గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు ‘330 మంది మృతి’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రష్దీ అబులోఫ్, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గాజా ప్రాంతంలో పెద్దఎత్తున దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ప్రకటించింది.
ఈ దాడుల్లో 330 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ చెప్తోంది.
‘ఉగ్రవాద లక్ష్యాలపై’ తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చెప్తోంది.
గాజాలో అత్యున్నత భద్రత అధికారి, హమాస్ డిప్యూటీ హోం మంత్రి మహమూద్ అబూ వఫా ఈ దాడిలో మరణించినట్లు చెప్తున్నారు.
రంజాన్ మాసం కావడంతో చాలా మంది తెల్లవారుజామున భోజనం చేస్తుండగా, గాజాలో పేలుళ్లు ప్రారంభమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
20కి పైగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆకాశంలో వెళ్లడం చూశామని వారు చెప్పారు.
ఆ విమానాలు గాజా నగరం, రఫా, ఖాన్ యూనిస్‌లలోని లక్ష్యాలపై బాంబులు వేసినట్లు తెలిపారు.
జనవరి 19న కాల్పుల విరమణ తర్వాత గాజాపై జరిగిన అతిపెద్ద వైమానిక దాడి ఇది. కాల్పుల విరమణను పొడిగించేందుకు జరిగిన చర్చలు ఒప్పందానికి రాలేకపోయాయి.

ఫొటో సోర్స్, Reuters

దాడులు ఆదేశించిన బెంజమిన్ నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మంగళవారం ఉదయం దాడులకు ఆదేశించినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దాడులకు ముందు ఇజ్రాయెల్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయాన్ని సంప్రదించిందని ఓ వైట్ హౌస్ ప్రతినిధి ఫాక్స్ న్యూస్‌తో అన్నారు.
"ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి హమాస్ చాలాసార్లు నిరాకరించింది. అంతేకాదు అమెరికా అధ్యక్ష రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, మధ్యవర్తుల పంపిన ప్రతిపాదనలను తిరస్కరించింది. అందుకే ఈ దాడులు జరుపుతున్నాం" అని ఇజ్రాయెల్ తన ప్రకటనలో పేర్కొంది.
"ఇప్పటి నుంచి.. ఇజ్రాయెల్ తన సైనిక బలాన్ని పెంచుతూ హమాస్‌పై చర్యలు తీసుకుంటుంది" అని ప్రకటించింది.
ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్.. బందీలను విడుదల చేయాలని హమాస్‌ను హెచ్చరిస్తూ ‘శత్రువుపై ఏమాత్రం దయ చూపం’ అన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ ద్రోహం చేసిందని హమాస్ ఆరోపించింది.
గాజాలో ఉన్న మిగిలిన బందీలను ఇజ్రాయెల్ ‘వారి అదృష్టానికి’ వదిలేసిందని హమాస్ పేర్కొంది.
కానీ హమాస్ ఇంకా యుద్ధాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించలేదు. బదులుగా మధ్యవర్తులు, ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చింది.
తాత్కాలిక కాల్పుల విరమణ మొదటి దశ మార్చి 1న ముగిసిన తర్వాత, చర్చలు ముందుకు సాగే మార్గాన్ని మధ్యవర్తులు వెతుకుతున్నారు.
హమాస్ నిర్బంధంలో ఉన్న బందీలు, ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల జరగాలని, మొదటి దశను ఏప్రిల్ వరకు పొడిగించాలని అమెరికా ప్రతిపాదించింది.
కానీ చర్చలపై అవగాహన ఉన్న ఒక పాలస్తీనా అధికారి బీబీసీతో మాట్లాడుతూ, "పరోక్ష చర్చలలో విట్‌కాఫ్ నిర్దేశించిన ఒప్పందంలోని కీలక అంశాలపై ఇజ్రాయెల్, హమాస్ విభేదించాయి’ అన్నారు.
2023 అక్టోబర్ 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై చేసిన దాడితో తాజా యుద్ధం ప్రారంభమైంది. 1,200 మందికి పైగా ప్రజలు మరణించారు. వీరిలో ఎక్కువగా సాధారణ పౌరులు ఉన్నారు. హమాస్ 251 మందిని బందీలుగా పట్టుకుంది.
దాంతో ఇజ్రాయెల్ సైనిక దాడికి దిగింది. హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటి వరకు 48,520 మందికి పైగా మరణించారు. వారిలో ఎక్కువ మంది పౌరులున్నారని హమాస్ చెబుతుంది.
గాజాలోని 21 లక్షల జనాభాలో ఎక్కువ శాతం మంది అనేకసార్లు నిరాశ్రయులయ్యారు. 70 శాతం భవనాలు దెబ్బతిన్నాయని లేదా పూర్తిగా నాశనమయ్యాయని అంచనా. ఆరోగ్య సంరక్షణ, నీరు, పారిశుద్ధ్య వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆహారం, ఇంధనం, మందులకు తీవ్ర కొరత ఏర్పడింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














