పీరియడ్స్‌లో ఉందని క్లాస్ రూం మెట్లపై కూర్చోబెట్టి పరీక్ష రాయించిన స్కూల్ మేనేజ్‌మెంట్, వివాదం ఏంటి?

ఫొటో సోర్స్, Special Arrangement / Getty Images
- రచయిత, జేవియర్ సెల్వకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను పీరియడ్స్ కారణంగా క్లాస్ రూమ్ బయట కూర్చోపెట్టి పరీక్ష రాయించడం వివాదానికి దారితీసింది . ఈ ఘటన కోయంబత్తూరు జిల్లాలోని కినతుకడవులో జరిగింది.
దీనిపై ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదైంది. పొల్లాచ్చి అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ సృష్టీ సింగ్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.
పరీక్ష రాయడానికి తరగతి గది బయట కూర్చున్న విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, పాఠశాల యాజమాన్యం విచారణకు ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు.
కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని సృష్టీ సింగ్ అన్నారు.

వీడియో తీసింది విద్యార్థిని తల్లే
బాలికది కోయంబత్తూరు జిల్లాలోని కినతుకడవు దగ్గరలోని సెంగుట్టై పాళ్యం ప్రాంతం. తల్లిదండ్రులు రోజు కూలీలు.
ప్రైవేట్ స్కూలులో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు ఏప్రిల్ 5న మొదటిసారి పీరియడ్ వచ్చింది. ఆ తర్వాత పరీక్ష రాయడానికి వచ్చిన ఆ విద్యార్థినిని క్లాస్ రూమ్ బయటే ఆపేసి, అక్కడే పరీక్ష రాయాల్సిందిగా ఒత్తిడి చేశారన్నది కుటుంబీకుల ఆరోపణ.
"నా కూతురు పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. రాత్రిపూట కాళ్లు నొప్పిపెడుతున్నాయని చెప్పింది. పీరియడ్స్ సమయంలో వచ్చే సాధారణమైన నొప్పి అనుకొని నా భార్య కూతురి కాళ్లకు నూనె రాసింది. ఆమెకు రుతుక్రమం ప్రారంభమై 3 రోజులే అయింది." అని విద్యార్థిని తండ్రి చెప్పారు.
" కాళ్ల నొప్పి గురించి అడిగినప్పుడు, నా కూతురు ఏడవడం మొదలుపెట్టింది. మూడు గంటల పాటు కదలకుండా తరగతి గది మెట్లపై కూర్చున్నానని, అందుకే తన కాళ్లు నొప్పిగా ఉన్నాయని చెప్పింది." అని తండ్రి తెలిపారు.
తల్లిదండ్రుల అభ్యర్థన మేరకే విద్యార్థినిని ఒంటరిగా కూర్చోబెట్టి ప్రిన్సిపల్ పరీక్ష రాయించారని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ ఘటనలో స్కూల్ ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేశారు.
అయితే ఆ విద్యార్థిని ప్రత్యేక తరగతి గదిలో కాకుండా బయట ఎందుకు కూర్చోబెట్టారో వివరణ కోరినట్టు పొల్లాచ్చి అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ సృష్టీ సింగ్ బీబీసీతో చెప్పారు.
పరీక్ష సమయంలో పాఠశాలకు వచ్చిన విద్యార్థిని తల్లి, తన కూతురు బయట కూర్చుని పరీక్ష రాస్తుండటాన్ని వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
బాలిక పాఠశాలలోని తరగతి గది వెలుపల మెట్లపై ఒంటరిగా కూర్చుని పరీక్ష రాస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.
పాఠశాల ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్ అసిస్టెంట్ అక్కడకు వచ్చి, అనుమతి లేకుండా స్కూలుకు ఎందుకు వచ్చారని, వీడియోను ఎందుకు తీశారని తనను ప్రశ్నించినట్లు విద్యార్ధిని తల్లి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండు రోజుల పాటు మెట్లపైనే కూర్చుని...
''నా కూతురికి ఏప్రిల్ 5న రుతుక్రమం మొదలయింది. 7వ తేదీన ఆమె పరీక్ష రాయడానికి వెళ్ళింది. ఆ రోజు ఆమెను తరగతి గది బయట మెట్లపై ఒంటరిగా కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. ఆ రాత్రే మాకు ఆ విషయం తెలిసింది." అని బాలిక తండ్రి బీబీసీతో చెప్పారు.
''ఆ తర్వాత రోజు పరీక్షను కూడా విద్యార్థినితో అదే విధంగా రాయిస్తుండడంతో, బాలిక తల్లి పాఠశాలకు చేరుకుని ఈ ఘటనను వీడియో తీశారు.'' అని తెలిపారు.
తాను కూడా అదే పాఠశాలలో చదువుకున్నానని, అక్కడ పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థుల పట్ల సామాజికంగా వివక్ష చూపుతున్నారని తండ్రి ఆరోపించారు.
ఈ సంఘటన తర్వాత, తమిళనాడు ఇంధన శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ కోయంబత్తూరుకు వచ్చారు. కోయంబత్తూరులోని ప్రైవేట్ పాఠశాలల్లో ఇలాంటివి తరచుగా జరుగుతున్నాయా అని సెంథిల్ బాలాజీని విలేఖరులు అడిగారు.
పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారని ఆయన బదులిచ్చారు.
మహావీర్ జయంతి ప్రభుత్వ సెలవు దినం కావడంతో గురువారం(ఏప్రిల్ 10) పాఠశాల మూసివేశారు. ఆ తర్వాత శుక్రవారం (ఏప్రిల్ 11) ఉదయం, పొల్లాచ్చి అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ సృష్టీ సింగ్ నేతృత్వంలోని పోలీసులు పాఠశాలకు వెళ్లి దర్యాప్తు జరిపారు.
పాఠశాల నిర్వాహకురాలు కల్పనా దేవిని సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. అయితే, ఈ ఘటనపై ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది కుల వివక్షా ? అవగాహనా రాహిత్యమా ?
జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ కోయంబత్తూరు జిల్లా అధ్యక్షుడు తంబు ఆధ్వర్యంలో కొందరు ఈ ఘటనపై పొల్లాచ్చి సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
''ఆమె అరుంధతీ కులానికి చెందిన విద్యార్థిని కాబట్టి, ఆమెపై వివక్షతో బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించారు." అని తంబు ఆరోపించారు.
ఈ ఘటనకు కారకులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థిని తల్లిదండ్రులు కోరినందుకే తరగతి గది వెలుపల పరీక్ష రాయడానికి అనుమతించినట్టు పాఠశాల యాజమాన్యం చెప్పిందని పోలీసులు తెలిపారు.
మరే ఇతర విద్యార్థినినీ ఇలా పరీక్ష రాయమని తామెప్పుడూ చెప్పలేదని టీచర్లు తమతో చెప్పారని పోలీసులు తెలిపారు.
"విద్యార్థిని తల్లి మొదట క్లాస్ టీచర్‌కు ఫోన్ చేశారు. తన కుమార్తెకు మొదటిసారి రుతుక్రమం ప్రారంభమైందని, కాబట్టి ఆమె విడిగా పరీక్ష రాయవచ్చా అని అడిగారు.'' అని సృష్టీ సింగ్ బీబీసీతో చెప్పారు.
‘‘దీని గురించి ప్రిన్సిపాల్‌ను అడగాలని విద్యార్థిని తల్లితో క్లాస్ టీచర్ చెప్పారు. విద్యార్థిని తల్లి తన దగ్గరకు వచ్చి అడగడం వల్లే ఆమె కోరిక మేరకు బాలికతో పరీక్ష రాయించామని ప్రిన్సిపాల్ చెప్పారు.’’ అని స్కూల్ యాజమాన్యం తనకు చెప్పినట్లు సృష్టీ సింగ్ వెల్లడించారు.
కాలు నొప్పిగా ఉందని బాలిక ఆ రాత్రి చెప్పినప్పుడే బాలికను బయట కూర్చొని పరీక్ష రాయమన్నారన్న విషయం తనకు తెలిసిందని తల్లి వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యేక ఏర్పాటు తల్లిదండ్రులే అడిగారంటున్న స్కూల్
పాఠశాల అధికారుల వ్యాఖ్యలను విద్యార్థిని తండ్రి తోసిపుచ్చారు. తన కుమార్తె రుతుక్రమం గురించి చెప్పి పరీక్ష రాయాల్సి వస్తుందా అని తాను అడిగానని, రాయాలని ప్రిన్సిపాల్ చెప్పారని ఆయన తెలిపారు. ఆమెను విడిగా కూర్చోబెట్టి పరీక్ష రాయడానికి అనుమతివ్వాల్సిందిగా పాఠశాల ప్రిన్సిపాల్‌ను కోరానని బీబీసీతో చెప్పారు.
"మేము పరీక్షకు ప్రత్యేక ఏర్పాటు అడిగిన మాట నిజమే. ప్రత్యేక తరగతి గది లేదా హాలులో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసి, పరీక్ష రాయడానికి అనుమతిస్తారా అని మేం అడిగాం" అని ఆయన అన్నారు.
ఈ ఘటనపై పాఠశాల నిర్వాహకుల నుంచి వివరణ కోరినట్టు సృష్టీ సింగ్ తెలిపారు.
ఈ స్కూలులో ఇంతకు ముందు ఇలాంటి సంఘటన ఏదైనా జరిగిందా అని కూడా దర్యాప్తు చేస్తామని ఆమె చెప్పారు.
"ప్రిన్సిపాల్ ఆఫీసులో చాలా టేబుళ్లు, కుర్చీలు ఉన్నాయి. అక్కడే పరీక్ష రాయడానికి అనుమతించవచ్చు. కానీ ఆయన బయట కూర్చుని రాయమని బాలికకు ఎందుకు చెప్పారన్నది తెలియాల్సి ఉంది'' అని సృష్టి సింగ్ అన్నారు.
బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా, ప్రిన్సిపాల్ తంగవేల్ పాండియన్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఆనందీ, ఆఫీస్ అసిస్టెంట్ శాంతిలపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సెక్షన్లు 3(1)(ఆర్) 3(1)(జెడ్‌ఏ)(డి) కింద నెగామమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు
ఈ ఘటనలో విద్యార్థిని వయస్సును పేర్కొంటూ పరీక్ష ప్రత్యేకంగా రాయడానికి పాఠశాల యాజమాన్యాన్ని అనుమతి కోరినందుకు ఆమె తల్లిదండ్రులను చాలా మంది సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.
''బాలికను విడిగా పరీక్ష రాయనివ్వాలన్న తల్లిదండ్రుల అభ్యర్థన సమర్థనీయమని చెప్పలేం. కానీ ఇతర విద్యార్థులతో కలిపి పరీక్ష రాయమని చెప్పడం ద్వారా అవగాహన పెంచడం ఉపాధ్యాయుల విధి." అని డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధిక బీబీసీతో అన్నారు.
పాఠశాలలో పోలీసు అధికారుల దర్యాప్తు ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు తమిళనాడు పాఠశాల విద్యా శాఖ ఒక ప్రకటన చేసింది.
‘‘ పీరియడ్స్‌లో ఉన్న బాలికలను విడిగా కూర్చుని పరీక్షలు రాయడానికి అనుమతించకూడదని పేర్కొంటూ అన్ని పాఠశాలలకు సందేశం అందుతుంది.'' అని ఆ ప్రకటనలో తెలిపింది.
"ప్రైవేట్ స్కూల్‌పై శాఖాపరమైన విచారణ జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. పిల్లలపై ఏ రూపంలోనైనా హింసను సహించేది లేదు. ప్రియమైన విద్యార్థి, ఒంటరిగా కూర్చోవద్దు! మేమంతా ఉన్నాం.'' అని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

విద్యా శాఖ దర్యాప్తు
"మేం పాఠశాలలో దర్యాప్తు జరిపాం. విద్యార్థి తల్లిదండ్రులతో నేనింకా మాట్లాడలేదు. మొదటి చర్యగా పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. ఈ విషయంలో తదుపరి చర్యలు విద్యాశాఖ సీనియర్ అధికారులు తీసుకుంటారు'' అని కోయంబత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి(తాత్కాలిక) గోమతి చెప్పారు.
తదుపరి చర్య తర్వాత దర్యాప్తు నివేదికను ప్రధాన విద్యాధికారికి అందిస్తామని తెలిపారు.
"రుతుస్రావం సమయంలో బాలికల ఆరోగ్యానికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేశాం. బాలికలు ఉపయోగించే నాప్‌కిన్లను పారవేయడానికి నాప్కిన్ యంత్రం, స్థలం ఉండాలని సూచించాం. ఇక నుంచి వీటిని మరింత జాగ్రత్తగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాం." అని గోమతి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














