స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రాను ముంబయి వీధుల్లో తిరగనివ్వమంటూ శివసేన హెచ్చరిక, ఎందుకు?

ఫొటో సోర్స్, @kunalkamra88
స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రాను అరెస్ట్ చేయాలని ఆదివారం శివసేన డిమాండ్ చేసింది.
కుణాల్ కామ్రా ఒక స్టాండప్ కామెడీ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేను ద్రోహిగా అభివర్ణించినట్లు ఆరోపణలు వచ్చాయి.
శివసేన సైనికులు ఎవరూ దీన్ని సహించలేరని, కుణాల్‌కు 'శివసేన తరహా చికిత్స' తప్పదని శివసేన అధికార ప్రతినిధి కృష్ణ హెగ్డే అన్నారు.
''కుణాల్ కామ్రాను ముంబయి పోలీసులు అరెస్ట్ చేయాలి. జైల్లో పెట్టి అతన్ని విచారించాలి. కుణాల్ కామ్రా తిట్లు, ఆయన వాడిన అశ్లీల పదాలు, ఏక్‌నాథ్ శిందేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రజలకు అవమానం. గతంలోనూ కుణాల్ ఇలాగే ప్రవర్తించారు. విమానాల్లో ప్రయాణించకుండా ఆయన ఆరు నెలల నిషేధానికి గురయ్యారు. ఇప్పుడు కూడా ఆయనకు కఠినమైన శిక్ష విధించాలి'' అని కృష్ణ హెగ్డే అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
శిందే స్పందన ఏంటి?
కునాల్ కమ్రా తన స్టాండప్ షోలో పరోక్షంగా పలువురిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనను దేశద్రోహిగా అభివర్ణించారు.
సోమవారం బీబీసీ మరాఠీ 'రాష్ట్ర మహారాష్ట్ర' కార్యక్రమానికి హాజరైన ఏక్ నాథ్ శిందే మాట్లాడుతూ.. వ్యంగ్యాన్ని అర్థం చేసుకుంటాం. కానీ దానికో పరిమితి ఉండాలి. నిజం చెప్పాలంటే ఇది ఎవరికో వ్యతిరేకంగా మాట్లాడటానికి సుపారీ తీసుకోవడం లాంటిదన్నారు.
''ఇదే వ్యక్తి (కునాల్ కమ్రా) సుప్రీంకోర్టు, ప్రధాని, ఆర్ణాబ్ గోస్వామి, కొందరు పారిశ్రామికవేత్తలపైనా వ్యాఖ్యలు చేశారు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛ కాదు. ఇది ఎవరి కోసమో పనిచేయడం'' అన్నారు.
ఇది సరికాదని శిందే చెప్పారు.
‘ముంబయి రోడ్లపై తిరగనివ్వం’
ముంబయిలోని ఖార్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌పై ఆదివారం పొద్దుపోయాక శివసేన కార్యకర్తలు దాడి చేశారు. హోటల్‌ను ధ్వంసం చేశారు. ఈ హోటల్‌లోనే కుణాల్ కామ్రా స్టాండప్ కామెడీ కార్యక్రమం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. యూనీకాంటినెంటల్ హోటల్‌ను దుండగులు ద్వంసం చేశారు.
శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ కూడా కుణాల్ కామ్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు.
కుణాల్ కామ్రా రెండు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే శివసేన సైనికులు అతన్ని ముంబయి రోడ్లపై తిరగనివ్వరంటూ ఆదివారం మీడియాతో ముర్జీ పటేల్ అన్నారు.
''ఎక్కడ కనిపించినా, అతని ముఖానికి నల్లరంగు పులుముతాం. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ఫేమ్ కోసం కుణాల్ ఇదంతా చేస్తున్నారు. పోలీసులకు అవసరమైన సమాచారాన్ని అందించాం. సరైన చర్య తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు'' అని ముర్జీ పటేల్ చెప్పారు.
శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్, ప్రస్తుతం వివాదానికి కారణమైన కుణాల్ కామ్రా వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసి 'కుణాల్ కా కమాల్' అనే వ్యాఖ్య జోడించారు.
శివసేన ఎంపీ నరేశ్ హస్కే కూడా ఒక వీడియో మెసేజ్‌లో కుణాల్ కామ్రాను బెదిరించారు.
''మహారాష్ట్రలోనే కాకుండా దేశంలోనే నిన్ను తిరగకుండా చేస్తాం. శివసేన సైనికులు వెంటాడటం మొదలుపెడితే దేశం విడిచి పారిపోవాల్సి ఉంటుంది. సంజయ్ రౌత్ ఇప్పుడు మీ వద్ద కార్యకర్తలు ఎవరూ లేకపోవడంతో డబ్బులిచ్చి కుణాల్ కామ్రాతో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. మిమ్మల్ని తలుచుకుంటే సిగ్గేస్తుంది. కుణాల్ కుమ్రా, మీకు దేశంలో తిరగడం కూడా కష్టమవుతుందనే సంగతి గుర్తు పెట్టుకోండి'' అని నరేశ్ వీడియోలో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter/Aaditya Thackeray
శివసేన (యూబీటీ) నాయకుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే.. స్టూడియోపై దాడిని పిరికితనమంటూ సోమవారం రాత్రి స్పందించారు.
''మింధే (శిందే) పిరికి గ్యాంగ్, కామెడీ వేదికను ధ్వంసం చేసింది. ఆ వేదికపై ఏక్‌నాథ్ శిందే గురించి ఒక పాట పాడారు. అది 100 శాతం కరెక్ట్ పాట. పిరికిపందలు మాత్రమే ఒక పాటకు ఈ విధంగా స్పందిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యవస్థ ఇలాగే ఉంటుందా? ఏక్‌నాథ్ శిందే మరోసారి ముఖ్యమంత్రి, హోంమంత్రి బలహీనులని నిరూపించారు'' అని ఠాక్రే స్పందించారు.
ఠాక్రే ఎప్పుడూ శిందేను ఉద్దేశించి మింధే అనే మరాఠీ పదాన్ని వాడతారు. మింధే అంటే మరాఠీలో విశ్వాసపాత్రుడు అని అర్థం.
కుణాల్ కామ్రా తన కామెడీ కార్యక్రమంలో 'దిల్ తో పాగల్ హై' సినిమాలోని ఒక పాటకు పేరడీ పాడారు. ఈ పాటలో 2022 నాటి శివసేన చీలికను ప్రస్తావించారు.
కామ్రా ఆ పాటలో 'గద్దార్' అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పదాన్ని ఏక్‌నాథ్ శిందేను ఉద్దేశించి వాడినట్లుగా భావిస్తున్నారు. అయితే, కుణాల్ కామ్రా తన పాటలో ఏక్‌నాథ్ శిందే పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.
''నిన్నటి ఘటన యాదృచ్ఛికంగా జరుగలేదు. వాళ్లు ఎందుకు అఫెండ్ అయ్యారు. ఆయన ఎవరి పేరును ప్రస్తావించలేదు. కామ్రా కవితలో కేవలం గద్దార్ అనే పదం మాత్రమే ప్రస్తావించారు. దానికే శిందే మద్దతుదారులు స్పందించారు. అంటే, వాళ్లు ఆ పదాన్ని తమకు ఆపాదించుకొని అంగీకరించారన్నట్లే కదా'' అని ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














