నటుడు, నాయకుడు, తాత్వికుడు.. కోట

ఫొటో సోర్స్, Ram Gopal Varma/twitter
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
కోట శ్రీనివాసరావు వెళ్లిపోయారు. తెలుగు సినిమా బతికినంత కాలం జీవించే వుంటారు.
పిసినారి నుంచి పొలిటీషియన్ వరకూ, కానిస్టేబుల్ నుంచి కన్నింగ్ విలన్ వరకు ఆయన వేయని పాత్రలేదు.
750 సినిమాల్లో నటించారు.
ఒకే రోజు 3 రాష్ట్రాల్లో షూటింగ్‌లకి హాజరైన రికార్డ్ వుంది.
రోజుకి నాలుగు కాల్‌షీట్స్, అనేక భాషల్లో నటించిన ప్రత్యేకత ఆయన సొంతం.
కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు.
పుట్టిన రోజు జరుపుకున్న 3 రోజులకే 80 ఏళ్లకు పైగా వయసులో కన్నుమూశారు.
ఆయన తండ్రి డాక్టర్.
కోట కూడా ఒక దశలో డాక్టర్ కావాలనుకుని యాక్టరయ్యారు.
అయితే తొలి అడుగు రంగస్థలంపైన. స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూ రవీంద్రభారతిలో నాటకాలు వేసేవారు.


ఫొటో సోర్స్, facebook.com/ActorKSR
ప్రాణం ఖరీదు నాటకం చూసిన నిర్మాత క్రాంతికుమార్ తొలి అవకాశం ఇచ్చారు.
ఆ నాటకాన్నే సినిమాగా తీశారు.
1978లో ప్రాణం ఖరీదు విడుదలయ్యింది.
ఒకవైపు ఉద్యోగం, మరోవైపు సినిమా.
83 వరకూ సినిమాని సీరియస్‌గా తీసుకోలేదు.
1985లో వచ్చిన ప్రతిఘటన సినిమాలో తెలంగాణ యాస మాట్లాడిన కాశయ్య పాత్రతో కథ మారింది.
ఎవరీ నటుడని కోట వైపు చూసారు.
అయితే పెద్దగా గుర్తింపు రాలేదు.
ఒకవైపు ఉద్యోగంలో ఒత్తిడి.
సెలవులు ఇక కుదరవు.
సినిమాల్ని నమ్మి ధైర్యం చేయలేని స్థితి.
మండలాదీశుడు సినిమాలో అవకాశం. మంచి పాత్ర.
కానీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ని ఎద్దేవా చేసే పాత్ర.
పేరు వస్తుంది. చెడ్డపేరు కూడా.
వేయడానికి సంకోచం, సందేహం.
వెనక్కి వెళ్లిపోవచ్చు.
బ్యాంక్‌లో నోట్లు లెక్కపెడుతూ , మేనేజర్‌గా రిటైరైపోవచ్చు.
కానీ డెస్టినీ మరోలా ఉంది.
కోటలాంటి గొప్ప నటుడి కోసం తెలుగు సినిమా ఎదురు చూస్తూ ఉంది.

ఫొటో సోర్స్, x.com/tamilstar
మండలాదీశుడి తర్వాత తిట్లు శాపనార్థాలు.
ఎన్టీఆర్‌కి కోపం వస్తుందని ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు.
ఉద్యోగం పోయినట్టే. ఇక వెళ్లలేడు.
అదృష్టం జంధ్యాల రూపంలో ‘అహనాపెళ్లంట’ అంటూ వచ్చింది.
రావుగోపాలరావు వేయాల్సిన వేషం.
అయితే పిసినారి, నికృష్టుడుగా కనిపించాలంటే కోటనే సరిపోతాడని జంధ్యాల నమ్మారు.
రేడియో నాటకాల ద్వారా వాచకాన్ని , పదాల విరుపుని నేర్చుకున్నారు కోట.
ఒక సినిమాలో ప్లీజ్ అనే పదాన్ని అనేక రకాలుగా పలికి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. సినిమా పేర్లకంటే ఆయన వేసిన క్యారెక్టర్లే ఎక్కువ గుర్తుంటాయి.

ఫొటో సోర్స్, facebook.com/ActorKSR
మామగారులో బాబూమోహన్ జంటగా చేసిన కామెడీ ఆల్‌టైమ్ హిట్.
తరువాత అది కొనసాగింది.
ఈ ఇద్దరు హాస్యనటుల జీవితంలో ఒకే రకమైన విషాదం విచిత్రం.
చేతుల మీద పెంచిన కొడుకుల్ని భుజాల మీద మోసారు.
రోడ్డు ప్రమాదాల్లో బిడ్డలు పోయారు.
పితృశోకాన్ని భరించగలం. పుత్ర శోకాన్ని తట్టుకోలేం అని కన్నీళ్లు పెట్టుకునేవారు కోట. కన్నీళ్లు, కష్టాలు ఆయన నటనకి అడ్డు రాలేదు.
నటించారు, నవ్వించారు, భయపెట్టారు.
మానవ ప్రవర్తనని విపరీతంగా పరిశీలించడం ఆయన అలవాటు.
అందుకే అంత వైవిధ్యం, తెరమీద అద్భుతంగా నటించే కోటకి, రాజకీయ నటన చేతకాలేదు.
పాలిట్రిక్స్ చేయలేనని పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు.

ఫొటో సోర్స్, ugc
తెలుగు వాళ్లలో ప్రత్యేకమైన పంచ్‌లైన్‌లని కోట సృష్టించారు.
పాయే, తంబీ, వారీ , గదైతే ఖండిస్తం, నాకేంటి..మరి నాకేంటి , మరదేనమ్మా నా స్పెషల్
ఆయన గొప్ప తాత్వికుడు కూడా. జీవితాన్ని తట్టుకున్నారు.
సుఖాల్ని భరించారు. కష్టాల్ని స్వీకరించారు.
ఆయన బతికుండగానే చనిపోయినట్లు వార్తలు ప్రసారం చేశాయి కొన్ని చానెళ్లు.
నేను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చింది.
ఆయన సూక్తుల్లో కొన్ని.
1. గుమ్మడికాయంత టాలెంట్ వున్నా, ఆవగింజంత అదృష్టం వుండాలి.
2. హాస్యానికి, కామెడీకి వున్న తేడా , తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్నంత
3. ఆర్టిస్ట్‌కి టైమ్ వచ్చినపుడు, ఇక భోం చేయడానికి కూడా టైమ్ వుండదు
4. జీవితం అనే పదంలోనే అర్థముంది. చివరికి మిగిలేది సున్నానే.
5. కరెంట్ వుందని తెలుసు. కానీ కనబడదు. దేవుడు కూడా అంతే.
చనిపోయే వరకూ నటించాలి. పోయినాకా సినిమాల్లో బతికుండాలి అని ఆయన కోరుకున్నారు.
అనారోగ్యం వల్ల చివర్లో అవకాశాలు లేవు.
అది నెరవేరలేదు కానీ బతికే వుంటారు.
తెలుగు సినిమా వున్నంత కాలం..కోట చిరంజీవే!
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














