తైవాన్ సైనిక విన్యాసాలు: చైనాకు ఏం చెప్పాలనుకుంటోంది?

చైనా, తైవాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టెస్సా వాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తైవాన్ వార్షిక సైనిక విన్యాసాలు 'హాన్ క్వాంగ్ ' బుధవారం నుంచి మొదలయ్యాయి. చైనా చొరబాటుకంటూ ప్రయత్నిస్తే తిప్పికొట్టేలా రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తోంది తైవాన్.

గతంలో ఎన్నడూ లేని విధంగా తైవాన్ భారీ స్థాయిలో ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది. 10 రోజుల పాటు ఇవి సాగనున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు సమయం.

తమ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించడం ద్వారా చైనాకు స్పష్టమైన సందేశం పంపాలన్నది తైవాన్ ఉద్దేశం.

తమను తాము స్వయంప్రత్తిగల దేశంగా తైవాన్ ప్రకటించుకుంటుంటే, అది తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది. సైనిక బలం ప్రయోగించైనా సరే ఏదో ఓ రోజు పునరేకీకరణ చేయాలని భావిస్తోంది.

ఈ పరిణామాలతో తైవాన్ మిత్రదేశమైన అమెరికా కూడా ఇందులో జోక్యం చేసుకుంటుందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తైవాన్, చైనా, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత ఏడాది పౌర భద్రతా విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన డిజాస్టర్ డ్రిల్

హాన్ క్వాంగ్ (Han Kuang) అంటే...

సైనిక విన్యాసాలను 'హాన్ క్వాంగ్' పేరుతో 1984 నుంచి ఏటా నిర్వహిస్తోంది తైవాన్. వేలాది బలగాలను మోహరించి, భూమి, సముద్రం, గగనతలంలో భారీ స్థాయి సైనిక విన్యాసాలను నిర్వహిస్తూ తైవాన్ తన సైనిక సంపత్తిని చాటి చెబుతుంటుంది.

చైనా ప్రధాన భూభాగాలన్ని తిరిగి కలిసిపోవడం అనేది హాన్ క్వాంగ్ అనే చైనీస్ పదానికి సాంకేతిక అర్ధం. రిపబ్లిక్ ఆఫ్ చైనా మొదటి లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. కానీ, తైవాన్ ఈ విన్యాసాలను తన బలాన్ని ప్రదర్శించడానికి ఉపయోగిస్తుంది.

చైనా నుంచి దాడులకు అవకాశం ఉందన్న ఆందోళనలు ఇటీవలికాలంలో ఎక్కువవుతున్న నేపథ్యంలో, హాన్‌ క్వాంగ్‌కు ప్రాధాన్యత పెరిగింది.

తైవాన్, చైనా, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది తైవాన్ 10 రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది.

సైనిక విన్యాసాలు ఎలా జరుగుతాయి?

బుధవారం(జూలై 9) ప్రారంభమైన సైనిక విన్యాసాలు ఈ నెల 18వరకు జరుగుతాయి.

రాకెట్ లాంచర్లు, డ్రోన్ల్లు తదితర సైనిక సంపత్తితో పాటు స్థానికంగా డెవలప్‌ చేసిన మిసైళ్లను ప్రదర్శిస్తారు.

ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మొబైల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ (హిమార్స్) కూడా అందులో ఉంది. దీన్ని అమెరికా అందించింది. ఇలాంటి వ్యవస్థనే యుక్రెయిన్‌కు కూడా అమెరికా సమకూర్చింది. ప్రస్తుతం తైవాన్ సైన్యం ఉపయోగిస్తున్న వ్యవస్థ కన్నా దీని రేంజ్ మరింత ఎక్కువగా ఉంది.

దాదాపు 22 వేలమంది సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. ఇది గత ఏడాది సంఖ్య కన్నా సుమారు 50 శాతం అధికం.

ఇటీవల కాలంలో చైనా యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి, నౌకలు సముద్ర జలాల్లోకి తరచుగా చొరబడుతున్న నేపథ్యంలో చైనా వ్యూహాలను తిప్పికొట్టడంపై తైవాన్ ఈసారి సైనిక విన్యాసాల్లో ప్రధానంగా దృష్టి పెడుతోంది.

ఇటీవలి కాలంలో పౌర రక్షణ వ్యవస్థకూ హాన్‌ క్వాంగ్‌లో ప్రాధాన్యత పెరిగింది. ప్రజలను ఒకేసారి తరలించడం, వైమానిక ప్రదర్శనలు నిర్వహించడం వంటి ప్రత్యేక విన్యాసాలను నిర్వహిస్తోంది.

తైవాన్, చైనా, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అందించిన మొబైల్ రాకెట్ లాంచ్ సిస్టమ్‌ను సైనిక విన్యాసాల్లో భాగంగా తైవాన్ ప్రదర్శిస్తోంది.

'హాన్ క్వాంగ్' బలోపేతం ఎందుకు?

తన గ్రేజోన్ వార్‌ఫేర్‌తో పాటు తైవాన్‌లో తప్పుడు సమాచార ప్రచారాలను చైనా విస్తృతం చేసింది. ఈ పరిణామాలు తైవాన్ ద్వీపం రక్షణను దెబ్బతీసేలా ఉన్నాయని కొంతమంది పరిశీలకులు హెచ్చరించారు.

చైనా నుంచి తైవాన్‌కు ముప్పు ఉందని అమెరికా హెచ్చరించింది. తైవాన్‌పై దండెత్తడానికి సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2027 వరకు గడువు ఇచ్చారన్న సమాచారాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అయితే ఈ విషయాన్ని చైనా ధ్రువీకరించలేదు.

డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధ్యక్షుడు విలియం లాయ్ గత ఏడాది ఎన్నికైనప్పటి నుంచి తైవాన్, చైనా మధ్య ఉద్రిక్తత నెలకొంది. లాయ్‌ను విభజనవాది అని చైనా ముద్ర వేసింది.

హాన్‌ క్వాంగ్‌పై సహజంగానే చైనా అసంతృప్తిగా ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)