జీహెచ్‌ఎఫ్: ఐక్య రాజ్య సమితిని మించి గాజాలో సాయం చేస్తామంటున్న ఈ సంస్థ ఎవరిది, దీనిపై విమర్శలేంటి?

జీహెచ్ఎఫ్ లోగోతో వెళ్తున్న మానవతా సాయం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జీహెచ్ఎఫ్ లోగోతో వెళ్తున్న మానవతా సాయం

రఫాలో ఓ సహాయ కేంద్రం వద్ద జరిగిన ఘటనపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో దక్షిణ గాజాలోని తమ ఫీల్డ్ ఆస్పత్రికి తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో గాయపడిన ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చినట్టు రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది.

హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య శాఖ, ప్రభుత్వ మీడియా కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, ఇజ్రాయెల్ దాడులలో 31 మంది మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని తెలిసింది. అలాగే వాడి గాజా బ్రిడ్జ్ ఏరియాలోని మరో సహాయక కేంద్రం సమీపంలోనూ మరో వ్యక్తి చనిపోయినట్లు తాజాగా తెలిపింది.

''పౌరులపై ఐడీఎఫ్ కాల్పులు జరపలేదని ప్రాథమిక విచారణలో తేలింది.'' అని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) తెలిపింది. ఆ పైన ఖాన్ యూనిస్‌ నగర సమీపంలోని సహాయ కేంద్రం వద్ద పౌరులపై మాస్క్ ధరించిన సాయుధ వ్యక్తులు రాళ్లు రువ్వి, కాల్పులు జరిపినట్లు చూపుతున్న డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది. బీబీసీ ఈ ఫుటేజీని వెంటనే పరిశీలించలేకపోయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఖాన్ యూనిస్‌లోని నాజర్ ఆస్పత్రి వైద్యులను బీబీసీ సంప్రదించగా.. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల వల్ల గాయాలు పాలైన 200 మంది ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.

ఇజ్రాయెల్ సైనికులు ప్రజలపై కాల్పులు జరపలేదని, అది వారిని లక్ష్యంగా చేసుకున్నది కాదని, ఆ కాల్పులలో ఎవరూ గాయపడలేదని ఐడీఎఫ్‌కు చెందిన ఓ సైనికుడు బీబీసీకి చెప్పారు.

గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) నిర్వహిస్తున్న సహాయ పంపిణీ కేంద్రం వద్ద పాలస్తీనియన్లు గుమిగూడినప్పుడు ఇజ్రాయెల్ ట్యాంకులు వచ్చి జనంపై కాల్పులు జరిపాయని రఫాలోని జర్నలిస్ట్ మొహమ్మద్ గరీబ్ బీబీసీతో చెప్పారు.

అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుతో నడుస్తున్న వివాదాస్పదమైన సహాయ సంస్థ జీహెచ్ఎఫ్‌ అసలు ఎవరిది?

గాజాలోని చిన్నారి

ఫొటో సోర్స్, Getty Images

గాజాలోకి జీహెచ్ఎఫ్ సాయాన్ని ఎలా పంపుతోంది?

జీహెచ్ఎఫ్ కార్యక్రమం నిశిత పరిశీలనకు, తీవ్ర విమర్శలకు గురవుతోంది.

అమెరికా భద్రతా కాంట్రాక్టర్లను వినియోగిస్తున్న ఈ సంస్థ గాజాలో 21 లక్షల మంది ప్రజలకు ప్రధాన సహాయ పంపిణీదారుగా ఉన్న ఐక్యరాజ్య సమితిని మించి సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 11 వారాలపాటు ఇజ్రాయెల్ దిగ్బంధం కారణంగా తీవ్ర దుర్భిక్షం ఏర్పడనుందనే నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ దిగ్బంధాన్ని సడలించింది.

జీహెచ్ఎఫ్ దక్షిణ, మధ్య గాజాలో ఏర్పాటు చేసిన నాలుగు పంపిణీ కేంద్రాల నుంచి పాలస్తీనియన్లు తమ కుటుంబాలకు అవసరమైన ఆహారం ఇతర నిత్యావసరాలను తీసుకువెళ్లాలి. ఈ కేంద్రాలకు అమెరికా కాంట్రాక్టర్లు భద్రత కల్పిస్తారు. ఇజ్రాయెల్ దళాలు వాటి చుట్టూ గస్తీ నిర్వహిస్తాయి.

పాలస్తీనీయులు ఈ కేంద్రాల వద్ద సాయం తీసుకోవాలంటే బయోమెట్రిక్ స్క్రీనింగ్, ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ముఖ గుర్తింపు టెక్నాలజీ) ద్వారా తమ గుర్తింపును చూపుతూ హమాస్‌తో ప్రమేయం లేదని నిరూపించుకోవాలి.

జీహెచ్ఎఫ్ బాక్సును పట్టుకుని కూర్చుని మహిళ

ఫొటో సోర్స్, Reuters

అభ్యంతరాలు ఏమిటి?

జీహెచ్ఎఫ్‌‌కు సహకరించేందుకు ఐక్యరాజ్య సమితి, పలు ఇతర సహాయక సంస్థలు నిరాకరించాయి. ఆ సంస్థ ప్రణాళికలు మానవీయ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయని, చూడటానికి 'సాయుధ సాయం' (వెపనైజ్ ఎయిడ్)లా ఉందని అభ్యంతరం చెబుతున్నాయి.

జీహెచ్ఎఫ్ ఆపరేషన్ అసలు ఏది అవసరమో దాన్ని దృష్టి మరల్చిందని, అన్ని మార్గాలను ఇజ్రాయెల్ తిరిగి తెరవాలని యూఎన్ అధికార ప్రతినిధి డిమాండ్ చేశారు.

ప్రాథమిక మానవీయ సిద్ధాంతాలకు గౌరవం ఇవ్వని ఏ స్కీమ్‌కు తాము సహకరించబోమని యూఎన్, ఇతర సహాయ సంస్థలు నొక్కి చెబుతున్నాయి.

జీహెచ్‌ఎఫ్ వ్యవస్థ ఆచరణాత్మకంగా వృద్ధులు, వికలాంగులు, క్షతగాత్రులు చేరలేని విధంగా, వేలాది మందికి హాని కలిగించేలా, రాజకీయ-సైనిక లక్ష్యాలకు లోబడి ఉంటుందని, సహాయ పంపిణీలో ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యంకాని విధానానికి ఉదాహరణగా నిలుస్తుందని అవి హెచ్చరిస్తున్నాయి.

జీహెచ్ఎఫ్‌ను ''సైనికీకరణ, ప్రైవేటీకరణ, రాజకీయం చేశారని'' మాజీ యూఎన్ మానవతా వాది (యూఎన్ హ్యుమానిటేరియన్ చీఫ్), నార్వేయన్ రిఫ్యూజీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ జాన్ ఈగ్‌లాండ్ చెప్పారు.

'' ఇదో భద్రతా సంస్థ. సాయుధ సంఘర్షణలో ఒక పార్టీ అయిన ఇజ్రాయెల్ రక్షణ దళాలతో కలిసి పనిచేయనున్న భద్రతా సంస్థ ఇది. వారికి కొన్ని హబ్‌లు ఉన్నాయి. ఈ సంఘర్షణలో ఇజ్రాయెల్ అవసరాలకు అనుగుణంగా ప్రజలను ఇక్కడ తనిఖీలు చేయనున్నారు.'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

జీహెచ్ఎఫ్‌కు సాయం చేయద్దని పాలస్తీనియన్లను హమాస్ హెచ్చరించింది.

''గందరగోళ పరిస్థితులను సృష్టిస్తూ, పాలస్తీనా పౌరులను ఆకలిలోకి నెట్టేసే విధానాన్ని అమలు చేస్తూ, యుద్ధ సమయంలో ఆహారాన్ని ఆయుధంగా వాడుతోంది.'' అని హమాస్ పేర్కొంటోంది.

జీహెచ్ఎఫ్ సురక్షిత పంపిణీ కేంద్రాల వద్ద సహాయక బృందాలను లక్ష్యంగా చేసుకుని హమాస్ చంపుతామనే హెచ్చరికలు జారీచేస్తోందని జీహెచ్‌ఎఫ్ తన ప్రకటనలో ఆరోపించింది.

ఈ కేంద్రాలలో మానవతా సాయం పొందకుండా గాజా ప్రజలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపింది.

సాయాన్ని హమాస్‌ దొంగిలించకుండా అడ్డుకోవడానికి, ప్రస్తుత పంపిణీ విధానానికి ప్రత్యామ్నాయం అవసరమని ఇజ్రాయెల్ అంటోంది. దొంగతనం ఆరోపణలను హమాస్ ఖండిస్తోంది.

జీహెచ్ఎఫ్‌పై నిఘాను పెంచిన క్రమంలో, సంస్థ విధానాలను వ్యతిరేకిస్తూ దాని డైరెక్టర్ జేక్ వుడ్ ఆదివారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు.

పాలస్తీనియన్లు

ఫొటో సోర్స్, Getty Images

రాజీనామా చేసిన జేక్ వుడ్ ఎవరు?

మానవతా కార్యకలాపాల్లో తనకున్న అనుభవం మేరకు రెండు నెలల క్రితం జీహెచ్ఎఫ్‌కు నాయకత్వం వహించాలని తనని సంప్రదించారని యూఎస్ మాజీ మెరైన్ జేక్ వుడ్ తెలిపారు. కానీ, వారం క్రితం ఆయన తన పదవి నుంచి దిగిపోతున్నట్లు ప్రకటించారు.

ఇజ్రాయెల్‌‌కు మద్దతు ఇచ్చే ప్రణాళికపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

'' ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది లాగానే గాజాలో నెలకొన్న ఆకలి సంక్షోభంతో నా గుండె బద్దలయింది. తీవ్ర వేదనకు గురయ్యాను. ఒక మానవతావాదిగా ఈ ఆకలి సంక్షోభాన్ని అరికట్టేందుకు నేను చేయగలిగిన సాయమంతా చేయాల్సి వచ్చింది.'' అని వుడ్ తన పదవీ విరమణ ప్రకటనలో తెలిపారు.

''ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం అందించేందుకు ఆచరణాత్మక ప్రణాళిక అభివృద్ధి చేసేందుకు, దారి మళ్లింపుపై ఉన్న భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు, గాజాలో దీర్ఘకాలిక స్వచ్చంద సంస్థల కృషికి సాయం చేసేందుకు పనిచేయడం చాలా గర్వంగా ఉంది.'' అని తెలిపారు.

''మానవత్వం, తటస్థత, నిష్పాక్షికత, స్వతంత్రతకు చెందిన మానవతా సిద్ధాంతాలకు కచ్చితంగా కట్టుబడి ఉంటూ ఈ ప్రణాళికలను అమలు చేయడం సాధ్యపడదని స్పష్టంగా అర్థమైంది. ఈ మానవతా సిద్ధాంతాలను నేను వదులుకోను.'' అని అన్నారు.

జేక్ వుడ్ రాజీనామాతో తమ కార్యకలాపాలు ఆగవని, సోమవారం తమ సహాయ పంపిణీ మొదలవుతుందని జీహెచ్ఎఫ్ తెలిపింది.

ఈ వారాంతనికల్లా 10 లక్షల మంది పాలస్తీనియన్లను చేరుకోవాలని జీహెచ్ఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. విదేశీ సాయాలను నిర్వహించే యూఎస్ ప్రభుత్వ సంస్థ యూఎస్ఎయిడ్ మాజీ సీనియర్ మేనేజర్ జాన్ అక్రీ ప్రస్తుతం దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

మానవతా సాయాల కోసం ఎదురుచూస్తోన్న ప్రజలు

క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది?

మార్చి 2న మానవతా సాయం గాజాలోకి వెళ్లకుండా ఇజ్రాయెల్ పూర్తిగా నిర్భధించింది. హమాస్‌తో రెండు నెలల కాల్పుల విరమణ ముగిసిన రెండు వారాలకు ఇజ్రాయెల్ తిరిగి తన సైనిక దాడిని ప్రారంభించింది.

గాజాలోని 58 మంది బందీలను విడిచిపెట్టాలని ఈ సాయుధ గ్రూపుపై ఒత్తిడిని పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నామని తెలిపింది. వీరిలో 23 మంది బతికున్నట్లు తెలిసింది. గాజాలో అన్ని ప్రాంతాలను ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకుంటాయని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పిన తర్వాత, మే 19న గాజాపై ఇజ్రాయెల్ సైన్యం తన దాడులను మరింత తీవ్రతరం చేసింది.

ఉత్తరాన ఉన్న ప్రజలందర్ని ఖాళీ చేయించి, వారిని బలవంతంగా దక్షిణానికి పంపాలనే ప్రణాళిక రచించింది.

ఇజ్రాయెల్ తాత్కాలికంగా ఈ నిర్భంధాలను సడలించిందని, అమెరికా మిత్ర దేశాల నుంచి వస్తున్న ఒత్తిడితో, గాజాలో కరువును అరికట్టేందుకు ప్రాథమిక ఆహార సరఫరాలకు అనుమతి ఇస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు. అప్పటి నుంచి పిండి, పిల్లల ఆహారం, వైద్య సరఫరాలు వంటి వాటితో మానవతా సాయాలున్న 665 లారీ లోడులను అనుమతించినట్లు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు.

తీవ్ర ఆహార సరఫరాల కొరతతో, ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆకలి సంక్షోభాన్ని తిప్పికొట్టేందుకు ఈ భూభాగంలో అవసరమైన సాయాలకు, ఇవి కేవలం ఒక నీటి బొట్టు అని అని యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ హెడ్ హెచ్చరించింది.

రాబోయే నెలల్లో 5 లక్షల మంది ప్రజలు ఆకలి చావులను ఎదుర్కొంటారని యూఎన్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ పేస్ క్లాసిఫికేషన్ (ఐపీసీ) అంచనాల్లో తెలిసింది.

2023 అక్టోబర్ 7న హమాస్‌ జరిపిన క్రాస్-బోర్డర్ దాడికి స్పందనగా ఇజ్రాయెల్ గాజాలో సైనిక దాడులను చేపట్టింది. హమాస్ ఆరోజు చేసిన దాడిలో 1200 మంది చనిపోగా, 251 మందిని బందీలుగా తీసుకెళ్లింది.

అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ జరుపుతోన్న దాడుల్లో 54,056 మంది చనిపోయారని, గత 10 వారాల్లోనే 3,901 మంది మరణించినట్లు హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)