ఇన్‌స్టంట్‌ లోన్‌ తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ ఎఫెక్ట్‌ అవుతుందా?

లోన్ యాప్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
    • హోదా, బీబీసీ కోసం

ఈ రోజుల్లో లోన్‌ పొందడం సులువైపోయింది. జస్ట్‌ అలా స్మార్ట్‌ఫోన్‌ పట్టుకుని యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.. పదివేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ సులువుగా రుణం వచ్చేస్తోంది. క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే ఎక్కువ రుణం, తక్కువుంటే ఎక్కువ వడ్డీతో రుణం.

ఫోన్ కొనాలన్నా, ఏదైనా గాడ్జెట్‌ తీసుకోవాలనుకున్నా లోన్‌ సులువుగా ఇచ్చేస్తున్నారు. సున్నా వడ్డీ, జీరో డౌన్‌ పేమెంట్‌, నో ప్రాసెసింగ్ ఫీ.. వంటి ప్రకటనలు జనాలను ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే సులువుగా వచ్చేదాని వెనుక ఎంతో కొంత రిస్క్‌ కూడా ఉంటుందని చాలామంది గ్రహించడం లేదు.

లోన్‌ యాప్‌ ద్వారా డబ్బు తీసుకుని, ఆ తర్వాత కట్టలేకపోయి సూసైడ్ చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు.

రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) పటిష్టమైన చట్టాలను తీసుకువచ్చింది. అయినప్పటికీ కొన్ని లోన్‌ యాప్స్ కారణంగా రుణ గ్రహీతలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

అందుకే ఏదైనా లోన్‌ తీసుకునేముందు ఈ 10 విషయాలను చెక్‌ చేసుకోండి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆర్బీఐ

ఫొటో సోర్స్, Getty Images

1. రిజిస్ట్రేషన్‌ ఉందా, లేదా?

మీరు రుణాలు తీసుకునే సంస్థలు రిజిస్టర్డ్ లేదా విశ్వసనీయ ప్లాట్‌ఫామ్స్‌గా ఉన్నాయో లేదో చెక్‌ చేయండి.

మీరు ఎంచుకున్న రుణ సంస్థ ఏదైనా బ్యాంకుతో లేదా ఎన్‌బీఎఫ్‌సీతో భాగస్వామ్యంతో ఉందో లేదో కూడా గమనించండి.

ఆర్‌బీఐ వెబ్‌సైట్‌కు వెళ్లి సదరు లోన్ యాప్‌ గురించి చెక్‌ చేయండి. వివిధ ఫారిన్‌ షెల్‌ కంపెనీల (ముఖ్యంగా చైనా) యాప్స్‌ వల్లే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్లను ఎంక్వైరీ చేయడానికి, ఐపీ అడ్రస్‌లు ట్రాక్‌ చేయడానికి కూడా అవకాశాలు లేకుండా పోతున్నాయి.

2. యాప్‌ ఏ పర్మిషన్స్‌ అడుగుతోంది?

డౌన్‌లోడ్ చేసుకునే ముందు యాప్స్‌ ఎక్కువగా మీ ఫోన్‌ కాంటాక్ట్స్‌, ఫోటోలు, మెసేజులు, మీ లొకేషన్‌ పర్మిషన్స్ అడుగుతుంటాయి. వీటిపై అప్రమత్తంగా ఉండండి.

ఎందుకంటే మీరు లోన్‌ కట్టకపోతే మీ ఫోన్‌లోని ఫోటోలను యాక్సెస్‌ చేసి, వాటిని ఎవరికైనా షేర్ చేయడం, మీ రుణానికి సంబంధించిన సమాచారం మీ ఫోన్ కాంటాక్ట్స్‌కు పంపించడం వంటివి చేస్తున్నాయి.

అందుకే ఇలాంటి లోన్ యాప్స్‌ విషయంలో కాస్త జాగ్రత్త.

వడ్డీ

ఫొటో సోర్స్, Getty Images

3. వడ్డీ ఎంత?

యాడ్స్‌లో సాధారణంగా జీరో ఇంట్రెస్ట్‌ రేట్‌, తక్కువ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్‌ ఫీ వంటి ప్రకటనలు చూస్తూ ఉంటాం. వీటితో పాటు అతి తక్కువ వడ్డీ రేటు అనేది కూడా కనిపిస్తుంది. అయితే మనం గమనించాల్సింది యాన్యువల్ పర్సంటేజ్‌ రేటు (ఏపీఆర్). ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత రిస్క్‌ అని గమనించండి.

కొన్ని యాప్స్‌ ఏకంగా 60 నుంచి 100 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తున్నాయి. అంటే రూ.100కు 5 నుంచి 10 రూపాయల దాకా వడ్డీ తీసుకుంటున్నాయి. మెజార్టీ జనాలు వారం, పది రోజులు, నెల రోజుల కోసమే రుణం తీసుకుంటున్నారు. 'వెంటనే తీర్చేస్తాం' కదా అనే భావనతో అత్యధిక శాతం వడ్డీలతో పీకల మీదకు తెచ్చుకుంటున్నారు.

వీటితో పాటు సర్వీస్‌ ఛార్జ్, ప్రాసెసింగ్‌ ఫీజు, లేట్‌ పేమెంట్ పెనాల్డీ వంటి హిడెన్‌ చార్జీలు అదనపు భారంగా మారతాయి. వీటి గురించి కూడా ముందే తెలుసుకోవాలి.

ఉదాహరణకు రూ.10 వేల రుణాన్ని 15 రోజులకు‌ తీసుకుంటే రూ.13,500 వరకూ కంపెనీలు వసూలు చేసిన సందర్భాలున్నాయి. అందువల్ల వడ్డీ ఎంతో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని, క్లారిటీ వచ్చాకే తీసుకోండి.

లోన్ యాప్స్

ఫొటో సోర్స్, Getty Images

4. రీ పేమెంట్‌ ఎప్పుడు, ఎలా?

కొన్ని లోన్‌ యాప్స్‌ రీపేమెంట్‌ విండోను ఎక్కువగా అందుబాటులో ఉంచడం లేదు.

కొన్ని సంస్థలు ఏడు రోజుల నుంచి ఏడాది వ్యవధితో ఇన్‌స్టంట్‌ లోన్స్‌ ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో మెజార్టీ సంస్థలు వార్షికంగా 35 నుంచి 45 శాతం వరకూ రుణాలు ఇస్తున్నాయి.

కొన్ని కంపెనీలు విద్యార్థులను టార్గెట్‌ చేస్తే, మరికొన్ని సంస్థలు ఉద్యోగులను, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని బిజినెస్ చేస్తున్నాయి.

లోన్ తీసుకునే ముందు రీ పేమెంట్ నిబంధనల గురించి తెలుసుకోవాలి.

5. రికవరీ ఏజెంట్ల గురించి..

లోన్‌ యాప్స్‌ విషయంలో అత్యంత వివాదాస్పద అంశం ఇదే. ఇచ్చిన అప్పును రాబట్టుకునే క్రమంలో వీరి ప్రవర్తన వివాదాస్పదమవుతోంది.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏజెంట్లు రుణ గ్రహీతలను వేధించకూడదు.

నిర్దిష్ట నియమ, నిబంధనలు పాటించాలి.

ఫోన్‌ కాంటాక్ట్స్‌ను, ఫొటోలను, డేటాను మన అనుమతి లేకుండా తీసుకోకూడదు, ఉపయోగించకూడదు.

ఫోన్‌ కాంటాక్ట్స్‌లోకి వెళ్లి అందరికీ మెసేజులు పంపడం, బహిరంగంగా రుణ గ్రహీతలను అవమానించడం, పరువు తీయడం వంటివి చేసిన ఉదంతాలు గత రెండేళ్లలో ఎన్నో చూశాం. ఇలా చేయడం నిషేధం.

6. సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం ఎంత?

ఈ ప్రశ్నకు అవును అని కచ్చితంగా చెప్పలేం. సాధారణంగా అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌ (పర్సనల్‌ లోన్స్‌ వంటివి) ఎప్పుడూ మన స్కోర్‌పై నెగిటివ్‌గానే ప్రభావం చూపిస్తాయి.

పదే పదే లోన్ల కోసం చేసే ఎంక్వైరీలు, చిన్న చిన్న మొత్తాల్లో అయినా సరే మనం పదే పదే తీసుకునే లోన్లు మన స్కోర్‌ను నెగిటివ్‌గానే ప్రభావితం చేస్తాయి. వీటిలో మీరు డిఫాల్ట్‌ అయితే, మీ క్రెడిట్‌ స్కోర్‌ తీవ్రంగా ప్రభావితమవుతుంది.

అయితే నియంత్రణలో లేని, నిబంధనలను పెద్దగా పాటించని సంస్థలు, యాప్స్‌.. అసలు మీ లోన్‌ విషయాన్ని క్రెడిట్‌ బ్యూరోలకు వెల్లడించకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. వాళ్ల ముఖ్య లక్ష్యం మీ నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం.

రుణాలు, ఆర్బీఐ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

7. లోన్ యాప్స్‌ రిజిస్టర్‌ అయ్యాయా?

మీరు తీసుకునే లోన్‌ యాప్స్‌ అసలు రిజిస్టర్‌ అయ్యాయో లేదో చెక్‌ చేయండి.

ఆర్‌బీఐ సైట్‌తో పాటు కంపెనీ డాక్యుమెంట్స్‌ ద్వారా ఈ సమాచారం మీరు పొందొచ్చు. ఈ లోన్‌ యాప్‌ ఏదైనా బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో అనుసంధానమైందో లేదో కూడా గమనించండి.

ఒకవేళ ఈ యాప్స్‌ ఏదైనా ఇతర దేశాలతో రిజిస్టర్‌/ లింక్‌ అయి ఉంటే మాత్రం, వాటిని మీరు పట్టుకోవడం కష్టం.

ఐపీ అడ్రస్‌లు ఇతర దేశాల్లో ఉంటూ, అక్రమంగా మీ నుంచి డబ్బు వసూలు చేసినా, దౌర్జన్యం చేసినా మీరు వాళ్లను ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది.

8. రీపేమెంట్‌ ఎలా చేస్తున్నారు?

మీరు చేసే పేమెంట్‌ పద్ధతేంటో చెక్‌ చేయండి.

వ్యక్తిగతంగా ఎవరి వాలెట్‌కైనా చేస్తున్నారా లేదా రిజిస్టర్డ్‌ యూపీఐ ఐడీకి చేస్తున్నారా చెక్‌ చేయండి.

మీ పేమెంట్‌ గేట్‌వే ఏదైనా బ్యాంకుతో అనుసంధానమై ఉందో లేదో చూడండి.

యాప్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

9. ఈ యాప్స్‌ ద్వారా లోన్ తీసుకోవడం సురక్షితమేనా?

వాస్తవానికి రుణం పొందాలనుకునే వాళ్లలో చాలామంది వెనకా ముందు ఎక్కువగా ఆలోచించరు. దీనికి కారణం కొన్ని సందర్భాల్లో మెడికల్‌ ఎమర్జెన్సీ, మరికొన్ని సందర్భాల్లో హఠాత్తుగా అవసరం పడటం. అవసరం ఉన్నా లేకపోయినా కొత్త లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడి ఇలాంటి లోన్స్‌ తీసుకుంటే మనకే రిస్క్‌.

లోన్స్‌ ఇచ్చే వాళ్లు వాటిని ఎలా అయినా రాబట్టుకోవాలని చూస్తారు.

రుణం తీసుకోవడం సురక్షితమా కాదా తెలుసుకోవడానికి ముందు.. ఈ యాప్స్ ద్వారా తీసుకోవడం అవసరమా? అని ఆలోచించండి. అంత అత్యవసరం ఏంటి? నిజంగా ఈ లోన్‌ తీసుకోకపోతే ఆర్థికంగా అంత ఇబ్బంది వస్తుందా? తీర్చగలిగే సామర్థ్యం ఉందా, లేదా చూడండి.

10. ప్రత్యామ్నాయం ఉందా?

కాస్త ఆలోచించి చూస్తే ఈజీ లోన్‌ యాప్స్‌కు ప్రత్యామ్నాయం కూడా ఉంటుంది.

బ్యాంకులు ఇచ్చే వ్యక్తిగత రుణాలు, ప్రభుత్వ బ్యాంకులు లేదా రిజిస్టర్డ్‌ ప్రైవేట్‌ బ్యాంక్స్‌, ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా లోన్‌‌కు ప్రయత్నించండి. కంపెనీ ఏమైనా శాలరీ అడ్వాన్స్‌ ఇచ్చే అవకాశం ఉందేమో చూడండి.

క్రెడిట్‌ కార్డ్ ద్వారా స్వల్పకాలిక రుణాలు, మార్ట్‌గేజ్‌ లోన్స్‌, గోల్డ్‌ లోన్స్‌ వంటివి తీసుకునే వెసులుబాటు ఉందేమో ఆలోచించండి. వీటిలో డాక్యుమెంటేషన్‌ కాస్త అధికంగా ఉంటుంది. అయితే, ప్రాసెసింగ్‌ ఫీజులు, వడ్డీలు, రికవరీ చర్యలు వంటివన్నీ చట్టానికి లోబడే ఉంటాయి.

ఒక వేళ రిజిస్టర్డ్‌ ఎన్‌బీఎఫ్‌సీల నుంచి లోన్స్‌ తీసుకున్నా సరే వాళ్ల టర్మ్స్‌, కండిషన్స్‌ పక్కాగా చదవండి. రీ పేమెంట్ క్లాజ్‌, ఆలస్య రుసుము, ప్రైవసీ పాలసీ వంటివి తెలుసుకోండి.

(గమనిక - ఇవన్నీ కేవలం అవగాహన కోసం అందించిన వివరాలు మాత్రమే. ఆర్థిక అంశాలపై మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిపుణులను సంప్రదించగలరు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)