ఎర్ర సముద్రంలో గ్రనేడ్లతో పేల్చేసి, మరో నౌకను ముంచేసిన హూతీలు

ఫొటో సోర్స్, AnsarAllah Media Office/ Screengrab
- రచయిత, డేవిడ్ గ్రిట్టెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎర్రసముద్రంలో ఓ కార్గో షిప్‌పై యెమెన్‌కు చెందిన హూతీలు దాడి చేసి ముంచేశారని, ఈ దాడిలో నౌకలోని సిబ్బందిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు యూరోపియన్ నేవల్ మిషన్ తెలిపింది. ఈ ఘటనలో మరో ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంది.
లైబీరియన్ జెండాతో, గ్రీకు సంస్థ నిర్వహణలో ఉన్న ఎటర్నిటీ సీ అనే రవాణా నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు. సోమవారం చిన్న చిన్న పడవల్లో వచ్చి, రాకెట్ల ద్వారా గ్రనేడ్లను ప్రయోగించడంతో నౌకకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ దాడిలో నౌకలోని ప్రొపెల్లర్ వ్యవస్థ ధ్వంసమైందని బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ తెలిపింది.
ఈ దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. రాత్రి నుంచి నౌకలోని సిబ్బంది కోసం గాలిస్తున్నారు.
ఎటర్నిటీ సీ నౌక ఇజ్రాయెల్ వెళుతోందని, అందుకే దానిపై దాడి చేసినట్లు ఇరాన్ మద్దతున్న హూతీలు ప్రకటించారు. సిబ్బందిలో కొందరిని తాము 'సురక్షిత ప్రాంతాని'కి తరలించినట్లు చెప్పారు. అయితే, వారి సంఖ్య వెల్లడించలేదు.

''ప్రాణాలతో బయటపడిన నౌకా సిబ్బందిని హూతీలు కిడ్నాప్ చేశారు", వారిని తక్షణమే విడుదల చేయాలని యెమెన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కోరింది.
వారం రోజుల వ్యవధిలో హూతీలు ముంచేసిన రెండో నౌక ఇది.
దీనికి ముందు ఆదివారం, లైబీరియన్ జెండాతో గ్రీస్ సంస్థ నిర్వహణలో నడుస్తున్న రవాణా నౌక 'మేజిక్ సీస్'పై హూతీలు మిసైల్స్, డ్రోన్లతో దాడి చేశారు. "అది ఆక్రమిత పాలస్తీనాలోని పోర్టుల్లోకి ప్రవేశించడంపై నిషేధం ఉన్న కంపెనీకి చెందినది'' అందుకే దానిపై దాడి చేసినట్లు హూతీలు ప్రకటించారు.
సాయుధులైన కొందరు వ్యక్తులు నౌకలోకి వచ్చి పేలుడు పదార్థాలు అమర్చిన తర్వాత, వరుస పేలుళ్లు జరిగి అది మునిగిపోయినట్లు మంగళవారం హూతీలు విడుదల చేసిన వీడియో ఫుటేజ్‌లో కనిపిస్తోంది.
మేజిక్ సీస్ రవాణా నౌకకు చెందిన 22 మంది సిబ్బందిని పక్కనే వెళుతున్న మరో వాణిజ్య నౌక రక్షించింది.

ఫొటో సోర్స్, EPA
పాలస్తీనియన్లకు మద్దతుగా దాడులు
2023 నవంబర్ నుంచి హూతీలు ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో మిసైల్స్, డ్రోన్లు, చిన్నచిన్న బోట్లలో వచ్చి దాదాపు 70 కార్గో షిప్‌లపై దాడులు చేశారు.
ఇజ్రాయెల్ గాజాలో హమాస్‌పై దాడుల నేపథ్యంలో తాము పాలస్తీనియన్లకు మద్దతుగా వ్యవహరిస్తున్నట్లు హూతీలు చెబుతున్నారు.
అలాగే.. ఇజ్రాయెల్, అమెరికా, యూకేకు చెందిన నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లుగా తరచూ పొరబడుతున్నారని, ఈ దేశాలు తమపై చేసిన వైమానిక దాడులకు ఇది ప్రతిస్పందనగా పేర్కొంటున్నారు.
ఎటర్నిటీ సీ నౌకపై జరిగిన దాడికి అంతర్జాతీయ స్పందనలో భాగంగా, సహాయక చర్యల్లో తాము కూడా పాల్గొంటున్నట్లు ఎర్ర సముద్రంలో ఈయూకు చెందిన నేవల్ మిషన్ 'ఆపరేషన్ యాస్పైడ్స్' తెలిపింది. సముద్రం నుంచి ఇప్పటివరకూ ఆరుగురిని రక్షించినట్లు పేర్కొంది.
ఈ ఆరుగురిలో ఐదుగురు ఫిలిప్పైన్స్ జాతీయులు కాగా, ఒకరు భారతీయుడని, మరో 19 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని యాస్పైడ్స్ ప్రతినిధి వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో చెప్పారు.
వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, గ్రీస్‌కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ సంస్థ డయాప్లస్ బుధవారం ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో సముద్రపు నీటిలో 24 గంటలు గడిపిన ఐదుగురిని కాపాడినట్లు ఉంది.
"మిగిలిన వారి ఆచూకీ తెలిసే వరకూ గాలింపు చర్యలు కొనసాగిస్తాం" అని డయాప్లస్ తెలిపింది.
ఈ దాడిలో నలుగురు చనిపోయారనని మారిటైమ్ సెక్యూరిటీ సంస్థలు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ కూడా రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, Diaplous/Handout via Reuters
మేజిక్ సీస్, ఎటర్నిటీ సీ మీద జరిగిన దాడుల్ని అమెరికా విదేశాంగ శాఖ ఖండించింది. "సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణా, ప్రాంతీయ ఆర్థిక సుస్థిరత, సముద్ర మార్గాల భద్రతకు ఇరాన్ మద్దతున్న హూతీల నుంచి ముప్పు పొంచి ఉంది" అని పేర్కొంది.
"అమెరికా చాలా స్పష్టంగా ఉంది. నౌకలు సముద్రంలో స్వేచ్ఛగా తిరిగేందుకు, రవాణా నౌకలు హూతీల ఉగ్రదాడుల బారిన పడకుండా రక్షించేందుకు అమెరికా తప్పనిసరిగా చర్యలు చేపడుతుంది. ఈ దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించాలి" అని అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈ ఏడాది తొలినాళ్లలో ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై హూతీల దాడుల తర్వాత, హూతీలే లక్ష్యంగా యెమెన్‌పై అమెరికా ఏడువారాల పాటు వైమానిక దాడులు చేసింది. అనంతరం మే నెలలో అమెరికాతో హూతీలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు.
తాజా దాడుల నేపథ్యంలో, దౌత్యమార్గంలో పరిష్కారాలు కనుగొనాలని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి కోరారు.
"కొన్ని నెలల ప్రశాంతత తర్వాత, ఎర్ర సముద్రంలో తిరిగి దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను, స్వేచ్ఛాయుత సముద్ర రవాణాను ఉల్లంఘించడమే" అర్సెనియో డొమిన్‌గెజ్ చెప్పారు.
"ఈ దాడులు, వాటివల్ల కలిగే కాలుష్యానికి అమాయకులైన ప్రయాణికులు, సముద్రాలపై ఆధారపడి జీవిస్తున్న సాధారణ ప్రజలు బలవుతారు " అని ఆయన హెచ్చరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














