గాజాలో పరిస్థితులు నరకం కంటే దారుణం : బీబీసీ ఇంటర్వ్యూలో ఐసీఆర్‌సీ చీఫ్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జెరెమీ బోవెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గాజాలో పరిస్థితులు నరకం కంటే అధ్వానంగా మారాయని 'ది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్'(ఐసీఆర్‌సీ) చీఫ్ బీబీసీతో చెప్పారు.
జెనీవాలోని ఐసీఆర్‌సీ ప్రధాన కార్యాలయంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సంస్థ అధ్యక్షురాలు మీర్యానా స్పోల్జారిక్ మాట్లాడుతూ 'మానవత్వం విఫలమవుతోంది' అన్నారు.
'గాజా భూమ్మీది నరకం' అంటూ గత ఏప్రిల్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇప్పుడు పరిస్థితి ఏమైనా మారిందా అని అడిగాను. అందుకు ఆమె.. 'పరిస్థితి మరింత దిగజారింది. జరుగుతున్నదంతా చూస్తూ అలాగే ఉండలేం. అక్కడ జరుగుతున్న విధ్వంసం స్థాయి, అక్కడి ప్రజల బాధలు ఆమోదయోగ్యమైన చట్టాలు, నైతికత, మానవీయ ప్రమాణాలు అన్నింటినీ దాటిపోయాయి' అని చెప్పారు.
'మరీ ముఖ్యంగా.. అక్కడి ప్రజలు మనుషులుగా వారికి దక్కాల్సిన కనీస గౌరవాన్ని కూడా కోల్పోయారు. అది మనందరి మనస్సాక్షిని కలచివేయాలి'' అన్నారు.
పాలస్తీనియన్ల కష్టాలకు ముగింపు పలికేందుకు, అలాగే, ఇజ్రాయెల్ బందీల విడుదలకు ప్రపంచ దేశాలు మరింతగా ప్రయత్నించాలి అన్నారామె.
ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కారణంగా కష్టాలు పడుతున్న ప్రజల బాధలను తగ్గించేందుకు సుమారు ఒకటిన్నర శతాబ్దాలుగా కృషి చేస్తున్న మానవతా సంస్థ.
జెనీవా ఒప్పందాల అమలయ్యేలా కూడా ఈ సంస్థ చూస్తుంది. యుద్ధాలు జరిగినప్పుడు సాధారణ పౌరుల రక్షణకు ఉద్దేశించినవి ఈ ఒప్పందాలు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1949లో అప్పటివరకు ఉన్న మూడు ఒప్పందాలకు అదనంగా ఇందులో నాలుగో ఒప్పందం చేర్చారు.


ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ తాను గాజాపై చేస్తున్న దాడులను ఆత్మరక్షణ చర్యలుగా చెప్పుకొంటోంది కదా అని మీర్యానాకు గుర్తుచేశాను. అందుకు ఆమె.. 'ప్రతి దేశానికీ తనను తాను రక్షించుకునే హక్కు ఉంటుంది' అన్నారు.
'అంతేకాదు.. ప్రతి తల్లికీ తన బిడ్డను క్షేమంగా చూసుకునే హక్కు ఉంటుంది. బందీలుగా పట్టుకోవడాన్ని కూడా సమర్థించం. చిన్నారులకు ఆహారం, వైద్యం, భద్రత లేకుండా చేయడానికి ఎలాంటి సమర్థింపూ ఉండదు. యుద్ధానికి నియమాలుంటాయి. ఏ సంఘర్షణలోనైనా, ఏ పక్షమైనా వాటిని గౌరవించాల్సిందే' అని చెప్పారు.
అంటే ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లో సాగిస్తున్న విధ్వంసం, 50 వేల మందికిపైగా పాలస్తీనియన్లను చంపేయడాన్ని అంతకుముందు 2023 అక్టోబర్ 7న హమాస్, ఇతర సాయుధ పాలస్తీనియన్లు సుమారు 1200 మందిని చంపేయడం, 250 మందిని బందీలుగా తీసుకెళ్లడంతో పోల్చి సమర్థించొచ్చా?
''జెనీవా ఒప్పందాలను గౌరవించకపోవడాన్ని సమర్థించినట్లు కాదు. ఏ పక్షం అయినా నిబంధనలను ఉల్లంఘించడానికి వీల్లేదు. జెనీవా ఒప్పందం ప్రకారం ప్రతి ఒక్కరికీ అవే నియమాలు వర్తిస్తాయి. గాజాలోని ఒక చిన్నారికి జెనీవా ఒప్పందం ప్రకారం ఎలాంటి రక్షణ నియమాలు ఉంటాయో ఇజ్రాయెల్‌లోని చిన్నారులకూ అవే ఉంటాయి'' అన్నారు మీర్యానా.
'ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.. మీ చిన్నారి కూడా ఇలాంటి భద్రతలేని పరిస్థితుల్లో చిక్కుకోవచ్చు. అప్పుడు ఆ చిన్నారికి అలాంటి రక్షణ అవసరం రావొచ్చేమో అనేది మీకు కూడా తెలియదు' అన్నారామె.
గాజాలో ఏం జరుగుతోందనే సమాచారం తెలుసుకోవడానికి ఐసీఆర్‌సీ ఒక విశ్వసనీయమైన ఆధారం. ఇజ్రాయెల్ గాజాలోకి బీబీసీ సహా, అంతర్జాతీయ వార్తా సంస్థలను అనుమతించడం లేదు. జర్నలిస్టులను ఆ ప్రాంతంలోకి రానీయడం లేదు. గాజాలో 300కి పైగా ఐసీఆర్‌సీ సిబ్బంది రిపోర్టింగ్ చేస్తున్నారు. వారిలో 90శాతం మంది పాలస్తీనీయన్లు. యుద్ధంలో ముఖ్యమైన ఘటనలను వారు రికార్డు చేస్తున్నారు.
గాజాలో ఉన్న తమ టీమ్ లీడర్‌తో మీర్యానా స్పోల్జారిక్ ప్రతి రోజూ మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు ఉన్న గాజా హ్యూమేనిటేరియన్ ఫౌండేషన్ రఫాలో సహాయ సామగ్రి పంపిణీ చేస్తున్న సమయంలో అనేకమంది పాలస్తీనియన్లు మరణించిన ప్రాంతానికి సమీపంలోనే ఐసీఆర్‌సీ నిర్వహిస్తున్న ఆసుపత్రి ఉంది.

ఫొటో సోర్స్, Reuters
గాజా హ్యూమేనిటేరియన్ ఫౌండేషన్ వద్దకు ప్రజలు భారీగా వచ్చి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు రెండుసార్లు జరగడాన్ని అక్కడకు సమీపంలోని తమ ఫీల్డ్ హాస్పిటల్ వద్ద ఉన్న ఐసీఆర్‌సీ వైద్య బృందాలు రెండుసార్లు చూశాయి.
"గాజాలో ఎక్కడా భద్రత లేదు. ఎక్కడా లేదు. పౌరులకు, బందీలకు కూడా. అది నిజం. మా ఆసుపత్రి కూడా సురక్షితం కాదు. యుద్ధం మధ్య మనం పని చేసే పరిస్థితిని మరోసారి నేను గుర్తు చేసుకోవాలనుకోవడం లేదు" అని మీర్యానా స్పోల్జారిక్ అన్నారు.
కొన్ని రోజుల కిందట ఓ బాలుడిని టెంట్‌లో ఉంచి చికిత్స చేస్తున్నప్పుడు, ఓ బుల్లెట్ టెంట్ నుంచి దూసుకుపోయింది.
"మా సిబ్బందికి కూడా భద్రత లేదు. వాళ్లు రోజుకు 20 గంటలు పని చేస్తున్నారు. వాళ్లంతా విసిగిపోయారు. ఇది చాలా దారుణం. ఇది సహనస్థాయిని దాటిపోయింది" అని ఐసీఆర్‌సీ అధ్యక్షురాలు అన్నారు.
మంగళవారం ఉదయం కొన్ని గంటల వ్యవధిలో రఫాలోని ఆసుపత్రికి 184 మంది పేషెంట్లు వచ్చారు. అందులో 19 మంది ఆసుపత్రికి వచ్చాక చనిపోయారు. ఆ తర్వాత మరో 8 మంది మరణించారని ఐసీఆర్‌సీ చెప్పింది. ఏడాది కిందట ఈ ఆసుపత్రి ప్రారంభించిన తర్వాత ఒకే సంఘటనలో ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి.
ఇది మంగళవారం తెల్లవారు జామున జరిగింది. దక్షిణ గాజాలో సహాయం పంపిణీ చేస్తున్న చోట గుమిగూడిన పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరిపాయని.. అక్కడి ఆ భయంకరమైన దృశ్యాల గురించి ఐసీఆర్‌సీ మెడిక్స్, పాలస్తీనా సాక్షులు వివరించారు. ఇది "పూర్తిగా మారణహోమం" అని విదేశీ ప్రత్యక్ష సాక్షి ఒకరు అన్నారు.
అయితే ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటన వేరేగా ఉంది. అందులో "అనేక మంది అనుమానితులు "ఇజ్రాయెల్ బలగాల వైపు కదులుతున్నారు'' అని వారికి కేటాయించిన మార్గాల నుంచి పక్కకు వస్తున్నారు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వారిని హెచ్చరించేందుకు తమ బలగాలు "గాలిలోకి కాల్పుల జరిపాయని.. కొంతమంది అనుమానిత వ్యక్తులు సైనికుల వైపు రావడంతో వారు దగ్గరగా వచ్చిన తర్వాత వారిపై కాల్పులు జరిపినట్లు" అందులో ఉంది.
ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. ఆదివారం మాదిరిగానే పాలస్తీనియన్లపై కాల్పులు జరిపారన్న వాదనను ఇజ్రాయెల్ సైన్యం తిరస్కరించింది.

ఫొటో సోర్స్, Reuters
ఎలాగైనా గెలవాలనే ప్రయత్నం, యుద్ధం, అమానవీయ పరిస్థితుల గురించి ఐసీఆర్‌సీ ఆందోళన చెందుతున్నట్లు మీర్యానా చెప్పారు.
"ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్లు, ప్రాంతాలను దాటి ఈ ప్రపంచాన్ని దురదృష్టకరమైన ప్రదేశంగా మారుస్తున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి మనిషి ప్రాథమిక హక్కులను కాపాడే నియమాలను మనం తుంగలోకి తొక్కేస్తున్నాం" అని ఆమె అన్నారు.
కాల్పుల విరమణ లేకపోతే ఆ ప్రాంతం భవిష్యత్ ఏంటా అని ఆమె ఆందోళన చెందుతున్నారు.
"ఇది చాలా ముఖ్యం. ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు సరైన మార్గం. మీరు ఆ మార్గాన్ని శాశ్వతంగా నాశనం చేస్తే, ఈ ప్రాంతంలో భద్రత ఎన్నటికీ కనిపించదు. ఇప్పటికీ ఆలస్యం ఏం కాలేదు. మనం దీన్ని ఆపవచ్చు"
''ప్రపంచ దేశాల నాయకులు బాధ్యత తీసుకోవాలి. వారు ఏదో ఒకటి చేయాలని, వారు చేయగలిగినంత చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఒక రోజు ప్రతిధ్వనిస్తుంది. వారి వెంట పడుతుంది. వారి ఇంటికి వస్తుంది" అని మీర్యానా అన్నారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ దాడులకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు సమర్థన కాదనేది ఐసీఆర్‌సీ అధ్యక్షురాలి అభిప్రాయం.
"ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, నిబంధనలను ఉల్లంఘించే హక్కు ఏ పక్షానికీ లేదు" అని ఆమె స్పష్టం చేశారు.
హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందిని చంపి, 251 మందిని బందీలుగా పట్టుకెళ్లిన తర్వాత ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించింది.
అప్పటి నుంచి గాజాలో 54,607 మంది చనిపోయారు. మార్చ్ 18న తిరిగి దాడులు ప్రారంభించిన తర్వాత మరో 4335 మంది చనిపోయారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది.
రెండు పక్షాలు దాడులు ఆపాలని ఐసీఆర్‌సీ అధ్యక్షురాలు విజ్ఞప్తి చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














