పెళ్లి చేసుకోవడం మంచిదా, కాదా? జీవ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ ఏం చెప్పారు? రచయిత టాల్‌స్టాయ్ ఏం చేశారు

ఎమ్మా, డార్విన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎమ్మా వెడ్జ్‌వుడ్‌ను చార్లెస్ డార్విన్ వివాహం చేసుకున్నారు.
    • రచయిత, బీబీసీ న్యూస్ ముండో
    • హోదా, ..

జీవ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ 1838లో నేచురల్ సెలెక్షన్స్‌పై తన ఆలోచనలను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. సైంటిఫిక్ రీసెర్చ్ షిప్ అయిన హెచ్ఎంఎస్ బీగల్‌లో ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో చేసిన ప్రయాణంలో పరిశీలనల ఆధారంగా ఆయన కొన్ని నోట్స్ రూపొందించారు.

ఈ కాలంలో డార్విన్ జియోలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ కార్యదర్శిగా కూడా ఎంపికయ్యారు. డార్విన్ అనేక ముఖ్యమైన రీసర్చ్ పేపర్లు కూడా సమర్పించారు. ఆ సమయంలో ఒక వ్యక్తిగత విషయం ఆయన ఆలోచనల్లో ఎక్కువగా తిరిగింది.

జీవిత భాగస్వామి ఉండటం ఎంత ప్రయోజనకరం? వివాహం ఒక వ్యక్తి జీవితం, పనిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఒంటరిగా జీవిస్తే కలిగే ప్రయోజనాలు, పెళ్లి తర్వాత జీవితాన్ని ప్రస్తావిస్తూ 1838 ఏప్రిల్‌లో డార్విన్ కొన్ని నోట్స్ రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డార్విన్, పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్ డార్విన్

పెళ్లితో లాభనష్టాలు

1838 జూలైలో డార్విన్ 'పెళ్లి' అంశంపై మరోసారి దృష్టి సారించారు కానీ, ఈసారి కొత్తగా రాశారు.

వివాహం గురించిన ముఖ్యమైన ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనడానికి చార్లెస్ డార్విన్ రెండు జాబితాలను రూపొందించారు.

'పెళ్లి చేసుకుంటే' కలిగే ప్రయోజనాలను ఈ కింది విధంగా తెలిపారు:

  • పిల్లలు (దేవుని చిత్తం).
  • మీ గురించి శ్రద్ధ వహించే స్థిరమైన భాగస్వామి (వృద్ధాప్యంలో కూడా అండగా ఉండగలరు).
  • ఆడుకోవడానికి, ప్రేమించడానికి ఒకరు ఉంటారు (కుక్క కంటే ఉత్తమమే).
  • ఒక ఇల్లు, దానిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒకరుంటారు.
  • సంగీతంపై ఆకర్షణ, ఒక స్త్రీతో మాట్లాడటం

"ఇవి మీ ఆరోగ్యానికి మంచివే కానీ, సమయం వృథా చేసేవి" అని డార్విన్ అభిప్రాయపడ్డారు.

"ఓ మై గాడ్, జీవితాంతం పని చేస్తూ, చేస్తూ, అలా గడిపేయడం భరించలేనిది. నేను అలా చేయను" అని అన్నారు.

ఆ తర్వాత డార్విన్ రెండు సంఘటనలను పోలుస్తూ.. "లండన్‌లో ఒక మురికి ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నట్లు ఊహించుకోండి. మరోవైపు, ఒక మంచి సోఫాలో అందమైన భార్య, చలి మంట వేసుకోవడం, పుస్తకం చదవడం, సంగీతం వినడం ఊహించుకోండి" అని అన్నారు.

'పెళ్లి చేసుకోకపోవడం' గురించి మరో జాబితా సిద్ధం చేశారు డార్విన్:

  • ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ.
  • ఇతరులతో సంభాషించాలా వద్దా అని మీరే ఎంచుకోవచ్చు.
  • క్లబ్‌లలో తెలివైన వ్యక్తుల మధ్య సంభాషణ.
  • బంధువుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.
  • పిల్లలను కనడం వల్ల కలిగే ఖర్చు, ఉద్రిక్తతను (బహుశా తగాదాలు) నివారించవచ్చు.
  • సమయం వృథా.
  • మధ్యాహ్నం చదువుకోలేకపోవడం.
  • ఊబకాయం, సోమరితనం.
  • టెన్షన్, బాధ్యత.
  • పుస్తకాలకు తక్కువ డబ్బు.
  • మీకు చాలామంది పిల్లలు ఉంటే, మీరు ఆహారం కోసం ఎక్కువ సంపాదించవలసి వస్తుంది (ఎక్కువగా పనిచేయడం మీ ఆరోగ్యానికి మంచిదికాదు).

రెండు జాబితాలు సిద్ధం చేసిన డార్విన్ చివరికి ‘కాబట్టి, వివాహం చేసుకోవాలి’ అని తేల్చారు.

అయితే, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి?.

ఎమ్మా, డార్విన్, వివాహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డార్విన్ 1983 నవంబర్ 11న, తన డైరీలో "అత్యంత అద్భుతమైన రోజు" అని రాశారు.

ఎప్పుడు వివాహం చేసుకోవాలి?

పెళ్లిపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, డార్విన్ కొత్త ప్రశ్నలను సంధించారు:

"వివాహం ఎప్పుడు జరగాలి? తొందరగా లేదా ఆలస్యంగా?"

"మీరు చిన్నవారైతే, మీ భావాలు స్పష్టంగా ఉంటాయి. త్వరగా వివాహం చేసుకోకపోతే, సంతోషకరమైన క్షణాలను కోల్పోతారు. కాబట్టి త్వరగా వివాహం చేసుకోండి" అని సమాజానికి డార్విన్‌ సలహా ఇచ్చారు.

కానీ, ఆ సలహా ఆయనను ఆందోళన పరిచింది.

"అంతులేని సమస్యలు, ఖర్చులు, సామాజిక జీవితంలోకి నెట్టివేయడం వల్ల తలెత్తే వాదనలు" అని డార్విన్ ఊహించారు.

పెళ్లితో సమయం మాత్రమే కాకుండా అవకాశాలు కూడా వృథా అవుతాయని ఆయన భావించారు.

"నేను ఫ్రెంచ్ నేర్చుకోలేను, మొత్తం ఖండం చుట్టూ తిరగలేను. అమెరికా వెళ్లలేను, బెలూన్‌లో ఎగరలేను, వేల్స్‌కు ఒంటరిగా ప్రయాణించలేను. ఇది బానిస లాంటి జీవితం" అని డార్విన్ రాశారు.

కానీ, డార్విన్ తన అభిప్రాయం నుంచి వెనక్కి తగ్గి, తన స్వరాన్ని మార్చుకుని మళ్లీ ఇలా రాశారు.

"అలసిపోయిన వృద్ధాప్యంలో చలితో, స్నేహితులు, పిల్లలు లేకుండా మీరు ఈ ఒంటరి జీవితాన్ని గడపలేరు" అని తెలిపారు.

నవంబర్ 11న, ఆయన తన డైరీలో "అత్యంత అద్భుతమైన రోజు!" అని రాశారు.

ఎందుకంటే ఆ రోజు డార్విన్ బంధువు ఎమ్మా వెడ్జ్‌వుడ్ ఆయనను వివాహం చేసుకోవడానికి అంగీకరించారు.

వివాహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డార్విన్‌ను ఎమ్మా ఇష్టపడినా ఆయన ఆమెను ఒక సాధారణ బంధువుగానే చూసేవారు.

ఎమ్మాను ఆశ్చర్యపరిచిన డార్విన్

ఎమ్మా అంగీకారం ఆనందానికి కారణమైనప్పటికీ అది ఆయన ఊహించినదే.

డార్విన్, వెడ్జ్‌వుడ్ కుటుంబాల మధ్య చాలాకాలంగా వివాహాలు జరిగాయి. డార్విన్‌కు ఎమ్మా తగిన ఎంపిక అని, ఇద్దరు మంచి జంటగా ఉంటారని వారి కుటుంబాలు కూడా భావించాయి.

అయితే, డార్విన్ 'వివాహ ప్రతిపాదన' ఎమ్మాను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే, డార్విన్‌ను ఎమ్మా ఇష్టపడినా, అప్పటివరకు ఆయన ఆమెను ఒక సాధారణ బంధువుగానే చూశారు.

కానీ, డార్విన్‌ను వివాహం చేసుకోవాలా, వద్దా? అనే విషయంపై ఎమ్మా కూడా జాబితా రాసి ఉంటే, అది భిన్నంగా ఉండేదని హెలెన్ లూయిస్ బీబీసీ సిరీస్ "గ్రేట్ వైవ్స్"లో అభిప్రాయపడ్డారు.

ఎమ్మాకు అంతకుముందు, డార్విన్‌కు ఉన్నన్ని సౌకర్యాలు ఉండేవి కావు. విమానాలు, వేల్స్‌కు ఒంటరిగా ప్రయాణాలు లేవు.

ఆరు నెలల తర్వాత ఎమ్మా, డార్విన్‌ల వివాహం జరిగింది. ఇద్దరు బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు, పది మంది పిల్లలను కన్నారు. 1882లో డార్విన్ మరణించే వరకు కలిసి ఉన్నారు.

ఆ 43 సంవత్సరాలలో డార్విన్ రచనలను ఎమ్మా కాపీ చేసి, టైప్ చేయడమే కాకుండా, తన భాషా నైపుణ్యాలను ఉపయోగించి ఆయనకు శాస్త్రీయ పురోగతికి సంబంధించిన వార్తలను అనువదించి, తెలియజేసేవారు.

డార్విన్ అనారోగ్యం, పిల్లలు వంశపారంపర్య వ్యాధులతో బాధపడుతున్న రోజుల్లో ఎమ్మా ఆయనకు తోడుగా ఉన్నారు. ఎమ్మా పక్కనే ఉండటంతో డార్విన్‌కు చాలా ప్రయోజనాలు కలిగాయి.

లియో టాల్‌స్టాయ్, సోఫియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోఫియాను లియో టాల్‌స్టాయ్ పెళ్లి చేసుకున్నారు.

లియో టాల్‌స్టాయ్ వివాహం..

1889లో రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ తన నైతిక, మతపరమైన ఆలోచనలను పంచుకోవడానికి 'ది క్రూట్జర్ సొనాటా' అనే నవలను ప్రచురించారు. అప్పటికే, ఆయన తన బిరుదును తిరస్కరించారు, తన మునుపటి రచనలను విమర్శించారు.

ది క్రూట్జర్ సొనాటాలో కథకుడు తన రైలు ప్రయాణం గురించి చెబుతారు. రైలులో కనిపించిన ఒక వ్యక్తి ప్రేమ, వివాహానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. తనకు స్త్రీలతో ఉన్న ప్రేమ సంబంధాలన్నింటిపై చింతిస్తున్నానని చెబుతారు. స్త్రీలు తమ రూపాన్ని ఉపయోగించి పురుషులను వలలో వేస్తారని చెప్పారు.

అంతేకాదు, కథలోని ప్రధాన పాత్ర కూడా తన భార్య అందమైన వయోలిన్ వాద్యకారుడిని ప్రేమిస్తుందని అసూయపడుతుంది.

ఈ కథ టాల్‌స్టాయ్ తన నిజమైన భార్య సోఫియాకు సందేశం పంపడానికి ఉపయోగించిన మార్గమని చాలామంది భావిస్తారు, సోఫియా తన ఫ్యామిలీ మ్యూజిక్ టీచర్‌కు సన్నిహితురాలు.

కాగా, టాల్‌స్టాయ్ సాహిత్య ఆశయాలకు సోఫియా ఎంతో మద్దతు ఇచ్చారు. ఆయన రచనలను చేతితో కాపీ చేసి, వాటి ప్రచురణ బాధ్యతలు తీసుకున్నారు సోఫియా. 13 మంది పిల్లలను చూసుకున్నారు. ఎస్టేట్‌ బాధ్యతలనూ నిర్వహించారు.

కానీ, వారి వివాహ జీవితం సాఫీగా సాగలేదు. ది క్రూట్జర్ సొనాటా ప్రచురితమయ్యే సమయానికి భర్తతో సోఫియా సంబంధం దెబ్బతింది.

ఎందుకంటే, అప్పటికే యువకుడైన సంస్థానాధిపతి వ్లాదిమిర్ చెర్ట్‌కోవ్‌తో టాల్‌స్టాయ్ సన్నిహితంగా ఉండేవారు, సోఫియా గురించి ఆయనకు చెడుగా చెప్పేవారు వ్లాదిమిర్. టాల్‌స్టాయ్‌ను రాడికల్ నమ్మకాల వైపు నడిపించారు. టాల్‌స్టాయ్ తన సంపదనంతా త్యజించిన సమయంలో సోఫియానే కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది.

దీంతో, ఆమె టాల్‌స్టాయ్‌ పుస్తకాల ప్రచురణ బాధ్యతను తీసుకున్నారు. వాటిని నిషేధించకుండా చూడాలని జార్, ఆర్థడాక్స్ చర్చిని కూడా కోరారు. అయితే, ఈ వాణిజ్యపరమైన ఆలోచనలు ఆమెను నమ్మకద్రోహిగా నిరూపించాయని వ్లాదిమిర్ టాల్‌స్టాయ్‌తో చెప్పారు.

48 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత 1910లో టాల్‌స్టాయ్ ఏమీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయారు.

కొన్ని రోజుల తర్వాత ఆయన ఒక రైల్వే స్టేషన్‌లో మరణించారు. టాల్‌స్టాయ్‌ మృతదేహం దగ్గరికి వెళ్లేందుకు కూడా సోఫియాకు అనుమతి దక్కలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)