చిత్తూరు: హనుమాన్ మందిరం కట్టిన ముస్లిం కుటుంబం, వివాదం ఏంటి..

సప్తమందిర ఆలయంలోని హనుమాన్
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కె. కొత్తపేటలో ముస్లింలు ఒక ఆంజనేయస్వామి గుడిని నిర్మించారు. సప్తమందిర సముదాయం పేరుతో ఈ ఆలయాన్ని కట్టించారు.

అక్కడ హనుమంతుడితో పాటు మరో ఆరుగురు దేవుళ్ల కోసం ఏడు ఆలయాలు కట్టారు.

ఈ ఆలయ సముదాయ నిర్మాణాన్ని ప్రారంభించిన వ్యక్తి ముస్లిం. ఆయన ఇప్పుడు జీవించి లేరు. కానీ, ఆయన కుమారులు ఈ ఆలయ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఆరు దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి, ఒక పూజారిని నియమించి ఈ ఆలయంలో పూజలు జరిగేలా వారే చూసుకుంటున్నారు.

అజీద్ బాషా అనే వ్యక్తి ఈ ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు. ఆయనకు ముగ్గురు కుమారులు. ఇప్పుడు ఈ ఆలయ వ్యవహారాలు రెండో కుమారుడు ఫిరోజ్ బాషా, మూడో కుమారుడు చాంద్ బాషా చూస్తున్నారు.

తిరుపతి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సప్తమందిర సముదాయం
ఫొటో క్యాప్షన్, ఈ ఆలయంలో ఆంజనేయస్వామి, సాయిబాబా, కామాక్షి అమ్మవారు, వినాయకుడు, శివలింగం, నవగ్రహాలను ప్రతిష్టించారు

2018లో అజీద్ బాషా జీవించి ఉన్నప్పుడు ఆలయంలో వినాయకుడు, సాయిబాబా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆయన మరణం తర్వాత ఏడాదిపాటు ఆలయ పనులు నిలిపివేశారు. 2024 నవంబర్ 25న మరో మూడు విగ్రహాలు ప్రతిష్ఠించారు.

ప్రస్తుతం ఈ ఆలయంలో ఆంజనేయస్వామి, సాయిబాబా, కామాక్షి అమ్మవారు, వినాయకుడు, శివలింగం, నవగ్రహాలను ప్రతిష్ఠించారు. వెంకటేశ్వర స్వామి ఆలయం, విగ్రహం సిద్ధమయ్యాయి. ప్రతిష్ఠించడానికి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు.

హిందూ ఆలయాల్లో పూజలు ఎలా జరుగుతాయో, ఇక్కడ కూడా అన్నీ అలాగే జరిగేలా చూసుకుంటున్నామని ఆలయ నిర్వహణ చూస్తున్న చాంద్‌బాషా బీబీసీకి చెప్పారు.

''ఉదయం సుప్రభాతం వినిపిస్తాం. ఈ గుడిలో పూజారి ఉన్నారు. విగ్రహాలకు పూజారి అభిషేకం చేసిన తర్వాత మేం మా పనులకు వెళతాం. సాయంత్రం గుడిలో దేవుడి పాటలు పెడతాం. ప్రతి పౌర్ణమికి భజనలు చేయిస్తాం. అన్నదానాలు నిర్వహిస్తాం. హనుమాన్ జయంతి, వినాయక చవితి పండుగలకు మేమే స్వయంగా పూజలు, భజనలు చేయిస్తాం'' అని ఆయన అన్నారు.

సప్తపది ఆలయ నిర్మాణకర్తలు
ఫొటో క్యాప్షన్, చాంద్ బాషా (ఎడమ), ఫిరోజ్ బాషా (కుడి)

ఆలయ నిర్మాణం వెనుక కథ

పిల్లలు పుట్టకపోవడంతో తమ తాత ఆంజనేయస్వామికి మొక్కుకున్నారని, తర్వాత తమ తండ్రి పుట్టడంతో ఆంజనేయుడిని ఆరాధించారని చాంద్ బాషా చెప్పారు. తాత, తండ్రి వారసత్వాన్ని ప్రస్తుతం తాము కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు.

'' 2006లో హనుమాన్ ఆలయ నిర్మాణాన్ని మా నాన్న మొదలుపెట్టారు. అన్ని గుడులు ఒకే చోట ఉంటే భక్తులు దర్శించుకుంటారనే ఉద్దేశంతో సప్త మందిర సముదాయం అని పేరు పెట్టి ఏడు ఆలయాల నిర్మాణానికి ఆయన పూనుకున్నారు. దాన్నే మేం కొనసాగిస్తున్నాం'' అని చాంద్ బాషా వివరించారు.

సప్త ఆలయ సముదాయం

తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే తమ తండ్రి ఈ ఆలయాన్ని మొదలుపెట్టారని ఆ సోదరులు తెలిపారు.

''మా నాన్న సైకిల్ మెకానిక్. ఇటుకల వ్యాపారం కూడా చేశారు. ఆ ఇటుకలనే ఆలయం కోసం కూడా వాడారు. ఆయన మేస్త్రీ పని నేర్చుకుని గుడి కడుతున్నప్పుడు, ఆయనతోపాటూ మేం కూడా కూలీల్లా పనిచేశాం'' అని చాంద్ బాషా చెప్పారు.

ఆలయం కోసం ఎవరైనా ఏదైనా ఇస్తే వాటిని వస్తువుల రూపంలోనే తీసుకునేవారు అజీద్ బాషా. ఇప్పుడు ఆయన కుమారులు కూడా ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని సప్త సముదాయ ఆలయం
ఫొటో క్యాప్షన్, అజీద్ బాషా కుమారులు ఫిరోజ్ బాషా (ఎడమ), చాంద్ బాషా (కుడి)

‘మత పెద్దలు దూరం పెట్టారు’

ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని బాషా సోదరులు చెప్పారు.

''గుడి మొదలుపెట్టినప్పుడు ఒక ముస్లిం అయి ఉండి, గుడి ఎందుకు కడుతున్నావు, మిమ్మల్ని మత బహిష్కరణ చేస్తాం, గ్రామ బహిష్కరణ చేస్తాం అంటూ ఇబ్బంది పెట్టారు. వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మా మతానికి దూరం చేసినా ఇబ్బందుల్ని తట్టుకుని మేం ముందుకు వెళ్తున్నాం. మేం మత గురువులకు ఏదైనా ఇవ్వాలనుకుంటే వారు తిరస్కరిస్తారు. మా దగ్గర చందాలు కూడా తీసుకోరు. మా పెళ్లిళ్లకు కూడా అడ్డుపడ్డారు'' అన్నారు చాంద్ బాషా.

తమను బహిష్కరించడంతో మసీదుకు వెళ్లలేకపోతున్నామని వీరు చెబుతున్నారు.

''సనాతన ధర్మంపై నమ్మకంతో ఉన్నాం. మసీదుకు రానివ్వరు. అందుకే ఈ గుడిలోనే అందరు దేవుళ్ళు ఉన్నారని అనుకుని ఇక్కడే అన్ని చేసుకుంటాం. రంజాన్ సమయంలో కూడా మా బంధువులను కలవలేం. గుడి కట్టించినప్పటికీ ముస్లిం పద్ధతులను పాటిస్తాం. సనాతన ధర్మాన్ని ఆచరిస్తాం.'' అని చాంద్ బాషా అన్నారు.

హనుమాన్ గుడి
ఫొటో క్యాప్షన్, ఆంజనేయస్వామి గుడిలో మొక్కుతున్న చాంద్ బాషా, ఫిరోజ్ బాషా

‘అంత్యక్రియలు చేయనివ్వలేదు’

మత బహిష్కరణ చేయడమే కాకుండా, తమ తండ్రి చనిపోతే ముస్లిం ఆచారాల ప్రకారం అంత్యక్రియలు కూడా చేయనివ్వలేదని సోదరులు అన్నారు.

''ఇంట్లో మృతదేహాన్ని పెట్టుకొని బాధపడలేక వేరే ఊరికి వెళ్లి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది'' అని చాంద్ బాషా తెలిపారు.

ముస్లింల దుకాణంలో తమకు టీ కూడా ఇవ్వరని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

''మా దేవుడి ఊరేగింపును మా దగ్గరకు రాకుండా తిప్పుకొని వెళ్తున్నారు. మసీదు మైక్‌లో మా గురించి చెడ్డగా చెప్పారు. ఎలాగోలా మేం పెళ్లిళ్లు చేసుకున్నాం. భవిష్యత్తులో మా పిల్లల పెళ్లిళ్లకు ఇబ్బంది అవుతుంది. మేం కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటే ముందుగా మా మత గురువుల నుంచి ఒక సర్టిఫికెట్ తీసుకోవాలి. కానీ మాకు ఇవ్వడం లేదు.'' అని బాషా వివరించారు.

కె. కొత్తపేట గ్రామంలోని మసీదు

పోలీసులకు ఫిర్యాదు

వెలివేతపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, కానీ ఎలాంటి ఫలితం లేదని సోదరుల్లో ఒకరైన ఫిరోజ్ బాషా చెప్పారు.

‘‘పోలీసులు వాళ్లని పిలిపించి మాట్లాడితే, అలాంటిదేమీ లేదు అని నటించారు. పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ తర్వాత మళ్లీ మాతో ముందులాగే ప్రవర్తిస్తున్నారు. పోలీసులు చెప్పడంతో నేను మసీదుకు వెళ్లాను. అక్కడ ఎవరూ నాతో మాట్లాడలేదు. మసీదులో చందా కడతామంటే మమ్మల్ని పట్టించుకోలేదు. రెండు రోజులు వెళ్లాను తర్వాత మానేశాను'' అని అన్నారు.

గ్రామ ముస్లిం పెద్ద సైఫుల్లా
ఫొటో క్యాప్షన్, గ్రామ ముస్లిం పెద్ద సైఫుల్లా

‘మేం మసీదులో అడ్డుకోలేదు’

గ్రామంలోని మిగతా ముస్లింలు మాత్రం గుడి పేరుతో వచ్చే ఆదాయం కోసమే ఈ సోదరులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.

''ఇక్కడ హిందూ ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉంటాం. వారిని మేం బహిష్కరించలేదు. మసీదుకు వచ్చి నమాజ్ చేసుకోమని చెబుతాం. కానీ, గుడికి వచ్చే నిధులు హిందువులు ఎక్కడ తీసుకుంటారో అనే వాళ్ళు కావాలని ఇలా మాపైన ప్రచారం చేస్తున్నారు. వారు వచ్చి నమాజ్ చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. మేం కూడా ఆలయాలకు వెళ్లొస్తుంటాం'' అని సైఫుల్లా అన్నారు.

మసీదు

పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా వచ్చి నమాజ్ చేసుకోవాలని వారికి తాము చెప్పినట్లు సైఫుల్లా తెలిపారు. 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వారు హజరత్‌కి చందా ఇవ్వలేదని ఆయన తెలిపారు.

‘‘ హిందువులు కూడా మసీదుని గౌరవిస్తారు. కానీ, ఒక ముస్లిం అయి ఉండి కూడా రంజాన్ సమయంలో నమాజ్ చేస్తుంటే పెద్దగా లౌడ్ స్పీకర్లు పెట్టి సౌండ్ పెడతాడు. వారి తండ్రి చనిపోయినప్పుడు తెల్లవారుజామున జమాత్ సమయంలో మా దగ్గరికి వచ్చి మాట్లాడి, వెళ్లిపోయి తిరుపతిలో అంత్యక్రియలు చేసుకున్నారు. మేం అతనికి వద్దు అని చెప్పలేదు.’’ అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)