'లైంగిక హింస హమాస్‌కు ఒక యుద్ధ ఆయుధం' అంటూ బాధితుల వాంగ్మూలంతో విడుదలైన ఇజ్రాయెల్ నిపుణుల నివేదిక

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, డేవిడ్ గ్రిటెన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిలో ''ఉద్దేశపూర్వక జాతిహనన వ్యూహంలో భాగంగా'' లైంగిక హింసకు పాల్పడిందని ఇజ్రాయెల్‌లోని న్యాయ, లింగ నిపుణులు తాజా నివేదికలో ఆరోపించారు. దీనిపై న్యాయం కోసం వారు డిమాండ్ చేశారు.

ఈ నివేదిక అత్యాచార యత్నానికి గురైన బాధితురాలి ప్రత్యక్ష వాంగ్మూలం, గాజాలో బందీలుగా ఉండి విడుదలైన 15మంది, అలాగే లైంగిక దాడికి ప్రత్యక్ష సాక్షులైనవారి నుంచి తీసుకున్న వాంగ్మూలాలతో తయారుచేసినట్టు ది దిన్హా ప్రాజెక్ట్ తెలిపింది.

''నేరస్తులపై వ్యక్తిగతంగా నేరారోపణలు మోపడం సాధ్యంకాకపోయినా, ఈ నేరాలను విచారించేందుకు ఇదో చట్టబద్ధమైన బ్లూప్రింట్'' అని ఆ బృందం పేర్కొంది.

అయితే తమ దళాలు లైంగిక హింసకు పాల్పడ్డాయనడాన్ని హమాస్ ఖండించింది. మహిళా బందీలను అగౌరవంగా చూశామనే ఆరోపణలను హమాస్ తిరస్కరించింది.

ఏదేమైనా, అత్యాచారం, సామూహిక అత్యాచారంతో సహా అనేక ప్రదేశాలలో అక్టోబర్ 7 దాడి సమయంలో సంఘర్షణ సంబంధిత లైంగిక హింస జరిగిందని నమ్మడానికి ‘సహేతుకమైన కారణాలు’ ఉన్నాయని, బందీలు అత్యాచారం సహా లైంగిక హింసకు గురయ్యారనేందుకు ‘నమ్మదగిన సమాచారం’ ఉందని మార్చి 2024లో ఐక్యరాజ్యసమితి మిషన్‌ తేల్చింది.

ఇజ్రాయెల్ చేతిలో హత్యకు గురికావడానికి ముందు, ముగ్గురు అగ్రశ్రేణి హమాస్ నాయకులు హత్య అపహరణ, హింసించడం తదితర నేరాలతోపాటు అత్యాచారం, లైంగిక హింసకు పాల్పడ్డారని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్ ఆరోపించారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అక్టోబరు 7న, హమాస్, దాని అనుబంధ పాలస్తీనా సాయుధ బృందాలకు చెందిన వందలాదిమంది దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేశారు. సుమారు 1,200 మందిని చంపారు. 251 మందిని బందీలుగా పట్టుకున్నారు.

దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ గాజాలో సైనిక చర్యను ప్రారంభించింది. ఈ చర్యవల్ల 57,500 మందికి పైగా మరణించారని హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

లైంగిక హింస బాధితులకు న్యాయం చేయడానికి దీనా ప్రాజెక్టును అక్టోబర్ 7 తర్వాత ప్రారంభించారు. దీనిని న్యాయ పండితుడు రూత్ హాల్పెరిన్‌కద్దర్, న్యాయవాది, మాజీ చీఫ్ మిలిటరీ ప్రాసిక్యూటర్ షారోన్ జగాగి పిన్హాస్, మాజీ న్యాయమూర్తి డిప్యూటీ అటార్నీ జనరల్ నవా బెన్‌ఓర్ స్థాపించారు.

హమాస్ లైంగిక హింసను ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించిందని, మారణహోమ పథకంలో భాగంగా, ఇజ్రాయెల్ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసి, వారిని కేవలం అమానవీయంగా చూసే లక్ష్యంతో ఉపయోగించిందని మంగళవారం ప్రచురితమైన ఈ నివేదికలో పేర్కొంది.

ఇది "అక్టోబర్ 7 దాడి బాధితులకు, ఇతర సంఘర్షణ ప్రాంతాలలోని బాధితులకు న్యాయం చేయడానికి ఒక మార్గాన్ని సృష్టిస్తుంది" అని బృందం పేర్కొంది.

సోషల్ మీడియా పోస్టుల నుంచి రికార్డు చేసిన సాక్ష్యాల వరకు, అలాగే ఫోరెన్సిక్ సాక్ష్యాలు, విజువల్, ఆడియో సాక్ష్యాల వరకు అనేక ఆధారాలను తాము సమీక్షించామని రచయితలు చెప్పారు.

అయితే, ఈ నివేదిక బాధితులను గుర్తించదు. కానీ వారిలో కొందరి పేర్లను సూచించే నివేదికలను ఉదహరిస్తుంది. అక్టోబరు 7న నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌లో జరిగిన దాడిలో ప్రాణాలతో బయటపడిన ఒక మహిళ తాను అత్యాచారానికి, లైంగిక దాడికి గురైనట్టు దీనా ప్రాజెక్ట్ సభ్యులకు తెలిపారు.

గాజాలో బందీలుగా ఉన్న అందరినీ విడిపించాలంటూ 2024లో ఇజ్రాయెల్‌లో ప్రజల నిరసన

ఫొటో సోర్స్, Getty Images

తనతో బలవంతంగా లైంగికచర్యలు చేయించారని, లైంగిక దాడి జరిగిందని, మాటలతోనూ, శారీరకంగా లైంగిక వేధింపులకు గురి చేశారని 15 మంది మాజీ బందీల్లో ఒకరు తెలిపారు.

బలవంతంగా తాను నగ్నత్వాన్ని భరించాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. ఇదే అనుభవాన్ని మరో ఆరుగురు బందీలు కూడా చెప్పారు.

బందీల్లో దాదాపు అందరూ మౌఖిక, శారీరక వేధింపులకు గురయ్యారని, అందులో ప్రైవేట్ భాగాలను తాకడం లాంటి చర్యలు కూడా ఉన్నాయని, వివాహం చేసుకోవాల్సిందిగా ఆరుగురి ఒత్తిళ్లుకూడా ఎదురయ్యారని నివేదిక తెలిపింది.

బందీల్లోని ఇద్దరు మగవాళ్లు కూడా తమను నగ్నంగా ఉంచారని, ఆ సమయంలో శారీరక వేధింపులకు గురయ్యానని, ఒకరు తన శరీరంపై వెంట్రుకలన్నింటినీ గీసేశారని చెప్పారు.

లైంగిక హింస సంఘటనలను చూసిన లేదా విన్న వ్యక్తుల నుండి వచ్చిన కథనాలు ఇటువంటి నేరాలు అక్టోబరు 7న "విస్తృతంగా, ఒక పద్ధతి ప్రకారం" ఉన్నాయని చూపించాయని దీనా ప్రాజెక్ట్ తెలిపింది.

ఐదుగురు సాక్షులు కనీసం నాలుగు వేర్వేరు సామూహిక అత్యాచార కేసులను నివేదించినట్లు నివేదిక తెలిపింది. మరో ఏడుగురు, ఎనిమిది వేర్వేరు అత్యాచారం లేదా తీవ్రమైన లైంగిక దాడులు జరిగినట్టు, వాటిలో కొన్ని బందీలుగా ఉన్నప్పుడే జరిగినట్టు తెలిపారు.

ఇంకా ఐదుగురు కనీసం మూడు వేర్వేరు లైంగిక దాడుల కేసుల గురించి చెప్పారు. వీటిలో కొన్ని బందీలుగా ఉన్నప్పటివి ఉన్నాయి. మరో ముగ్గురు మూడు వేర్వేరు శారీరక వైకల్య సంఘటనలను నివేదించారు.

వీటిలో తొమ్మిది కేసులు నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌కు సంబంధించినవి కాగా, రెండు నహల్ ఓజ్ సైనిక స్థావరానికి సంబంధించినవి. ఒకటి రూట్ 232 రోడ్డుకు సంబంధించినది, నాలుగు గాజాలో బందీలుగా ఉన్నప్పటివి.

ఇజ్రాయెల్, హమాస్

ఫొటో సోర్స్, Reuters

వీటిపై మొదటగా స్పందించిన 27మంది ''ఆరుప్రాంతాలలో లైంగిక హింస జరిగిన స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి'' అని చెప్పారు. నోవా ఫెస్టివల్, రూట్ 232, బెయెరి, అల్యూమిమ్, నహల్ ఓజ్, రెయిమ్ లకు చెందిన కిబ్బుట్జిమ్ వంటి చోట్ల డజన్ల కొద్దీ కేసులను వివరించారు.

"చాలామంది బాధితులు శాశ్వతంగా మౌనం వహించారు" అని నివేదిక పేర్కొంది, ఎందుకంటే వారు అక్టోబర్ 7 న హతులయ్యారు, లేదా దిగ్భ్రాంతి చెంది మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు’’ అని నివేదిక తెలిపింది.

ఇందుకు ప్రతిస్పందనగా ఈ నివేదిక రచయితలు అంతర్జాతీయ న్యాయ మార్గదర్శనాన్ని (గ్లోబల్ లీగల్ బ్లూప్రింట్) అందించారు. అందులో లైంగిక హింసను 'యుద్ధ ఆయుధం'గా ఉపయోగించడాన్ని నేరంగా ఎలా విచారించాలనే విషయాన్ని వివరించారు.

సాక్ష్యాలు స్పష్టంగా లేకపోయినా, బాధితులు లేకపోయినా, నేరాలను వ్యక్తులపై నేరుగా మోపలేకపోయినా వ్యవస్థాగతంగా న్యాయం సాధించేలా ఈ పద్ధతి పనిచేస్తుంది.

ఈ నివేదికలో సాక్ష్యాల ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని ఒక సంఘటనకు ఎంత సమీపంగా ఉన్నాయనే ఆధారంగా వర్గీకరించే ఒక విధానాన్ని రూపొందించారు. అదే విధంగా సామూహిక దాడుల సమయంలో జరిగిన పాశవిక చర్యలకు నేర బాధ్యతను మోపేందుకు కూడా ఒక చట్టపరమైన పద్ధతిని సూచించారు.

ఇందులో ముఖ్యంగా ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగా ఆ చర్యను చేయకపోయినా, లేదా ఇతరులు ఆ నేరాన్ని చేసిన విషయం తెలియకపోయినా, వారు నేర బాధ్యత నుంచి తప్పించుకోలేరని సూచించారు.

నివేదిక చివరలో ''ఈ న్యాయం జరగాల్సింది కేవలం వ్యక్తిగత బాధితుల కోసమే కాదు, మరింత విస్తృతంగా చూస్తే యుద్ధ సమయంలో లైంగిక హింస అనేది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే తీవ్రమైన నేరమనే వాస్తవాన్ని అంగీకరించడానికి ఇలాంటి నేరాలకు బాధ్యులైనవారిని శిక్షించాల్సిన అవసరం ఉందన్న నిబద్ధతనీ, ఇలాంటి క్రూరమైన పనులకు శిక్ష లేకుండా ఉండటానికి అంతర్జాతీయ సమాజం అంగీకరించదన్న విషయాన్నీ స్పష్టంగా వెల్లడించడానికి కూడా'' అని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)