గాజా: హమాస్ అధికారం నుంచి తప్పుకోవాలని పాలస్తీనియన్లు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో వందల మంది పాల్గొంటున్నారు. హమాస్ అధికారం నుంచి తప్పుకోవాలని, ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తర గాజాలోని బెయిత్ లాహియాలో ఈ వారం హమాస్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన జరిగింది. 2023 అక్టోబర్‌లో యుద్ధం మొదలైన తర్వాత హమాస్‌కు వ్యతిరేకంగా ఇంత పెద్ద ప్రదర్శన జరగడం ఇదే తొలిసారి.
'హమాస్ అవుట్' అంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.
గాజాలో రెండు నెలల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది. దీంతో హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో ఆందోళనలు జరుగుతున్నాయి.
మార్చ్ 18 నుంచి ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన తర్వాత వందల మంది చనిపోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు.

కాల్పుల విరమణను పొడిగించేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అయితే, జనవరిలో కుదిరిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ విస్మరించిందని హమాస్ అంటోంది.
యుద్ధం తిరిగి ప్రారంభం కావడానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కారణమని బుధవారం హమాస్ ఆరోపించింది.
హమాస్‌కు వ్యతిరేకంగా ఆందోళనలను హమాస్ మద్దతుదారులు తేలిగ్గా తీసిపడేస్తున్నారు. ఈ ఆందోళనలు చేస్తున్నవారంతా ద్రోహులని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిరసనకారులు ఏం కోరుకుంటున్నారు?
తాము యుద్ధంతో విసిగిపోయామని నిరసనకారులు బీబీసీతో చెప్పారు.
"నిద్రపోలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, మాకు పరిశుభ్రమైన మంచినీరు కూడా దొరకడం లేదు. ఇది సాధారణ జీవితం కాదు. అవమానకరమైన జీవితం. మేం విసుగెత్తిపోయాం" అని గాజా వాసి ఫాతిమా రియాద్ అల్ అమ్రానీ బీబీసీ గాజా లైఫ్‌లైన్ కార్యక్రమంలో చెప్పారు.
పేరు చెప్పడానికి ఇష్టపడని గాజాకు చెందిన ఓ వ్యక్తి, ఈ ప్రాంతంలో హమాస్ పాలన కొనసాగడానికి వీల్లేదని అన్నారు.
"గాజా మీద హమాస్ నియంత్రణ వదిలేయాలి. ఇక్కడ ఇప్పటికే చాలా హింస, విధ్వంసం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో మేం ఇజ్రాయెల్‌తో కానీ, పశ్చిమ దేశాలతో కానీ పోరాడలేం. ప్రపంచం అంతా మాకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తోంది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
వీటి వెనుక ఎవరైనా ఉన్నారా?
గాజాలో ఆందోళనలు సందర్బోచితంగా కనిపిస్తున్నాయని, ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నా, చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయని పాలస్తీనాలో మానవహక్కుల కమిషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అమ్మార్ డ్వీక్ అన్నారు.
"ప్రజల అసహనం భరించలేని స్థాయికి చేరింది. హమాస్ ఈ ప్రాంతంపై నియంత్రణను వదులుకోవాలని వారు కోరుకుంటున్నారు. హమాస్ లేకపోతే తమకు మానవతా సాయం అందుతుందని వారు భావిస్తున్నారు" అని ఆయన అన్నారు.
ఆందోళనలు సందర్భోచితమే అయినప్పటికీ, గాజాను భవిష్యత్‌లో ఎవరు పరిపాలించాలనే దానిపై వారిలో స్పష్టత లేదని వాషింగ్టన్‌లోని మిడిల్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధకుడిగా ఉన్న డాక్టర్ హస్సన్ నిమ్నేహ్ చెప్పారు.
ఆందోళనలు చేస్తున్న వారితో పాటు వారికి నాయకత్వం వహిస్తున్న వారిలో ఎక్కువ మంది యువకులు. వారి వెనుక ఎలాంటి రాజకీయ గ్రూపులూ లేవని పాలస్తీనియన్ యాక్టివిస్ట్ అబ్దుల్ హమీద్ అబ్దెల్ అట్టి చెప్పారు.
గాజా వెలుపల బీబీసీ కొంతమందితో మాట్లాడినప్పుడు, వారు ఆందోళనల వెనుక ఎవరైనా ఉండొచ్చని అన్నారు.

ఫొటో సోర్స్, EPA
పాలస్తీనా రాజకీయాల్లో విభజన
కొన్నేళ్లుగా, పాలస్తీనా రాజకీయ నాయకత్వం రెండు అధికారిక కేంద్రాలు హమాస్, ఫతా ఉద్యమంగా చీలిపోయింది. హమాస్ గాజాను, పాలస్తీనా అథారిటీ ద్వారా ఫతా ఉద్యమం ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ను పాలిస్తున్నాయి.
2006లో జరిగిన పాలస్తీనా పార్లమెంటరీ ఎన్నికల్లో హమాస్ ఘన విజయం సాధించిన తర్వాత ఈ రెండు గ్రూపుల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఎన్నికల తర్వాత మహమూద్ అబ్బాస్ నాయకత్వంలోని ఫతా గ్రూప్ గాజా నుంచి వైదొలగింది.
గాజాలో విజయం సాధించిన తర్వాత, ఇజ్రాయెల్‌తో మునుపటి పాలస్తీనా ఒప్పందాల పునరుద్ధరణకు, ఇజ్రాయెల్ చట్టబద్ధతను గుర్తించేందుకు, హింసకు వ్యతిరేకంగా జరిగిన అన్ని ప్రయత్నాలనూ హమాస్ వ్యతిరేకించింది.
దీంతో హమాస్ నాయకత్వంలోని ప్రభుత్వం మీద ఇజ్రాయెల్, దాని మిత్రపక్షంగా ఉన్న పశ్చిమ దేశాలు తీవ్రమైన ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు విధించాయి.
ఫతాకు అనుకూలంగా ఉన్న సైనికులను 2007లో హమాస్ గాజా నుంచి పంపించేసింది. దీంతో ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలు గాజాపై నిర్బంధాన్ని తీవ్రం చేశాయి.
అప్పటి నుంచి, హమాస్, ఫతా మధ్య ఒప్పందం కోసం పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

ఫొటో సోర్స్, AFP
గాజాలో రాజకీయ మార్పు తప్పదా?
యుద్ధం తిరిగి మొదలైన తర్వాత, హమాస్‌కు వ్యతిరేకంగా వీధుల్లో, ఆన్‌లైన్‌లో విమర్శలు పెరిగాయి. అయినప్పటికీ గాజాలో హమాస్‌కు వీర విధేయులైన అనుచరగణం ఉంది. హమాస్‌కు మద్దతు తగ్గినా, అదెంత స్థాయి వరకు తగ్గిందో అంచనా వెయ్యడం కష్టం.
2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభం కావడానికి ముందే హమాస్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభం అయ్యాయని పరిశీలకులు చెబుతున్నారు.
అయితే, భయం వల్ల బయటపడటం లేదని అంటున్నారు.
గాజాలో ఫతా అధికార ప్రతినిధి ముంతెర్ అల్ హయక్ ఆందోళనలను ఉద్దేశించి మాట్లాడుతూ, "ప్రజలు ఏం కోరుకుంటున్నారో వినండి" అన్నారు.
గాజాలో హమాస్ అస్థిత్వం "పాలస్తీనా ఏర్పాటుకు ముప్పుగా పరిణమించింది" అని ఆయన అన్నారు.
దీనిపై హమాస్ స్పందన కోసం బీబీసీ అనేకసార్లు ప్రయత్నించింది. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.
"అణచివేత, దేశ వ్యతిరేకులకు వ్యతిరేకంగా గొంతు వినిపించే హక్కు అందరికీ ఉంది" అని హమాస్ అధికారిక ఫేస్‌బుక్ గ్రూప్ బస్సీమ్ నయీం చెప్పారు.
"గాజాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అయితే, దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోకూడదు" అని ఆయన అన్నారు.
ఈ ఆందోళనలు రానున్న రోజుల్లోనూ కొనసాగే అవకాశం ఉందని కొంతమంది కార్యకర్తలు బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














