హోమ్‌బౌండ్: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ భారతీయ చిత్రాన్ని చూసి 9 నిమిషాలు చప్పట్లు కొట్టారు...

ఫొటో సోర్స్, Dharma Productions
- రచయిత, అసీమ్ ఛబ్రా
- హోదా, సినిమా విమర్శకుడు, కాన్స్ నుంచి
2010లో ‘మాసాన్’ సినిమాతో నిర్మాత నీరజ్ ఘెవాన్, కాన్స్‌లో అరంగేట్రం చేశారు. వారణాసి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేమ, దుఃఖం, కుల వ్యవస్థలోని బాధల గురించి చెబుతుంది.
ఇందులో విక్కీ కౌశల్ నిమ్న కులానికి చెందిన వ్యక్తిగా ప్రధాన పాత్రను పోషించారు. ఆయన కుటుంబం గంగానది ఒడ్డున మృతదేహాలను దహనం చేసే పనిచేస్తుంది ఈ సినిమాలో.
అప్పట్లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'అన్ సర్టెన్ రిగార్డ్' విభాగంలో ‘మసాన్’ను ప్రదర్శించారు. ఈ కేటగిరీలో విభిన్నమైన, కొత్త తరహా కథలు ఉంటాయి.
ఈ సినిమా ‘ప్రామిసింగ్ ఫ్యూచర్’ ప్రైజ్‌ను గెలుచుకుంది.
ఐదు సంవత్సరాల కిందట కోవిడ్ మహమ్మారి సమయంలో, ఘెవాన్ స్నేహితుడు సోమెన్ మిశ్రా ‘న్యూయార్క్ టైమ్స్’లో ప్రచురితమైన 'టేకింగ్ అమృత్ హోమ్' అనే కథనాన్ని చదవమని సలహా ఇచ్చారు. ఈ వ్యాసం జర్నలిస్ట్ బషరత్ పీర్ రాశారు. సోమెన్ మిశ్రా ముంబైలోని ధర్మ ప్రొడక్షన్స్‌లో క్రియేటివ్ డెవలప్‌మెంట్ హెడ్.
ఈ వ్యాసంలో, లాక్‌డౌన్ సమయంలో, రవాణా సౌకర్యాలులేని లక్షల మంది ప్రజలు వందల, వేల కిలోమీటర్లు నడిచి తమ గ్రామాలకు ఎలా తిరిగి వస్తున్నారో వివరించారు.
నీరజ్‌కి ఆ వ్యాసం చాలా ప్రత్యేకంగా అనిపించింది. అందులో ఒక ముస్లిం, ఒక దళిత బాలుడు స్నేహితులుగా కనిపిస్తారు.
ఈ వ్యాసమే ఆయన కొత్త చిత్రం 'హోమ్‌బౌండ్' కి ప్రేరణగా మారింది.
ఈ వారం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'అన్ సర్టెన్ రిగార్డ్' విభాగంలో ‘హోమ్‌బౌండ్’ను ప్రదర్శించారు. దాని ప్రీమియర్ తర్వాత, ప్రేక్షకులు లేచి నిలబడి, 9 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు.


ఫొటో సోర్స్, Dharma Productions
మార్టిన్ స్కోర్సెస్ 'హోమ్‌బౌండ్' చిత్రంలో ఎలా భాగమయ్యారు?
సినిమా చూసిన తర్వాత, చాలామంది కళ్లు చెమర్చాయి. షో చూశాక సినిమా ప్రధాన నిర్మాత కరణ్ జోహార్‌ను నీరజ్ ఘెవాన్ ఆలింగనం చేసుకున్నారు. అక్కడే ఉన్న ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్‌లు కూడా వారిద్దరినీ ఆలింగనం చేసుకున్నారు.
ఇది ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగిన అతిపెద్ద సౌత్ ఏషియన్ ఈవెంట్ కావడంతో చాలామంది ఈ ప్రాంతానికి చెందిన సినీ ప్రముఖులు సినిమా చూడటానికి వచ్చారు.
ఎవరూ ఊహించనంతగా ఈ చిత్రానికి అభినందనలు లభించాయి.
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాతలలో కరణ్ జోహార్ ఒకరు. 'కభీ ఖుషీ కభీ ఘమ్', 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' వంటి హిట్ చిత్రాలను ఆయన రూపొందించారు.
ప్రముఖ హాలీవుడ్ నిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా గత నెలలో చేరారు. 'హోమ్‌బౌండ్' సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన ఫ్రెంచ్ ప్రొడ్యూసర్ మెలిటా టోస్కాన్ డు ప్లాంటియర్, ఈ సినిమా ప్రాజెక్ట్‌కు మార్టిన్‌ను పరిచయం చేశారు.
ఒక సమకాలీన భారతీయ సినిమా ప్రాజెక్ట్‌కు స్కోర్సెస్ నిర్మాతగా వ్యవహరించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఆయన పాత భారతీయ సినిమాలను రీస్టోర్ ( పునరుద్ధరణ) చేసే పనికి సాయం చేస్తున్నారు.
"నేను నీరజ్ మొదటి చిత్రం ‘మసాన్’ను 2015లో చూశాను. చాలా నచ్చింది. మెలిటా టోస్కాన్ డు ప్లాంటియర్ ఈ ప్రాజెక్ట్‌ను నాకు పంపినప్పుడు, చాలా సంతోషించా" అని గత నెలలో స్కోర్సెస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సినిమా నిర్మాణంలో స్కోర్సెస్ తనకు సహాయం చేశారని నీరజ్ ఘెవాన్ చెప్పారు.
"సినిమా ఎడిటింగ్ ప్రక్రియలో ఆయన చాలాసార్లు మా బృందానికి మార్గనిర్దేశం చేసి సలహా ఇచ్చారు. ఈ సినిమా కథను, దాని సామాజిక సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి కూడా స్కోర్సెస్ ప్రయత్నించారు" అని నీరజ్ అన్నారు.

ఫొటో సోర్స్, Dharma Productions
'బొమ్మలు కాదు, కథలను చూపించాలి'
సినిమాలో లేవనెత్తిన సమస్యలోని భావోద్వేగాన్ని, వాస్తవికతని సరిగ్గా చిత్రీకరించడం నీరజ్ ఘెవాన్‌కి పెద్ద సవాల్.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలైన మొహమ్మద్ షోయబ్ అలీ (ఇషాన్ ఖట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా), ఇద్దరూ శతాబ్దాలుగా సమాజంలోని అగ్రకులాల చేతుల్లో వివక్షను ఎదుర్కొన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారే.
వారిద్దరూ ఈ సామాజిక అడ్డంకులను అధిగమించాలని కలలు కంటారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరి కొత్త గుర్తింపును సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారు.
నీరజ్ ఘెవాన్ కూడా తాను దళితుడినని చెప్పారు. ఈ గుర్తింపు ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమే కాదు, బాల్యం నుంచీ ఆయనపై ప్రభావం చూపింది.
పెద్దయ్యాక, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. తరువాత గురుగ్రామ్‌లో కార్పొరేట్ ఉద్యోగంలో చేరారు నీరజ్.
తాను ఎప్పుడూ ప్రత్యక్షంగా వివక్షను ఎదుర్కోలేదని, కానీ సమాజంలో తాను ఎక్కడ ఉన్నానో గ్రహించానని ఆయన చెప్పారు.
నేటికీ తన పుట్టుకతో ముడిపడి ఉన్న గుర్తింపు భారాన్నిమోస్తున్నానని చెప్పారు.
భారతదేశ జనాభాలో ఎక్కువ మంది గ్రామాల్లో నివసిస్తున్నారని, కానీ హిందీ చిత్రాలలో గ్రామీణ కథలు చాలా అరుదుగా చూపిస్తారని నీరజ్ ఘెవాన్ చెప్పారు.
అణగారిన వర్గాలను కేవలం గణాంకాలుగా మాత్రమే గుర్తించి మాట్లాడటం వల్ల వారు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Dharma Productions
మానవ సంబంధాల లోతులను స్పృశించే సినిమా
నీరజ్ ఘెవాన్ ఈ సినిమా స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టినప్పుడు, కోవిడ్‌కు ముందు రెండు పాత్రల జీవితాన్ని ఊహించుకోవడం ప్రారంభించారు.
నీరజ్ తన బాల్యాన్ని హైదరాబాద్‌లో గడిపారు. ఆయన స్నేహితుడు అస్గర్...ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు.
ఈ సినిమాని ఉత్తర భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అందంగా చిత్రీకరించారు. ముస్లిం, దళిత పాత్రల రోజువారీ ఇబ్బందులు, వారు పొందే చిన్న చిన్న ఆనందాలను ఇందులో చూపిస్తారు.
పురుష పాత్రలతో పాటు జాన్వీ కపూర్ పోషించిన స్త్రీ పాత్రతో వారి బంధాలు, సంభాషణలు, అనుభవాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. జాన్వీ కపూర్, విశాల్ జెత్వా ఇద్దరూ దళితుల పాత్రలు పోషించారు.
ఘెవాన్ స్క్రిప్ట్ చాలాచోట్ల ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది.
కోవిడ్ మహమ్మారి ఎంత విస్తృతంగా ఉంటుందో 2019 సంవత్సరం నాటికి మనలో ఎవరికీ తెలియదు. కానీ ఈ చిత్రం ఒక మార్పును సున్నితంగా చూపిస్తుంది. ఏ సంక్షోభం కూడా కులం, వర్గం, లేదా మతాన్ని వదిలిపెట్టదన్న విషయాన్ని చెబుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














