి కన్నీళ్లు పెడతారు...''
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








