అమెరికా: జర్నలిస్టు కంటపడిన యెమెన్‌పై దాడుల సంభాషణ, ఇది ఎలా జరిగింది?

యెమెన్‌పై దాడులకు సంబంధించిన సంభాషణ ముందుగానే జర్నలిస్టు కంటపడింది.
    • రచయిత, ఆంటోనీ జుర్చర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యెమెన్ మీద అమెరికా దాడి చేసే విషయమై జాతీయ భద్రతాధికారుల మధ్య 'సిగ్నల్' యాప్‌లో జరిగిన జరిగిన రహస్య సంభాషణను ప్రముఖ పొలిటికల్ జర్నలిస్టు జెఫ్రీ గోల్డ్‌బర్గ్ చూశారు.

అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైఖేల్ వాల్జ్ అనుకోకుండా తనను ఆ చాట్‌లో జోడించినట్లు ది అట్లాంటిక్ మేగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్‌బర్గ్ సోమవారం తన మేగజైన్ వెబ్‌సైట్‌లో రాసిన కథనంలో తెలిపారు.

ఈ గ్రూపులో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసి వైల్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఉన్నారు

అది 'నిజం కావచ్చు' అని జాతీయ భద్రత మండలి అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

ఈ గ్రూపులో అమెరికా సైనిక దాడులకు సంబంధించిన చర్యలు, విధానాల గురించి చర్చించినట్లు గోల్డ్‌బర్గ్ చెప్పారు.

ట్రంప్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారుల మధ్య జరిగే ఇలాంటి సంభాషణల్లో నేరుగా పాల్గొనడం, చూడటం అత్యంత అరుదు.

మార్చ్ 15న అమెరికన్ బలగాలు యెమెన్‌లోని హౌతీల మీద దాడులు చేసిన తర్వాత 'అద్భుతంగా పని చేశారు' అని వాల్జ్ ఆ గ్రూపులో మెసేజ్ పెట్టారు.

ఆ మాట రాసిన తర్వాత అమెరికన్ జెండా, పిడికిలి, మంటకు సంబంధించిన ఎమోజీలను పోస్ట్ చేశారు. తర్వాత మిగతా సభ్యులు అభినందనలు చెబుతూ పోస్టులు పెట్టారు.

సోమవారం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత వైట్‌హౌస్‌లో వేడుకల కళ తగ్గింది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
https://www.theatlantic.com/

ఫొటో సోర్స్, https://www.theatlantic.com/

ఫొటో క్యాప్షన్, అమెరికా జాతీయ భద్రత గ్రూపులో జరిగిన సంభాషణ

చట్టాన్ని ఉల్లంఘించారా?

బయటి వ్యక్తి ఒకరు పొరపాటునైనా రక్షణకు సంబంధించిన సున్నిత రహస్య సమాచారాన్ని చూడటం ట్రంప్ ప్రభుత్వంలో భద్రతా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఇటువంటి సున్నితమైన సమాచారం కోసం రూపొందించిన సురక్షిత ప్రభుత్వ మార్గాల ఆవల ఇటువంటి సంభాషణలు జరుగుతున్నాయంటే, అది గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.

"దేశానికి సంబంధించిన రహస్య సమాచారం పట్ల ఈ ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోంది. దీని వల్ల అమెరికన్ల భద్రత ప్రమాదంలో పడుతుంది" అని సెనేటర్ మార్క్ వార్నర్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

ఈ వ్యవహారంపై వీలైనంత త్వరలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని డెమోక్రటిక్ కాంగ్రెస్ మెన్ క్రిస్ డెల్యూజియే డిమాండ్ చేశారు.

"ఇది సుస్పష్టంగా జాతీయ భద్రతను ఉల్లంఘించడమే. దీని వల్ల ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుంది" అని ఆయన అన్నారు.

డెమోక్రాట్లు మాత్రమే కాదు, రిపబ్లికన్లు కూడా ఈ వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారు.

నెబ్రస్కాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు డాన్ బేకన్ కూడా ఈ ప్రభుత్వం మనస్సాక్షి లేకుండా వ్యవహరిస్తోందన్నారు.

"రక్షణ వ్యవస్థలు లేకుండా ఇలా గ్రూపుల్లో ఎవరిని పడితే వాళ్లను ఎలా చేరుస్తారు. భద్రత లేని ఫోన్లను రష్యా, చైనా గమనిస్తూనే ఉంటాయి" అని ఆయన చెప్పారు.

ఈ విషయంలో ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించే అవకాశం ఉంది.

ఇది పొరపాటని వైట్‌హౌస్ అంగీకరించిందని, ఇలాంటి పొరపాట్లు అప్పుడప్పుడు జరిగే అవకాశం ఉందని స్పీకర్ మైక్ జాన్సన్ ఈ అంశాన్ని తేలిక చేస్తూ మాట్లాడారు.

"వాళ్లు ఇకపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మరోసారి కచ్చితంగా ఇలాంటివి జరక్కుండా చూస్తారు. దీని గురించి ఇంత కన్నా ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు" అని ఆయన అన్నారు.

యెమెన్, అమెరికా సైనిక చర్య

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ ‌హెగ్‌సెత్, జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్

ట్రంప్‌తో విభేదించిన వాన్స్

ఈ వ్యవహారం తమకు తెలియకుండా జరిగిందని ట్రంప్ చెప్పారు.

ఆ తర్వాత జాతీయ భద్రత బృందానికి మద్దతుగా వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

సోమవారం ఉదయం కల్లా ఈ వ్యవహారంలో కొంతమంది ఉన్నతాధికారుల రాజీనామాలు తప్పవనే పుకార్లు వ్యాపించాయి. అందులో ఈ గ్రూపులోకి జర్నలిస్ట్ గోల్డ్‌బర్గ్‌ను చేర్చిన వాల్జ్ రాజీనామా చేస్తారని అందరూ భావించారు. ఈ పుకార్లు మరింతగా విస్తరిస్తున్నప్పటికీ వైట్‌హౌస్ నుంచి ఎలాంటి స్పందనా లేదు.

సోమవారం మధ్యాహ్నం శ్వేత సౌధం విడుదల చేసిన ప్రకటనలో ‘‘యెమెన్‌లో హౌతీల మీద దాడులు విజయవంతం కావడంతో పాటు ప్రభావాన్ని చూపాయి" అని పేర్కొన్నారు.

ఈ సంభాషణ జరిగిన గ్రూపులో ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ యెమెన్ మీద అమెరికా సైనిక దాడుల గురించి ప్రతి చిన్న విషయాన్ని పోస్ట్ చేశారు.

విదేశాంగ విధానంలో జేడీ వాన్స్ ట్రంప్ అడుగు జాడల్లో నడిచినా, ప్రైవేట్ చర్చల్లో మాత్రం అమెరికా సైనిక చర్య చేపట్టడం ద్వారా 'తప్పు' చేసిందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

యెమెన్‌లో హూతీల మీద దాడులతో అమెరికన్ వాణిజ్యానికి వచ్చిన ఇబ్బందేమీ లేకున్నా, యూరోపియన్ నౌకల రవాణాకు ముప్పు ఏర్పడుతుందని వాన్స్ భావిస్తున్నారు.

"ఈ చర్యతో తన వ్యవహార శైలి గురించి యూరప్‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నారనే దాని గురించి అధ్యక్షుడికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. దీని వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది" అని జేడీ వాన్స్ తన సోషల్ మీడియా ఖాతాలో రాశారు.

విదేశాంగ విధానంలో అధ్యక్షుడి నిర్ణయాలతో ఉపాధ్యక్షుడు విభేదించడం ఇదే తొలిసారి.

ఇరాక్‌పై యుద్ధం విషయంలో జార్జ్ డబ్ల్యు బుష్ నిర్ణయాలను అప్పటి ఉపాధ్యక్షుడు డిక్ షెనీ వ్యతిరేకించారు.

ఒసామా బిన్ లాడెన్‌ను హత్య చేయాలనే బరాక్ ఒబామా నిర్ణయం చాలా ప్రమాదకరమని జో బైడెన్ భావించారు.

అమెరికా జాతీయ భద్రతకు సంబంధించి సున్నితమైన సమాచారం బయటకు పొక్కడం ఇదే తొలి సారి కాదు.

అధ్యక్షులుగా పదవీకాలం ముగిసే సమయంలో రహస్య పత్రాలను తమతో తీసుకెళ్లారనే ఆరోపణలపై ట్రంప్, జో బైడెన్ మీద దర్యాప్తు జరిగింది.

సిగ్నల్ యాప్‌లో జాతీయ భద్రత బృందం జరిపిన సంభాషణ ఒక జర్నలిస్టుకు చేరిందన్న అంశంపై హిల్లరీ క్లింటన్ సోమవారం మధ్యాహ్నం తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఈ చర్య షాక్‌కు గురిచేసిందని, అపనమ్మకాన్ని కలిగించిందని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)