కర్ణాటక: కొండ దిగువన గుహలో రష్యన్ మహిళ, ఇద్దరు చిన్నారులను గుర్తించిన పోలీసులు, అసలు వారు అక్కడికి ఎలా వచ్చారు?

- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
కర్ణాటకలో తీరప్రాంత జిల్లా అయిన ఉత్తర కన్నడలోని మారుమూల ప్రాంతంలోని ఒక గుహలో ఓ రష్యన్ మహిళ తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి నివసిస్తున్నట్టు కనుగొన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.
గస్తీ పోలీసులు ఓ కొండకు 700 నుంచి 800 మీటర్ల దిగువన గుహ ముఖద్వారం వద్ద కొన్ని దుస్తులు వేలాడుతుండటాన్ని గుర్తించారు. దీంతో పోలీసు బృందం ప్రమాదకరమైన అటవీ మార్గంలో గుహ వైపు వెళ్లగా, గుహ నుంచి బంగారురంగు జుట్టుతో ఓ చిన్నారి పరిగెత్తుతూ రావడం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది.
"గుహ చుట్టూ పాములు తిరుగుతున్నట్టు కనిపించాయి. ఈ ప్రాంతం ప్రమాదకరమైనది. ఎందుకంటే కిందటేడాది రామతీర్థ కొండల చుట్టూ కొండచరియలు విరిగి పడ్డాయి. అందుకే గస్తీ బృందం పరిసరాలను పరిశీలిస్తోంది" అని ఉత్తర కన్నడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం. నారాయణ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'దేవుని సేవలో' ఉన్నానంటూ..
గుహలో నీనా కుటినా (40) అనే రష్యన్ మహిళ, ఆమె పిల్లలు ప్రేమ (6), అమా (4) ఉన్నారు. వాళ్లు అక్కడ సౌకర్యంగానే కనిపించారు.
"అక్కడ నివసించడం ప్రమాదకరమని ఆమెను ఒప్పించడానికి సమయం పట్టింది" అని ఎస్పీ నారాయణ చెప్పారు.
ఒక వారం కిందటే, ఆమె కొన్ని కూరగాయలు, కిరాణా సామగ్రిని తీసుకువచ్చారు. కట్టెలు ఉపయోగించి వంట చేసుకున్నారు. పోలీసులు అక్కడ ఒక పాపులర్ బ్రాండ్ నూడుల్స్, సలాడ్‌ను కనుగొన్నారు.
"ఆమె పాండురంగ విఠల విగ్రహాన్ని పూజించడం మా బృందం కనుగొంది. శ్రీకృష్ణుడు తనను ధ్యానం చేయడానికి పంపాడని, తాను తపస్సు చేస్తున్నానని ఆమె చెప్పారు" అని ఎస్పీ తెలిపారు.
నీనా తన పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నానని పోలీసులకు చెప్పారు. దీంతో ఆమె పాస్‌పోర్టును పోలీసులు, అటవీ అధికారులు కనుగొన్నారు. నీనా భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చేవారు. ఆమె వీసా గడువు 2017లోనే ముగిసింది.

ఫొటో సోర్స్, Screengrab
ఎప్పటి నుంచి ఉంటున్నారు?
నీనా 2016 అక్టోబర్ 18 నుంచి 2017 ఏప్రిల్ 17 వరకు బిజినెస్ వీసాపై భారతదేశంలో ఉన్నారు. గోవాలోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఎఫ్ఆర్ఆర్ఓ) ఆమెకు 2018 ఏప్రిల్ 19న ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసింది. దీంతో, నీనా నేపాల్ వెళ్లి, అక్కడి నుంచి 2018 సెప్టెంబర్ 8న భారత్‌కు తిరిగి వచ్చారు.
ప్రస్తుతం, ఆమెను ఓ ఆశ్రమానికి, చిన్నారులను చిల్డ్రన్స్ హోంకి తరలించారు. నీనా, ఆమె పిల్లలను విదేశీ పౌరులను ఉంచే బెంగళూరులోని డిటెన్షన్ సెంటర్‌కు తరలిస్తామని, అక్కడి నుంచి రష్యా పంపిస్తామని అధికారులు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














