భారత్, చైనాలు దగ్గరవుతున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్బరసన్ ఎథిరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్, చైనాలు తమ సరిహద్దుల్లో ఏళ్ల తరబడి ఉద్రిక్తతల తర్వాత నెమ్మదిగా సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల భారత్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ప్రతినిధులు చైనాను సందర్శించడాన్ని రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయనడానికి సంకేతంగా చూస్తున్నారు.
జూన్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు వేరువేరుగా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశాల కోసం చైనాలో పర్యటించారు.
షాంఘై సహకార సంస్థలో చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్ తదితర దేశాలు సభ్యులుగా ఉన్నాయి. గత ఐదేళ్లలో చైనాలో పర్యటించిన మొదటి సీనియర్ భారత ప్రతినిధి రాజ్‌నాథ్ సింగ్ మాత్రమే.
భారత్, చైనా మధ్య ప్రధాన సమస్య వారి 3,440 కిలోమీటర్ల సరిహద్దు. కొన్నిచోట్ల ఇది స్పష్టంగా గుర్తించలేదు. నదులు, సరస్సులు, మంచు కారణంగా కొన్ని ప్రాంతాలలో సరిహద్దు మారుతుంటుంది, దీనివల్ల రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తిన సందర్భాలున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
కీలక ఒప్పందాలు
2020 జూన్‌లో లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 1975 తర్వాత ఈ రెండు దేశాల మధ్య సైనికులు ప్రాణాలు పోయినంతటి తీవ్ర పోరాటం ఇదే. ఈ ఘటనలో కనీసం ఇరవై మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు మరణించారు.
అప్పటి నుంచి, రెండు వైపులా సైనిక ప్రతిష్టంభనలు నెలకొన్నాయి.
కానీ, ఇప్పుడు వారు మాట్లాడుకోవడానికి, కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
నిరుడు లద్దాఖ్ ప్రాంతంలో కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి భారత్, చైనాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను జనవరిలో తిరిగి ప్రారంభించారు, వీసా ఆంక్షలను సడలించారు.
ఆరేళ్ల తర్వాత భారత యాత్రికులకు టిబెట్ అటానమస్ రీజియన్‌లోని ‘పవిత్ర కైలాశ పర్వతం’, సరస్సును సందర్శించడానికి అనుమతులు లభించాయి.

ఫొటో సోర్స్, Anbarasan Ethirajan/BBC
అయినప్పటికీ, రెండు దేశాల మధ్య సవాళ్లు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
భారత రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. నిరుడు చైనాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు రూ. 10 లక్షల కోట్లకు చేరింది.
భారత్ ముఖ్యంగా అరుదైన భూఖనిజాల(రేర్ ఎర్త్ మినరల్స్) కోసం చైనాపై ఆధారపడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవడానికి సరిహద్దు ప్రాంతాలలో శాంతి చాలా అవసరం.

ఫొటో సోర్స్, Anbarasan Ethirajan/BBC
వాణిజ్యంపై దృష్టి
చైనా ఎక్కువగా తైవాన్‌పైనే దృష్టి పెడుతోంది, కాబట్టి ప్రస్తుతానికి ఉమ్మడి హిమాలయ సరిహద్దులో భారత్‌తో శాంతిని కోరుకుంటోంది. కానీ, తమ ఎదుగుదలను అడ్డుకోవడానికి అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇండియాను ఉపయోగిస్తున్నాయని చైనా అనుమానిస్తోంది.
కాబట్టి, సరిహద్దు వద్ద శాంతితో పాటు భారత్ విషయంలో ఇతర అంశాలలోనూ మెరుగుదల కోరుకుంటోంది చైనా.
భారతదేశంతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని, ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని, తమ కార్మికులు, ఇంజినీర్లపై వీసా నిషేధాలను ఎత్తివేయాలని చైనా ఆశిస్తోంది (2020 సరిహద్దు ఘర్షణ తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా భారత్ అనేక చైనీస్ యాప్‌లను నిషేధించింది, చైనా పెట్టుబడులను పరిమితం చేసింది).
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో పదవీకాలం ప్రారంభమైన తర్వాత భౌగోళిక రాజకీయ మార్పులు కూడా భారతదేశాన్ని చైనాతో దగ్గరయ్యేలా చేశాయి.
"అమెరికాకు చాలా దగ్గరి వ్యూహాత్మక మిత్రదేశంగా ఉంటామని భారత్ భావించింది కానీ, వాషింగ్టన్ నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదు" అని న్యూయార్క్‌లోని అల్బానీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ క్రిస్టోఫర్ క్లారీ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ చర్యలతో..
2025 మే నెలలో పాకిస్తాన్‌తో జరిగిన సరిహద్దు ఘర్షణ సమయంలో చైనా, పాకిస్తాన్ ఎంత దగ్గరగా పనిచేస్తున్నాయో భారత్ చూసింది. ఈ పోరాటంలో చైనా యుద్ధ విమానాలు, క్షిపణులు, రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ ఉపయోగించింది.
ఇక ఘర్షణ తర్వాత కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో సహాయం చేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇది ఇండియాను ఇబ్బంది పెట్టింది. కాల్పుల విరమణ చర్చలను నేరుగా నిర్వహించామని, మరెవరి ప్రమేయమూ లేదని భారత్ బదులిచ్చింది.
తరువాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను ట్రంప్ వైట్‌హౌస్‌లో భోజనానికి ఆహ్వానించారు. ఈ చర్య దిల్లీని మరింత కలవరపెట్టింది.
అదే సమయంలో, అమెరికా, భారత్‌లు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆగస్టు 1 నాటికి ఎటువంటి ఒప్పందం కుదరకపోతే సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు కూడా.
"భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం, వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనలతో, చైనా వంటి దేశాలకు దగ్గరవడానికి ఇదే సమయమనే ఆలోచనలో దిల్లీ ఉంది" అని క్లారీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మారుతున్న ప్రపంచ రాజకీయాలు
పెరుగుతున్న చైనా శక్తిని ఎదుర్కోవడానికి భారత్‌ను అమెరికా కీలక భాగస్వామిగా చూస్తోందని వ్యూహాత్మక నిపుణులు అంటున్నారు. కానీ, ట్రంప్ అనూహ్య చర్యల కారణంగా, భవిష్యత్తులో చైనాతో వివాదం తలెత్తితే అమెరికా నుంచి లభించే మద్దతుపై భారత్ ఇప్పుడు సందేహిస్తోందని తెలిపారు.
ఇక ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ గ్రూప్ కూడా అంత చురుగ్గా లేదు.
అదే సమయంలో, ఎస్‌సీఓ, బ్రిక్స్ వంటి ఇతర అంతర్జాతీయ గ్రూపులలో చైనా మరింత ప్రభావం చూపుతోందని భారత మాజీ దౌత్యవేత్త ఫుంచోక్ స్టోబ్డాన్ అభిప్రాయపడ్డారు.
భారతదేశం ఆచరణాత్మకంగా వ్యవహరిస్తోందని ఆయన అంటున్నారు.
భారత్ తన సంబంధాలను బ్యాలన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని కానీ, దేశీయ రాజకీయ కారణాల వల్ల చైనాకు ఎక్కువగా లొంగిపోవాలని కోరుకోవడం లేదని స్టోబ్డాన్ అభిప్రాయపడ్డారు.
కాగా, రష్యాను కూడా భారత్ నిశితంగా గమనిస్తోంది. తన చిరకాల మిత్రుడు, ప్రధాన ఆయుధ సరఫరాదారు అయిన రష్యా.. యుక్రెయిన్ యుద్ధం కారణంగా చైనాకు దగ్గరైంది. మాస్కోపై పాశ్చాత్య దేశాల ఆంక్షలతో, రష్యా ఇప్పుడు ఇంధన అమ్మకాలు, దిగుమతులు, పెట్టుబడుల కోసం చైనాపై ఆధారపడుతోంది. ఈ మార్పు భవిష్యత్తులో భారత్-చైనా వివాదంలో రష్యా ఎక్కడ నిలబడుతుందో అని దిల్లీని భయపెడుతోంది.
చైనా తన ఎగుమతులపై ఆధారపడిన దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి దాని పారిశ్రామిక శక్తిని ఉపయోగిస్తోంది, భారత్ ఆ ప్రభావాన్ని అనుభవిస్తోంది.
"చైనా ఇటీవల భారతదేశానికి వ్యతిరేకంగా వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటోంది, అరుదైన భూమి అయస్కాంతాలు, ఎరువులు వంటి కీలకమైన ఎగుమతులను నిలిపివేస్తోంది. ఈ చర్యలు భారతదేశ తయారీ, వ్యవసాయ రంగాలను ప్రభావితం చేస్తాయి" అని స్టోబ్డాన్ అన్నారు.
ఇవి భారత్ కార్లు, వ్యవసాయం, క్లీన్ ఎనర్జీ పరిశ్రమలకు చాలా ముఖ్యమైనవి.
అంతేకాదు, చైనా తన దిగుమతులపై ఏప్రిల్ నుంచి ఆంక్షలు విధించింది, కంపెనీలు అనుమతులు పొందాలని సూచించింది.
చైనా ఆంక్షలతో ఉత్పత్తి మందగించవచ్చని భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా, చైనాతో చర్చలు జరుపుతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
సరిహద్దు సమస్య పరిష్కరించుకుంటేనే..
చైనా తన వాణిజ్యాన్ని పెంచుకోవాలనుకున్నప్పటికీ, భారతదేశంతో తన సరిహద్దు వివాదాలపై వెనక్కి తగ్గడంలేదు. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌ను "దక్షిణ టిబెట్" అని పిలుస్తూ చైనా తన వాదనను పెంచుతోంది.
కాగా, అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో పూర్తి భాగమని దిల్లీ నొక్కి చెబుతోంది, ఇక్కడి ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో ఓటు వేస్తారని అంటోంది.
ఈ నేపథ్యంలో "చైనా, భారత్ సార్వభౌమాధికార భావనను వదులుకోకపోతే, వారు ఎప్పటికీ పోరాడుతూనే ఉంటారు'' అని షాంఘైలోని ఫుడాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ షెన్ డింగ్లీ బీబీసీకి చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్‌పై వారు ఒక ఒప్పందానికి రాగలిగితే, రెండు దేశాలు శాశ్వత శాంతిని పొందుతాయని షెన్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతానికి, తమ ప్రాదేశిక వివాదాన్ని సమీప భవిష్యత్తులో పరిష్కరించలేమని దిల్లీ, బీజింగ్ రెండింటికి తెలుసు.
బదులుగా, ప్రపంచంలోని శక్తిమంతమైన ఇతర దేశాలపై ఆధారపడకుండా ఆచరణాత్మకమైన పని సంబంధాన్ని నిర్మించుకోవడానికి, సంఘర్షణను నివారించడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














