లక్ష జీతమొచ్చినా పదో తేదీకే పర్స్ ఖాళీ, మీకూ ఇలా అవుతోందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
- హోదా, బీబీసీ కోసం
హైదరాబాద్‌లో ఉండే సంజీవ్ ఓ అకౌంటింగ్ కంపెనీలో సీనియర్ మేనేజర్. నెలకు రూ.లక్షన్నర వరకు జీతం ఉంటుంది. ఓ రోజు ఆయన తన ఫ్యామిలీతో సూపర్ మార్కెట్‌కు వెళ్లారు. బిల్లింగ్ పూర్తయింది. బిల్లు కట్టాలని చూస్తే జేబులో పర్స్ కనిపించలేదు, క్రెడిట్ కార్డ్స్ లేవు. అప్పటికే అక్కడ క్యూలైన్‌లో జనాలు అసహనంగా ఉన్నారు.
బిల్లు మొత్తం సుమారు రూ.12 వేల వరకూ ఉంది. గూగుల్ పే లేదా ఫోన్ పే చేయాలని స్టోర్ ఉద్యోగి అడిగారు. చేసేది లేక తన అకౌంట్‌లో మిగిలి ఉన్న కొద్ది మొత్తం చెల్లించి ఆయన బయటపడ్డారు. నిజానికి అది ఇంకో నాలుగు రోజుల్లో కట్టాల్సిన ఈఎంఐ కోసం దాచిన డబ్బు.
ఇది సంజీవ్ స్టోరీ మాత్రమే కాదు. లక్షల్లో జీతం వస్తున్నా 15వ తేదీకే దాదాపుగా పర్సు ఖాళీ అయి, క్రెడిట్ కార్డులన్నీ వాడేస్తూ.. వచ్చే నెల జీతాన్ని కూడా ఖర్చు పెడుతున్నారు.
బాగా సంపాదించాలి, బాగా ఖర్చు చేయాలి, రిచ్‌గా కనిపించాలి, గొప్పగా బతకాలి. కానీ లోపలంతా అప్పుల ఊబి, ఈఎంఐల టెన్షన్, జీరో సేవింగ్స్.
అర్బన్ మిడిల్ క్లాస్‌లో చాలామందికి ఎదురయ్యే పరిస్థితి ఇది.. మీరూ ఈ జాబితాలో ఉన్నారా?


ఫొటో సోర్స్, Getty Images
అప్పు చేసైనా ఆడంబరాలు
ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా జనాలకు మన జీవితాలు కనిపిస్తున్నాయనేదే ఈ అర్బన్ మిడిల్ క్లాస్ డెట్ ట్రాప్‌కు ముఖ్య కారణం.
ఓ రకంగా ఇది ఉచ్చులాంటిది.
బ్రాండెడ్ వస్తువులు, విమాన ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు.. ఇవన్నీ మన కోసం కన్నా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసమో, వాట్సాప్ స్టేటస్‌ల కోసమో ఖర్చుగా పెడుతున్నాం.
ఆండ్రాయిడ్ కాస్తా ఐఫోన్ అయింది. ఐఫోన్ కాస్తా ఐఫోన్ మ్యాక్స్ అయిపోయింది.
కానీ, ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో చేరినా, వారం రోజులు సెలవు పెట్టినా వచ్చే నెల బడ్జెట్ అంతా తారుమారే.
ఆర్థిక క్రమశిక్షణలో అతి ముఖ్యమైన 'అత్యవసర నిధి' అనే కాన్సెప్ట్‌కు మనలో చాలామంది ఆమడ దూరం.
ఆర్బీఐ వార్షిక రిపోర్ట్ 2024-25 ప్రకారం జీఎన్‌డీఐతో పోలిస్తే 5.3 శాతం (నెట్ హౌస్‌హోల్డ్స్ ఫైనాన్షియల్ సేవింగ్స్) మాత్రమే మనం మిగులుస్తున్నాం. అయితే కరోనా కాలంలో (2021-22) ఇది 11.6 శాతంగా ఉందని ఆర్బీఐ విడుదల చేసిన గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్‌కం డేటా చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆదా అంటే ఆమడ దూరం
ఆర్బీఐ 2025 జనవరిలో విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం..
భారత్‌లో 5 నుంచి10 శాతం మంది మధ్యతరగతి ప్రజలు అప్పుల్లో ఉన్నారు. 67 శాతం మంది మంది పర్సనల్ లోన్ తీసుకున్నారు.
వీరిలో కొందరికి క్రెడిట్ కార్డులున్నాయి.
అంతేకాకుండా ఒక బిగ్ టికెట్ (పెద్ద మొత్తంలో) లోన్ ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.
అప్పులు తీసుకుంటున్న వాళ్లలో 45 శాతం మందికి క్రెడిట్ యోగ్యత తగ్గిపోతోందని 'కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్' పుస్తక సహ రచయిత, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ సౌరభ్ ముఖర్జియా ఓ ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
కోవిడ్ తర్వాత అప్పులు తీసుకుంటున్న వారిలో 48 శాతం మంది ఈ రుణాలను సంపద సృష్టించుకోవడానికి కాకుండా రోజువారీ అవసరాలు, వస్తువుల కొనుగోళ్ల కోసం వాడుతున్నారనేది సౌరభ్ అభిప్రాయం.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరు దోషులు?
లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్ మనలో చాలామందికి పెద్ద శత్రువు.
పక్కనున్న వాళ్ల కంటే బాగా బతకాలి, వాళ్లకంటే బెస్ట్ లైఫ్‌స్టైల్ ఉన్నట్టు మనం చూపించుకోవాలి. ఏడాదికి కనీసం ఒకసారి లేదా రెండుసార్లు టూర్ వెళ్లాలి. పెద్ద ఇల్లు, పెద్ద కారు.. ఇవన్నీ మన సొసైటీ మన మీద వేసే అతిపెద్ద ఒత్తిడి.
వాళ్లు కొన్నారని మనం, మనం కొన్నామని ఇంకొకరు.. ఇలా సొసైటీ అందరిని మెల్లిగా ఓ ట్రాప్‌లో దించుతోంది. మనం సులువుగా అందులో పడిపోయి, ఆర్థిక ఇబ్బందులను తెచ్చుకుంటున్నాం.
- 2 బీహెచ్‌కే నుంచి 3 బీహెచ్‌కే
- నార్మల్ ఫోన్ నుంచి ఐ ఫోన్
- రైలు ప్రయాణం బదులు విమాన ప్రయాణం
- ఇంటి భోజనం బదులు జొమాటో, స్విగ్గీ ఆర్డర్స్
- ఓలా, ఉబెర్ బదులు.. స్పెషల్ డ్రైవర్
ఇలా చెప్పుకుంటూ పోతే, మన లైఫ్‌స్టైల్‌ను మనమే పదేపదే అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంతకు తగ్గట్టు ఆదాయం వస్తోందా? లేక మన సర్కిల్లో ఎవరైనా చేశారు కాబట్టి, అలా చేస్తున్నామా? అనేది ఆలోచించాలి.
సోషల్ మీడియా, ఇన్‌ఫ్లూయెన్సర్స్, సహోద్యోగులు.. ఇలా మన చుట్టూ ఉన్నవాళ్ల ప్రభావానికి లోనైపోతున్నాం.
బయటకు ధనవంతుడిగా కనిపిస్తున్నా.. లోపల పూర్తిగా దెబ్బతిన్న ఆర్థిక స్థితి. కుప్పలుగా ఈఎంఐలు, రిటైర్మెంట్ ప్లానింగ్‌కు నో ఫండ్, ఎమర్జెన్సీకి నో ఫండ్, బ్యాంకుల్లో నో బ్యాలెన్స్.. ఇదీ స్థితి.
మన సిబిల్ స్కోర్ చూసి క్రెడ్ వంటి వాళ్లు ఇచ్చే ప్రీ అప్రూవ్డ్ లోన్ రూ.5-6 లక్షలు అనేది మీ విలువా? లేక మీ సేవింగ్స్ బ్యాంకులో ఉండే రూ.2 లక్షలకు వెయిటేజీ ఎక్కువా? ఆలోచించండి.

ఫొటో సోర్స్, Getty Images
అప్పు తప్పు కాదా?
పదిహేనేళ్ల కిందటి వరకూ అప్పును ముప్పుగానే చూశాం.
ఏదైనా ఇంటి రుణం, కార్ లోన్‌కే పరిమితమయ్యాం. కానీ, ఇప్పుడు మొబైల్ ఫోన్ కావాలన్నా, బట్టలు కొన్నా, వెకేషన్‌కు వెళ్లాలన్నా రుణం దొరికిపోతోంది.
రూ.20-30 కూడా ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించేస్తున్నాం. అంటే అతిచిన్న అవసరానికి కూడా అప్పు చేయడానికి మనం వెనకాడట్లేదు.
దీన్ని సౌలభ్యం అని కప్పిపుచ్చుకోవచ్చు కానీ ముమ్మాటికీ ఇదో ట్రాప్.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటికైనా ఇలా చేద్దామా!
- స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌కు, క్వాలిటీ ఆఫ్ లైఫ్‌కు మధ్య తేడా తెలుసుకుందాం.
- ఎక్కువ సంపాదించడం, ఎక్కువ ఖర్చు చేయడం వల్ల ఆనందం రాదని గ్రహిద్దాం.
- అప్పులకు సాధ్యమైనంత దూరంగా ఉందాం.
- మన జీతంలో కనీసం 20-30 శాతం పీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిగా పెడదాం.
- ఖర్చులు ఎక్కడ ఎక్కువవుతున్నాయో గమనిద్దాం. సబ్‌స్క్రిప్షన్స్ ఏవైనా ఉంటే తగ్గించుకుందాం. స్పెండింగ్ బిహేవియర్ ఎలా మారుతోందో చెక్ చేయడానికి ఎక్సెల్ షీట్స్ వేసుకుందాం.
- ఏదైనా వస్తువుకు ఈఎంఐ ఇస్తున్నారంటే అది మనకు అందుబాటులో లేదు కాబట్టే పెట్టారని అర్థం చేసుకోవాలి.
- మన దగ్గర అధికంగా ఉన్న ధనంతో మనం కొనాలి కానీ, అప్పుతో వచ్చే ఆనందం నిజమైందా లేదా అనేది గుర్తిద్దాం.
- లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (మ్యూచువల్ ఫండ్స్, ఇల్లు, రిటైర్మెంట్ ఫండ్స్, గోల్డ్) వంటి వాటి గురించి ఆలోచిద్దాం.
- కార్లు, బైకులు, ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ ఎప్పటికీ ఆస్తులు కావు, కాలేవు.
మన పాత తరం మనలా ఖర్చు చేయలేదు. రూపాయి రూపాయి పోగేశారు. ఇళ్లు కట్టారు, మనల్ని చదివించారు. కానీ, మనం మాత్రం సౌకర్యం పేరుతో జేబును ఖాళీ చేసుకుంటున్నాం.
ఇప్పుడు జనరేషన్ జడ్‌కు ఉన్న నాలెడ్జ్, అవకాశాలతో పోలిస్తే మన తల్లిదండ్రులకు ఆప్షన్స్ చాలా తక్కువ.
మన బలం, మన బలగం సేవింగ్స్. మన బలం మనం కోల్పోయి.. అప్పుల్లో కూరుకుపోతే ఇక తర్వాతి తరానికి ఏం నేర్పిద్దాం?
(గమనిక - ఇవన్నీ కేవలం అవగాహన కోసం అందించిన వివరాలు మాత్రమే. ఆర్థిక అంశాలపై మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిపుణులను సంప్రదించగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














