పీరియడ్స్‌లో ఉన్నారేమో అని చెక్ చేసేందుకు అమ్మాయిల దుస్తులు విప్పించిన స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే, అల్పేష్ కర్కరే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మహారాష్ట్రలోని థానేలో ఒక స్కూల్ టాయిలెట్ గోడపై రక్తపు మరకలు కనిపించడంతో, విద్యార్థినులు ఎవరికైనా పీరియడ్స్ వచ్చాయేమోనని చూసేందుకు అమ్మాయిల దుస్తులు విప్పించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న స్కూల్ ప్రిన్సిపల్‌ను, ఒక మహిళా ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ పరిస్థితిని ఎదుర్కొన్న పది నుంచి పదిహేను మంది అమ్మాయిలలో ఒకరి తల్లి పోలీసులకు ఫిర్యాదు దాఖలు చేయడంతో, స్కూల్ ప్రిన్సిపల్‌ను, మహిళా ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నర్సరీ నుంచి పదో తరగతి వరకు సుమారు 600 మంది విద్యార్థినులు ఈ పాఠశాలలో చదువుతున్నారు.
థానే జిల్లాలోని షాహపుర్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
బుధవారం విద్యార్థినుల తల్లిదండ్రులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.
దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోక్సో కింద 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రిన్సిపల్‌ను, ఒక మహిళా ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివిధ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారిని కాంటాక్ట్ చేయలేకపోయింది.
ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు సీనియర్ పోలీసు అధికారి మిలింద్ శిందే గురువారం బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేంటి విషయం?
థానే జిల్లాలోని షాహపుర్ తాలుకాలోని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో జులై 8న ఈ ఘటన జరిగింది.
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం... ‘జులై 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య 125 మంది విద్యార్థినులను స్కూల్ ప్రిన్సిపల్ హాల్‌లోకి పిలిపించారు.
ఆ తర్వాత స్కూల్ బాత్రూమ్ ఫ్లోర్‌పై, గోడలపై ఉన్న రక్తపు మరకపు చిత్రాలను ప్రొజెక్టర్‌పై చూపించారు. అందులో రక్తంతో ఉన్న చేతి ముద్ర ఉన్న ఫొటో ఒకటి ఉంది.
గోడలపైకి రక్తపు మరకలు ఎలా వచ్చాయని విద్యార్థినులను ప్రశ్నించారు?
విద్యార్థినులు ఎవరికైనా పీరియడ్స్ వచ్చాయా అని అడిగారు. పీరియడ్స్‌లో ఉన్న అమ్మాయిలను చేతులు పైకెత్తమన్నారు. వారి అరచేతి ముద్రలను ఓ టీచర్ కలెక్ట్ చేశారు’
రుతుస్రావంలో లేమని చెప్పిన 10 నుంచి 15 మంది అమ్మాయిలను బాత్రూమ్‌కు తీసుకెళ్లి, వారి దుస్తులు విప్పించి పరిశీలించాలని మహిళా ఉద్యోగులకు చెప్పినట్లు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనతో విద్యార్థినులంతా షాక్‌కు గురయ్యారు. వీరంతా 5 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థినులు.
కొంతమంది అమ్మాయిలు ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు.
కొందరు దీనిపై మాట్లాడలేకపోయారు. ఈ ఘటన తర్వాత కొందరు విద్యార్థినులు స్కూల్‌కు వెళ్లేందుకు కూడా భయపడ్డారని తల్లిదండ్రులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కోపంలో తల్లిదండ్రులు
పీరియడ్స్‌లో లేని తన కూతుర్ని శానిటరీ పాడ్ ఎందుకు పెట్టుకు రాలేదని తిట్టారని ఓ పేరెంట్ ఆరోపించారు.
అంతేకాక, తన కూతురి అరచేతి ముద్రలు కూడా తీసుకున్నారని చెప్పారు.
ఇలా జరగడంతో తన కూతురు చాలా అసౌకర్యానికి, ఇబ్బందికి గురైనట్లు ఆ మహిళ తెలిపారు.
ఈ ఘటనతో తమ పిల్లలు తీవ్ర షాక్‌కు గురయ్యారని బీబీసీకి కొందరు తల్లిదండ్రులు చెప్పారు.
'' ఈ ఘటన మా పిల్లల భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. మా పిల్లలు బాగా భయపడిపోయారు. స్కూల్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.'' అని ఒక పేరెంట్ కోరారు.
దీనిపై తాను ప్రశ్నించినప్పుడు ప్రిన్సిపల్ ప్రతిదాన్ని ఖండించారని ఒక విద్యార్థిని తల్లి బీబీసీతో చెప్పారు.
ఎంతమంది అమ్మాయిలు అబద్ధం చెబుతారు? అని అన్నప్పుడు, స్కూల్ నుంచి ఎలాంటి సమాధానం లేదని తెలిపారు.
30 నుంచి 40 మంది విద్యార్థినుల తల్లిదండ్రులు స్కూల్‌కు రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images
తల్లిదండ్రుల ఆందోళనతో ప్రిన్సిపల్ పోలీసులకు కాల్ చేశారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో, పోలీసులు, అధికారులు తక్షణమే స్కూల్ వద్దకు వచ్చారు.
పోలీసులు తల్లిదండ్రులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
స్కూల్‌ను మూసివేశారు. స్కూల్ టెలిఫోన్ నెంబర్‌కు బీబీసీ ఫోన్ చేస్తే, ప్రిన్సిపల్, ఇతరులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అంతే తప్ప, మరే సమాచారం ఇవ్వలేదు.
ప్రస్తుతం స్కూల్‌ను మూసివేశారని ఫోన్‌లో తెలిపారు.
కోపంతో ఉన్న తల్లిదండ్రులతో స్కూల్ ప్రిన్సిపల్ వాదించడం ఒక వీడియోలో కనిపించింది.
విద్యార్థినుల దుస్తులు విప్పించాలని తానెలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అలాంటిది జరగలేదని ప్రిన్సిపల్ ఆ వీడియోలో అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














