‘ఇలా జరక్కుండా ముందే ఆపలేమా?’ సమాధానం కోసం ఎదురుచూస్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల కుటుంబాలు

ఎయిరిండియా విమాన ప్రమాదం, బాధిత కుటుంబాలు
ఫొటో క్యాప్షన్, కుమారుడు, కుమార్తెతో ఇనాయత్, నఫీసా
    • రచయిత, సమీరా హుస్సేన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత నెలలో అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై నివేదిక కోసం ఇంతియాజ్ అలీ కొన్ని రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూశారు.

ఈ ప్రమాదంలో ఆయన సోదరుడు, మరదలు, వాళ్ల ఇద్దరు పిల్లలు చనిపోయారు.

శనివారం ఉదయం ఆ నివేదిక బహిర్గతం కాగానే ఆయన దాన్ని జాగ్రత్తగా చదివారు.

అది చదివిన తర్వాత చాలా నిరుత్సాహానికి గురయ్యారు.

"అదొక వస్తువు వర్ణన గురించి చదివినట్లు ఉంది" అని ఆయన అన్నారు.

"పైలట్ల చివరి సంభాషణ తప్ప, విమానం కూలిపోవడానికి నిజమైన కారణాలు ఏవీ అందులో లేవు"

రానున్న రోజుల్లోనైనా మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని ఆయన ఆశిస్తున్నారు.

"ఇది మాకు అవసరం. ఎందుకంటే నిజంగా ఏం జరిగిందో మేం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అలా తెలుసు కోవడం వల్ల మా జీవితంలో ఏదీ మారదు. మేం ఆ రోజు ఎలా బాధ పడ్డామో అలాగే బాధ పడుతూ ఉండాలి. అయితే మాకు సమాధానాలు లభిస్తాయి" అని ఇంతియాజ్ అలీ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎయిరిండియా విమాన ప్రమాదం, బాధిత కుటుంబాలు
ఫొటో క్యాప్షన్, జావిద్, మరియం అలీ, వారి పిల్లలు జయన్, అమని విమాన ప్రమాదంలో చనిపోయారు

జూన్ 12న ఎయిర్ ఇండియాకు చెందిన 171 విమానం అహ్మదాబాద్‌లో టేకాఫ్ తీసుకున్న కాసేపటికే సమీపంలోని నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు మరో 19 మంది చనిపోయారు.

విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకండ్ల తర్వాత ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగినట్లు శనివారం విడుదల చేసిన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో వెల్లడైంది.

అయితే అలాఎందుకు జరిగింది? అలా జరగడానికి దారి తీసిన పరిస్థితులేంటనే దానికి సంబంధించిన కారణాలు తెలియలేదు.

కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్స్‌లో ఒక పైలట్ "మీరు ఎందుకు ఆపేశారు" అని అన్నప్పుడు దానికి మరో పైలట్ "అలా చేయలేదు" అని చెప్పడం వినిపించిందని నివేదిక తెలిపింది.

ప్రమాదానికి సంబంధించి తుది నివేదిక 12నెలల్లోపు వస్తుందని భావిస్తున్నారు.

41 ఏళ్ల శ్వేత పరిహార్ కూడా ప్రమాదానికి సంబంధించి సమాధానాలు కోరుకుంటున్నారు. ఆమె భర్త 43 ఏళ్ల అభినవ్ పరిహార్ జులై చివర్లో లండన్ వెళ్లాల్సి ఉంది. కానీ, అక్కడ ఇంటికి త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో నెల రోజులు ముందుగానే విమానం ఎక్కారు. ఆ విమానం ప్రమాదానికి గురైంది.

ఏ దర్యాప్తు కూడా తన భర్తను తనకు తెచ్చివ్వలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

"మేం వాళ్లను పోగోట్టుకున్నాం, వాళ్లు తిరిగి రారు" అని ఆమె చెప్పారు.

"దర్యాప్తులో వాళ్లు ఏం చేస్తారు? ప్రమాదం ఎలా జరిగిందో మాకు చెప్పండి. 250 మంది ప్రయాణికుల జీవితాల గురించి ఏం చెబుతారు? క్షమించండి. అంతా ముగిసిపోయింది. అంతా అయిపోయింది" అని ఆమె అన్నారు.

ఈ ప్రమాదం తన 11 ఏళ్ల కుమారుడు విహాన్‌పై చూపించిన ప్రభావం గురించి మాట్లాడుతూ పరిహార్ భావోద్వేగానికి లోనయ్యారు.

"అతను తన తండ్రిని కోల్పోయాడు" అని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.

తాను ఇక ఎన్నడూ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించబోనని విహాన్ తన తల్లితో చెప్పారు.

ఎయిరిండియా విమాన ప్రమాదం, బాధిత కుటుంబాలు
ఫొటో క్యాప్షన్, కుమారుడు విహాన్‌తో అభినవ్, శ్వేత పరిహార్(ఫైల్ ఫొటో)

59 ఏళ్ల బడాసాబ్ సయద్ విమాన ప్రమాదంలో తన సోదరుడు, మరదలు, వారి ఇద్దరు పిల్లలను కోల్పోయారు.

విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలో సమాధానాలు లభిస్తాయని ఆయన ఆశతో ఉన్నారు. అయితే నివేదిక చూసిన తర్వాత తన సందేహాలు మరింత పెరిగాయని చెప్పారు.

"ఇంజన్లకు ఇంధనం ఎవరు ఆపారని పైలట్లు చర్చించుకుంటున్నట్లు నివేదికలో ఉంది. అది మనకు తెలియదు. దీనర్థం ఏంటి? ఇలా జరక్కుండా మనం చేయలేమా?" అని ఆయన ప్రశ్నించారు.

తన సోదరుడు 49 ఏళ్ల ఇనాయత్ సయద్ కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తి అని బడాసాబ్ సయద్ చెప్పారు. సోదరుడు, అతని భార్య , పిల్లలు విమాన ప్రమాదంలో చనిపోవడంతో మొత్తం కుటుంబం కకావికలమైందన్నారు. వారి తల్లి 83 ఏళ్ల బీబీ సాబ్ పడుతున్న ఆవేదన వర్ణనాతీతం.

"కుమారుడు, మనవడు, మనవరాలిని కోల్పోవడంతో ఆమె బలహీనంగా మారారు. ఆమె ఏమనుకుంటున్నారో మాతో చెప్పగలిగే పరిస్థితిలో లేరని అనుకుంటున్నాను" అని బడాసాబ్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)