సంగారెడ్డి: చిన్న ఆనవాలు కూడా దొరక్క కుమిలిపోతున్న కన్నోళ్లు, సిగాచీ విషాదంలో ఇంకా దొరకని 8 మంది ఆచూకీ

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
(గమనిక: ఈ కథనంలో అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)
''రెండుసార్లు రక్త నమూనాలు తీసుకున్నారు. శరీరంలో చిన్న ముక్క దొరికినా పంపించి పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు ఏ నమూనాతో మ్యాచ్ కాకపోవడం మా దురదృష్టం'' అంటూ బాధపడ్డారు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నారావు.
జూన్ 30న హైదరాబాద్ శివారు పాశమైలారంలోని సిగాచీ ఇండస్ట్రీలో జరిగిన భారీ ప్రమాదంలో చిన్నారావు కుమారుడు గుండేపల్లి వెంకటేశ్ ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు.
వెంకటేశ్ తండ్రి, ఇతర బంధువులు పాశమైలారంలోని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా) కార్యాలయం వద్ద వేచిచూస్తున్నారు.
''ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎదురుచూస్తూనే ఉన్నాం. 11వ రోజున కర్మ చేయాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదైనా ఎముక తీసుకెళ్లి చేయాలి.. లేదా పిల్లాడ్ని ఇక్కడ ఒగ్గేసి వెళ్లాలా.. అర్థం కావడం లేదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ఫొటో సోర్స్, UGC
ప్రమాదంలో ఎంతమంది చనిపోయారంటే..
సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం, 44 మంది చనిపోయారు.
మరో 8 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
అలా ఆచూకీ తెలియాల్సిన వారిలో, ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన గుండేపల్లి వెంకటేశ్ ఒకరు.
సిగాచీ ఇండస్ట్రీలో క్వాలిటీ అనాలసిస్ విభాగంలో నాలుగేళ్లుగా సీనియర్ కెమిస్టుగా పనిచేస్తున్నారు వెంకటేశ్.
ఇప్పటివరకు చనిపోయిన వారికి సంబంధించి లభించిన శరీర భాగాల నుంచి శాంపిల్స్ సేకరించి, వాటిని వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏ శాంపిల్స్ తో పోలి ఉంటే వాటిని అప్పగిస్తూ వచ్చారు.
ప్రస్తుతం ప్రమాదం జరిగిన పరిశ్రమ వద్దకు మీడియాను, ఇతర బయట వ్యక్తులను పోలీసులు అనుమతించడం లేదు.

ఫొటో సోర్స్, UGC
ఆనవాళ్ల కోసం అణువణువూ గాలింపు
తమకు దొరికిన శాంపిళ్లను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాల డీఎన్ఏతో సరిపోల్చే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కానీ, మరో 8 మందికి సంబంధించి ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు.
వారికి సంబంధించి ఏదైనా శరీర భాగాలు లేదా అవశేషాలు లభిస్తాయేమోనని డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బంది పరిశ్రమలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో అణువణువూ గాలిస్తున్నారు.
చిన్న ఇనుప కడ్డీలు, కర్రలు పట్టుకుని ప్రమాద ప్రదేశంలో శిథిలాలను తవ్వుతూ ఏదైనా ఎముకలు, కణజాలం వంటివి దొరుకుతాయేమోనని వెతుకుతున్నారు.
అలాగే, సిగాచీ ఇండస్ట్రీ వద్ద తొలగించిన శిథిలాలను సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశంలో పోశారు. అక్కడ కూడా మున్సిపల్, డీఆర్ఎఫ్ సిబ్బంది శోధిస్తున్నారు.
ఘటన జరిగి 10 రోజులవడంతో ఆచూకీ లేని 8 మంది కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఫొటో సోర్స్, UGC
ఇంకా ఆచూకీ తెలియాల్సిన వారు వీరే..
ఆచూకీ తెలియని వారిలో తెలంగాణకు చెందిన సిల్వేరి రవి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుండేపల్లి వెంకటేశ్, కర్ణాటకకు చెందిన జస్టిన్(ప్రస్తుత నివాసం హైదరాబాద్), ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ కుమార్ శర్మ, అఖిలేశ్ కుమార్ నిషాద్, విజయ్ కుమార్ నిషాద్, బిహార్‌కు చెందిన శివ్‌జీ కుమార్, ఝార్ఖండ్‌కు చెందిన ఇర్ఫాన్ అన్సారీ ఉన్నారు.
వీరి కుటుంబ సభ్యులు పాశమైలారం చేరుకుని వారి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు.
కర్ణాటకలోని బీదర్‌కు చెందిన 22ఏళ్ల జస్టిన్ పనిలో చేరిన మూడో రోజే ప్రమాదంలో గల్లంతయ్యారు.
జస్టిన్‌కు చెందిన దాదాపు పాతిక మంది కుటుంబ సభ్యులు పాశమైలారం ప్రాంతానికి వచ్చి ఎదురు చూస్తున్నారు.
జస్టిన్ కుటుంబం గతంలో హైదరాబాద్ పటాన్‌చెరు ప్రాంతానికి వచ్చి అక్కడే ఉంటోంది.
భీంరావు అనే స్నేహితుడి సాయంతో సిగాచీ ఇండస్ట్రీలో ప్రమాదానికి మూడు రోజుల ముందే పనికి కుదిరాడని జస్టిన్ తండ్రి రామదాసు చెప్పారు.
ఈ ప్రమాదంలో భీంరావు కూడా చనిపోయారని వివరించారు.

చేతికందొచ్చిన కొడుకు పని చేసుకుంటూ కుటుంబానికి ఆదరవుగా ఉంటాడని భావించిన జస్టిన్ తండ్రి రామదాసుకు కన్నీళ్లే మిగిలాయి.
''ఇప్పటికి తొమ్మిది రోజులు అయ్యింది. అన్నం లేదు.. నీళ్లు లేవు. నాకున్నది ఒక్క కొడుకు. నేనెట్లా బతకాలి. ఇప్పుడు ఏం చేయాలో, ఎవరూ ఏమీ చెప్పడం లేదు'' అని మంగళవారం(జూన్ 8న) బీబీసీ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు రామదాసు.
అధికారులు వచ్చి మరో 24 గంటలు, మరో 24 గంటలు అంటున్నారే కానీ ఏమీ తెలియడం లేదని అన్నారాయన.
''నాతో సహా ఐదు మంది శాంపిల్స్ ఇచ్చాం. ఇప్పటివరకు లభించిన ఏ శరీర భాగంతోనూ మ్యాచ్ కాలేదని చెబుతున్నారు'' అని రామదాసు వాపోయారు.
ఇదే విషయమై జస్టిన్ మేనత్త బీబీసీతో మాట్లాడారు.
''జస్టిన్‌కు సంబంధించి ఏదైనా గుర్తు దొరుకుతుందేమోని ఆశగా ఎదురు చూస్తున్నాం. ఆయన మృతదేహం దొరకలేదు. చిన్న బట్ట కూడా దొరకలేదు. మొత్తం మా కుటుంబాలన్నీ చిన్న చిన్న పాపలతో వచ్చి ఇక్కడే ఉంటూ ఏదైనా ఆచూకీ దొరుకుతుందేమోని ఎదురు చూస్తున్నాం'' అని చెప్పారు.

బంధువుల ఎదురుచూపులు
శాంపిల్స్ తీసుకున్నా.. మ్యాచ్ కాకపోవడంతో రెండు నుంచి మూడుసార్లు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారని ఆచూకీ లేని 8 మంది కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
యూపీకి చెందిన అఖిలేశ్ కుమార్ నిషాద్, విజయ్ కుమార్ నిషాద్ ఆచూకీ కూడా గత నెల 30వ తేదీన ప్రమాదం జరిగినప్పటి నుంచి కనిపించడం లేదని బంధువులు చెబుతున్నారు.
అఖిలేశ్, విజయ్ తల్లిని వెంట పెట్టుకుని వారి బంధువు జైప్రకాష్ నిషాద్ యూపీ నుంచి వచ్చి పాశమైలారంలోని ఐలా ఆఫీసు వద్ద ఎదురుచూస్తూ కనిపించారు.
''ఇప్పటివరకు ఏమీ తెలియడం లేదు. అధికారులు వచ్చి డెడ్ బాడీ దొరుకుతుందని చెబుతున్నారు. కానీ, ఇప్పటివరకు అది కూడా దొరకలేదు. ప్రభుత్వం, కంపెనీ ఇచ్చే పరిహారం ఏమో గానీ కనీసం డెడ్‌బాడీ అయినా దొరికితే చాలు అన్నట్లుగా ఉంది'' అని అన్నారు జైప్రకాశ్ నిషాద్.
ఇప్పటికీ కొందరి ఆచూకీ దొరక్కపోవడానికి కారణాలపై సంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి గాయత్రీ దేవిని బీబీసీ సంప్రదించింది.
''కుటుంబ సభ్యుల నుంచి శాంపిల్స్ తీసుకున్నాం. కానీ, ఇప్పటివరకు వారి డీఎన్ఏ ప్రమాద స్థలం నుంచి సేకరించిన శాంపిల్స్‌తో మ్యాచ్ కాలేదు. ఇంకా డీఎన్ఏ శాంపిల్స్ మ్యాచింగ్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చివరి నిమిషం వరకు పరీక్షలు కొనసాగిస్తాం'' అని ఆమె చెప్పారు.

లోపాలపై డిసెంబర్‌లో నివేదిక
సిగాచీ ఇండస్ట్రీలో మొత్తం 197 మంది పనిచేస్తుండగా, 110 మంది రెగ్యులర్, 87 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నట్లు తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ గుర్తించింది.
గతేడాది డిసెంబరులో పరిశ్రమలో చేసిన తనిఖీలకు సంబంధించిన నివేదిక తాజాగా వెలుగు చూసింది.
అగ్నిప్రమాదాలు జరిగితే బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడం, కార్మికుల భద్రతకు సంబంధించి రక్షణ పరికరాలు పూర్తిస్థాయిలో లేకపోవడం, ప్రాథమిక చికిత్స కిట్లు లేవని, కార్మికులకు రక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ తన నివేదికలో చెప్పారని ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు.
ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ వెళ్లి లోపాలు ఉన్నాయి. సరిచేసుకోవాలని స్పష్టంగా రిపోర్టు ఇచ్చారని బీబీసీతో చెప్పారు తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి.
''టెక్నికల్ అంశాలను సరిచేసుకోవడం మేనేజ్‌మెంట్ బాధ్యత'' అని ఆయన స్పష్టం చేశారు.
అయితే, తమ కంపెనీకి భద్రతా ప్రమాణాలకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నట్లు ప్రమాదం జరిగిన తర్వాత సిగాచీ ఇండస్ట్రీ ఎండీ, సీఈవో అమిత్ రాజ్ సిన్షా ప్రకటించారు.

ప్రమాద కారణాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం
మరోవైపు సిగాచీ పరిశ్రమలో ప్రమాదానికి కారణాలపై పూర్తి స్థాయి కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు.
డ్రైయర్ చాంబర్‌లో డస్ట్ ఎక్స్‌ప్లోజన్ కారణంగా ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్లుగా మంత్రి వివేక్ వెంకటస్వామి బీబీసీతో చెప్పారు.
ఇదే విషయాన్ని కంపెనీ యాజమాన్యం కూడా ప్రాథమిక సమాచారంగా చెబుతోంది.
ప్రమాదానికి పూర్తిస్థాయి కారణాలు తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. ఈ కమిటీ ఇప్పటికే ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించింది.
కమిటీ ప్రమాదానికి గల కారణాలు అన్వేషించడంతోపాటు రసాయన, ఫార్మా రంగాల్లోని పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో పూర్తిస్థాయి నివేదిక సమర్పించనుందని అధికారులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














