దొంగలను పట్టించిన బూట్లు, 24 గంటల్లోనే ఓ ఎన్‌కౌంటర్, మరికొన్ని అరెస్టులు..ఎలా జరిగిందంటే

ఫొటో సోర్స్, HANDOUT
- రచయిత, విజయానంద్ అరుముగం
- హోదా, బీబీసీ ప్రతినిధి
చెన్నైలో జరిగిన వరస చైన్ స్నాచింగ్ సంఘటనలు, ఆ తర్వాత 24 గంటల్లో అనేక మలుపులు తిరిగాయి.
ఉదయం 6చోట్ల మహిళల మెడల్లో గొలుసులు చోరీకి గురికావడం, తర్వాత 4 గంటల్లో విమానంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం, అర్ధరాత్రి ఎన్‌కౌంటర్, మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్‌లో మూడో వ్యక్తిని అరెస్టు చేయడం వంటి సంఘటనలు సంచలనం సృష్టించాయి.
వరసగా ఆరుగురు మహిళల నుంచి గొలుసులు లాక్కున్న కేసును పోలీసులు సీసీటీవీ ద్వారా ఎలా బయటపెట్టారు? విమానం ఎక్కిన ఇద్దరిని పోలీసులు ఎలా అరెస్ట్ చేశారు?
అర్ధరాత్రి అరెస్టు చేసిన వ్యక్తిని పోలీసులు ఉదయం ఎందుకు ఎన్‌కౌంటర్ చేశారు?


ఫొటో సోర్స్, HANDOUT
అసలు ఏం జరిగింది?
చెన్నై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ అరుణ్ విలేఖరులకు ఈ విషయం గురించి వివరించారు.
"మార్చి 25న ఉదయం 6:30 గంటలకు జరిగిన చైన్ స్నాచింగ్ సంఘటనలకు సంబంధించి నిఘా విభాగానికి సమాచారం అందింది. వెంటనే పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. యాంటీ-స్నాచింగ్ పెట్రోల్‌ను అప్రమత్తం చేశారు."
ఉదయం 6 గంటలకు సైదాపేటలో మొదటి చైన్ స్నాచింగ్ జరిగింది. "తరువాత, వారు తిరువాన్మియూర్ నుంచి గిండి వరకు ఆరు ప్రదేశాల్లో గొలుసులను దొంగిలించారు" అని ఆయన చెప్పారు.
దోపిడీ చేసిన వెంటనే విమానాశ్రయానికి వెళ్లి టిక్కెట్లు కొని, అందుబాటులో ఉన్న విమానంలో ముంబై లేదా హైదరాబాద్‌కు వెళ్లడమే ఆ ముఠా ప్రణాళిక అని అరుణ్ చెప్పారు.
"ఈ ముఠాకు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే అలవాటు లేదు" అని ఆయన అన్నారు.
"అరెస్టు చేసిన వ్యక్తుల నుంచి 26.5 తులాల విలువ గల ఆరు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. మెడలోని గొలుసును దొంగలు లాగుతుండగా 65 ఏళ్ల మహిళ గాయపడ్డారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు" అని ఆయన తెలిపారు.
దోపిడీ తర్వాత, వందకు పైగా సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నేరంలో పాల్గొన్న వ్యక్తులను అరెస్ట్ చేశామని అరుణ్ పేర్కొన్నారు.
"సంఘటన జరిగిన సౌత్ జోన్‌లో నేరస్థులను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 3 గంటల్లో పట్టుకున్నాం" అని ఆయన అన్నారు.
విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తుల అరెస్టును వివరిస్తూ ..."వారు ఉదయం 4.15 గంటలకు (మార్చి 25) చెన్నై చేరుకున్నారు. ఉదయం 6 గంటలకు దోపిడీ చేసిన తర్వాత, ఉదయం 10 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరారు" అని మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ అరుణ్ చెప్పారు.
"సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నేరస్థులను పట్టుకున్నారు. వారు దుస్తులు మార్చుకున్నారు కానీ బూట్లు మార్చుకోలేదు. దాని ఆధారంగానే విమానంలోనే ఒకరిని అరెస్టు చేశాం" అని అరుణ్ చెప్పారు.
మీనంబాక్కం విమానాశ్రయ పోలీసు ఇన్‌స్పెక్టర్ పాండియన్ విమానం ఎక్కి, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, విమానాశ్రయ అధికారులతో సంప్రదించిన తర్వాత అరెస్ట్ చేశారని అరుణ్ తెలిపారు.
ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో మిగతా ప్రయాణికులకు వివరించారు పాండియన్. దాంతో ఆ వ్యక్తిని విమానంలోంచి దించడానికి వారంతా సాయం చేశారని పోలీస్ కమిషనర్ అరుణ్ తెలిపారు.
నేరంలో పాల్గొన్న వారిలో ఒకరికి చెల్లుబాటు అయ్యే ఆధార్ ఐడీ లేకపోవడంతో టిక్కెట్ తీసుకోవడంలో సమస్య వచ్చింది. దాంతో ఆ వ్యక్తి మరొక టికెట్ కౌంటర్ వద్ద వేచి ఉన్నాడు. అప్పుడే పోలీసులు రెండో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారని తెలిపారు.
దోపిడీ ముఠా నేపథ్యం గురించి అరుణ్ మాట్లాడుతూ, "వారిలో ఇద్దరు ముంబైకి చెందినవారు. ఈరోజు (మార్చి 26) అరెస్ట్ చేసిన మూడవ వ్యక్తి కర్ణాటకకు చెందినవారు. దోపిడీ కోసం ద్విచక్ర వాహనాన్ని తీసుకువచ్చింది ఆయనే." అని అన్నారు.

"ఈ సంఘటన ఇరానియన్ దొంగల తరహాలో జరిగిందా?" అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు "ఇరానీ దొంగలు దృష్టిని మళ్లిస్తారు. చైన్ స్నాచింగ్‌లు, దోపిడీలు ఇప్పుడు జరుగుతున్నాయి. చెన్నైలోని రోడ్లు వారికి బాగా తెలుసు" అని అరుణ్ బదులిచ్చారు.
ప్రజలను మళ్లించి దోచుకోవడం ఇరానియన్ దొంగల అలవాటు. ఇరాన్ నుంచి వచ్చిన వారు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు. తమిళనాడు పోలీసులు వారి దోపిడీ శైలిని 'ఇరానీ శైలి' అని పిలుస్తారు.
వారు ఒక పెద్ద గ్రూపుగా పనిచేస్తున్నారని అరుణ్ అన్నారు. "వారికి భారతదేశం అంతటా క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉంది. మహారాష్ట్రలో వారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అక్కడ ఉన్న 20 క్రిమినల్ గ్రూపులలో జాఫర్ గులాం హుస్సేన్ మూడవ వ్యక్తి" అని అన్నారు.
వారు విమానంలో తప్పించుకుని ఉంటే, ఆ ముఠాను పట్టుకోవడం సాధ్యం అయ్యేది కాదని కూడా ఆయన వివరించారు.
ఎన్‌కౌంటర్ గురించి అడిగినప్పుడు, "ఎన్‌కౌంటర్లు ప్రణాళిక ప్రకారం జరిగేవి కావు. పోలీసులు తమ పని తాము చేసుకుంటుండగా అవి అనుకోకుండా జరిగాయి" అని అరుణ్ అన్నారు.
‘‘ఆ వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు నాటు తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. పోలీసు వాహనం మాత్రమే దెబ్బతింది. ఆ తర్వాత ఆత్మరక్షణ కోసం ఇన్‌స్పెక్టర్ మహ్మద్ బుఖారీ ఒకసారి తుపాకీతో ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు" అని అరుణ్ తెలిపారు.

ఫొటో సోర్స్, HANDOUT
గంట వ్యవధిలోనే ఆరు చోట్ల దొంగతనాలు
ఉదయం 6 గంటల ప్రాంతంలో చెన్నైలోని సైదాపేటతో సహా ఆరు చోట్ల చైన్ స్నాచింగ్ జరిగినట్లు చెన్నై మెట్రోపాలిటన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం (మార్చి 25) సమాచారం అందింది.
ఈ దోపిడీలు గంటలోనే జరగడంతో, చెన్నై సౌత్ జోన్‌లోని అడయార్, పునితా తోమైయార్ హిల్, త్యాగరాయ నగర్ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు వెంటనే సమాచారం అందింది.
అంతకుముందు, ఉదయం 6 గంటల ప్రాంతంలో, తిరువాన్మియూర్‌లోని ఇందిరా నగర్‌లో పనికి వెళ్తున్న 54 ఏళ్ల మహిళ నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 8 తులాల నగలు లాక్కొని వెళ్లిపోయారు.
ఈ విషయంలో ఆ మహిళ తిరువాన్మియూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శాస్త్రి నగర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న 66 ఏళ్ల మహిళ నుంచి 4 గ్రాముల బంగారు గొలుసు లాక్కున్నారని బీసెంట్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ఆ తరువాత, గిండి రేస్ క్లబ్ ప్రాంతం, సైదాపేట, వేలచ్చేరి విజయనగర్ బస్టాండ్‌లలో అనుమానాస్పద వ్యక్తులు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులను లాక్కున్నారని అక్కడి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, HANDOUT
విమానాశ్రయంలో ఇద్దరి అరెస్టు
ఈ సంఘటనలలో కొన్ని అడయార్ ప్రాంతంలో జరిగినందున, అడయార్ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, దర్యాప్తు చేపట్టారు.
చెన్నై నగరమంతటా పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. దీని తర్వాత, చెన్నై విమానాశ్రయంలో తనిఖీలు జరిగాయి. హైదరాబాద్‌కు బయలుదేరబోతున్న ఇండిగో విమానంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
అడయార్ డిప్యూటీ కమిషనర్ పొన్ కార్తీక్‌కుమార్‌తో బీబీసీ మాట్లాడింది. "అరెస్టుకు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంలో మెట్రోపాలిటన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి పత్రికా ప్రకటన జారీ చేస్తారు" అని మాత్రమే ఆయన సమాధానం ఇచ్చారు.
తరువాత, చెన్నై మెట్రోపాలిటన్ పోలీసులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
"బంగారు గొలుసు దోపిడీలో పాల్గొన్న వ్యక్తులు చెన్నై విమానాశ్రయం వైపు వెళ్తున్నారనే సమాచారం ఆధారంగా, ప్రత్యేక దళాలు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాయి"
"దోపిడీలలో పాల్గొన్న వ్యక్తులలో ఒకరిని విమానాశ్రయం ఎంట్రీ దగ్గర అరెస్టు చేశారు. మరొక వ్యక్తిని విమానం లోపల అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, HANDOUT
మూడో వ్యక్తిని ఎలా అరెస్టు చేశారు?
మూడవ వ్యక్తి సల్మాన్‌ను ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో ప్రత్యేక పోలీసు దళాలు అరెస్టు చేశాయి.
దోపిడీ తర్వాత రైలులో ప్రయాణిస్తున్న సల్మాన్‌ను రైల్వే పోలీసుల సహాయంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, HANDOUT
దొంగలను ఎలా పట్టుకున్నారు?
ప్రాథమిక దర్యాప్తులో వారిద్దరూ ఇతర రాష్ట్రాలకు చెందినవారని, గతంలోనూ చైన్ స్నాచింగ్‌కి పాల్పడినట్లు తేలిందని పోలీసుల ప్రకటనలో తెలిపారు.
బంగారు గొలుసు దోపిడీకి పాల్పడిన వారిని పోలీసులు మూడు గంటల్లోనే అరెస్టు చేసినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. దీని గురించి బీబీసీ ఒక సీనియర్ పోలీసు అధికారితో మాట్లాడింది.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆయన మాట్లాడుతూ, "సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పారు. చెన్నైలో పల్లవన్ తంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒకేసారి బంగారు గొలుసులు లాక్కున్న తర్వాత నిందితులు వచ్చిన వాహనాన్ని వారు ఆపారు" అని అన్నారు.
"వారు అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లి, ఆపై ముంబైకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ప్రాథమిక దర్యాప్తులో వారు మహారాష్ట్రకు చెందినవారని తేలింది" అని ఆయన అన్నారు.
జనవరి 17న, చెన్నై సమీపంలోని తాంబరంలో ఒకేసారి పదిచోట్లకుపైగా చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. ఇందులో ఒక మహిళా పోలీసు అధికారికి చెందిన బంగారు గొలుసు కూడా ఉంది.
"ఈ దోపిడీకి పాల్పడిన వ్యక్తులు విమానంలో పారిపోయి ఉండవచ్చని నిర్ధరించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వెతికినా వారు దొరకలేదు. ఇప్పుడు, దోపిడీ అదే శైలిలో జరగడంతో, మేం త్వరగా చర్య తీసుకుని వారిని అరెస్ట్ చేశాం" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
చైన్ స్నాచింగ్‌కి పాల్పడిన ముఠాపై ముమ్మర దర్యాప్తు
ప్రస్తుతం తదుపరి దర్యాప్తులు జరుగుతున్నందున, చైన్ స్నాచింగ్‌కి పాల్పడిన ముఠా పూర్తి నేపథ్యం త్వరలో తెలుస్తుందని అన్నారు.
బంగారం ధర బాగా పెరగడంతో గొలుసులను దొంగిలించడానికి వచ్చిన దొంగలు విమానంలోనే వచ్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
దొంగలు బంగారు గొలుసును లాక్కోవడానికి ఉపయోగించిన వాహనం కర్ణాటక రాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉంది.
'దీని తర్వాత, వారు ఈ వాహనాలను ఎవరి నుంచి కొనుగోలు చేశారు?' దొంగిలించిన బంగారాన్ని వారు ఏం చేస్తారు? చెన్నైలో వారికి సహాయం చేసిన ముఠా ఏది?' అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














