హమాస్ దిగిపోవాలంటూ గాజాలో భారీ నిరసన, రాకెట్ల దాడి తర్వాత ప్రజల్లో ఆగ్రహం

ఫొటో సోర్స్, AFP
- రచయిత, రష్డి అబౌలాఫ్, అలెక్స్ బాయ్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో జరిగిన అతిపెద్ద నిరసన ఇదే.
ఈ హమాస్ వ్యతిరేక నిరసనలో వందల మంది పాల్గొన్నారు. హమాస్ గ్రూప్ అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వీరంతా వీధుల్లోకి వచ్చారు.
ముసుగులు ధరించిన హమాస్ మిలిటెంట్లు కొందరు తుపాకులు, లాఠీలతో కొందరిపై దాడి చేశారు. నిరసనకారులను బలవంతంగా చెల్లాచెదురు చేశారు.
ఉత్తర గాజాలోని బెయిత్ లాహియా వీధుల్లో మంగళవారం కొంతమంది యువకులు "అవుట్, అవుట్, అవుట్, హమాస్ అవుట్" అనే నినాదాలతో నిరసన ప్రదర్శన చేస్తున్న వీడియోలను హమాస్ వ్యతిరేకులు కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ నిరసనపై హమాస్ నేరుగా స్పందించలేదు, కానీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూనే కారణమని ఆరోపించింది.

నిరసనలను తక్కువగా చేసి చూపించేందుకు ప్రయత్నించిన హమాస్ మద్దతుదారులు, ఆ నిరసనల్లో పాల్గొన్న వారు దేశద్రోహులంటూ ఆరోపణలు చేశారు.
ఇస్లామిక్ జిహాద్ సాయుధులు ఇజ్రాయెల్‌పై రాకెట్లను ప్రయోగించిన ఒక రోజు తర్వాత గాజాలో ఈ నిరసనలు జరిగాయి. రాకెట్ల దాడికి బదులుగా బెయిత్ లాహియాలోని చాలా ప్రాంతాలను ఖాళీ చేయించాలని ఇజ్రాయెల్ నిర్ణయించడంతో హమాస్‌పై ఈ ప్రాంతం ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది.
దాదాపు రెండు నెలల కాల్పుల విరమణ తర్వాత గాజాలో తన సైన్యాన్ని తిరిగి మోహరించింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణను పొడిగించేందుకు అమెరికా చేసిన నూతన ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించిందని ఆరోపించింది.
అయితే, జనవరిలో జరిగిన అసలు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ విస్మరించిందంటూ హమాస్ ప్రత్యారోపణలు చేసింది.
మార్చి 18న వైమానిక దాడులతో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి వందల సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
నిరసనకారుల్లో ఒకరైన బెయిత్ లాహియా నివాసి మొహమ్మద్ దియాబ్ ఇల్లు యుద్ధంలో ధ్వంసమైంది. ఏడాది కిందట జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఈయన తన సోదరుడిని కూడా కోల్పోయారు.
"ఎవరి కోసమో, ఏ పార్టీ ఎజెండా కోసమో, లేదంటే ఇతర దేశాల ప్రయోజనాల కోసమో మా ప్రాణాలను బలివ్వాలనుకోవడం లేదు'' అని ఆయన అన్నారు.
"హమాస్ దిగిపోవాలి. శిథిలాల కింద ధ్వంసమైపోయిన, దు:ఖంలో కూరుకుపోయిన వారి మొర ఆలకించాలి'' అన్నారు.
"హమాస్ దిగిపోవాలి, పాలన అంతం కావాలి" అని నిరసనకారులు నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా ఆ ఫుటేజీలో కనిపించాయి.
గాజాలో 2007 నుంచి హమాస్ పాలన సాగిస్తోంది. అంతకుముందు ఏడాది జరిగిన పాలస్తీనా ఎన్నికల్లో గెలిచి, ఆ తర్వాత తన ప్రత్యర్థులను అత్యంత హింసాత్మకంగా తరిమికొట్టింది.
యుద్ధం తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి గాజా వీధులతో పాటు ఆన్‌లైన్‌లోనూ హమాస్‌పై బహిరంగ విమర్శలు పెరిగాయి. అయినప్పటికీ, నేటికీ హమాస్‌కి విధేయులు చాలామంది ఉన్నారు. అయితే, హమాస్‌కి మద్దతునిచ్చే వారిలో ఎంతమంది మారారనేది కచ్చితంగా అంచనా వేయడం కష్టం.

ఫొటో సోర్స్, AFP
యుద్ధానికి చాలాకాలం ముందు నుంచే హమాస్‌పై ప్రజల్లో వ్యతిరేకత కనిపించేది, కాకపోతే ప్రతీకార చర్యల భయంతో అది ఎక్కువగా బయటపడలేదు.
"ఇలా అంటున్నందుకు క్షమించండి. కానీ, హమాస్ అసలు దేన్ని పణంగా పెడుతోంది? మన రక్తాన్ని/ప్రాణాన్ని పణంగా పెడుతోంది. ప్రపంచానికి మన ప్రాణాలు కేవలం ఒక నంబర్‌గా మాత్రమే కనిపిస్తున్నాయి" అని గాజాకు చెందిన మొహమ్మద్ అల్-నజ్జర్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
"హమాస్‌కు కూడా మా ప్రాణాలను సంఖ్యలానే చూస్తోంది. దిగిపోండి" అని కూడా పోస్ట్‌లో పేర్కొన్నారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడితో గాజాలో యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడిలో దాదాపు 1,200 మంది మరణించారు. 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు.
ఈ దాడికి ప్రతిగా, గాజాలో హమాస్‌ను నాశనం చేయడానికి ఇజ్రాయెల్ సైనిక దాడి చేపట్టిందని, ఈ దాడిలో 50,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని హమాస్ నిర్వహణలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గాజాలోని 2.1 మిలియన్ల(21 లక్షలమంది) జనాభాలో చాలామంది, ఇప్పటికే ఎన్నోసార్లు నిరాశ్రయులయ్యారు.
గాజాలో 70 శాతం భవనాలు దెబ్బతిన్నాయని లేదా ధ్వంసమయ్యాయని అంచనా.
ఆరోగ్య సంరక్షణ, నీరు, పారిశుద్ధ్య వ్యవస్థలు కుదేలయ్యాయి. ఆహారం, ఇంధనం, మందుల కొరత ఉంది. ఆశ్రయం దొరకడం కూడా కష్టంగా మారింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














