ఐటీ రిటర్న్స్: ఎవరెవరు దాఖలు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది?

ఆదాయపు పన్ను రిటర్నులు, మనీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, అజిత్ గధ్వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రస్తుతం, ఆదాయపు పన్ను రిటర్న్స్(ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్) దాఖలవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు, లేదా చెల్లించేందుకు గడువు పొడిగించారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి తుదిగడువు సెప్టెంబర్ 15వ తేదీ. ఈలోపు రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చు.

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ సాధారణ పౌరులకు, అంటే పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఇకపై, ఉద్యోగులు తమ వార్షిక ఆదాయం రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర పన్ను చెల్లింపుదారులకు పరిమితి రూ. 12 లక్షలుగా ఉంది.

అయితే, కొత్త నిబంధన ఈ ఏడాది ఐటీ రిటర్న్స్ విషయంలో చాలామందిని గందరగోళానికి గురిచేసింది.

దేశంలో ఐటీ రిటర్న్స్, పాన్ కార్డ్ గురించి సాధారణ పన్ను చెల్లింపుదారులలో ఇప్పటికే అనేక అపోహలున్నాయి. ఉదాహరణకు, ఎవరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి? వార్షిక ఆదాయం ఎంత ఉంటే దాఖలు చేయాలి? చేయకపోతే ఏమవుతుంది? వంటివి.

ఐటీ రిటర్న్స్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), ట్యాక్స్ ఎక్స్‌పర్ట్ కరీం లఖానీతో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నిర్మలా సీతారామన్, ట్యాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ ఉపశమనం కల్పిస్తూ ప్రకటన చేశారు.

ఎవరికి తప్పనిసరి?

మీ మొత్తం ఆదాయం 'ప్రాథమిక మినహాయింపు పరిమితి'ని మించితే తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని కరీం లఖానీ అన్నారు.

  • సాధారణ పన్ను చెల్లింపుదారుడి (60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న) వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలకు పైగా ఉంటే పన్ను చెల్లించాలి.
  • వయో వృద్ధుల (60 నుంచి 80 సంవత్సరాల వయస్సు) వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు పైగా ఉంటే పన్ను చెల్లించాలి.
  • సూపర్ సీనియర్ సిటిజన్ (80 సంవత్సరాలకు పైగా వయస్సు) వార్షిక ఆదాయం రూ. 5 లక్షలకు పైగా ఉంటే పన్ను చెల్లించాలి.

మీ మొత్తం వార్షిక ఆదాయం (సెక్షన్ 80 కింద తగ్గింపులను క్లెయిమ్ చేయడానికి ముందు) పైన పేర్కొన్న 'ప్రాథమిక మినహాయింపు పరిమితి'ని దాటితే, రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. అదే సమయంలో, ఏదైనా కంపెనీ లాభ, నష్టాలతో సంబంధం లేకుండా రిటర్న్స్ దాఖలు చేయాలి.

అదేవిధంగా, మీరు ఈ కింది సందర్భాలలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది:

  • రిటర్న్ లేదా రిఫండ్ కోసం క్లెయిమ్ చేసుకోవడం.
  • కంపెనీకి ఏవైనా నష్టాలు వస్తే, వాటిని మరుసటి ఆర్థిక సంవత్సరానికి క్యారీఫార్వర్డ్ చేయడం(కొనసాగించడం).
  • మీకు భారత్‌లో మతపరమైన లేదా చారిటబుల్ ట్రస్ట్ కింద ఏదైనా ఆస్తి ఉండటం.
  • మీది ఒక రాజకీయ పార్టీ కావడం.
  • మీరు భారత పౌరులై, దేశం వెలుపల ఆస్తి లేదా ఆర్థిక ప్రయోజనాలను కలిగి (ఎన్ఆర్ఐ లేదా ఆర్ఎన్ఓఆర్) ఉండటం.
  • మీరు భారత నివాసి అయితే, దేశం వెలుపల అకౌంట్‌పై సంతకం చేసే అధికారం కలిగి ఉంటే (ఎన్ఆర్ఐ లేదా ఆర్ఎన్ఓఆర్) మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి.

మరికొన్ని పరిస్థితులు..

అదనంగా, మరికొన్ని పరిస్థితుల్లో మీరు తప్పకుండా రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే, మీ ఆదాయం 'ప్రాథమిక మినహాయింపు పరిమితి' కంటే తక్కువగా ఉండి..

  • మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాలలో రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ జమ చేసి ఉండటం.
  • పొదుపు ఖాతాలో రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జమ చేయడం.
  • మీ కోసం లేదా మరొకరి కోసం విదేశీ పర్యటన లేదా విహారయాత్రకు రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయడం.
  • మీ వార్షిక విద్యుత్ బిల్లు లక్ష రూపాయలకు పైగా ఉండటం.
  • మీ టీడీఎస్ లేదా టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) రూ. 25,000కు పైగా ఉండటం (సీనియర్ సిటిజన్లకు రూ. 50,000).
  • మీ వ్యాపారం వార్షిక టర్నోవర్ రూ. 60 లక్షలకు పైగా ఉండటం.
  • మీ వ్యాపార ఆదాయం రూ. 10 లక్షలకు పైగా ఉంటే, మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి.
పన్ను రిటర్న్, జరిమానా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

జరిమానా ఉంటుందా?

ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని సంస్థలు లేదా పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయడానికి చివరి తేదీ సాధారణంగా ప్రతీ ఏటా జూలై 31 అని చార్టర్డ్ అకౌంటెంట్ కరీం లఖానీ చెప్పారు.

మొత్తం ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉండి, గడువు ముగిసిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తే, రూ. 1,000 జరిమానా, వార్షిక ఆదాయం రూ. 5 లక్షలకు పైగా ఉన్నవారికి రూ. 5,000 వరకు జరిమానా విధిస్తారు.

మీ ఆదాయం 'ప్రాథమిక మినహాయింపు పరిమితి' కంటే తక్కువగా ఉన్నపుడు రిటర్న్స్ దాఖలు చేయకపోయినా జరిమానా విధించరు.

అయితే, మీ బ్యాంకు ఖాతాలో రూ. 1 కోటి కంటే ఎక్కువ జమ చేసి లేదా విదేశీ పర్యటనలో రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసి రిటర్న్స్ దాఖలు చేయకపోవడం, లేదా ఆలస్యంగా దాఖలు చేసినా జరిమానా విధిస్తారు.

  • మీ ఆదాయపు పన్నులో బకాయిలు ఉండి, సకాలంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే, బకాయి ఉన్న మొత్తంపై నెలకు ఒక శాతం సాధారణ వడ్డీ వసూలు చేస్తారు.
  • మీకు వ్యాపారం లేదా మూలధన నష్టం ఉండి, మీ పన్ను రిటర్న్స్‌ను సకాలంలో దాఖలు చేయకపోతే, ఆ నష్టాన్ని తదుపరి సంవత్సరం ఆదాయంలో చూపించలేరు.
  • మీరు ఎక్కువ పన్ను చెల్లించి, రిఫండ్ లేదా రిటర్న్‌కు అర్హులైన పరిస్థితుల్లో, మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఆలస్యంగా దాఖలు చేస్తే రిఫండ్ కూడా ఆలస్యం కావొచ్చు.
  • సీరియస్ కేసుల్లో ఆదాయపు పన్ను శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కట్టాల్సిన పన్ను రూ. 25,000కు పైగా ఉంటే, 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
  • ఇతర సందర్భాల్లో, మూడు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా పడవచ్చు.
ట్యాక్స్, రిటర్న్స్

ఫొటో సోర్స్, Getty Images

ప్రతి సంవత్సరం దాఖలు చేయాలా?

"మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ప్రారంభించినంత మాత్రాన, ప్రతి సంవత్సరం దాఖలు చేయాలనే నిబంధన లేదు" అని కరీం లఖానీ అంటున్నారు.

''ఆ సంవత్సరానికి ఉన్న నిబంధనల ప్రకారం మీరు రిటర్న్స్ దాఖలు చేయడానికి అర్హులు కాకపోతే చేయాల్సిన అవసరం లేదు. దీనర్థం ఆ సంవత్సరానికి మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే, ఇతర షరతులు వర్తించకపోతే, ఆ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు" అని ఆయన అన్నారు.

ఉదాహరణకు, "2023-24 అసెస్‌మెంట్ సంవత్సరంలో మీ ఆదాయం రూ. 3 లక్షలుగా ఉండటంతో, పన్ను రిటర్న్స్ దాఖలు చేశారనుకుందాం. తదుపరి ఏడాది, 2024-25లో మీ ఆదాయం రూ. 2 లక్షలే ఉందనుకోండి. మీకు ఐటీ రిటర్న్స్ తప్పనిసరి అనే నిబంధన వర్తించదు, దాఖలు చేయాల్సిన అవసరం లేదు" అని కరీం చెప్పారు.

అయితే, ఐటీ రిటర్న్స్ క్రమం తప్పకుండా దాఖలు చేయడం మంచి ఆలోచన అని కరీం లఖానీ సలహా ఇస్తున్నారు. ఇది ఆర్థిక క్రమశిక్షణను చూపుతుందని, భవిష్యత్తులో రుణాలు పొందడం సులభతరం చేస్తుందని తెలిపారు.

టీడీఎస్ చెల్లించాక, మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోతే, దానిని క్లెయిమ్ చేయడానికి రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

దీని ప్రకారం, మీరు వ్యాపార నష్టాలను భవిష్యత్తు ఆదాయం లేదా లాభాలకు భర్తీగా చూపించాలనుకుంటే, మీ ఆదాయం పన్ను 'ప్రాథమిక మినహాయింపు పరిమితి' కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ప్రతి సంవత్సరం పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఆదాయం, పన్ను రిటర్న్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పదవీ విరమణ చేస్తే?

మీరు పదవీ విరమణ తర్వాత లేదా పని మానేసిన తర్వాత ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలా వద్దా అనేది కొన్ని విషయాలపై ఆధారపడి ఉంటుంది.

ఆదాయం: పదవీ విరమణ తర్వాత మీ ఆదాయ వనరులు లేదా మార్గాలు ఏమిటి? మీకు పెన్షన్ లభిస్తుందా? బ్యాంకుల నుంచి వడ్డీ, అద్దె ఆదాయం, స్టాక్ మార్కెట్ ఆదాయం తదితరాలు ఏమైనా ఉన్నాయా? ఈ మొత్తం 'ప్రాథమిక మినహాయింపు పరిమితి'ని మించితే, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి.

పెన్షన్: పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ కూడా ఆదాయంగా పరిగణిస్తారు. పెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం 'ప్రాథమిక మినహాయింపు పరిమితి' మించి ఉంటే, రిటర్న్స్‌ దాఖలు చేయాలి.

బ్యాంకు లావాదేవీలు: పదవీ విరమణ తర్వాత బ్యాంకు ఖాతాలో పెద్ద లావాదేవీలు జరిగితే, ఉదాహరణకు, ఖాతాలో రూ. 1 కోటికి పైగా జమ అయితే లేదా విదేశీ పర్యటనకు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేస్తే, పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి. ఆ వ్యక్తి ఆదాయం 'ప్రాథమిక మినహాయింపు పరిమితి' కంటే తక్కువగా ఉన్నప్పటికీ, రిటర్న్స్ దాఖలు చేయాలి.

పన్ను రిఫండ్ క్లెయిమ్: పదవీ విరమణకు ముందు మీ జీతం నుంచి ఎక్కువ టీడీఎస్ చెల్లించి, రిఫండ్ పొందాలనుకుంటే, రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఆదాయం, పన్ను రిటర్న్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ప్రయోజనాలు ఏమిటి?

క్రమం తప్పకుండా, గడువులోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి,

  • ఐటీ రిటర్న్స్ మీ ఆదాయానికి అధికారిక రుజువు. ఇది అన్ని రకాల రుణ దరఖాస్తులు, క్రెడిట్ కార్డ్ దరఖాస్తులు లేదా ప్రధాన ఆర్థిక లావాదేవీలకు ఉపయోగపడుతుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గత కొన్ని సంవత్సరాల ఐటీ రిటర్న్స్‌ను అడుగుతాయి.
  • విదేశాలకు వెళ్లడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, అనేక దేశాల రాయబార కార్యాలయాలు గత కొన్ని సంవత్సరాలుగా ఐటీ రిటర్న్స్‌ అడుగుతాయి. ఇది మీ ఆర్థిక స్థిరత్వం, ఆదాయానికి రుజువు. ఇది మీకు వీసా లభించే అవకాశాలను పెంచుతుంది.
  • ప్రభుత్వ టెండర్లు, ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు కూడా, గత కొన్ని సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించాలి.
  • అదనంగా, ఐటీ రిటర్న్స్‌ను మీ చిరునామాకు రుజువుగా కూడా పరిగణిస్తారు.
  • పెద్ద బీమా పాలసీలను తీసుకునేటప్పుడు, కొన్ని బీమా కంపెనీలు రిటర్న్స్ అడగవచ్చు.

పాన్ కార్డ్ ఉన్న ప్రతిఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. మీ మొత్తం ఆదాయం, కొన్ని ఇతర అంశాలపై అది ఆధారపడి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)