ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్: ఏఏఐబీ ప్రాథమిక నివేదికను నిపుణులు సందేహిస్తున్నారా? ఎందుకు

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాత్విక్ విమానాశ్రయానికి బయల్దేరిన ఎయిరిండియా విమానం కూలిపోయింది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాత్విక్ విమానాశ్రయానికి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది
    • రచయిత, ఇషాద్రితా లాహిడీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అహ్మదాబాద్‌లో గత నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక వచ్చింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఈ నివేదికను రూపొందించింది. ప్రమాదానికి సంబంధించిన అనేక కీలక విషయాలను ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది.

విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయిందని ఈ నివేదిక సూచిస్తోంది. విమానంలోని ఇంధన స్విచ్‌లు 'రన్' మోడ్ నుంచి 'కటాఫ్' స్థితిలోకి వెళ్లిపోయాయని, తర్వాత కొన్ని సెకన్లలోనే విమానం కూలిపోయిందని రిపోర్టులో పేర్కొన్నారు.

ఈ రిపోర్టులోని అనేక కీలక అంశాలపై బీబీసీ, విమాన సంబంధిత సమస్యలపై అవగాహన ఉన్న కొందరు నిపుణులతో మాట్లాడింది.

ఈ నివేదికను పూర్తిగా విశ్లేషించి వారు కొన్ని అంశాలను ప్రస్తావించారు. రిపోర్టును విడుదల చేసేటప్పుడు మరింత పారదర్శకతను పాటించి ఉండాల్సిందన్న భావన వారు వ్యక్తం చేశారు.

ప్రమాదానికి సంబంధించి తలెత్తుతున్న చాలా ప్రశ్నలకు ఈ నివేదిక సమాధానాలు ఇచ్చి ఉండాల్సిందని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విమానంలోని 241 మంది చనిపోగా, ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, విమానంలో ఉన్నవారిలో 241 మంది చనిపోగా, ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు

ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ అంటే ఏంటి?

ప్రాథమిక నివేదిక బయటకొచ్చాక 'ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్', 'ఫ్యూయల్ కటాఫ్ స్విచ్' అనే పదాలు పదే పదే వినిపిస్తున్నాయి.

విమానం ఇంజిన్‌లకు ఇంధన సరఫరాను ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు నియంత్రిస్తాయని బీబీసీతో విమానయాన నిపుణుడు సంజయ్ లజార్ వివరించారు.

''ప్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల పని విమానం ఇంజిన్లకు ఇంధనాన్ని పంపించడం, నిలిపేయడం. కటాఫ్ అంటే విమాన ఇంజిన్‌కు ఫ్యూయల్ సరఫరా నిలిచిపోవడం. దీనివల్ల ఇంజిన్లు ఆగిపోతాయి'' అని సంజయ్ వివరించారు.

''ఫ్యూయల్ కటాఫ్ స్విచ్ అనేది ఇంజిన్‌లోని ఒక స్విచ్. ఇది ఇంజిన్‌లోకి ఇంధనాన్ని పంపిస్తుంది. ఒకవేళ ఇంజిన్‌లో మంటలు చెలరేగితే ఈ స్విచ్ ఇంధన సరఫరాను నిలిపేస్తుంది. తద్వారా మంటలు వ్యాప్తి చెందవు. ఇలా మంటలు చెలరేగితే, కంప్యూటర్ ఈ స్విచ్‌ను నియంత్రిస్తుంటుంది'' అని మరో ఏవియేషన్ నిపుణుడు, కెప్టెన్ శక్తి లుంబా వివరించారు.

''విమానం నేల మీద ఉన్నప్పుడు ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి పైలట్ ఈ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ను వాడతారు. ఇదొక స్టార్టింగ్ స్విచ్'' అని ఆయన చెప్పారు.

ఎయిరిండియా విమాన ప్రమాదం

స్విచ్ కటాఫ్‌కు ఎలా మారింది?

విమానంలోని ఫ్యూయల్ స్విచ్ స్థానం కటాఫ్‌ స్థితిలో ఉందని వెల్లడించిన ఈ నివేదిక, దాని స్థానం ఎలా మారిందనే అంశంపై స్పష్టతను ఇవ్వలేదని విమానయాన నిపుణుడు, కెప్టెన్ మోహన్ రంగనాథన్ చెప్పారు.

''కో పైలట్ (పైలట్ ఫ్లయింగ్), విమానాన్ని నడుపుతున్నారు. కెప్టెన్ దాన్ని పర్యవేక్షిస్తున్నారని రిపోర్టు మొదట్లోనే పేర్కొన్నారు. అంటే టేకాఫ్ సమయంలో 'పైలట్ ఫ్లయింగ్' రెండు చేతులు 'కంట్రోల్ కాలమ్' మీదే ఉంటాయి'' అని రంగనాథన్ తెలిపారు.

ఒకవేళ స్విచ్ కటాఫ్ అయితే,

ఒకవేళ స్విచ్ అకస్మాత్తుగా కటాఫ్ అయితే ఏం చేయవచ్చు. ఈ విషయం గురించి కెప్టెన్ శక్తి లుంబా వివరించారు.

''ఆపత్కాలంలో కొన్ని పనులు చెక్ లిస్ట్ చూడకుండా చేయాల్సి ఉంటుంది. అలాంటి పనులను పైలట్లు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒకవేళ రెండు ఇంజిన్లు విఫలమైన పరిస్థితి ఏర్పడితే, అప్పుడు ఫ్యూయల్ స్విచ్‌లను ఆఫ్ చేసి వెంటనే ఆన్ (రీసైకిల్) చేయాల్సి ఉంటుంది'' అని ఆయన చెప్పారు.

ఎయిరిండియా విమాన ప్రమాదం

కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ ద్వారా ఏం తెలిసింది?

నివేదిక ప్రకారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో ఒక పైలట్ మరొకరిని ''ఎందుకు స్విచ్ కటాఫ్ చేశారు'' అని అడిగినట్లు, అందుకు మరో పైలట్ 'నేను చేయలేదని' సమాధానం ఇస్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత, మేడే సంకేతాన్ని పంపించారు.

వారి వద్ద ఉన్న కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) ద్వారా ఏ పైలట్ ఏ మాటలు అన్నారో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటందని కెప్టెన్ మోహన్ రంగనాథ్ అభిప్రాయపడ్డారు.

ఇలాంటి ఒక భయంకరమైన ప్రమాదం గురించి నివేదిక ఇస్తున్నప్పుడు, ఇలాంటి విషయాలను స్పష్టంగా వెల్లడించాలని ఆయన అన్నారు.

సీవీఆర్‌కు చెందిన పూర్తి ట్రాన్స్‌స్క్రిప్టును ఏఏఐబీ విడుదల చేయకపోవడం దురదృష్టకరమని సంజయ్ లజార్ వ్యాఖ్యానించారు.

ఎయిరిండియా విమాన ప్రమాదం

ప్రమాద సమయంలో ఏం జరిగి ఉంటుంది?

విమానం కూలిపోయినప్పుడు స్విచ్‌లు 'రన్' పొజిషన్‌లో ఉన్నాయని కెప్టెన్ శక్తి లుంబా అన్నారు.

''అంటే ఇంజిన్లు స్టార్ట్ అవుతున్నాయి. అవి స్టార్ట్ అయ్యే ప్రక్రియ మొదలైంది. కానీ అవి పూర్తిగా స్టార్ట్ కాలేకపోయాయి. దీనివల్ల విమానంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ తర్వాత రామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్‌ఏటీ) కిందకు వచ్చింది'' అని లుంబా తెలిపారు.

విమానంలోని అన్ని విద్యుత్ వనరులు విఫలమైనప్పుడు, అటువంటి ఆపత్కాలంలోనే ఆర్‌ఏటీ బయటకు వస్తుందని సంజయ్ అన్నారు.

ఎయిరిండియా విమానం

ఫొటో సోర్స్, Getty Images

చాలా ప్రశ్నలకు సమాధానమేదీ?

ఈ ప్రాథమిక నివేదికతో తక్కువ సమాధానాలు, ఎక్కువ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయని ఏవియేషన్ నిపుణులు సంజయ్ లజార్ అభిప్రాయపడ్డారు.

ఏదైనా రిపోర్టును అస్పష్టంగా, గందరగోళ భాషతో, గణాంకాలతో మొదలుపెడితే దాని విశ్వసనీయతపై సందేహాలు వస్తాయని కెప్టెన్ మోహన్ రంగనాథన్ అన్నారు.

సమగ్రంగా, పూర్తిగా దర్యాప్తు జరగనంతవరకు బోయింగ్, జీఈ (జనరల్ ఎలక్ట్రిక్)లకు సంబంధించి తమకు ఎలాంటి సిఫార్సులు లేవని ఏఏఐబీ తన రిపోర్టులో ఒకే వాక్యంలో స్పష్టంగా ఎలా చెప్పగలదు? అంటూ సంజయ్ లజార్ ప్రశ్నించారు.

తర్వాత ఏం చేయాలి?

ప్రమాదంపై మరింత లోతైన దర్యాప్తు జరగాలని సంజయ్ లజార్ అన్నారు. సీవీఆర్ డేటాను పూర్తిగా, దాని ట్రాన్స్‌స్క్రిప్టును పారదర్శకంగా బయటపెట్టాలని అభిప్రాయపడ్డారు.

''టేకాఫ్ తర్వాత ఆ రెండు ఇంజిన్లకు ఇంధన కొరత ఏర్పడి విఫలమయ్యేలా ఏదో (లేక ఎవరో) జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది'' అని ఆయన అన్నారు.

ఈ ప్రాథమిక నివేదిక స్పష్టంగా లేదని బీబీసీతో మాట్లాడిన చాలామంది నిపుణులు చెప్పారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలిపే కారణాలు నివేదికలో పొందుపరచాలని వారు అభిప్రాయపడ్డారు.

ఎయిరిండియా ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఏఏఐబీపై ప్రశంసలు

ఈ నివేదికను రూపొందించడం చాలా సవాలుతో కూడిన అంశమని, ఈ విషయంలో ఏఏఐబీ గొప్పగా పనిచేసిందని మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు ప్రశంసించారు.

ఏఏఐబీ, అంతర్జాతీయ ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ చాలా పారదర్శకంగా ఈ దర్యాప్తును నిర్వహించిందని ఆయన వివరించారు.

మరోవైపు, యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ గోయెల్ కూడా ఏఏఐబీ నివేదికను ప్రశంసించారు.

ఇంత వివరణాత్మక ప్రాథమిక నివేదికను తయారు చేసిన ఏఏఐబీని ప్రశంసించాలని ఆయన అన్నారు.

అనేక విమాన ప్రమాదాల దర్యాప్తునకు పీటర్ గోయెల్ నేతృత్వం వహించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)