రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదం: భారత్‌లో ద్వంద్వ పౌరసత్వం చెల్లుతుందా, చట్టం ఏం చెబుతోంది?

రాహుల్ గాంధీ, కాంగ్రెస్, పౌరసత్వం

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించిన పిటిషన్‌పై మార్చి 24న అలహాబాద్‌ హైకోర్ట్ లఖ్‌నవూ బెంచ్‌ ఎదుట విచారణకు వచ్చింది.

ఈ కేసులో సమాధానం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు చాలా సమయం ఇచ్చింది.

ఏప్రిల్ 21 తర్వాతి వారంలో ఈ కేసు విచారణ జరుగుతుందని లఖ్‌నవూ బెంచ్ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఏఆర్ మసూది, జస్టిస్ ఏకే శ్రీవాస్తవలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం కూడా ఉందనేది విఘ్నేష్ శిశిర్ వాదన.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ పిటిషన్‌పై 2024 నవంబర్‌లో విచారణ జరిపిన న్యాయస్థానం సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి సంబంధిత మంత్రిత్వ శాఖ బ్రిటన్ ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలు కోరుతూ లేఖ రాసిందని, ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కోర్టుకు వివరించారు.

అప్పటి నుంచి, కేంద్రం కోర్టును సమయం కోరుతూ వస్తోంది. సోమవారం విచారణ జరిగినప్పుడు కూడా మరికొంత సమయం కోరింది. దీంతో ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కానున్న వారంలో ఈ కేసును కూడా విచారణ నిమిత్తం జాబితాలో చేర్చనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం,
ఫొటో క్యాప్షన్, భారత న్యాయ సంహిత, పాస్‌పోర్ట్ చట్టాల ప్రకారం రెండు దేశాల పౌరసత్వం ఉండడం నేరమని పిటిషనర్ వాదిస్తున్నారు.

పిటిషనర్ వాదన ఏంటి?

రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని నిరూపించేందుకు అవసరమైన పత్రాలు, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వచ్చిన కొన్ని ఈ మెయిల్స్ తన వద్ద ఉన్నాయని పిటిషనర్ చెబుతున్నారు. అందుకే, ఆయనకు భారత్‌లో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని, ఆయన ఎంపీ కాలేరని అంటున్నారు.

ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్ కోరుతున్నారు.

ఈ విషయమై పిటిషనర్ ఇప్పటికే రెండుసార్లు కేంద్ర హోంశాఖకు మెమోరాండం అందజేశారు. రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దు చేయాలని ఆయన హోంశాఖను కోరుతున్నారు.

హోంమంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను కోర్టును ఆశ్రయించినట్లు విఘ్నేష్ శిశిర్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడికి రెండు దేశాల పౌరసత్వాలు ఉండటం భారతీయ న్యాయ సంహిత, పాస్‌పోర్ట్ చట్టం కింద నేరమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే రాహుల్ గాంధీ పౌరసత్వంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.

రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ, సుబ్రమణ్య స్వామి కూడా దిల్లీ హైకోర్టులో ఇలాంటి పిటిషనే వేశారు.

బ్రిటన్ అధికారులకు రాహుల్ గాంధీ సమర్పించిన పత్రాల్లో తనను తాను బ్రిటిష్ పౌరుడిగా రాహుల్ గాంధీ చెప్పుకున్నారని సుబ్రమణ్యస్వామి ఆరోపిస్తున్నారు.

ద్వంద్వ పౌరసత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ద్వంద్వ పౌరసత్వం ఉన్న వారికి రెండు దేశాల్లోనూ ఓటు వేసే హక్కు ఉంటుంది.

ద్వంద్వ పౌరసత్వం అంటే ఏమిటి?

ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు లేదా అంత కంటే ఎక్కువ దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉంటే దాన్ని ద్వంద్వ పౌరసత్వంగా చెబుతున్నారు.

ద్వంద్వ పౌరసత్వం ఉంటే, రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పాస్‌పోర్టులు కలిగి ఉండే హక్కు అతనికి ఉంటుందని అర్థం.

ఉదాహరణకు, ఒక వక్తి బ్రిటిష్ పౌరుడయ్యి.. అతనికి అమెరికా పౌరసత్వం కూడా ఉంటే ఆయన వద్ద రెండు దేశాల పాస్‌పోర్టులు ఉంటాయి.

అలా ఆ వ్యక్తి, రెండు దేశాల్లోనూ ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం వంటి రాజకీయపరమైన హక్కులు పొందుతారు.

దానితో పాటు, ఆ వ్యక్తి ఎలాంటి వీసా, వర్క్ పర్మిట్ అవసరం లేకుండా తనకు పౌరసత్వం ఉన్న దేశాల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా పర్యటించవచ్చు.

రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు ఎవరైనా, రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పాస్‌పోర్టులు కలిగి ఉండవచ్చు.

ద్వంద్వ పౌరసత్వాన్ని భారత్ ఆమోదిస్తుందా?

ఈ నేపథ్యంలో, ద్వంద్వ పౌరసత్వాన్ని భారత్ ఆమోదిస్తోందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

భారత రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తి భారత పౌరసత్వంతో పాటు మరో దేశ పౌరసత్వం కలిగివుండడం నిషేధం.

"రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, పౌరసత్వ చట్టం1955 సెక్షన్ 9లోని నిబంధనల ప్రకారం భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేదు" అని పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది.

అలాగే, పాస్‌పోర్ట్ చట్టం 1967 ప్రకారం ఒక వ్యక్తి విదేశీ పౌరసత్వం పొందిన తర్వాత కూడా భారతీయ పాస్‌పోర్టును కలిగివుండడం నేరం.

భారతీయులెవరైనా విదేశాల్లో ఉండి, ఆ దేశ పౌరసత్వం తీసుకుంటే, తమ పాస్‌పోర్ట్‌ను ఆయా దేశాల్లోని ఇండియన్ ఎంబసీలో అప్పగించి దాన్ని రద్దు చేసుకోవాలని అమెరికాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ చెబుతోంది.

అలా సరెండర్ చేసిన పాస్‌పోర్ట్‌ను ఇండియన్ ఎంబసీ రద్దు చేసి, సరెండర్ సర్టిఫికెట్‌తో పాటు పాస్‌పోర్టును తిరిగి ఇస్తుంది.

నార్త్ అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో నివశిస్తున్న ప్రవాస భారతీయుల కోరిక మేరకు, భారత ప్రభుత్వం పౌరసత్వ చట్టం 1955ను 2005 ఆగస్టులో సవరించి ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) పథకాన్ని తీసుకొచ్చిందని భారత విదేశాంగ శాఖ వెబ్‌సైట్ చెబుతోంది.

రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు ఉన్న వ్యక్తికి భారత దేశంలో రాజకీయపరమైన హక్కులు ఉండవు.

ఏమిటీ OCI స్కీమ్?

భారత విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం, ఈ స్కీమ్ కింద విదేశాల్లో ఉంటున్న భారతీయులందర్నీ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కింద రిజిస్టర్ చేస్తారు.

1950 జనవరి 26 నాటికి, లేదా ఆ తర్వాత భారత పౌరులుగా ఉన్నవారు, లేదంటే 1950 జనవరి 26న భారత పౌరులుగా మారడానికి అర్హత ఉన్నవారు ఈ ఓసీఐ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గెజిట్‌లో పేర్కొన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఇతర దేశాలకు చెందిన పౌరులు ఓసీఐ స్కీమ్ కింద ఎలాంటి లబ్ధి పొందలేరు.

ఏది ఏమైనప్పటికీ. ఓసీఐని ద్వంద్వ పౌరసత్వంగా భావించడానికి వీల్లేదు. ఎందుకంటే, ఓసీఐ గుర్తింపు ఉన్నప్పటికీ వారికి భారత దేశంలో ఎలాంటి రాజకీయపరమైన హక్కులు ఉండవు.

అలాగే, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సమాన అవకాశాలకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం భారత పౌరులకు వర్తించే హక్కులు వీరికి వర్తించవు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)